గత రెండేళ్లతో పోల్చితే తగ్గిపోయిన రిజిస్ట్రేషన్లు, ఆదాయం
ఎన్నికల ముందు నుంచీ స్థిరాస్తి రంగం మందగమనం
రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా అదే స్తబ్ధత
కొత్త ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై స్పష్టత లేక గందరగోళం
భూమి విలువల పెంపు, లే–ఆఫ్‌లు, ఆర్థిక మందగమనం వంటివీ కారణమే
వరుస ఎన్నికలు, ప్రభుత్వ మార్పు, భూమి విలువల సవరణ, కరువు ఛాయలు, ఆర్థిక మందగమనం, బ్యాంకు రుణవడ్డీ రేట్ల భారం.. వెరసి రియల్ ఎస్టేట్ రంగంపై ముప్పేట దాడి జరుగుతోంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థిరాస్తి క్రయవిక్రయాలు పడిపోయాయి. గత ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలతో మొదలైన ప్రతికూల పరిస్థితి క్రమంగా తారస్థాయికి చేరింది. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా.. స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే పాలసీలు, నిర్ణయాలపై ఎలాంటి స్పష్టత లేకపోయే సరికి పరిశ్రమ నిరాశలోకి జారిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానరాని స్పష్టత..
సాధారణంగా ఎన్నికలకు ఆరేడు నెలల ముందు నుంచే స్థిరాస్తి మార్కెట్ క్రమంగా తగ్గుతూ ఉంటుంది. నగదు లభ్యత,లావాదేవీలపై పరిమితులు, వడ్డీ రేట్ల ప్రభావం, డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసం వంటివి స్థిరాస్తి రంగంపై ప్రభావం చూపిస్తాయి. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా.. ఇప్పటికీ విధానాలు, పాలసీల అమలుపై స్పష్టత కొరవడింది. ఔటర్ వరకూ జీహెచ్‌ఎంసీ విస్తరణ, మెగా మాస్టర్ ప్లాన్, మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, 111 జీవో రద్దు వంటి పలు
కీలక ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటన్నది తేలడం లేదు. దీంతో బిల్డర్లు, కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి.
మేడ్చల్, రంగారెడ్డి పరిధిలో తగ్గుదల..
సాధారణంగా గ్రేటర్ పరిధిలో మేడ్చల్–మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కానీ గత రెండేళ్లుగా ఈ జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్లు, ఆదాయం తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో గత ఏడాది తొలి ఆరు నెలల్లో 30,814 డాక్యుమెంట్లు రిజి్రస్టేషన్‌కాగా.. రూ.758.13 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది అదే సమయంలో రిజి్రస్టేషన్లు 30,111 డాక్యుమెంట్లకు, ఆదాయం రూ.731.15 కోట్లకు తగ్గాయి. అలాగే మేడ్చల్‌లో డాక్యుమెంట్లు 83,742 నుంచి 75,068కు, రంగారెడ్డిలో 1,18,072 నుంచి 1,13,570కు తగ్గాయి.
లే–ఆఫ్‌లు, ధరల పెరుగుదలా కారణమే..
గ్రేటర్‌లో గృహాలు, ఆఫీసు స్పేస్ వ్యాపారం ఎక్కువ శాతం ఐటీ కంపెనీలు, ఉద్యోగుల మీద ఆధారపడి ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనంతోపాటు ఐటీ రంగంలో లే–ఆఫ్‌లు జరుగుతున్నాయి. కంపెనీలు కూడా విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తున్నాయి. ఇది ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై ప్రభావం చూపడంతో.. గ్రేటర్‌లో స్థిరాస్తి వ్యాపారం మందకొడిగా మారింది. మరోవైపు కరోనా తర్వాత సిమెంట్, స్టీలు వంటి నిర్మాణ సామగ్రి ధరలు రెట్టింపయ్యాయి. దీంతో డెవలపర్లు అపార్ట్‌మెంట్ల ధరలను పెంచేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాటిని కొనలేని స్థితిలో ఉన్నారు.
రిజిస్ట్రేషన్లపై లెక్కలు చూస్తే..
2022 జనవరి–జూన్ మధ్యలో గ్రేటర్‌లో మొత్తం 2,48,817 స్థిరాస్తి డాక్యుమెంట్లు రిజి్రస్టేషన్‌కాగా.. రూ.4,108 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే సమయంలో 2,32,628 డాక్యుమెంట్లే రిజిస్ట్రేషన్ అయి.. ఆదాయం రూ.3,920 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు 2,18,749కు పడిపోయాయి. అంటే 2022తో పోలిస్తే 30 వేల రిజిస్ట్రేషన్లు తగ్గాయి.
కొనుగోలు వాయిదా వేసుకుంటున్నారు..
సాధారణంగా హైదరాబాద్‌లో మధ్యతరగతి గృహాల మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరడంతో మార్కెట్ ఎలా ఉంటుందోఅన్న సందేహాలు ఉన్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇళ్ల కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభం నుంచి స్థిరాస్తి రంగం బాగుంటుంది. – ఇంద్రసేనారెడ్డి, గిరిధారి హోమ్స్ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment