గడచిన ఆర్థిక సంవత్సరంలోవిశాఖ జిల్లాలో కొత్తగా 16,505 యూనిట్ల ఏర్పాటు
ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు, నెల్లూరు, కృష్ణా, అనంతపురం జిల్లాలు
గత ఏడాది మొత్తం 2,71,341 యూనిట్ల ద్వారా రూ.8,286.46 కోట్ల పెట్టుబడులు
తద్వారా 19,86,658 మందికి ఉపాధి కల్పన
సామాజిక ఆర్థిక సర్వే–2024 వెల్లడి
సాక్షి, అమరావతి: కొత్త ఎంఎస్‌ఎంఈల ఏర్పాటులో రాష్ట్రం వేగంగా దూసుకుపోతోంది. గత ఏడాది (2023–24)లోనే రాష్ట్రంలో కొత్తగా 2,71,341 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు కావడం ద్వారా రూ.8,286.46 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు సామాజిక ఆర్థిక సర్వే–2024 వెల్లడించింది. కొత్తగా ఏర్పాటైన యూనిట్ల ద్వారా 19,86,658 మందికి ఉపాధి లభించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి 1.90 లక్షలుగా ఉన్న ఎంఎస్‌ఎంఈల సంఖ్య గడచిన ఐదేళ్ల కాలంలో వేగంగా విస్తరించడం ద్వారా 10 లక్షలు దాటింది.
గడచిన ఏడాది కొత్త ఎంఎంస్‌ఎంఈల ఏర్పాటులో విశాఖ జిల్లా మంచి దూకుడు కనబర్చినట్టు సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రూ.648.40 కోట్ల పెట్టుబడితో కొత్తగా 16,505 ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేయడం ద్వారా విశాఖ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
ఆ తర్వాతి స్థానాల్లో రూ.477.56 కోట్లతో గుంటూరు జిల్లా (16,085 యూనిట్లు), రూ.526.13 కోట్లతో ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు (15,910 యూనిట్లు), రూ.491.88 కోట్లతో కృష్ణా (14,729 యూనిట్లు), రూ.313.84 కోట్లతో అనంతపురం (14,280 యూనిట్లు) జిల్లాలు నిలిచాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 968 యూనిట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 2,213 యూనిట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి.
ఉపాధి కల్పనలో కర్నూలు ఫస్ట్
ప్రతీ రూ.కోటి పెట్టుబడికి 8.75 మందికి ఉపాధి కల్పించడం ద్వారా కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 2023–24 సంవత్సరంలో కర్నూలు జిల్లాలో రూ.266.11 కోట్ల పెట్టుబడితో 12,256 యూనిట్లు ఏర్పాటు కావడం ద్వారా 2,33,019 మందికి ఉపాధి లభించినట్టు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. ఆ తర్వాతి స్థానంలో చిత్తూరు జిల్లా 1,72,276 మందికి ఉపాధి కల్పించడం ద్వారా రెండో స్థానంలో నిలిచింది.
ఈ జిల్లాలో ప్రతీ రూ.కోటి పెట్టుబడికి 5.79 మందికి ఉపాధి లభించింది. రాష్ట్రం మొత్తం మీద చూస్తే 2023–24లో ప్రతీ రూ.కోటి పెట్టుబడికి కేవలం 2.39 మందికి ఉపాధి లభించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెట్టుబడుల విలువ పరంగా చూస్తే రూ.648 కోట్ల ఎంఎస్‌ఎంఈ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా విశాఖ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.
గడచిన ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ 2023–27 ద్వారా ఎంఎంస్‌ఎంఈలను అంతర్జాతీయంగా ఎదిగే విధంగా అనేక ప్రోత్సహకాలు ఇవ్వడమే కాకుండా ఎంఎంస్‌ఎంఈ క్లస్టర్ పోగ్రాం, ఎంఎస్‌ఎంఈలను పటిష్టం చేసేవిధంగా ర్యాంప్ పథకం, టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు, ఎంఎస్‌ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు సర్వేలో ప్రముఖంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment