సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వృద్ధి రేటుపై ద్రవ్యోల్బణం ప్రభావం పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23లో రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు గణనీయంగా తగ్గనుందని ‘ముందస్తు ప్రాథమిక అంచనాలు (ప్రొవిజనల్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్/పీఏఈ)’ స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ధరల వద్ద 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ 19.4శాతం వృద్ధి రేటును నమోదుచేయగా.. 2022–23లో 15.6 శాతానికి తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
జాతీయ స్థాయిలో చూసినా.. 2021–22లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 19.5శాతం వృద్ధిరేటు నమోదు చేయగా.. 2022–23లో 15.4 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. రాష్ట్ర శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన తెలంగాణ సామాజిక–ఆర్థిక సర్వే–2023 నివేదికలో ఈ గణాంకాలను వెల్లడించింది.
స్థిర ధరల వద్ద 7.4 %
దేశ, రాష్ట్ర వృద్ధిరేటు తగ్గుదలకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం, సప్లై మందగమనం, డిమాండ్ తగ్గడంతో వృద్ధికి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రధానంగా తయారీ రంగంపై ఈ ప్రభావం అధికంగా ఉందని తెలిపింది. ఇక గత ఏడాది (2021–22) సాధించిన 19.4శాతం భారీ వృద్ధిరేటుపై అంతకు మించిన వృద్ధిరేటును ఈ ఏడాది ఆశించడం సాధ్యం కాదని వివరించింది.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014–15 నుంచి 2019–20 వరకు జాతీయ సగటును మించి వృద్ధిరేటును తెలంగాణ నమోదు చేసిందని.. కోవిడ్ తర్వాత కాలంలో జాతీయ సగటుతో సమానంగా వృద్ధి రేటు కొనసాగుతోందని పేర్కొంది. ఇక స్థిర (2011–12 నాటి) ధరల వద్ద 2022–23లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 7.4 శాతం, దేశ జీడీపీ వృద్ధి రేటు 7శాతం ఉంటుందని అంచనా వేసింది.
తగ్గిన నిరుద్యోగం
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్) ప్రకారం రాష్ట్ర లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (ఎల్‌ఎఫ్‌పీఆర్) 65.4 శాతంగా ఉంది. ఏదో ఒక పనిచేస్తూ లేదా ఏదైనా పనికోసం ఎదురు చూస్తున్న 15–59 ఏళ్ల జనాభా శాతాన్ని ఎల్‌ఎఫ్‌పీఆర్‌గా పరిగణిస్తారు. ఈ సర్వే ప్రకారం.. 2019–20తో పోల్చితే 2020–21లో రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 7.5 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) డేటా ప్రకారం.. 2022 ఏప్రిల్‌తో పోల్చితే 2022 డిసెంబర్‌లో రాష్ట్ర నిరుద్యోగ రేటు 9.9 శాతం నుంచి 4.1 శాతానికి దిగొచ్చింది. ముఖ్యంగా పట్టణాల్లోనే నిరుద్యోగం అధికంగా ఉంది. 2019–20తో పోల్చితే 2020–21లో గ్రామీణ నిరుద్యోగం 5.7శాతం నుంచి 3.6శాతానికి, పట్టణ నిరుద్యోగం 10.7శాతం నుంచి 8శాతానికి తగ్గాయి. ఇదే సమయంలో పురుషుల్లో నిరుద్యోగం 8.4శాతం నుంచి 5.5 శాతానికి, మహిళల్లో నిరుద్యోగం 6.1 శాతం నుంచి 4.5శాతానికి తగ్గాయి.
పెరిగిన ఉద్యోగ భద్రత
సామాజిక–ఆర్థిక సర్వే ప్రకారం.. రాష్ట్రంలో ఉద్యోగులకు సదుపాయాలు, భద్రత క్రమంగా పెరుగుతున్నాయి. 2019–20తో పోల్చితే 2020–21లో పెయిడ్ లీవ్‌కు అర్హతగల ఉద్యోగులు 45.2శాతం నుంచి 50.9శాతానికి.. పెన్షన్లు, ఆరోగ్య సేవలు వంటి సదుపాయాలు కలిగిన ఉద్యోగులు 40.8శాతం నుంచి 46.9శాతానికి పెరిగారు. రాతపూర్వక జాబ్ కాంట్రాక్టు కలిగిన ఉద్యోగులు 39.9శాతం నుంచి 36.2శాతానికి తగ్గారు. ఈఓడీబీ, టీ–ఐడియా, టీ–ప్రైడ్ వంటి కార్యక్రమాలతో పాటు ఐటీ, ఇతర సేవా రంగాలను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలతో ఉద్యోగుల పరిస్థితులు మెరుగయ్యాయని ప్రభుత్వం పేర్కొంది.
రాష్ట్ర, జాతీయ వృద్ధిరేటు తీరు
జీఎస్డీపీ వృద్ధిలో మూడో స్థానం
►స్థిర ధరల వద్ద 2022–23లో రాష్ట్ర జీఎస్డీపీ విలువ రూ.13.27 లక్షల కోట్లు, దేశ జీడీపీ విలువ రూ.273.08 లక్షల కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.11.48 లక్షల కోట్లు, దేశ జీడీపీ రూ.236.65 లక్షల కోట్లుగా నమోదైందని తెలిపింది.
►జీఎస్డీపీ వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో (19.4 శాతంతో) నిలిచిందని.. ఒడిశా (20.5శాతం), మధ్యప్రదేశ్ (19.7 శాతం) తొలి రెండు స్థానాల్లో నిలిచాయని పేర్కొంది.
►2021–22లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.9 శాతమని.. 2022–23లో కూడా ఇదే స్థాయిలో భాగస్వామ్యం ఉండనుందని ప్రభుత్వం అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment