Socio-economic survey
-
చిన్నతరహా పరిశ్రమల్లో విశాఖ దూకుడు
సాక్షి, అమరావతి: కొత్త ఎంఎస్ఎంఈల ఏర్పాటులో రాష్ట్రం వేగంగా దూసుకుపోతోంది. గత ఏడాది (2023–24)లోనే రాష్ట్రంలో కొత్తగా 2,71,341 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు కావడం ద్వారా రూ.8,286.46 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు సామాజిక ఆర్థిక సర్వే–2024 వెల్లడించింది. కొత్తగా ఏర్పాటైన యూనిట్ల ద్వారా 19,86,658 మందికి ఉపాధి లభించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి 1.90 లక్షలుగా ఉన్న ఎంఎస్ఎంఈల సంఖ్య గడచిన ఐదేళ్ల కాలంలో వేగంగా విస్తరించడం ద్వారా 10 లక్షలు దాటింది. గడచిన ఏడాది కొత్త ఎంఎంస్ఎంఈల ఏర్పాటులో విశాఖ జిల్లా మంచి దూకుడు కనబర్చినట్టు సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రూ.648.40 కోట్ల పెట్టుబడితో కొత్తగా 16,505 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేయడం ద్వారా విశాఖ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రూ.477.56 కోట్లతో గుంటూరు జిల్లా (16,085 యూనిట్లు), రూ.526.13 కోట్లతో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు (15,910 యూనిట్లు), రూ.491.88 కోట్లతో కృష్ణా (14,729 యూనిట్లు), రూ.313.84 కోట్లతో అనంతపురం (14,280 యూనిట్లు) జిల్లాలు నిలిచాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 968 యూనిట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 2,213 యూనిట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. ఉపాధి కల్పనలో కర్నూలు ఫస్ట్ప్రతీ రూ.కోటి పెట్టుబడికి 8.75 మందికి ఉపాధి కల్పించడం ద్వారా కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 2023–24 సంవత్సరంలో కర్నూలు జిల్లాలో రూ.266.11 కోట్ల పెట్టుబడితో 12,256 యూనిట్లు ఏర్పాటు కావడం ద్వారా 2,33,019 మందికి ఉపాధి లభించినట్టు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. ఆ తర్వాతి స్థానంలో చిత్తూరు జిల్లా 1,72,276 మందికి ఉపాధి కల్పించడం ద్వారా రెండో స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో ప్రతీ రూ.కోటి పెట్టుబడికి 5.79 మందికి ఉపాధి లభించింది. రాష్ట్రం మొత్తం మీద చూస్తే 2023–24లో ప్రతీ రూ.కోటి పెట్టుబడికి కేవలం 2.39 మందికి ఉపాధి లభించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెట్టుబడుల విలువ పరంగా చూస్తే రూ.648 కోట్ల ఎంఎస్ఎంఈ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా విశాఖ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గడచిన ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ 2023–27 ద్వారా ఎంఎంస్‌ఎంఈలను అంతర్జాతీయంగా ఎదిగే విధంగా అనేక ప్రోత్సహకాలు ఇవ్వడమే కాకుండా ఎంఎంస్ఎంఈ క్లస్టర్ పోగ్రాం, ఎంఎస్ఎంఈలను పటిష్టం చేసేవిధంగా ర్యాంప్ పథకం, టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు, ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు సర్వేలో ప్రముఖంగా పేర్కొన్నారు. -
రెట్టించిన వృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో వేగంగా వృద్ధి చెందుతున్నట్లు సామాజిక ఆర్థిక సర్వే 2022 – 23 వెల్లడిస్తోంది. అన్ని రంగాల్లో వృద్ధి రేటు దగ్గర నుంచి తలసరి ఆదాయం వరకు దేశ సగటు కంటే రాష్ట్రంలో అధికంగా నమోదు కావడం గమనార్హం. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో 13.98 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 2022 – 23 సంవత్సరానికి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 16.22 శాతం వృద్ధి నమోదు కాగా ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి 15.9 శాతంగా ఉంది. 2021 – 22 (తొలి సవరించిన అంచనాల ప్రకారం) రాష్ట్ర జీఎస్డీపీ రూ.11,33,837 కోట్లు కాగా 2022–23 ముందస్తు అంచనాల ప్రకారం రూ.13,17,728 కోట్లకు చేరనుంది. అంటే ఒక్క సంవత్సరంలోనే నికరంగా రూ.1,83,891 కోట్ల విలువైన ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థకు వచ్చి చేరింది. ఇదే సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం 2021–22తో పోలిస్తే 2022–23లో రూ.26,931 పెరిగి రూ.2,19,518కు చేరుకుంది. దేశవ్యాప్తంగా చూస్తే తలసరి ఆదాయంలో వృద్ధి రూ.23,476గా నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్న పథకాలతో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను వేగంగా చేరుకుంటోందని ఆర్థిక సర్వే విశ్లేషించింది. విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, వ్యవసాయం తదితర రంగాలకు వివిధ పథకాల ద్వారా ఇప్పటివరకు రూ.1.97 లక్షల కోట్లను నేరుగా లబ్థిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే. 2022–23 సామాజిక ఆర్థిక సర్వేను సీఎం వైఎస్ జగన్ బుధవారం విడుదల చేశారు. అందులో ముఖ్యాంశాలు ఇవీ.. అన్ని రంగాల్లో రెండంకెల వృద్ధి జీఎస్డీపీలో కీలకమైన వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో రాష్ట్రం రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 13.18 శాతం వృద్ధి నమోదు కాగా పరిశ్రమల రంగంలో 16.36 శాతం, సేవా రంగంలో 20.52 శాతం వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా చూస్తే వ్యవసాయ రంగంలో 11.2 శాతం, పరిశ్రమల రంగంలో 13.9 శాతం, సేవా రంగంలో 17.4 శాతం వృద్ధి నమోదైంది. రాష్ట్రంలో ఒక్క వ్యవసాయ రంగంలోనే 20.72 శాతం వృద్ధి నమోదు కాగా ఉద్యానవన పంటల్లో 12.58 శాతం, పశు సంపదలో 7.32 శాతం, ఆక్వాలో 19.41 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం వ్యవసాయం, అనుబంధ రంగాల విలువ రూ.4,39,645 కోట్లకు చేరింది. పరిశ్రమల రంగంలో 16.36 శాతం వృద్ధితో రూ.2,83,821 కోట్లకు చేరింది. పరిశ్రమల రంగంలో కీలకమైన మైనింగ్ రంగంలో 15.81 శాతం, తయారీ రంగంలో 11.81 శాతం, ఎలక్ట్రిసిటీ 30.96 శాతం, నిర్మాణ రంగంలో 16.94 శాతం వృద్ధి నమోదైంది. సేవా రంగంలోకూడా దేశ సగటు కంటే రాష్ట్రం అధిక వృద్ధి రేటును నమోదు చేసింది. 2022–23లో దేశవ్యాప్తంగా సేవా రంగంలో 17.4 శాతం వృద్ధి నమోదైతే, రాష్ట్రంలో 20.52 శాతం వృద్ధి నమోదయ్యింది. ఏపీలో 2021–22లో సేవా రంగ ఉత్పత్తి విలువ రూ.4,07,810 కోట్లుగా ఉంటే 2022–23లో రూ.4,91,496 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. సేవా రంగంలో వాణిజ్యం–హోటళ్ల విభాగంలో 28.42 శాతం, రైల్వేలు 17.82 శాతం, రవాణా రంగం 28.42 శాతం, రియల్ ఎస్టేట్ 13.14 శాతం వృద్ధి నమోదయ్యింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 36.19 శాతం కాగా పరిశ్రమలు 23.36 శాతం, సేవా రంగం వాటా 4.45 శాతంగా ఉంది. సామాజిక ఆర్థిక సర్వే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్, తదితరులు విద్య ► మనబడి నాడు – నేడు ద్వారా మూడు దశల్లో పాఠశాలల్లో మౌలిక వసతులు పటిష్టం. ► తొలిదశ కింద రూ.3,669 కోట్లతో 15,717 పాఠశాలల అభివృద్ధి. మూడేళ్లలో 57,189 పాఠశాలలు, 3,280 ఇతర విద్యా సంస్థల్లో రూ.16,022 కోట్లతో మౌలిక వసతుల కల్పన. ► చదువులను ప్రోత్సహిస్తూ జగనన్న అమ్మ ఒడి ద్వారా రూ.19,617.60 కోట్లు వ్యయం. ► జగనన్న విద్యా కానుక కింద ఒకటి నుంచి 10వ తరగతి చదివే 47.4 లక్షల మంది విద్యార్థులకు రూ.2,368 కోట్లు........... ► జగనన్న గోరుముద్ద కోసం రూ.3,239 కోట్లు వ్యయం. ► జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌తో 24.75 లక్షల మంది విద్యార్థులకు రూ.9,249 కోట్ల మేర ప్రయోజనం. ► జగనన్న వసతి దీవెనతో హాస్టళ్లలో ఉంటున్న 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.3,366 కోట్లు లబ్ధి. వైద్యం – మహిళా సంక్షేమం ► ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులను నియమించి ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం అమలు. ► వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 3,255 ప్రొసీజర్లకు ఉచితంగా వైద్యం. ఇప్పటివరకు 1.41 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం. ► నాడు – నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు బలోపేతం. ► 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, 528 అర్బన్ హెల్త్ కేర్ క్లినిక్స్ ఏర్పాటు ► వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా 35.7 లక్షల మంది గర్భవతులు, బాలింతలు, పిల్లల్లో రక్తహీనత నివారించి పౌష్టికాహారం అందించేందుకు రూ.6,141 కోట్లు వ్యయం. ► ప్రస్తుతం ఉన్న 11 మెడికల్ కాలేజీలకు అదనంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు. మహిళా సాధికారత ► వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 26.7 లక్షల మంది మహిళలకు రూ.14,129 కోట్లు పంపిణీ. ► వైఎస్సార్ ఆసరాతో స్వయం సహాయక సంఘాలకు చెందిన 78.74 లక్షల మంది మహిళలకు రూ.12,758 కోట్లు. ► వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలకు రూ.3,615 కోట్ల వడ్డీ చెల్లింపు. 1.02 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం. సుస్థిరాభివృద్ధి.. ► నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానం. ► ఎస్డీజీ ఇండియా 2020–21 నివేదికలో నాలుగో స్థానం సాధించిన ఏపీ. ► ఎస్డీజీ–7 లక్ష్యంలో మొదటి ర్యాంకు, ఎస్డీజీ 14 లక్ష్యంలో రెండో ర్యాంకు. ► రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక పాలన విధానాలను అనుసరిస్తున్న ఇతర రాష్ట్రాలు. ► ఆర్బీకేలు, సచివాలయాలు, భూముల సమగ్ర సర్వే తదితర కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు. గృహ నిర్మాణం ► పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా మహిళలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన 30.65 లక్షల ఇళ్ల పట్టాలు జారీ. ► ఇప్పటివరకు 21.25 లక్షల ఇళ్లు మంజూరు చేయగా 4.4 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి. వివిధ దశల్లో కొనసాగుతున్న మిగతా ఇళ్లు. ► వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.32,909 కోట్ల వ్యయం. ► వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ప్రతీ నెలా 64.45 లక్షల మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు రూ.66,823.79 కోట్ల పంపిణీ. రైతుల సంక్షేమం కోసం.. ► అన్నదాతలకు సేవలన్నీ ఒకేచోట అందించే విధంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు. ► వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం కింద 52.38 లక్షల మంది రైతులకు రూ.27,063 కోట్ల మేర ఆర్థిక సాయం. ► ఉచిత పంటల బీమా పథకంతో రూ.6,872 కోట్ల ప్రీమియం చెల్లించిన ప్రభుత్వం. ► వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 73.88 లక్షల మంది రైతులకు రూ.1,834.55 కోట్ల వడ్డీ సబ్సిడీ చెల్లింపు. ► వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ కోసం రూ.27,800 కోట్ల సబ్సిడీ చెల్లింపు, ఆక్వా రైతులకు రూ.2,647 కోట్ల సబ్సిడీ చెల్లింపు. ► పామాయిల్, బొప్పాయి, కోకో, టమాటా, కొబ్బరి, ఎండుమిర్చి ఉత్పత్తిలో మొదటి ర్యాంకులో ఆంధ్రప్రదేశ్. ► వైఎస్సార్ జలకళ కింద 9,629 మంది రైతులు లబ్థి పొందేలా రూ.188.84 కోట్ల విలువైన 6,931 బోర్ల తవ్వకం. ► వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద 1.20 లక్షల మంది మత్స్యకార కుటుంబాలకు రూ.422 కోట్లు పంపిణీ. పరిశ్రమలు ► మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో విజయవంతంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహణ. ► 386 ఎంవోయూల ద్వారా రూ.13.11 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు. 6 లక్షల మందికిపైగా ఉపాధి. ► రూ.19,115 కోట్ల పెట్టుబడితో 1.52 లక్షల ఎంఎస్ఎంఈల ఏర్పాటు. 13.63 లక్షల మందికి ఉపాధి. ► రూ.1.35 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 69 భారీ ప్రాజెక్టుల నిర్మాణ పనులు. ► వరుసగా మూడేళ్లుగా సులభతర వాణిజ్యం ర్యాంకుల్లో మొదటి స్థానం దక్కించుకుంటున్న ఏపీ. ► మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం, కాకినాడ సెజ్‌లో పోర్టులతోపాటు తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. ఇతర సంక్షేమ పథకాలు ► జగ్జీవన్ జ్యోతి పథకం కింద 15.14 లక్షల మంది ఎస్సీలు, 4.5 లక్షల మంది ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ► సొంత ఆటోలు, ట్యాక్సీలున్న 2.74 లక్షల మందికి వైఎస్సార్ వాహనమిత్ర కింద నాలుగేళ్లుగా రూ.1,041 కోట్లు పంపిణీ. ► వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా 81,783 చేనేత కుటుంబాలకు రూ.788.50 కోట్లు. ► వైఎస్సార్ కాపునేస్తం కింద 3.56 లక్షల మంది మహిళలకు రూ.1,518 కోట్లు. ► వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 3.94 లక్షల మందికి రూ.595.86 కోట్ల మేర లబ్ధి. ► జగనన్న చేదోడు కింద 3.30 లక్షల మందికి రూ.927.49 కోట్లు. ► వైఎస్సార్ లా నేస్తం ద్వారా 4,248 మంది యువ న్యాయవాదులకు రూ.35.40 కోట్లు. -
వృద్ధికి ద్రవ్యోల్బణం దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వృద్ధి రేటుపై ద్రవ్యోల్బణం ప్రభావం పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23లో రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు గణనీయంగా తగ్గనుందని ‘ముందస్తు ప్రాథమిక అంచనాలు (ప్రొవిజనల్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్/పీఏఈ)’ స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ధరల వద్ద 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ 19.4శాతం వృద్ధి రేటును నమోదుచేయగా.. 2022–23లో 15.6 శాతానికి తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. జాతీయ స్థాయిలో చూసినా.. 2021–22లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 19.5శాతం వృద్ధిరేటు నమోదు చేయగా.. 2022–23లో 15.4 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. రాష్ట్ర శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన తెలంగాణ సామాజిక–ఆర్థిక సర్వే–2023 నివేదికలో ఈ గణాంకాలను వెల్లడించింది. స్థిర ధరల వద్ద 7.4 % దేశ, రాష్ట్ర వృద్ధిరేటు తగ్గుదలకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం, సప్లై మందగమనం, డిమాండ్ తగ్గడంతో వృద్ధికి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రధానంగా తయారీ రంగంపై ఈ ప్రభావం అధికంగా ఉందని తెలిపింది. ఇక గత ఏడాది (2021–22) సాధించిన 19.4శాతం భారీ వృద్ధిరేటుపై అంతకు మించిన వృద్ధిరేటును ఈ ఏడాది ఆశించడం సాధ్యం కాదని వివరించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014–15 నుంచి 2019–20 వరకు జాతీయ సగటును మించి వృద్ధిరేటును తెలంగాణ నమోదు చేసిందని.. కోవిడ్ తర్వాత కాలంలో జాతీయ సగటుతో సమానంగా వృద్ధి రేటు కొనసాగుతోందని పేర్కొంది. ఇక స్థిర (2011–12 నాటి) ధరల వద్ద 2022–23లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 7.4 శాతం, దేశ జీడీపీ వృద్ధి రేటు 7శాతం ఉంటుందని అంచనా వేసింది. తగ్గిన నిరుద్యోగం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్) ప్రకారం రాష్ట్ర లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (ఎల్ఎఫ్పీఆర్) 65.4 శాతంగా ఉంది. ఏదో ఒక పనిచేస్తూ లేదా ఏదైనా పనికోసం ఎదురు చూస్తున్న 15–59 ఏళ్ల జనాభా శాతాన్ని ఎల్ఎఫ్పీఆర్గా పరిగణిస్తారు. ఈ సర్వే ప్రకారం.. 2019–20తో పోల్చితే 2020–21లో రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 7.5 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) డేటా ప్రకారం.. 2022 ఏప్రిల్‌తో పోల్చితే 2022 డిసెంబర్లో రాష్ట్ర నిరుద్యోగ రేటు 9.9 శాతం నుంచి 4.1 శాతానికి దిగొచ్చింది. ముఖ్యంగా పట్టణాల్లోనే నిరుద్యోగం అధికంగా ఉంది. 2019–20తో పోల్చితే 2020–21లో గ్రామీణ నిరుద్యోగం 5.7శాతం నుంచి 3.6శాతానికి, పట్టణ నిరుద్యోగం 10.7శాతం నుంచి 8శాతానికి తగ్గాయి. ఇదే సమయంలో పురుషుల్లో నిరుద్యోగం 8.4శాతం నుంచి 5.5 శాతానికి, మహిళల్లో నిరుద్యోగం 6.1 శాతం నుంచి 4.5శాతానికి తగ్గాయి. పెరిగిన ఉద్యోగ భద్రత సామాజిక–ఆర్థిక సర్వే ప్రకారం.. రాష్ట్రంలో ఉద్యోగులకు సదుపాయాలు, భద్రత క్రమంగా పెరుగుతున్నాయి. 2019–20తో పోల్చితే 2020–21లో పెయిడ్ లీవ్‌కు అర్హతగల ఉద్యోగులు 45.2శాతం నుంచి 50.9శాతానికి.. పెన్షన్లు, ఆరోగ్య సేవలు వంటి సదుపాయాలు కలిగిన ఉద్యోగులు 40.8శాతం నుంచి 46.9శాతానికి పెరిగారు. రాతపూర్వక జాబ్ కాంట్రాక్టు కలిగిన ఉద్యోగులు 39.9శాతం నుంచి 36.2శాతానికి తగ్గారు. ఈఓడీబీ, టీ–ఐడియా, టీ–ప్రైడ్ వంటి కార్యక్రమాలతో పాటు ఐటీ, ఇతర సేవా రంగాలను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలతో ఉద్యోగుల పరిస్థితులు మెరుగయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర, జాతీయ వృద్ధిరేటు తీరు జీఎస్డీపీ వృద్ధిలో మూడో స్థానం ►స్థిర ధరల వద్ద 2022–23లో రాష్ట్ర జీఎస్డీపీ విలువ రూ.13.27 లక్షల కోట్లు, దేశ జీడీపీ విలువ రూ.273.08 లక్షల కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.11.48 లక్షల కోట్లు, దేశ జీడీపీ రూ.236.65 లక్షల కోట్లుగా నమోదైందని తెలిపింది. ►జీఎస్డీపీ వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో (19.4 శాతంతో) నిలిచిందని.. ఒడిశా (20.5శాతం), మధ్యప్రదేశ్ (19.7 శాతం) తొలి రెండు స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. ►2021–22లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.9 శాతమని.. 2022–23లో కూడా ఇదే స్థాయిలో భాగస్వామ్యం ఉండనుందని ప్రభుత్వం అంచనా వేసింది. -
AP Forest Department: ఆదాయం అదరహో!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అటవీ శాఖ ఆదాయంలో భారీ వృద్ధి నమోదైంది. రెండేళ్లుగా రూ.15–20 కోట్ల మధ్య ఉన్న ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి రూ.193.31 కోట్లుగా నమోదైంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి అటవీ శాఖ ఆదాయం రూ.200 కోట్లుగా నమోదవుతుందని సామాజిక ఆర్థిక సర్వే 2020–21 అంచనా వేసింది. అంతర్జాతీయ వేలం విధానంలో ఎర్ర చందనం అమ్మకం ద్వారా రూ.175 కోట్ల ఆదాయం ఖజానాకు వచ్చి చేరింది. చదవండి: Rayalaseema: పారిశ్రామిక ‘సీమ’ ఇదే సమయంలో ఫర్నిచర్ తయారీలో అత్యధిక డిమాండ్ ఉండే టేకు కలప విక్రయం ద్వారా రూ.10.98 కోట్ల ఆదాయం సమకూరింది. అంతకుముందు ఏడాది మొత్తం మీద రూ.6.83 కోట్ల విలువైన టేకు కలపను విక్రయించారు. ఈ రెండింటి తర్వాత వెదురు అమ్మకం ద్వారా డిసెంబర్ నాటికి అటవీ శాఖకు రూ.6.53 కోట్ల ఆదాయం లభించింది. అంతకుముందు ఏడాది మొత్తం మీద వెదురు అమ్మకం ద్వారా రూ.850 కోట్లు ఆర్జించింది. ఇవికాకుండా ఇతర కలప, బీడీ ఆకులు, జీడి మామిడి విక్రయాల ద్వారా అటవీ శాఖ ఆదాయాన్ని ఆర్జించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,80,603.39 చదరపు కిలోమీటర్లలో అడవి విస్తరించి ఉండగా, ఇందులో 1,994.28 చదరపు కిలోమీటర్లలో దట్టమైన అటవీ ప్రాంతం, 13,861.27 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సాధారణ అడవులు ఉన్నాయి. -
రాష్ట్రానికి రెండేళ్లలో పెట్టుబడులు రూ.33,323.2 కోట్లు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 మహమ్మారి ఉన్నప్పటికీ కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం ముందంజలో ఉందని సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడైంది. గడచిన రెండేళ్ల కాలంలో రాష్ట్రంలోకి రూ.33,323.2 కోట్ల విలువైన నూతన పెట్టుబడులు వచ్చినట్టు సర్వే లెక్క గట్టింది. 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో పెద్ద, మెగా, ఎంఎస్ఎంఈ రంగాల్లో మొత్తం 13,789 యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటిద్వారా 1,41,276 మందికి ఉపాధి లభించినట్టు సర్వే వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం 2020–23, ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం, సింగిల్ విండో క్లియరెన్స్ కోసం ‘వైఎస్సార్ ఏపీ వన్’ వంటివిధానాలు అమలు చేయడం వంటి పెట్టుబడుల ఆకర్షణకు దోహదపడినట్టు తేలింది. పెట్టుబడులు, ఉపాధి కల్పనలో ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, విశాఖ జిల్లాలు ముందంజలో ఉన్నాయి. 60 భారీ కంపెనీల ఏర్పాటు గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో 60కి పైగా భారీ, అతి భారీ యూనిట్లు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రాష్ట్రంలోకి రూ.28,188.75 కోట్ల విలువైన పెట్టుబడులు రాగా.. 29,531 మందికి ఉపాధి లభించింది. అత్యధికంగా అనంతపురం జిల్లా రూ.12,041 కోట్లు, చిత్తూరు జిల్లా రూ.11,194.72 కోట్లు, విశాఖ జిల్లా రూ.2,461.19 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. చిన్న పరిశ్రమల్లో భారీ ఉపాధి ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈ రంగానిదే అగ్రస్థానమని మరోసారి నిరూపణ అయ్యింది. రెండేళ్లలో రాష్ట్రంలో ఈ రంగం ద్వారా 1,11,745 మందికి ఉపాధి లభించింది. 2019–20, 2020–21 కాలంలో రాష్ట్రంలో మొత్తం 13,729 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా యూనిట్లు రాగా.. వీటిద్వారా రూ.5,134.45 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. 1,596 యూనిట్ల ఏర్పాటుతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. 16,377 మందికి ఉపాధి కల్పించడం ద్వారా ప్రకాశం జిల్లా ముందంజలో ఉంది. వైఎస్సార్ నవోదయం కింద ఆర్థికంగా కష్టాల్లో ఉన్న యూనిట్లు పునరుద్ధరించడానికి చేయూతనివ్వడం, రీస్టార్ట్ ప్యాకేజీ కింద కోవిడ్ సమయంలో రాయితీ బకాయిల చెల్లింపు, లాక్డౌన్ కాలానికి విద్యుత్ బిల్లుల మాఫీతో ఈ రంగంలో పెట్టుబడులు పెరగడానికి కారణమైందని ఆర్థిక సర్వే పేర్కొంది. -
వృద్ధి బాటలో ఏపీ..
సాక్షి, అమరావతి: జాతీయ వృద్ధి రేటు తిరోగమనంలో ఉండగా రాష్ట్రం వృద్ధి బాటలో పయనిస్తోంది. కరోనా కష్టకాలంలోనూ 2020 – 21 రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 1.58 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో జాతీయ సగటు వృద్ధి – 3.8 శాతంతో తిరోగమనంలో ఉండటం గమనార్హం. రాష్ట్ర తలసరి ఆదాయంలో కూడా రూ.1,735 పెరుగుదల నమోదైంది. 2020 – 21 సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. 2019 – 20లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,68,480 ఉండగా 2020–21లో రూ.1,70,215గా నమోదైంది. 2019 –20లో జాతీయ తలసరి ఆదాయం రూ.1,34,186గా ఉంది. లాక్డౌన్, కర్ఫూ్యలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పెద్ద ఎత్తున సహాయం అందించినట్లు సామాజిక ఆర్ధిక సర్వే వెల్లడించింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.1,902.35 కోట్ల వ్యయంతో 5,33,670 మందికి ఉచితంగా వైద్య చికిత్సలు అందించినట్లు సర్వే పేర్కొంది. నవరత్నాలతో అన్ని వర్గాలకు పెద్ద ఎత్తున సహాయం అందించినట్లు స్పష్టమైంది. సర్వేలో ప్రధానాంశాలు ఇవీ... ఆరోగ్యం – మహిళా సంక్షేమం ► కోవిడ్ సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన ప్రణాళికతో ఎదుర్కొంటోంది. ► కరోనా కట్టడికి లాక్‌డౌన్‌తో పాటు పేదలకు సాయం ► 1,80,49,054 మందికి పరీక్షలు నిర్వహించగా 14,54,052 మందికి పాజిటివ్‌గా నిర్థారణ. ► పది లక్షల జనాభాకు దేశంలో సగటున 2.2 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా రాష్ట్రంలో సగటున 3.3 లక్షల మందికి పరీక్షలు జరిగాయి. ► విదేశాల నుంచి క్రయోజనిక్ ట్యాంకర్ల కొనుగోలు. ► రాష్ట్రానికి రోజూ కేటాయిస్తున్న 590 టన్నుల ఆక్సిజన్ పూర్తిస్థాయిలో వినియోగం నమోదవుతున్న నేపథ్యంలో 900 టన్నులు కేటాయించాలని కేంద్రానికి వినతి. ► వ్యాక్సినేషన్లో 45 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్స్కు ప్రాధాన్యం. ► రాష్ట్రంలో తొలి డోసు టీకా తీసుకున్న వారు 53.28 లక్షల మంది కాగా రెండు డోసులూ తీసుకున్న వారి సంఖ్య 21.64 లక్షలు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా వెచ్చించి టీకాల కొనుగోలు. గృహ నిర్మాణం, సామాజిక భద్రత, సంక్షేమ చర్యలు ► పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన 27.94 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు 27.94 లక్షల ఇంటి పట్టాల పంపిణీ ► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో భాగంగా రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణం. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం. ► వైఎస్సార్ పెన్షన్ కానుక కింద ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ. 61.73 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా రూ.1,487 కోట్లు పెన్షన్ రూపంలో పంపిణీ. ► దివ్యాంగులకు నెలకు రూ.3,000, డయాలసిస్ రోగులకు రూ.10,000 చొప్పున పెన్షన్. ► వలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ. ఇతర సంక్షేమ పథకాలు.. ► జగ్జీవన్ జ్యోతి పథకం ద్వారా 15.63 లక్షల మంది ఎస్సీలు, 5.23 లక్షల మంది ఎస్టీల నివాసాలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ ► కొత్తగా 53 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు ► వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా సొంతంగా ఆటో, కారు కలిగిన 2.74 లక్షల మందికి లబ్ధి ► వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా పేద చేనేత కుటుంబాలకు ఏటా రూ.24,000 ఆర్థిక సాయం. 81,703 మంది లబ్ధిదారులకు రూ.383.79 కోట్ల పంపిణీ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీఎస్) ► 2030 నాటికి 17 విభాగాల్లో ఎస్డీజీఎస్ సాధించడం కోసం ఐక్యరాజ్యసమితి తోడ్పాటు. ► దేశీయ ఎస్డీజీఎస్ ర్యాంకుల్లో 2018లో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండగా 2019లో మూడో స్థానానికి ఎగబాకింది ► పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యానికి సంబంధించి నీతి ఆయోగ్ విధించిన 6 లక్ష్యాలు, శాంతి భద్రతలు, న్యాయం, పటిష్ట వ్యవస్థలకు సంబంధించి విధించిన 16 లక్ష్యాల్లో 2019లో మొదటిస్థానం సాధించిన రాష్ట్రం. ► మరో నాలుగు ఎస్‌డీజీఎస్‌ల్లో రెండవ ర్యాంకు, పేదరిక నిర్మూలనలో మూడో ర్యాంకును రాష్ట్రం సాధించింది. మహిళా సాధికారత... ► వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పేద మహిళలకు ఆర్థిక తోడ్పాటు. ► 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న 24.55 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.4,604.13 కోట్ల మేర ఆర్థికసాయం ► అన్ని కాంట్రాక్టు పనులు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ► వైఎస్సార్ ఆసరా ద్వారా 87,74,674 మంది స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు రూ.6,792.21 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ... ► వార్షిక ఆదాయం రూ.ఐదు లక్షల లోపు ఉన్న 1.44 కోట్లకుపైగా కుటుంబాలు ఆరోగ్యశ్రీతో ప్రయోజనం పొందుతున్నాయి. ► పథకం ద్వారా 1,577 నెట్వర్క్ ఆస్పత్రుల్లో 2,436 ప్రొసీజర్లకు వర్తింపు. ► వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా 1,484 ఎంపానల్డ్ నెట్వర్క్ ఆస్పత్రుల ద్వారా 1,059 ప్రొసీజర్లకు చికిత్స. ► ఈ పథకం ద్వారా 5,33,670 మంది రోగులకు రూ.1,902.35 కోట్ల మేర ప్రయోజనం. ► శస్త్రచికిత్స తర్వాత రోజుకు రూ.225 చొప్పున గరిష్టంగా నెలకు రూ.5,000 సాయం. ► డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు కింద మూడేళ్లలో ఆరు దశల్లో పూర్తి ఉచితంగా కంటి పరీక్షల నిర్వహణ వ్యవసాయం సంక్షేమం ► ‘వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్’ పథకం ద్వారా పెట్టుబడి సాయం కింద రూ.13,500 చొప్పున ఆర్థిక సాయం. ఈ పథకం ద్వారా 52.38 లక్షల మందిరైతు కుటుంబాలకు రూ.17,030 కోట్ల మేర ప్రయోజనం. ► పంటల బీమా ప్రీమియం భారం రాష్ట్ర ప్రభుత్వానిదే. ఉచిత పంటల బీమా పథకం ద్వారా 5.67 లక్షల మంది రైతులకు రూ.1,968 కోట్ల మేర లబ్ధి. ► రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు. ► ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు, మత్స్యకార కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా. ► రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గ్రామాల్లోనే అందించేలా గ్రామ సచివాలయాల వద్ద 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ► ఉద్యానవన పంటల సాగులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం. ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమోటా ఉత్పత్తిలో మొదటి స్థానంలో రాష్ట్రం. ► జలయజ్ఞంలో భాగంగా 54 సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో 14 ప్రాజెక్టులు పూర్తి. రెండు ప్రాజెక్టుల్లో తొలి దశ పనుల పూర్తి. పురోగతిలో పోలవరం, పూల సుబ్బయ్య ప్రాజెక్టులు. ► వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం. ► 2020 – 21లో 168.31 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి. 2019–20లో 175.12 లక్షల టన్నుల ఉత్పత్తి నవరత్నాలు – విద్య ► జాతీయ సగటుతో పాటే రాష్ట్రంలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉంది. అక్షరాస్యతలో జాతీయ సగటు రేటు 72.98 శాతం కాగా రాష్ట్రంలో 67.35 శాతం ఉంది. ► జగనన్న అమ్మ ఒడి కింద దారిద్రరేఖకు దిగువన ఉన్న 44.5 లక్షల మంది తల్లులకు రూ.15,000 చొప్పున మొత్తం రూ.6,673 కోట్లు ఆర్థిక సాయం అందింది. ► ఒకటి నుంచి పదో తరగతి చదివే 42.34 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ద్వారా పాఠ్యపుస్తకాల పంపిణీ. ► జగనన్న గోరుముద్ద ద్వారా మధ్యాహ్న భోజనం పథకాన్ని సమూలంగా మార్చేసి బలవర్థకమైన పౌష్టికాహారాన్ని 36.88 లక్షల మందికి అందిస్తోంది. ► పోటీ ప్రపంచంలో రాణించేలా ఇంగ్లీష్ మీడియం విద్యకు ప్రోత్సాహం ► ‘మనబడి నాడు– నేడు’ కింద తొలిదశలో 15,715 పాఠశాలల్లో మౌలికవసతుల అభివృద్ధి ► జగనన్న విద్యా దీవెన పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాలకు చెందిన 13.26 లక్షల మంది విద్యార్థులకు రూ.4,879 కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లింపులు. ► జగనన్న వసతి దీవెన కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాలకు చెందిన 10.89 లక్షల మంది విద్యార్థులకు ఆహారం, హాస్టల్ ఫీజుల వ్యయాన్ని భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. పరిశ్రమలు – మౌలిక వసతులు ► రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో 75 శాతం స్థానిక యువతకు ఉపాధి కల్పన ► వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు. ► వైఎస్సార్ నవోదయం ద్వారా ఎంఎస్ఎంఈల పునరుద్ధరణ. ► రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం ► మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ సెజ్‌ల్లో నాలుగు నాన్ మేజర్ పోర్టుల నిర్మాణ పనులు -
బాలికలు ఎక్కువగా సర్కారు బడులకే!
హైదరాబాద్: రాష్ట్రంలో చదువుకుంటున్న బాలికల్లో ఎక్కువ శాతం మంది ప్రభుత్వ పాఠశాలలకే వెళుతున్నారు. ముఖ్యంగా 11–16 ఏళ్ల మధ్య వయసున్న వారిలో మూడింట రెండొంతుల మంది ప్రభుత్వ బడుల్లోనే చదువుతున్నారు. అదే సమయంలో తల్లిదండ్రులు మగ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల్లో 75% మంది బాలురు ఉండగా.. కేవలం 25% వరకే బాలికలు ఉంటున్నారు. అయితే ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే బాలికల్లో 46 శాతం మందిని ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్‌లోనే ఈ వివరాలన్నీ స్పష్టమయ్యాయి. భద్రత, ఆర్థిక పరిస్థితులతోనూ.. బాలికల విద్య విషయంగా ఇంకా వివక్ష కొనసాగుతున్న పరిస్థితి ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొడుకును చదివిస్తే తమను చూసుకుంటాడని, కూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోతుందన్న తల్లిదండ్రుల ఆలోచనా ధోరణితోపాటు భద్రత, ఆర్థిక ఇబ్బందులు వంటివి దీనికి కారణమని చెబుతున్నారు. బాలికలను దూరంగా ఉన్న ప్రైవేటు స్కూళ్లకు పంపడం భద్రం కాదన్న ఆలోచనలు ఇంకా ఉన్నాయని అంటున్నారు. ఇక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరో ఒకరిని మాత్రమే బాగా చదివించే పరిస్థితి ఉన్నవారు.. కొడుకును మాత్రం ప్రైవేటు స్కూళ్లకు పంపి, బాలికలను ప్రభుత్వ స్కూళ్లలో చేరుస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. నివేదికలోని కొన్ని ప్రధాన అంశాలివీ.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో కలిపి 60,06,344 మంది విద్యార్థులు చదువుతుండగా.. అందులో బాలురు 30,82,741 మంది, బాలికలు 29,23,603 మంది ఉన్నారు. మొత్తం విద్యార్థుల్లో ప్రభుత్వ స్కూళ్లలో 27,71,536 మంది (46.1 శాతం) చదువుతుండగా... 32,24,173 మంది (53.7 శాతం) ప్రైవేటు స్కూళ్లలో.. మదర్సాలు, ఇతర పాఠశాల్లో 10,635 మంది (0.2 శాతం) చదువుతున్నారు. తల్లిదండ్రులు 7 నుంచి 10 ఏళ్లలోపు బాలికలలో.. 50.5 శాతం మందిని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తుంటే.. 46.4 శాతం మందినే ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. 0.7 శాతం మందిని ఇతర పాఠశాలల్లో చదివిస్తుండగా.. 2.4 శాతం మంది బడి బయట ఉన్నారు. బాలురలో 45.8 శాతం మందిని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తుంటే.. 49.8 శాతం మందిని ప్రైవేటు స్కూళ్లలో.. 0.2శాతం మందిని ఇతర పాఠశాలల్లో చదివిస్తున్నారు. 4.2 % బాలురు బడి బయటే ఉన్నారు. 11 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయసున్న బాలికల్లో.. 67 శాతం మందిని ప్రభుత్వ స్కూళ్లలో, 25 శాతం మందిని ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. మరో 1.6 శాతం మంది బాలికలను ఇతర పాఠశాలల్లో చదివిస్తుండగా.. 6.5 శాతం మంది బడి బయటే ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లలో బాలికలంటే 10 శాతం ఎక్కువ మంది బాలురను చదివిస్తున్నారు. విద్యా బోధనను అందిస్తున్న ప్రభుత్వ టీచర్లలో 24,285 మంది (17.2 శాతం) పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తుండగా.. 1,16,796 మంది (82.8 శాతం) గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లోనే పనిచేస్తున్నారు. మొత్తం టీచర్లలో 78,817 మంది (55.9 శాతం) పురుషులు ఉండగా.. 62,264 మంది (44.1శాతం) మహిళా టీచర్లు ఉన్నారు. వివక్ష తగ్గడం లేదు బాలికలకు చదువుపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. దీనికి తల్లిదండ్రుల ఆలోచనా ధోరణితోపాటు పలు కారణాలు కూడా ఉన్నాయి. దూరంగా ఉన్న ప్రైవేటు స్కూళ్లకు పంపడం ఒక సమస్య అయితే.. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి మరో ఇబ్బంది. ఇలాంటి పరిస్థితుల్లో బాలికల చదువుపై ప్రభావం పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బాలికలకు నాణ్యమైన విద్య అందేలా.. ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చెయ్యాలి. నాగటి నారాయణ, తల్లిదండ్రుల సంఘంఅధ్యక్షుడు -
ఒకే రోజు.. ఆర్థిక, సామాజిక సర్వే
ఆదిలాబాద్ అర్బన్/ఆసిఫాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక, ఆర్థిక సర్వేకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో సర్వే పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నేరుగా ప్రజలే వివరాలు తెలియజేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా సమగ్ర సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించేందుకు సన్నద్ధమయ్యారు. జిల్లాలోని కుటుంబాలను గుర్తించిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ పథకాల నిధులు విడుదల చేస్తే నేరుగా లబ్ధిదారులకు చేరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. సర్వేలో లేని కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఇంటింటి సర్వే ఆధారంగా ప్రభుత్వం జనాభా ప్రతిపాదికన సంక్షేమ పథకాలు వ ర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 19న జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు 30వేలకుపైగా అధికారులను, సర్వే ఎన్యూమరేటర్లను వినియోగించనున్నారు. సర్వే అనంతరం నివేది కను ప్రభుత్వానికి నివేదించనున్నారు. సర్వేలో వివరాలు నమోదు చేసుకోకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 6,96,248 కుటుంబాలు జిల్లాలోని 52 మండలాల్లో 866 గ్రామ పంచాయతీలు, ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం వీటి పరిధిలలో 6,96,248 కుటుంబాలు ఉన్న ట్లు అధికారులు గుర్తించారు. ఇందులో పట్టణ ప్రాంతా ల్లో 1,26,307 కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల్లో 5,32,298 కుటుంబాలు ఉన్నాయనే వివరాలు అధికారు లు సిద్ధం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింట సర్వే చేసేందుకు 5,052 మంది ఎన్యూమరేటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేసేందుకు 22,812 మంది ఎన్యూమరేటర్లను నియమించారు. వీరితోపాటు 3 వేల మందికిపైగా సూపర్వైజర్లు, అధికారులు ఈ సర్వేలో పాల్గొనున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ 25 నుంచి 30 ఇళ్ల చొప్పు న సర్వే నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు సంబంధించిన 30,700 సమగ్ర సర్వే పుస్తకాల పేరిట ప్రింటింగ్ చేయిస్తున్నారు. కుటుంబ సర్వే ద్వారా ప్రజలు ఎలాంటి తప్పులు లేకుం డా పూర్తి సమాచారం అందించాలని అధికారులు సూచి స్తున్నారు. ఎన్యూమరేటర్లను, సూపర్వైజర్లను గ్రామాలకు తరలించేందుకు 100 ఆర్టీసీ బస్సులు, 646 ఇతర వాహనాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కళాశాలల, పాఠశాలల, ట్రాన్స్‌పోర్టు వాహనాలను వినియోగిస్తున్నారు. స్థానిక రూట్లకు అనుగుణంగా వాహనాల వినియోగం వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. సర్వే ఇలా.. ఈ సర్వే చేసేందుకు వచ్చిన ఎన్యూమరేటర్లకు కుటుంబ సభ్యులు తమ పూర్తి వివరాలు చెప్పాలి. కుటుంబ సభ్యులతోపాటు తాత, ముత్తాతల వివరాలు సేకరించనున్నా రు. ఎన్యూమరేటర్ల వద్ద 80 అంశాలతో కూడిన నమూ నా ఫారం (25) అందుబాటులో ఉంటుంది. అందులో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేస్తారు. ఇందులో ముఖ్యంగా కులం, భూముల వివరాలు, సొంత ఇళ్లు, రేషన్‌కార్డు, పెన్షన్ పొందుతున్న వివరాలు తెలియజేయాలి. దీంతోపాటు ఊరిలో అర్హులైన పేద ప్రజలు ఎం త మంది ఉన్నారు? ఎంత మందికి సొంత ఇళ్లు ఉన్నా యి? ప్రస్తుతం ఎంత మంది సంక్షేమ పథకాలు అందుతున్నాయనే వివరాలు స్పష్టంగా తెలిసిపోతాయి. సర్వే లో గ్రామ అధికారులతో పాటు మండలంలోని ప్రతి శా ఖ అధికారితోపాటు ఎంపీడీవోలు, తహశీల్దార్లు కలిపి సుమారు 18శాఖలకు చెందిన అధికారులు పాల్గొనున్నారు. అయితే ఈ నెల 19న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కంపెనీలకు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఎలాంటి తప్పులు లేకుండా జవాబుదారితనంలో సమగ్రంగా సర్వే నిర్వహించాలని ఎన్యూమరేటర్లను, అధికారులను కలెక్టర్ జగన్మోహన్ ఇది వరకే ఆదేశించారు. ఇందులో భాగంగానే అధికారులకు, సిబ్బంది విడతలవారీ గా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సర్వేపై గ్రామీ ణ, పట్టణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్త్రృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.