
ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణకు కేటాయించే అవకాశం
మున్సిపల్ శాఖ పంపిన ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం
కేంద్ర సాయం కోసం డీపీఆర్‌లు ఢిల్లీకి పంపాలని సీఎం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టులకు రానున్న బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నట్లు తెలిసింది. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులతోపాటు మెట్రో రైలు విస్తరణకు అధిక నిధులు కేటాయించే అవకాశాలున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అందే ఆర్థిక సాయం, వివిధ సంస్థల నుంచి తెచ్చుకొనే రుణాలు కాకుండా దాదాపు రూ. 20 వేల కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించొచ్చని చెబుతున్నాయి.
ఇప్పటికే మున్సిపల్ శాఖ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని.. కేంద్ర ఆర్థిక సాయం కోసం ఆయా ప్రాజెక్టుల (డీపీఆర్) సమగ్ర నివేదికలను కేంద్రానికి పంపాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
‘మూసీ’కి రూ. 2 వేల కోట్లు!
హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా 2030 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ. 2 వేల కోట్ల వరకు నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం రూ. 4,100 కోట్లను ప్రపంచ బ్యాంకు ద్వారా రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికితోడు కేంద్రం కూడా ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందిస్తుందని, మిగిలిన నిధు లను ప్రైవేటు రంగం ద్వారా పెట్టుబడుల రూపంలో తీసుకోవాలనేది ప్రభుత్వ ప్రణాళికగా కనిపిస్తోంది.
ఈ ప్రాజెక్టు పూ ర్తయ్యే సమయానికి రూ. లక్షన్న ర కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందులో ఎక్కువగా ప్రైవేటు పెట్టుబడుల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ప్రాజెక్టు తొలివిడతలో భాగంగా ఇబ్బందిలేని ప్రాంతాల్లో ఈ ఏడాది మూసీ పునరుజ్జీవ పనులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం బడ్జెట్‌లో రూ. 2 వేల కోట్లు కేటాయించొచ్చని తెలుస్తోంది.
మెట్రో విస్తరణకు రూ. 7 వేల కోట్లపైనే?
రూ. 24,369 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టులో 30 శాతం మేర రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఈ మేరకు రూ. 7,200 కోట్లను ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించే అవకాశాలున్నాయి. దీంతోపాటు మరో రూ. 4 వేల కోట్లకుపైగా కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఇవి పోను రూ. 12 వేల కోట్లలో రూ. 1,000 కోట్లను పీపీపీ పద్ధతిలో సమకూర్చుకోవాలనుకుంటోంది.
మిగతా నిధులను జైకా, ఏడీబీ, ఎన్‌డీబీ లాంటి సంస్థల ద్వారా రుణాల రూపంలో తీసుకోనుంది. అదేవిధంగా హైదరాబాద్ శివార్లలో దాదాపు 800 చదరపు కిలోమీటర్లకుపైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఫ్యూచర్ సిటీ భూసేకరణ కోసం తొలిదశలో భాగంగా రూ. 10 వేల కోట్లను ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment