వృద్ధి బాటలో ఏపీ.. | CM Jagan released the 2020 21 Socio Economic Survey | Sakshi
Sakshi News home page

వృద్ధి బాటలో ఏపీ..

Published Thu, May 20 2021 6:13 AM | Last Updated on Thu, May 20 2021 9:07 AM

CM Jagan released the 2020–21 Socio-Economic Survey - Sakshi

సాక్షి, అమరావతి: జాతీయ వృద్ధి రేటు తిరోగమనంలో ఉండగా రాష్ట్రం వృద్ధి బాటలో పయనిస్తోంది. కరోనా కష్టకాలంలోనూ 2020 – 21 రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 1.58 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో జాతీయ సగటు వృద్ధి – 3.8 శాతంతో తిరోగమనంలో ఉండటం గమనార్హం. రాష్ట్ర తలసరి ఆదాయంలో కూడా రూ.1,735 పెరుగుదల నమోదైంది. 2020 – 21 సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. 2019 – 20లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,68,480 ఉండగా 2020–21లో రూ.1,70,215గా నమోదైంది. 2019 –20లో జాతీయ తలసరి ఆదాయం రూ.1,34,186గా ఉంది. లాక్‌డౌన్, కర్ఫూ్యలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పెద్ద ఎత్తున సహాయం అందించినట్లు సామాజిక ఆర్ధిక సర్వే వెల్లడించింది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.1,902.35 కోట్ల వ్యయంతో 5,33,670 మందికి ఉచితంగా వైద్య చికిత్సలు అందించినట్లు సర్వే పేర్కొంది. నవరత్నాలతో అన్ని వర్గాలకు పెద్ద ఎత్తున సహాయం అందించినట్లు స్పష్టమైంది. సర్వేలో ప్రధానాంశాలు ఇవీ...

ఆరోగ్యం – మహిళా సంక్షేమం
► కోవిడ్‌ సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన ప్రణాళికతో ఎదుర్కొంటోంది.
► కరోనా కట్టడికి లాక్‌డౌన్‌తో పాటు పేదలకు సాయం
► 1,80,49,054 మందికి పరీక్షలు నిర్వహించగా 14,54,052 మందికి పాజిటివ్‌గా నిర్థారణ. 
► పది లక్షల జనాభాకు దేశంలో సగటున 2.2 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా రాష్ట్రంలో సగటున 3.3 లక్షల మందికి పరీక్షలు జరిగాయి.
► విదేశాల నుంచి క్రయోజనిక్‌ ట్యాంకర్ల కొనుగోలు.
► రాష్ట్రానికి రోజూ కేటాయిస్తున్న 590 టన్నుల ఆక్సిజన్‌ పూర్తిస్థాయిలో వినియోగం నమోదవుతున్న నేపథ్యంలో 900 టన్నులు కేటాయించాలని కేంద్రానికి వినతి.
► వ్యాక్సినేషన్‌లో 45 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు ప్రాధాన్యం.
► రాష్ట్రంలో తొలి డోసు టీకా తీసుకున్న వారు 53.28 లక్షల మంది కాగా రెండు  డోసులూ తీసుకున్న వారి సంఖ్య 21.64 లక్షలు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా వెచ్చించి టీకాల కొనుగోలు.

గృహ నిర్మాణం, సామాజిక భద్రత, సంక్షేమ చర్యలు
► పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన 27.94 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు 27.94 లక్షల ఇంటి పట్టాల పంపిణీ
► వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో భాగంగా రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణం. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం.
► వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ.  61.73 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా రూ.1,487 కోట్లు పెన్షన్‌ రూపంలో పంపిణీ.
► దివ్యాంగులకు నెలకు రూ.3,000, డయాలసిస్‌ రోగులకు రూ.10,000 చొప్పున పెన్షన్‌.
► వలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పెన్షన్‌ పంపిణీ.

ఇతర సంక్షేమ పథకాలు..
► జగ్జీవన్‌ జ్యోతి పథకం ద్వారా 15.63 లక్షల మంది ఎస్సీలు, 5.23 లక్షల మంది ఎస్టీల నివాసాలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్‌
► కొత్తగా 53 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు
► వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ద్వారా సొంతంగా ఆటో, కారు కలిగిన 2.74 లక్షల మందికి లబ్ధి
► వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా పేద చేనేత కుటుంబాలకు ఏటా రూ.24,000 ఆర్థిక సాయం. 81,703 మంది లబ్ధిదారులకు రూ.383.79 కోట్ల పంపిణీ

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీఎస్‌)
► 2030 నాటికి 17 విభాగాల్లో ఎస్‌డీజీఎస్‌ సాధించడం కోసం ఐక్యరాజ్యసమితి తోడ్పాటు.
► దేశీయ ఎస్‌డీజీఎస్‌ ర్యాంకుల్లో  2018లో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండగా 2019లో మూడో స్థానానికి ఎగబాకింది
► పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యానికి సంబంధించి నీతి ఆయోగ్‌ విధించిన 6 లక్ష్యాలు, శాంతి భద్రతలు, న్యాయం, పటిష్ట వ్యవస్థలకు సంబంధించి విధించిన 16 లక్ష్యాల్లో 2019లో మొదటిస్థానం సాధించిన రాష్ట్రం.
► మరో నాలుగు ఎస్‌డీజీఎస్‌ల్లో రెండవ ర్యాంకు, పేదరిక నిర్మూలనలో మూడో ర్యాంకును రాష్ట్రం సాధించింది. 

మహిళా సాధికారత...
► వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా పేద మహిళలకు ఆర్థిక తోడ్పాటు.
► 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న 24.55 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.4,604.13 కోట్ల మేర ఆర్థికసాయం
► అన్ని కాంట్రాక్టు పనులు, నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
► వైఎస్సార్‌ ఆసరా ద్వారా 87,74,674 మంది స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు రూ.6,792.21 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ...
► వార్షిక ఆదాయం రూ.ఐదు లక్షల లోపు ఉన్న 1.44 కోట్లకుపైగా కుటుంబాలు ఆరోగ్యశ్రీతో ప్రయోజనం పొందుతున్నాయి.
► పథకం ద్వారా 1,577 నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో 2,436 ప్రొసీజర్లకు వర్తింపు.
► వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా 1,484 ఎంపానల్డ్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ద్వారా 1,059 ప్రొసీజర్లకు చికిత్స.
► ఈ పథకం ద్వారా 5,33,670 మంది రోగులకు రూ.1,902.35 కోట్ల మేర ప్రయోజనం. 
► శస్త్రచికిత్స తర్వాత రోజుకు రూ.225 చొప్పున గరిష్టంగా నెలకు రూ.5,000 సాయం.
► డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు కింద మూడేళ్లలో ఆరు దశల్లో పూర్తి ఉచితంగా కంటి పరీక్షల నిర్వహణ

వ్యవసాయం సంక్షేమం
► ‘వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ పథకం ద్వారా పెట్టుబడి సాయం కింద రూ.13,500 చొప్పున ఆర్థిక సాయం. ఈ పథకం ద్వారా 52.38 లక్షల మందిరైతు కుటుంబాలకు రూ.17,030 కోట్ల మేర ప్రయోజనం.
► పంటల బీమా ప్రీమియం భారం రాష్ట్ర ప్రభుత్వానిదే. ఉచిత పంటల బీమా పథకం ద్వారా 5.67 లక్షల మంది రైతులకు రూ.1,968 కోట్ల మేర లబ్ధి.
► రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు.
► ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు, మత్స్యకార కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా.
► రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గ్రామాల్లోనే అందించేలా గ్రామ సచివాలయాల వద్ద 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు
► ఉద్యానవన పంటల సాగులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం. ఆయిల్‌ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమోటా 
ఉత్పత్తిలో మొదటి స్థానంలో రాష్ట్రం.
► జలయజ్ఞంలో భాగంగా 54 సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో 14 ప్రాజెక్టులు పూర్తి. రెండు ప్రాజెక్టుల్లో తొలి దశ పనుల పూర్తి. పురోగతిలో పోలవరం, పూల సుబ్బయ్య ప్రాజెక్టులు.
► వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం.
► 2020 – 21లో 168.31 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి. 2019–20లో 175.12 లక్షల టన్నుల ఉత్పత్తి

నవరత్నాలు – విద్య
► జాతీయ సగటుతో పాటే రాష్ట్రంలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉంది. అక్షరాస్యతలో జాతీయ సగటు రేటు 72.98 శాతం కాగా రాష్ట్రంలో 67.35 శాతం ఉంది.
► జగనన్న అమ్మ ఒడి కింద దారిద్రరేఖకు దిగువన ఉన్న 44.5 లక్షల మంది తల్లులకు రూ.15,000 చొప్పున మొత్తం రూ.6,673 కోట్లు ఆర్థిక సాయం అందింది. 
► ఒకటి నుంచి పదో తరగతి చదివే 42.34 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ద్వారా పాఠ్యపుస్తకాల పంపిణీ.
► జగనన్న గోరుముద్ద ద్వారా మధ్యాహ్న భోజనం పథకాన్ని సమూలంగా మార్చేసి బలవర్థకమైన పౌష్టికాహారాన్ని 36.88 లక్షల మందికి అందిస్తోంది.
► పోటీ ప్రపంచంలో రాణించేలా ఇంగ్లీష్‌ మీడియం విద్యకు ప్రోత్సాహం
► ‘మనబడి నాడు– నేడు’ కింద తొలిదశలో 15,715 పాఠశాలల్లో మౌలికవసతుల అభివృద్ధి
► జగనన్న విద్యా దీవెన పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాలకు చెందిన 13.26 లక్షల మంది విద్యార్థులకు రూ.4,879 కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లింపులు.
► జగనన్న వసతి దీవెన కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాలకు చెందిన 10.89 లక్షల మంది విద్యార్థులకు ఆహారం, హాస్టల్‌ ఫీజుల వ్యయాన్ని భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.

పరిశ్రమలు – మౌలిక వసతులు
► రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో 75 శాతం స్థానిక యువతకు ఉపాధి కల్పన
► వైఎస్సార్‌ జగనన్న బడుగు వికాసం కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు.
► వైఎస్సార్‌ నవోదయం ద్వారా ఎంఎస్‌ఎంఈల పునరుద్ధరణ.
► రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం
► మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ సెజ్‌ల్లో నాలుగు నాన్‌ మేజర్‌ పోర్టుల నిర్మాణ పనులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement