హైదరాబాద్: రాష్ట్రంలో చదువుకుంటున్న బాలికల్లో ఎక్కువ శాతం మంది ప్రభుత్వ పాఠశాలలకే వెళుతున్నారు. ముఖ్యంగా 11–16 ఏళ్ల మధ్య వయసున్న వారిలో మూడింట రెండొంతుల మంది ప్రభుత్వ బడుల్లోనే చదువుతున్నారు. అదే సమయంలో తల్లిదండ్రులు మగ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల్లో 75% మంది బాలురు ఉండగా.. కేవలం 25% వరకే బాలికలు ఉంటున్నారు. అయితే ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే బాలికల్లో 46 శాతం మందిని ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్‌లోనే ఈ వివరాలన్నీ స్పష్టమయ్యాయి.
భద్రత, ఆర్థిక పరిస్థితులతోనూ..
బాలికల విద్య విషయంగా ఇంకా వివక్ష కొనసాగుతున్న పరిస్థితి ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొడుకును చదివిస్తే తమను చూసుకుంటాడని, కూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోతుందన్న తల్లిదండ్రుల ఆలోచనా ధోరణితోపాటు భద్రత, ఆర్థిక ఇబ్బందులు వంటివి దీనికి కారణమని చెబుతున్నారు. బాలికలను దూరంగా ఉన్న ప్రైవేటు స్కూళ్లకు పంపడం భద్రం కాదన్న ఆలోచనలు ఇంకా ఉన్నాయని అంటున్నారు. ఇక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరో ఒకరిని మాత్రమే బాగా చదివించే పరిస్థితి ఉన్నవారు.. కొడుకును మాత్రం ప్రైవేటు స్కూళ్లకు పంపి, బాలికలను ప్రభుత్వ స్కూళ్లలో చేరుస్తున్నారని స్పష్టం చేస్తున్నారు.
నివేదికలోని కొన్ని ప్రధాన అంశాలివీ..
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో కలిపి 60,06,344 మంది విద్యార్థులు చదువుతుండగా.. అందులో బాలురు 30,82,741 మంది, బాలికలు 29,23,603 మంది ఉన్నారు. మొత్తం విద్యార్థుల్లో ప్రభుత్వ స్కూళ్లలో 27,71,536 మంది (46.1 శాతం) చదువుతుండగా... 32,24,173 మంది (53.7 శాతం) ప్రైవేటు స్కూళ్లలో.. మదర్సాలు, ఇతర పాఠశాల్లో 10,635 మంది (0.2 శాతం) చదువుతున్నారు. తల్లిదండ్రులు 7 నుంచి 10 ఏళ్లలోపు బాలికలలో.. 50.5 శాతం మందిని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తుంటే.. 46.4 శాతం మందినే ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. 0.7 శాతం మందిని ఇతర పాఠశాలల్లో చదివిస్తుండగా.. 2.4 శాతం మంది బడి బయట ఉన్నారు.
బాలురలో 45.8 శాతం మందిని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తుంటే.. 49.8 శాతం మందిని ప్రైవేటు స్కూళ్లలో.. 0.2శాతం మందిని ఇతర పాఠశాలల్లో చదివిస్తున్నారు. 4.2 % బాలురు బడి బయటే ఉన్నారు. 11 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయసున్న బాలికల్లో.. 67 శాతం మందిని ప్రభుత్వ స్కూళ్లలో, 25 శాతం మందిని ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. మరో 1.6 శాతం మంది బాలికలను ఇతర పాఠశాలల్లో చదివిస్తుండగా.. 6.5 శాతం మంది బడి బయటే ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లలో బాలికలంటే 10 శాతం ఎక్కువ మంది బాలురను చదివిస్తున్నారు. విద్యా బోధనను అందిస్తున్న ప్రభుత్వ టీచర్లలో 24,285 మంది (17.2 శాతం) పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తుండగా.. 1,16,796 మంది (82.8 శాతం) గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లోనే పనిచేస్తున్నారు. మొత్తం టీచర్లలో 78,817 మంది (55.9 శాతం) పురుషులు ఉండగా.. 62,264 మంది (44.1శాతం) మహిళా టీచర్లు ఉన్నారు.
వివక్ష తగ్గడం లేదు
బాలికలకు చదువుపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. దీనికి తల్లిదండ్రుల ఆలోచనా ధోరణితోపాటు పలు కారణాలు కూడా ఉన్నాయి. దూరంగా ఉన్న ప్రైవేటు స్కూళ్లకు పంపడం ఒక సమస్య అయితే.. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి మరో ఇబ్బంది. ఇలాంటి పరిస్థితుల్లో బాలికల చదువుపై ప్రభావం పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బాలికలకు నాణ్యమైన విద్య అందేలా.. ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చెయ్యాలి.
నాగటి నారాయణ, తల్లిదండ్రుల సంఘంఅధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment