గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఖర్చులను తగ్గించుకోండి
కొత్త పథకాలకు ప్రత్యేకంగా నిధుల అంచనాలు చూపెట్టాలి
4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో సమర్పించాలి
2025–26 బడ్జెట్ తయారీ కోసం ఆర్థిక శాఖ మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) గాను వార్షిక బడ్జెట్ తయారీ కోసం అన్ని ప్రభుత్వ శాఖలు తమ అంచనాలను జనవరి 4వ తేదీలోగా పంపాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ మేరకు బడ్జెట్ రూపకల్పన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం...
» అన్ని ప్రభుత్వ విభాగాలు ఈనెల 4వ తేదీలోగా ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ బడ్జెట్ ప్రతిపాదనలను ఆయా శాఖలకు పంపాల్సి ఉంటుంది. అదే రోజున ఆయా శాఖాధిపతులు వాటిని పరిశీలించి మార్పులు, చేర్పులు చేసిన అనంతరం ఆర్థిక శాఖకు పంపాల్సి ఉంటుంది.
» ఊహాజనిత అంచనాలకు పోకూడ దు. తమకు అవసరమయ్యే వాస్తవిక నిధుల కంటే ఎక్కువ లేదా తక్కువ మొత్తాలను ప్రతిపాదించకూడదు.
» గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దుల కింద చేసే ఖర్చును అన్ని శాఖలు తగ్గించుకోవాలి.
»ప్రతి శాఖ విధిగా వ్యవస్థీకృత వ్యయాన్ని ప్రతిపాదించాలి. ఆఫీసుల నిర్వహణ, వాహనాలు, అద్దెలు, విద్యుత్, తాగునీటి ఖర్చులు, ఔట్‌సోర్సింగ్ సర్వీసులు, సంక్షేమ, సబ్సిడీ పథకాలకు అయ్యే వ్యయ అంచనాలను పంపాల్సి ఉంటుంది.
» డిసెంబర్ 31, 2024 వరకు ఉన్న నికర అప్పుల వివరాలను పంపాలి. ప్రతి శాఖలో ఉన్న శాశ్వత ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగుల వివరాలు పంపాలి.
» అన్ని శాఖలు 2024–25 ఆర్థిక సంవత్సరపు సవరించిన అంచనాలను కూడా పంపాలి. ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశాలను రాబడి శాఖలు ప్రతిపాదించాలి.
» వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలను ప్రారంభించాల్సి ఉంటే అందుకు సంబంధించిన వివరాలు, అయ్యే ఖర్చును విధిగా ప్రతిపాదించాలి.
»ప్రభుత్వ శాఖల్లో అమలు పరిచేందుకు వీలున్న కేంద్ర ప్రాయోజిత పథకాలను (సీఎస్‌ఎస్) గుర్తించడం ద్వారా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకునే వీలున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిష్పత్తిని పేర్కొంటూ ప్రతిపాదనలు పంపాలి.
Comments
Please login to add a commentAdd a comment