సాక్షి, విశాఖపట్నం: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు సంతాపం తెలిపారు. విశాఖలో మన్మోహన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశం గొప్ప నేతను కోల్పోయిందని చెప్పుకొచ్చారు. ఆయన సంస్కరణలు దేశానికి, రాబోయే తరానికి ఎంతో ఉపయోగకరమని ప్రశంసించారు.
విశాఖలో మన్మోహన్ సింగ్ మృతిపై వైఎస్సార్‌సీపీ నేతలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, రవీంద్ర బాబు, కుంభ రవిబాబు, బొత్స ఝాన్సీ, మంత్రి గుడివాడ అమర్నాథ్, జడ్పీ చైర్మన్ సుభద్ర సహా పార్టీ నేతలు పాల్గొన్నారు.
అనంతరం, బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ..‘దేశం గొప్ప నేతను కోల్పోయింది. అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. పనికి ఆహార పథకాన్ని తీసుకుని వచ్చి పేదల కడుపు నింపారు. రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పని చేసిన గొప్ప వ్యక్తి. ఆయన మరణం దేశానికి తీరని లోటు అంటూ కామెంట్స్ చేశారు.
మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ మాట్లాడుతూ..‘దేశ చిత్రపటాన్ని ప్రపంచంలో నిలిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్. సంస్కరణల వారధి మన్మోహన్ సింగ్. ఆయన మరణం దేశానికి తీరని లోటు. ఆయన సంస్కరణలు దేశానికి రాబోయే తరానికి ఎంతో ఉపయోగకరం అని అన్నారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘దేశానికి మన్మోహన్ సేవలు మరువలేము. స్టీల్ ప్లాంట్ విస్తరణకు ఎంతో కృషి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం కాకుండా కాపాడారు. ఆయన సేవలను ఈ ప్రాంత ప్రజలు గుర్తు పెట్టుకుంటారు అని వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ..‘ఇండియాను గ్లోబల్ పవర్‌గా చేసిన ఘనత మన్మోహన్ సింగ్‌కు దక్కుతుంది. అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. మన్మోహన్ సింగ్ గొప్ప దేశ భక్తుడు అని తెలిపారు.
కుంభ రవిబాబు మాట్లాడుతూ.. దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే అణు ఒప్పందం జరిగింది. గ్రామీణ దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన తన సంస్కరణలతో మార్చారు అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment