నిధులివ్వలేదు.. గ్యారెంటీ లేదు.. ప్రాజెక్టుల ఊసు లేదు.. ఏ గ్రాంటు కిందా కేటాయింపులు లేవు.. రెండు మూడు రాష్ట్రాలతో కలిపి కొన్ని అంశాల్లో డబ్బులిస్తామని చెప్పడానికే కేంద్ర బడ్జెట్ పరిమితమైంది. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్లో వాటాను పెంచకపోవడం వల్ల రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో మళ్లీ కోత పడనుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు సెస్సులు, సర్‌చార్జీలు తగ్గించుకోవాలని, లేదంటే వాటిలోనూ వాటా ఇవ్వాలని తెలంగాణ కోరినా కేంద్రం కనికరించలేదు. మొత్తానికి తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో ప్రకటించిన బడ్జెట్‌లో తెలంగాణకు ఉత్తచేయి చూపారని బీజేపీయేతర పార్టీల నేతలు అంటున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పట్టించుకోలేదు... ఆర్థిక సంఘం సిఫారసు చేసే నిధులకు గ్యారంటీ ఇవ్వలేదు... ఫార్మాసిటీ, డిఫెన్స్ కారిడార్, నిమ్స్ ఏర్పాటు, జాతీయస్థాయి చేనేత పరిశోధన కేంద్రం లాంటి ప్రాజెక్టులకు నిధులడిగినా కేంద్ర ప్రభుత్వం కనికరం చూపలేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్టుకూ నిధులివ్వలేదు. అలాగే, ఏ ప్రాజెక్టు, ఏ పథకం, ఏ గ్రాంటు కింద కూడా తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు చూపలేదు. నలుగురిలో నారాయణ అన్న చందంగా రెండు, మూడు చోట్ల ఇతర రాష్ట్రాలతో కలిపి డబ్బులిస్తామని చెప్పడానికి మాత్రమే కేంద్రం పరిమితమైంది. స్థూలంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న హామీలను పట్టించుకోకుండా, రాష్ట్ర మంత్రులు చేసిన అభ్యర్థనలను వినకుండానే తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ 2023–24 బడ్జెట్‌ను బుధవారం లోక్‌సభలో ప్రకటించారు. విభజన హామీలైన రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కార్మాగారం లాంటి ప్రాజెక్టుల ఊసెత్తకుండానే... కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధుల పెంపు, రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు లాంటి ఊరట కలిగించే అంశాలేవీ లేకుండానే ఈ ఏడాది కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం గమనార్హం.
వాదనలు, అభ్యర్థనలు పట్టించుకోలేదు...
అభివృద్ధి చెందుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలను అన్ని రాష్ట్రాల గాటన కట్టవద్దని, పురోగమన రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వాలన్న రాష్ట్ర వాదనను కేంద్రం ఈసారి కూడా పరిగణనలోకి తీసుకోలేదని ఆర్థికశాఖ వర్గాలు చెప్పాయి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల కారణంగా అప్పుల్లో కోత, 2021–26 వరకు 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పౌష్టికాహార పంపిణీ కోసం ఆర్థిక సంఘం ఇవ్వాలన్న నిధులు... ఇలా రూ.లక్ష కోట్లకు పైగా నష్టం జరిగిందని తెలంగాణ చెబుతున్నా.. కేంద్రం వీటిలో ఏ ఒక్క విషయంలోనూ ఉపశమనం కలిగించలేదు. త్వరలోనే ఎన్నికలున్న కర్ణాటకకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పేరుతో రూ.5వేల కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణకు గత మూడేళ్ల నుంచి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద ఇవ్వాల్సిన రూ.1,350 కోట్లు ఎందుకు ఇవ్వలేదనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు గతంలో ప్రతిపాదించిన 157 మెడికల్ కళాశాలల్లో ఒక్కటి కూడా రాష్ట్రానికి ఇవ్వకపోవడం, ఇప్పుడు ఆ మెడికల్ కళాశాలలిచ్చిన చోటనే నర్సింగ్ కళాశాలలు మంజూరు చేయడంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందనే వాదన వినిపిస్తోంది. వ్యవసాయ రంగంతోపాటు ఉపాధి హామీ పథకానికి కూడా నిధులు తగ్గించడంతో రాష్ట్రంలోని గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, సన్న, చిన్నకారు రైతాంగానికి ప్రత్యక్ష నష్టం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రావాల్సిన నిధుల్లో కోత
కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్) నిధుల్లో వాటాను పెంచకపోవడం వల్ల రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో మళ్లీ కోత పడనుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు సెస్సులు, సర్‌చార్జీలు తగ్గించుకోవాలని, లేదంటే వాటిలోనూ వాటా ఇవ్వాలని తెలంగాణ కోరినా కేంద్రం కనికరించకపోవడం గమనార్హం. ఇక, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల మేరకు రుణాలపై ఆంక్షల విషయంలోనూ కేంద్రం అదే వైఖరి చూపింది. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే జీఎస్‌డీపీలో అదనంగా 0.5 శాతం రుణాలకు అంగీకరిస్తామన్న నిబంధనను కొనసాగించడంతో మరోమారు రూ.6వేల కోట్ల అప్పులకు కోత పడుతుందని ఆర్థిక శాఖ అంటోంది. రుణ పరిమితులపై ఆంక్షలు కొనసాగించడం, గ్రాంట్లు ప్రత్యేకంగా కేటాయించకపోవడం, అప్పుల్లో కోతల నిబంధనలను యథాతథంగా ఉంచడంతో ఈసారి కూడా నిధులకు కటకట తప్పదని చెబుతోంది.
స్పష్టత లేని ప్రతిపాదనలు
గుడ్డిలో మెల్లలా 50 ఏళ్ల కాలపరిమితిలో చెల్లించే విధంగా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల కింద రూ.13.7 లక్షల కోట్లు కేంద్రం కేటాయించినా, అందులో మన రాష్ట్రానికి ఎంత వస్తుంది... ఏ ప్రాతిపదికన ఆ నిధులిస్తారన్న దాంట్లో స్పష్టత లేదు. గతంతో పోలిస్తే ఈ రుణపరపతిని భారీగానే పెంచినా రాష్ట్రానికి ఇచ్చే సమయానికి ఆంక్షలు విధిస్తే నష్టపోతామని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక, కేటాయింపులను చూస్తే ములుగు వర్సిటీతోపాటు ఏపీలోని మరో వర్సిటీకి కలిపి రూ.37 కోట్లు బడ్జెట్‌లో చూపెట్టారు. అదేవిధంగా దేశంలోని మూడు భారజల కేంద్రాలకు చూపెట్టిన రూ.1,473 కోట్లలోనే మణుగూరు భార జల కేంద్రానికి నిధులు రావాల్సి ఉంటుంది. మొత్తమ్మీద ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ రాష్ట్రం ఆశించిన విధంగా లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకు అన్ని రాష్ట్రాలతో కలిపి చేసిన కేటాయింపులే తప్ప ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదని, బకాయిలు వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదని అంటున్నారు.
బడ్జెట్ నిరుత్సాహపరిచింది..
కేంద్ర బడ్జెట్ తెలంగాణను నిరుత్సాహపరిచింది. ఈ బడ్జెట్ పేదల వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్. ఆర్థిక మంత్రి ప్రసంగంలో తెలంగాణకు ప్రత్యేక ప్రకటనలు ఏమీ లేవు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు హామీలను విస్మరించారు. పునరి్వభజన చట్టంలో ఇచి్చన హామీల గురించి కూడా ప్రస్తావన లేదు. హైదరాబాద్‌లో మిల్లెట్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నట్లు గతంలోనూ అనేక ఉత్తుత్తి హామీలు ఇచ్చారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరగడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బాధ్యత ఉంది. తెలంగాణకు అవసరమైన నిధులు రాబట్టేలా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో కేసీఆర్ విఫలమయ్యారు.
– ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ
ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదు...
కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. తెలంగాణ ప్రజలకు ఉపయోగం లేకుండా రూపొందించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం ఊసేలేదు. విభజన చట్టాన్ని ఆమోదించి పదేళ్లు అవుతున్నా ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు.
– కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ ఎంపీ
జుమ్లా బాజీ బడ్జెట్...
బడ్జెట్ పూర్తిగా జుమ్లా బాజీ. ప్రసంగానికి, వాస్తవ కేటాయింపులకు పొంతన లేదు. తెలంగాణకు సంబంధించి మాట రాలేదు. ఏ స్కీములోనూ తెలంగాణ కనిపించలేదు. రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు వడ్డీ లేని రుణాలు కొత్తేమీ కాదు. బడ్జెట్లో తెలంగాణను మర్చిపోయారు.
– కె.కేశవరావు, బీఆర్‌ఎస్ ఎంపీ
రైతు, పేద ప్రజలకు వ్యతిరేకం..
ఇది రైతు, పేదల, గ్రామీణ ప్రజల వ్యతిరేక బడ్జెట్. డిజిటల్ వ్యవసాయం అంటే అభివృద్ధి జరిగిపోదు. గత 9 ఏళ్లలో ఎన్ని డ్యాములు కట్టారు? ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు తెచ్చారు?ఎంత మందికి విద్యుత్తు ఉచితంగా ఇచ్చారు? వీటికి సమాధానం చెప్పాలి. ఇది భారతదేశ బడ్జెట్. కేవలం కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే బడ్జెట్ కాదు. రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణకు మాత్రం పూర్తి అన్యాయం చేశారు.
– నామా నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్ ఎంపీ
ఎరువులకు నిధులకోత అన్యాయం..
దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. చాలా ఏళ్లుగా బీఆర్‌ఎస్ ఈ విషయాన్ని చెబుతోంది. బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని గణాంకాల ద్వారా అంగీకరించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఎరువులకు నిధుల కోత ఎక్కువగా ఉంది. వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వానికి సరైన ఆలోచన లేదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకున్నారు.
– కె.ఆర్.సురేశ్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment