
జాతీయ సగటు 23.59 శాతం కంటే రాష్ట్రంలోనే అధికం
రాష్ట్ర అటవీ విస్తీర్ణం 27,688 చదరపు కిలోమీటర్లు
రాష్ట్రంలో 2,939 కి పైగా వృక్ష, మొక్కల జాతులు
365 పక్షి జాతులు, 131 జంతు, మృగాల జాతులు
సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు 24.69 శాతం ఉన్నాయని సామాజిక, ఆర్థిక సర్వే 2024–25లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో అడవులు 23.59 శాతం ఉండగా, రాష్ట్రంలో అంతకంటే అధికంగానే ఉన్నట్లు పేర్కొంది. అడవుల సగటు విస్తీర్ణంలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 2,939 కి పైగా వృక్ష, మొక్క జాతులున్నాయి. 365 పక్షి జాతులు, 131 ఇతర జంతువులు, మృగాల జాతులున్నాయని సర్వేలోతెలిపారు.
రాష్ట్రంలో మొత్తం అడవులు 27,688 చ.కి.మీ మేర విస్తరించి ఉన్నాయి. మొత్తం 12 రక్షిత ప్రాంతాల్లో 9 వైల్డ్‌లైఫ్ శాంక్చురీలు, మూడు జాతీయ పార్కులు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం వనమహోత్సవం, ప్రాజెక్ట్ టైగర్, అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అమ్రాబాద్ పులుల అభయారణ్యం (ఏటీఆర్)ను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటించింది.
