అందాల రాచకొండ | Natural beauties that attract tourists | Sakshi
Sakshi News home page

అందాల రాచకొండ

Published Mon, Jan 6 2025 5:08 AM | Last Updated on Mon, Jan 6 2025 5:08 AM

Natural beauties that attract tourists

పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రకృతి అందాలు 

పురాతన కట్టడాలు, ఆలయాలకు ప్రసిద్ధి 

పలు సినిమాల షూటింగ్‌ 

ఫిలింసిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన 

రాచకొండ అభివృద్ధితో ఉపాధి, ఉద్యోగావకాశాలు

సంస్థాన్‌ నారాయణపురం: ప్రకృతి అందాలు.. ప్రాచీన కట్టడాలు, పురాతన దేవాలయాలకు పెట్టింది పేరు రాచకొండ ప్రాంతం. ఎత్తయిన కొండలు, ప్రకృతి సోయగాలు, పక్షుల కిలకిలారావాలు, మయూరాల నాట్యం, సెలయేళ్లు, జలపాతాలు.. అంతులేని ఈ ప్రకృతి అందాలకు చిరునామా రాచకొండ. ఆనాడు తెలంగాణ ప్రాంతానికి రాజధానిగా వెలసిన గొప్ప నగరం. 

ఇప్పటి తెలంగాణ ప్రాంతం అంతటికీ పద్మనాయక వంశీయుల ఏలుబడిలో రాజధానిగా చరిత్ర పుటల్లో నిలిచింది. యాద్రాది భువనగిరి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని సంస్థాన్‌ నారాయణపురం మండలంలో రాచకొండ అటవీ ప్రాంతం 35 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది హైదరాబాద్‌ నగరానికి దగ్గరగా ఉంది. గతంలో మాజీ సీఎం కేసీఆర్‌ ఫిలింసిటీ ఏర్పాటు కోసం ఏరియల్‌ సర్వే నిర్వహించి, అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. 

రాచకొండలో ఫిలింసిటీ ఏర్పాటు చేస్తానని గత సంవత్సరం జూలైలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రకటించారు. దేశంలోనే అతిపెద్ద రెండో సైబరాబాద్‌ ఈస్ట్‌ కమిషనరేట్‌కు.. గత ప్రభుత్వం రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌గా నామకరణం చేసింది. 

రాచకొండలో చూడదగ్గ ప్రదేశాలు.. 
రాచకొండలో కట్టడాలు, నిర్మాణాలతో పాటు గుహలు, వందల సంఖ్యలో దేవాలయాలు, శిల్ప కళాఖండాలు, చిత్రాలు ఉన్నాయి. ప్రధానంగా కచేరి ప్రదర్శన శాల, ఉత్సవ విగ్రహాల మందిరం, సన్యాసుల దొన, సంకెళ్ల బావి, మెట్ల బావులు, కోనేర్లు, కోట చుట్టూ ఉన్న రాతి కట్టడా లు, కొండలు, గుహలు, గొలుసు కట్టు చెరువులు, దేవలమ్మ నాగారంలోని నాగాంబిక శిలాశాసనం, గొలుసు కట్టు చెరువులు, గన్నేర్లలోని జాలువారు సెలయేళ్లు, మొల్కచెర్వు ప్రాంతంలోని ఎత్తయిన జలపాతాలు, అంతకు మించి పచ్చటి కొండలు, చిట్టడవిలో నెమళ్లు కనువిందు చేస్తాయి. 

నక్షత్ర తాబేళ్లకు ఈప్రాంతం ప్రత్యేకం. ప్రకృతి ప్రేమికులు వర్షాలు కురిసిన తర్వాత జూలై, ఆగస్ట్‌ నెలల్లో రాచకొండకు ఎక్కువగా వస్తుంటారు. చారిత్రక కట్టాడాలు, దేవాలయ సందర్శనకు రోజూ వస్తుంటారు. 

దేవాలయాలకు ప్రసిద్ధి 
రాచకొండలో వందల సంఖ్యలో దేవాలయాలున్నాయి. ఎంతో ప్రాధాన్యమున్న పురాతన రామాలయం ఉంది. ఆ రామాలయంలో సహజ పాండిత్య బమ్మెర పోతన పూజలు చేశాడని చరిత్ర చెబుతోంది. గుప్త నిధుల తవ్వకాల్లో బయటపడిన స్వయంభూ లింగేశ్వర శివలింగానికి నిత్యం పూజలు నిర్వహిస్తారు. ఇటీవల పునరి్నరి్మంచిన సరళమైసమ్మ, శ్రీ లక్ష్మీ నర్సింహ దేవాలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. సరళ మైసమ్మ దేవాలయం వద్ద ప్రతి ఆదివారం జాతరలా జరుగుతుండటంతో.. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.

వీరభద్రస్వామి దేవాలయం, త్రికుటేశ్వర ఆలయం, అమ్మవారి దేవాలయాలు, పురాతన శివాలయంతో పాటు ఆళ్వారుల దేవాలయాలు.. ఇలా రాచకొండ అంతటా విస్తరించి ఉన్నాయి. మహాశివరాత్రికి స్వయంభూ లింగేశ్వర శివలింగం ఉత్సవాలు, గాలిబ్‌ షాహెద్‌ హజరత్‌ ఉర్సు ఒకేరోజు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. 

చౌటుప్పల్‌ మండలంలోని ఆదిమహావిష్ణువు దేవాలయల సందర్శనకు భక్తులు వస్తుంటారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల శివాలయంలో ఏకశిల ధ్వజస్తంభంతో పాటు ఇతర శాసనాలు, కట్టడాలు అనేకం ఉన్నాయి. మొల్కచెర్వు ప్రాంతంలో జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. 

పర్యాటకులను ఆకర్షించేలా.. 
రాచకొండ చారిత్రక నేపథ్యం ప్రతిబింబించేలా ప్రణాళికలు రూపొందించారు. రాచకొండ అటవీ శాఖ బీట్‌లో 657 ఎకరాల్లో ఎకో టూరిజం అర్బన్‌ పార్క్‌ అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే వివిధ రకాల 2500 మొక్కలు నాటారు. పురాతన మెట్ల బావిని అభివృద్ధి చేశారు. 

రాచకొండ ప్రకృతి అందాలను తిలకించే విధంగా అతి పెద్ద వ్యూ పాయింట్, ప్రధాన ద్వారం అభివృద్ధి. దర్గా నుంచి రాచకొండ కోట వరకు రోడ్డు నిర్మాణం, రోడ్డు వెంట ఉన్న చెరువుల మరమ్మతులు చేశారు. వివిధ రకాల పూల, గడ్డి జాతి మొక్కలతో పాటు విభిన్న రకాల వృక్షాలను పెంచుతున్నారు .

ఫిలింసిటీకి అనువైన ప్రాంతం.. 
హైదరాబాద్‌కు రాచకొండ అతి సమీపంలోని ప్రాంతం. గతంలో అప్పటి సీఎం కేసీఆర్‌ రెండు వేల ఎకరాల్లో ఫిలిం సిటీ నిర్మించాలని ఈ ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. గత సంవత్సరం జూలైలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఫిలింసిటీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. రాచకొండ గుట్టల్లో ఇప్పటికే పలు సినిమాలను చిత్రీకరించారు.

మల్కాపురం ఘాట్‌ కంచె భూ ముల్లో ‘రెబల్‌’చిత్రం, పవన్‌కల్యాణ్‌ నటించిన ‘గబ్బర్‌సింగ్‌’సినిమాలో క్లైమాక్స్‌ సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు. మహేశ్‌బాబు హీరోగా ‘ఆగడు’చిత్రం క్‌లైమాక్స్‌ ఫైట్‌ను కూడా ఇక్క డే చిత్రీకరించారు. రాచకొండలో శ్రీకాంత్‌ హీరోగా నటించిన ‘విరోధి’, ‘సీ తారాముల కల్యా ణం’ సినిమాలో సుమన్‌పై క్‌లైమాక్స్‌ ఫైట్లను చిత్రీకరించారు. ‘జానకిరామా’హిందీ సీరియల్‌ నిర్మాణంతో పాటు అనేక షార్ట్‌ ఫిల్మ్‌లు చిత్రీకరించారు. 



ప్రగతి.. ప్రతిపాదనలకే పరిమితం.. 
కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు రాచకొండ అభివృద్ధి ప్రతిపాదనలపై ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. కానీ ఆ తర్వాత వాటి ఊసే ఎత్తడం లేదు. అభివృద్ధి ప్రతిపాదనల్లో భాగంగా రాచకొండలో ఐటీ పార్కు, కృషి విజ్ఞాన కేంద్రం, నెమళ్ల పార్కు, టెంపుల్‌ సిటీ, ఫిలింసిటీ, పర్వతారోహణం, రోప్‌వే, స్పోర్ట్స్‌సిటీ, ఎడ్యుకేషన్‌ హబ్, స్మార్ట్‌సిటీ, రైలుబోగీల పరిశ్రమ, ఇండ్రస్టియల్‌ కారిడార్‌గా అభివృద్ధి తదితర ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రతిపాదనలు వచ్చాయి. 

రాచకొండకు హైదరాబాద్‌ నుంచి, శంషాబాద్‌ నుంచి, హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి నుంచి నాలుగు లేన్ల రోడ్లను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. ఇవన్నీ ప్రతిపాదనల దశల్లోనే ఉన్నాయి. రాచకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఇక్కడి ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 

రాచప్ప సమితి సేవలు అమోఘం.. 
రాచకొండను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా లన్న ఉద్దేశంతో స్థానిక యువత రాచకొండ చారిత్రక పర్యావరణ పర్యాటక పరిరక్షణ సమితి (రాచప్ప) అనే సంస్థను ఏర్పాటు చేశారు. రాచకొండ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. 

కొన్ని దేవాలయాలను ఎంపిక చేసుకొని, నిత్య దీపారాధన, స్వయంభూ లింగేశ్వర శివలింగం వద్ద సోమవారం అన్నదానం చేస్తున్నారు. రాచకొండ చరిత్రపై ప్రచారం నిర్వహిస్తున్నారు. రాచకొండ పర్యాటక ఉత్సవాలను కూడా రాచప్ప సమితి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు.  

పర్యాటకాభివృద్ధి చేయాలి  
రాచకొండ ప్రాంతాన్ని ఫిలింసిటీతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. టెంపుల్‌ సిటీగా తీర్చిదిద్దాలి. మౌలిక వసతులు కల్పించాలి. చారిత్రక కట్టడాలను పరిరక్షించి గోల్కొండ ఖిల్లాను అభివృద్ధి చేయాలి. హైదరాబాద్‌కు అతి సమీపంలోని రాచకొండను అభివృద్ధి చేస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.  – సూరపల్లి వెంకటేశం,  ప్రధాన కార్యదర్శి, రాచప్ప సమితి  

ది కోవ్‌ రిసార్ట్‌లో రూంల ధరలు ఇలా..
» ఈ రిసార్ట్‌లో 21 కాటేజీలు ఉన్నాయి. వీటిలో బస చేయాలంటే పర్యాటక శాఖకు చెందిన వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకోవాలి.  
» 21 కాటేజీలను 7 రకాలుగా విభజించి అద్దెలు నిర్ణయించారు. 

అద్దెకు 18 శాతం టాక్స్‌ అదనం.  
శేయాన్స్‌ రౌండ్‌ హౌస్‌: ఇది ఒక రూమ్‌ మాత్రమే. ఏసీ ఉంటుంది. దీని అద్దె 15 వేలు. ఇద్దరు పెద్దలు, ఒక చిన్నవారికి (5 ఏళ్ల లోపు) మాత్రమే అవకాశం ఉంటుంది. అదనంగా ఎవరైనా ఉంటే రూ.5 వేలు చెల్లించాలి. 

పూల్‌ హెవెన్‌ కాటేజీలు: మూడు ఏసీ గదులు ఉంటాయి. అద్దె రూ.12 వేలు. ఇద్దరు పెద్దలు, ఒకరు చిన్న వారికి (5 ఏళ్ల లోపు) మా త్రమే అవకా శం ఉంటుంది. అదనంగా ఉండేవారికి రూ.4 వేలు చెల్లించాలి. 5 నుంచి 12 ఏళ్లలోపు వారు అయితే అదనంగా రూ.3 వేలు చెల్లించాలి.  

గ్లాంప్‌ విల్లా: రెండు ఏసీ గదులు ఉంటాయి. ధర రూ.13 వేలు. ఇద్దరు పెద్దలు, ఒకరు చిన్న వారికి అవకాశం ఉంటుంది. అదనంగా ఉంటే రూ.2,500. 5 ఏళ్ల నుంచి 12 ఏళ్లలోపు ఉన్న వారికి అదనంగా రూ.1500 చెల్లించాలి.  
ట్విన్‌ బెడ్‌ కాటేజేస్‌: ఒక రూమ్‌. ఏసీ ఉంటుంది. నలుగురు పెద్దవారు, ఒకరు చిన్నారి ఉండేందుకు రూ.13 వేలు చెల్లించాలి. అదనంగా ఉండే వారికి రూ.2,500. అలాగే 12 ఏళ్ల పిల్లలకు రూ.1,500 అదనంగా చెల్లించాలి.  

ఫ్లోటింగ్‌ క్యాబిన్స్‌: రెండు ఏసీ గదులు ఉంటాయి. రూ.8,500 చెల్లించాలి. ఇద్దరు పెద్ద వారికి, ఒక చిన్నారికి అవకాశం ఉంటుంది. అదనంగా ఉండే వారికి రూ.2 వేలు, టాక్స్‌ వేస్తారు. 12 ఏళ్లలోపు వారికి రూ.1500, పన్ను అదనం.  పై రూంలలో ఉండే సదుపాయాలు టీవీ, ఫ్రిజ్, అడ్వెంచర్‌ యాక్టివిటీస్, బ్రేక్‌ఫాస్ట్‌.  

ఫ్లోటింగ్‌ క్యాబిన్స్‌: ఒక రూం. నాన్‌ ఏసీ. రూ.7 వేలు, టాక్స్‌ అదనం. ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారికి అవకాశం ఉంటుంది. అదనంగా ఉంటే రూ.2 వేలు, టాక్స్‌ ఉంటుంది. 12 ఏళ్లలోపు వారికి రూ.1,500, టాక్స్‌ అదనం.  

విల్లా బ్రాంచ్‌ కాటేజెస్‌: మూడు ఏసీ రూంలు ఉంటాయి. ధర రూ.7,500, టాక్స్‌ అదనం. ఇద్దరు పెద్దలు, ఒకరు చిన్నారికి అవకాశం. అదనంగా ఉంటే రూ.2 వేలు, టాక్స్‌ చెల్లించాలి. 12 ఏళ్లలోపు వారికి రూ.1,500, టాక్స్‌ అదనం.  

విల్లా బ్రాంచ్‌ కాటేజెస్‌: ఒక రూం, నాన్‌ ఏసీ. రూ.6 వేలు, టాక్స్‌ అదనం. ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారికి అవకాశం. అదనంగా ఉంటే రూ.2 వేలు, టాక్స్‌ చెల్లించాలి. 12 ఏళ్లలోపు వారికి రూ.1,500, టాక్స్‌ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.  

ప్రీమియం రూమ్స్‌: రెండు ఏసీ రూంలు. రూ.7,500, టాక్స్‌ అదనం. ఇద్దరు పెద్దలు, ఒకరు చిన్నారికి అవకాశం. అదనంగా ఉంటే రూ.2 వేలు, టాక్స్‌ చెల్లించాలి. 12 ఏళ్లలోపు వారికి రూ.1,500, టాక్స్‌ అదనం. 

ప్రీమియం రూమ్స్‌: నాలుగు రూంలు. నాన్‌ ఏసీ. రూ.6 వేలు, టాక్స్‌ అదనం. ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారికి అవకాశం. అదనంగా ఉంటే రూ.2 వేలు, టాక్స్‌ చెల్లించాలి. అదనపు చిన్నవారికి 1,500, టాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది.  ఈ రూంలల్లో అడ్వెంచర్‌ యాక్టివిటీస్‌తోపాటు బ్రేక్‌ఫాస్ట్‌ ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement