సామాజిక ఆర్థిక సర్వే (2024–25)లో కేంద్ర ప్రభుత్వం వెల్లడి
తెలంగాణ ఎంఎస్‌ఎంఈ పాలసీతో ఈ–కామర్స్ వ్యాప్తికి దోహదం
రాష్ట్రంలో 100 శాతం గ్రామాలకు రక్షిత మంచినీరు
ఇస్రో భువన్ ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రికల్ ఇన్‌ఫ్రా నిర్వహణ
రాజస్థాన్, ఏపీల తర్వాత సిమెంట్ పరిశ్రమల్లో మూడో స్థానం
స్థూల ఉత్పత్తిలో సేవల రంగం వాటా 6 శాతం.. దేశంలో ఏడో స్థానంలో తెలంగాణ
ఐటీ సేవల్లో కర్ణాటక తర్వాత రెండో ప్లేస్.. తలసరి ఆదాయంలో ఐటీదే అగ్రస్థానం
బెంగళూరు, ముంబైతో పోటీగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం
ఐటీ, ఫిన్‌టెక్ సేవల విస్తృతి కారణంగా ఆఫీసులు, నివాస స్థలాలకు మంచి డిమాండ్
ఫర్వాలేదనిపించే స్థాయిలో పారిశ్రా మిక అభివృద్ధి సాధించినట్టు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సొంత ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో తెలంగాణ దూసుకుపోతోందని సామాజిక, ఆర్థిక సర్వే 2024–25 వెల్లడించింది. దేశంలోని 15 రాష్ట్రాల్లో వసూలవుతున్న పన్నుల్లో సగం కంటే ఎక్కువ మొత్తం సొంత పన్నుల( Own Tax Revenue) ద్వారానే వస్తోందని.. అందులో అత్యధికంగా తెలంగాణలో సొంత పన్నుల రాబడి 88శాతంగా ఉందని తెలిపింది. కర్ణాటక, హరియాణా రాష్ట్రాలు 86 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయని వెల్లడించింది.
శుక్రవారం ప్రారంభమైన లోక్‌సభ బడ్జెట్ సమావేశాల్లో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సర్వే ప్రకారం.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా అంశాల్లో ముందంజలో ఉందని వెల్లడైంది. ముఖ్యంగా మహిళా పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ హబ్‌గా మారిందని.. కర్ణాటక, మహారాష్ట్రలతో పోటీగా ఇక్కడ రియల్‌ఎస్టేట్ వ్యాపారం వృద్ధి చెందుతోందని ఈ సర్వే తెలిపింది.
రాష్ట్రంలో 100శాతం గ్రామాలకు రక్షిత మంచినీరు అందుతోందని, 86 శాతం సాగుయోగ్యమైన భూములకు నీటి సౌకర్యం ఉందని పేర్కొంది. సామాజిక, ఆర్థిక సర్వే (2024–25)లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, సామాజిక పరిస్థితులకు సంబంధించిన విశేషాలివీ..
⇒ ఎగుమతుల పెంపు కోణంలో దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ–కామర్స్ మార్కెట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక విధానం ఈ–కామర్స్ వ్యా ప్తికి ఇతోధికంగా దోహదపడనుంది. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ), గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ పోర్టల్‌లో అమ్మకపు సంస్థల ప్రాతినిధ్యాన్ని పెంచేదిగా ఉంది.
⇒ 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్‌ను ప్రారంభించినప్పుడు దేశంలోని 3.23 కోట్ల గ్రామీణ కుటుంబాలు (17శాతం) మాత్రమే రక్షిత మంచినీటి సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. 2024 నవంబర్ 26 నాటికి ఈ పథకం కింద మరో 12.06 కోట్ల కుటుంబాలకు రక్షిత మంచినీరు అందుతోంది. ప్రస్తుతం దేశంలోని 79.1 శాతం గ్రామీణ కుటుంబాలకు నల్లా నీరు చేరుతోంది. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు 100 శాతం గ్రామీణ కుటుంబాలకు రక్షిత మంచినీటిని అందిస్తున్నాయి. ఇందులో తెలంగాణ ఒకటి.
⇒ ఇస్రో చేపట్టిన అనేక భౌగోళిక వేదికల ద్వారా గ్రామీణాభివృద్ధి, పట్టణ ప్రణాళిక, న్యాయ, ఎలక్ట్రికల్ ఇన్‌ఫ్రా రంగాల్లో సామర్థ్యం పెరగడంతోపాటు ఆయా రంగాల్లో రాష్ట్రాలు సాధిస్తోన్న పురోగతిని తెలుసుకునే వీలు కలుగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలో భువన్ వేదిక ద్వారా వెబ్‌జీఐఎస్ పోర్టల్‌తో ఎలక్ట్రికల్ ఇన్‌ఫ్రా నిర్వహణ సాధ్యమవుతోంది.
⇒ ప్రపంచంలో చైనా తర్వాత సిమెంట్ ఉత్పత్తి అత్యధికంగా జరుగుతోంది మన దేశంలోనే. మన దేశంలోని రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే 87 శాతం సిమెంట్ పరిశ్రమలున్నాయి.
⇒ రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో సేవల రంగం గణనీయ పాత్ర పోషిస్తోంది. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటకల్లోని సేవల రంగం వాటా దేశంలోని అన్ని రాష్ట్రాల వాటాలో 25 శాతాన్ని మించుతోంది. తెలంగాణలో స్థూల ఉత్పత్తిలో సేవల రంగం వాటా 6 శాతంగా నమోదైంది. దేశంలో ఈ రంగంలో తెలంగాణ ఏడో స్థానంలో ఉంది.
⇒ రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సేవల రంగాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, హరియాణా, తమిళనాడు ముందంజలో ఉన్నాయి. బెంగళూరు, ముంబై, హైదరాబాద్, గుర్గావ్, చెన్నై నగరాల్లో ఎక్కువ వృద్ధి కనిపిస్తోంది. ఆయా నగరాల్లో ఐటీ, ఫిన్‌టెక్ సేవల విస్తృతి కారణంగా ఆఫీసు, నివాస స్థలాల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది.
⇒ కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు సర్విసుల రంగంలో మంచి ప్రతిభ కనబరుస్తున్నా.. పారిశ్రామిక అభివృద్ధిలో ఫర్వాలేదనిపించే స్థాయిలోనే ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోని ఆర్థిక వ్యవస్థ పట్టణీకరణ కేంద్రంగా ముందుకెళుతుండటమే ఇందుకు కారణం.
⇒ సామూహిక అభ్యాస కార్యక్రమాల ద్వారా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రేరణ మోడల్ విద్య కొనసాగుతోంది. తద్వారా తక్కు వ సంఖ్యలో ఉండే సమూహాలు అభ్యసనం, బో ధన తదితర కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి.
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఐటీ సర్విసుల విస్తృతి గణనీయంగా ఉంది. వాణిజ్య సేవల రంగమైన ఐటీ రంగమే తెలంగాణ
తలసరి ఆదాయ వాటాలోనూ సింహభాగం నమోదు చేస్తోంది.
మహిళా పారిశ్రామికవేత్తలకు తెలంగాణ హబ్‌గా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సహకారం ఇందుకు దీర్ఘకాలికంగా దోహదపడనుంది. దేశంలోనే మహిళా పారిశ్రామికవేత్తల ఇంక్యుబేటర్ రాష్ట్రంగా తెలంగాణ రూపొందింది.
2016–21 మధ్య దేశవ్యాప్తంగా సాగునీటి సౌకర్యం బాగా పెరిగింది. పంజాబ్ (98శాతం), హరియాణా (94), తెలంగాణ (86), ఉత్తరప్రదేశ్ (84శాతం)లలో సాగుయోగ్యమైన భూములకు ఎక్కువగా నీటి సౌకర్యం అందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment