బడ్జెట్ ప్రతిపాదనలను బట్టి చూస్తే.. రాబడి 39.41% ఖర్చు 39.75%
2024–25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ రూ. 2.74 లక్షల కోట్లు
ఆరు నెలలు ముగిసే సరికి ఆదాయం రూ. 1.08 లక్షల కోట్లే (39.41% మాత్రమే)
ఆర్థిక సంవత్సరం 6 నెలలు గడిచేసరికి డోలాయమానంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
రూ.2.54 లక్షల కోట్ల ఖర్చు ప్రతిపాదించగా ఆరు నెలల్లో రూ.1.01 లక్షల కోట్లు అంటే 39.75% వ్యయం
రూ.లక్ష కోట్ల రాబడిలో అప్పులే రూ.32 వేల కోట్లు.. పన్ను ఆదాయం రూ.69 వేల కోట్లే
అమ్మకపు పన్ను మినహా అన్ని పన్ను రాబడుల్లోనూ గత ఏడాదితో పోలిస్తే తగ్గుదల
ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్థిక సంవత్సరం చివరికి రూ.2 లక్షల కోట్లు వచ్చేది కూడా అనుమానమే!
ప్రభుత్వం త్వరగా మేలుకోకపోతే ముందుంది గడ్డుకాలమే అంటున్న ఆర్థిక నిపుణులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌లో రూ.100 ఆదాయం కింద ప్రతిపాదిస్తే, ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు ముగిసే సమయానికి రూ.39.41 మాత్రమే వచ్చాయి. కానీ బడ్జెట్‌లో రూ.100 ఖర్చు కింద ప్రతిపాదించగా, ఇదే ఆరు నెలల్లో ఖర్చు పెట్టింది మాత్రం రూ.39.75. అంటే బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే ఆదాయం కంటే ప్రభుత్వ ఖర్చే ఎక్కువగా ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
పన్ను రాబడుల్లో మందగమనం, కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం రాకపోవడం, పన్నేతర ఆదాయం భారీగా తగ్గడం లాంటి పరిణామాలతో ఆరు నెలల తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డోలాయమానంలో పడిందని ఈ గణాంకాల ద్వారా అర్థమవుతోంది. ముఖ్యంగా గత ఏడాదితో పోలిస్తే అమ్మకపు పన్ను మినహా మిగిలిన పన్ను రాబడుల్లోనూ తగ్గుదల నమోదు కావడం గమనార్హం.
వచ్చింది రూ.లక్ష కోట్లే
2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.74 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 నాటికి ఆరు నెలలు ముగిసే సమయానికి ఈ ప్రతిపాదనల్లో కేవలం 39.41 శాతం అంటే రూ.1.08 లక్షల కోట్లు మాత్రమే ఖజానాకు చేరింది. ఇందులో పన్ను రాబడులు కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమే కావడం గమనార్హం. బడ్జెట్ ప్రతిపాదనలను బట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.64 లక్షల కోట్లు పన్ను రాబడుల రూపంలో సమకూరాలి.
అంటే ఆరు నెలలకు అందులో సగం లెక్కన కనీసం రూ.82 వేల కోట్లు రావాల్సి ఉంది. కానీ ఏకంగా రూ.13 వేల కోట్లు తక్కువగా కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమే పన్నుల రూపంలో సమకూరాయి. జీఎస్టీ కింద రూ. 24,732 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.7,251 కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ.16,081 కోట్లు, ఎక్సైజ్ పద్దు కింద రూ.9,492 కోట్లు వచ్చాయి. ఇందులో అమ్మకపు పన్ను మినహా అన్ని శాఖల్లోనూ గత ఏడాది కంటే తగ్గుదల కనిపించింది.
ఇక పన్నేతర ఆదాయం అయితే గత ఏడాదితో పోలిస్తే చాలా దూరంలో ఉంది. గత ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లో సెప్టెంబర్ నాటికి 74 శాతం పన్నేతర ఆదాయం రాగా, ఈ ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లో ఇప్పటివరకు కేవలం 11.65 శాతం అంటే రూ.4,101 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పటివరకు రూ.లక్ష కోట్లు రాగా, మరో రూ.1.70 లక్షల కోట్లు రావాల్సి ఉందని, కానీ పరిస్థితి ఇలా కొనసాగితే మరో రూ.లక్ష కోట్లు రావడం కూడా గగనమేనని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి.
30 శాతానికి పైగా అప్పులే
రెవెన్యూ రాబడులు పోను రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అప్పుల మీదనే ఆధారపడి నడుస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన రూ.1.08 లక్షల కోట్ల ఆదాయంలో అప్పులు రూ.32,536 కోట్లు ఉండటం గమనార్హం. అంటే మొత్తం వచ్చిన దాంట్లో 30 శాతానికి పైగా అప్పుల ద్వారానే సమకూరిందన్నమాట. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తం అప్పుల్లో ఇప్పటికే 66 శాతం సమీకరించిన నేపథ్యంలో రానున్న ఆరు నెలల్లో అప్పుల సమీకరణకు కూడా అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు అనుగుణంగా రుణాల సమీకరణ జరగాల్సిన నేపథ్యంలో రానున్న ఆరునెలల పాటు సొంత ఆదాయం పెంచుకోవడం పైనే ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుందని, లేదంటే ఖజానాకు తిప్పలు తప్పవని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఇక కేంద్రం నుంచి సాయం కూడా ఆశించిన మేర అందడం లేదని ఆరునెలల లెక్కలు చెపుతున్నాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేంద్రం రూ.21 వేల కోట్లకు పైగా ఇస్తుందని బడ్జెట్‌లో ప్రతిపాదించగా, ఆరు నెలల్లో కేవలం రూ.2,447 కోట్లు (11 శాతం) మాత్రమే వచ్చాయి.
ఖర్చులు పైపైకి..
ఓ వైపు ఆదాయం తగ్గుతుండగా, మరోవైపు ఖర్చుల అనివార్యత రాష్ట్ర ఖజానాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ ఏడాది రూ.2.54 లక్షల కోట్లు ఖర్చవుతుందని బడ్జెట్‌లో ప్రతిపాదించగా, ఇప్పటివరకు రూ.1.01 లక్షల కోట్లు (39.75 శాతం) ఖర్చయినట్లు ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో రెవెన్యూ పద్దు కింద రూ.41,802 కోట్లు, అప్పులకు వడ్డీల కింద రూ.13,187 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం రూ.21,279 కోట్లు, పింఛన్ల కోసం రూ. 8,560 కోట్లు, సబ్సిడీల రూపంలో రూ.6,376 కోట్లు వ్యయం జరిగింది.
ఇక మూలధన వ్యయం కింద మరో రూ.9,924 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అనివార్య ఖర్చులు పెరిగాయని అర్థమవుతోందని, ఈ ఏడాదిలో కొత్త పథకాల అమలుకు ఎలాంటి అవకాశం లేదని, ఉన్న పథకాలనే కనాకష్టంగా కొనసాగించాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు. రాబడి తగ్గి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత పొదుపుగా వ్యవహరించడంతో పాటు వీలున్నంత త్వరగా రాబడి మార్గాలను పెంచుకునే ప్రయత్నాలను ప్రారంభించకపోతే ఆర్థిక ఒడిదుడుకులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
అదనపు రాబడులొచ్చే ప్రణాళికలు చూడండి
– సీఎస్‌తో సీఎం, డిప్యూటీ సీఎం ప్రత్యేక భేటీ
రాష్ట్ర ఆదాయ వనరులపై ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఉద్యోగ సంఘాల జేఏసీలతో సమావేశం అనంతరం ఈ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పరిస్థితులను బేరీజు వేసుకుని అదనంగా ఖజానాకు రాబడులు వచ్చేందుకు ఎలాంటి ప్రణాళికలు చేపడతారో వివరిస్తూ వీలున్నంత త్వరగా నివేదికలు ఇవ్వాలని సీఎస్‌ను సీఎం, డిప్యూటీ సీఎంలు ఆదేశించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment