రెట్టించిన వృద్ధి | CM YS Jagan released Socio Economic Survey 2022-23 | Sakshi
Sakshi News home page

సామాజిక ఆర్థిక సర్వే : ఏపీలో రెట్టించిన వృద్ధి

Published Thu, Mar 16 2023 2:14 AM | Last Updated on Thu, Mar 16 2023 2:14 AM

CM YS Jagan released Socio Economic Survey 2022-23 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో వేగంగా వృద్ధి చెందుతున్నట్లు సామాజిక ఆర్థిక సర్వే 2022 – 23 వెల్లడిస్తోంది. అన్ని రంగాల్లో వృద్ధి రేటు దగ్గర నుంచి తలసరి ఆదాయం వరకు దేశ సగటు కంటే రాష్ట్రంలో అధికంగా నమోదు కావడం గమనార్హం. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో 13.98 శాతం వృద్ధి నమోదైంది.

ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 2022 – 23 సంవత్సరానికి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 16.22 శాతం వృద్ధి నమోదు కాగా ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి 15.9 శాతంగా ఉంది. 2021 – 22 (తొలి సవరించిన అంచనాల ప్రకారం) రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11,33,837 కోట్లు కాగా 2022–23 ముందస్తు అంచనాల ప్రకారం రూ.13,17,728 కోట్లకు  చేరనుంది. అంటే ఒక్క సంవత్సరంలోనే నికరంగా రూ.1,83,891 కోట్ల విలువైన ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థకు వచ్చి చేరింది.

ఇదే సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం 2021–22తో పోలిస్తే 2022–23లో రూ.26,931 పెరిగి రూ.2,19,518కు చేరుకుంది. దేశవ్యాప్తంగా చూస్తే తలసరి ఆదాయంలో వృద్ధి రూ.23,476గా నమోదైంది. రాష్ట్ర ప్రభు­త్వం ప్రవేశపెట్టిన నవరత్న పథకాలతో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను వేగంగా చేరుకుంటోందని ఆర్థిక సర్వే విశ్లేషించింది.

విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, వ్యవసాయం తదితర రంగాలకు వివిధ పథకాల ద్వారా ఇప్పటివరకు రూ.1.97 లక్షల కోట్లను నేరుగా లబ్థిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే. 2022–23 సామాజిక ఆర్థిక సర్వేను సీఎం వైఎస్‌ జగన్‌­ బుధవారం విడుదల చేశారు. అందులో ముఖ్యాంశాలు ఇవీ..

అన్ని రంగాల్లో రెండంకెల వృద్ధి
జీఎస్‌డీపీలో కీలకమైన వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో రాష్ట్రం రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 13.18 శాతం వృద్ధి నమోదు కాగా పరిశ్రమల రంగంలో 16.36 శాతం, సేవా రంగంలో 20.52 శాతం వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా చూస్తే వ్యవసాయ రంగంలో 11.2 శాతం, పరిశ్రమల రంగంలో 13.9 శాతం, సేవా రంగంలో 17.4 శాతం వృద్ధి నమోదైంది. 

రాష్ట్రంలో ఒక్క వ్యవసాయ రంగంలోనే 20.72 శాతం వృద్ధి నమోదు కాగా ఉద్యానవన పంటల్లో 12.58 శాతం, పశు సంపదలో 7.32 శాతం,  ఆక్వాలో 19.41 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం వ్యవసాయం, అనుబంధ రంగాల విలువ రూ.4,39,645 కోట్లకు చేరింది.  పరిశ్రమల రంగంలో 16.36 శాతం వృద్ధితో రూ.2,83,821 కోట్లకు చేరింది. పరిశ్రమల రంగంలో కీలకమైన మైనింగ్‌ రంగంలో 15.81 శాతం, తయారీ రంగంలో 11.81 శాతం, ఎలక్ట్రిసిటీ 30.96 శాతం, నిర్మాణ రంగంలో 16.94 శాతం వృద్ధి నమోదైంది.

సేవా రంగంలోకూడా దేశ సగటు కంటే రాష్ట్రం అధిక వృద్ధి రేటును నమోదు చేసింది. 2022–23లో దేశవ్యాప్తంగా సేవా రంగంలో 17.4 శాతం వృద్ధి నమోదైతే, రాష్ట్రంలో 20.52 శాతం వృద్ధి నమోదయ్యింది. ఏపీలో 2021–22లో సేవా రంగ ఉత్పత్తి విలువ రూ.4,07,810 కోట్లుగా ఉంటే 2022–23లో రూ.4,91,496 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.

సేవా రంగంలో వాణిజ్యం–హోటళ్ల విభాగంలో 28.42 శాతం, రైల్వేలు 17.82 శాతం, రవాణా రంగం 28.42 శాతం, రియల్‌ ఎస్టేట్‌ 13.14 శాతం వృద్ధి నమోదయ్యింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 36.19 శాతం కాగా పరిశ్రమలు 23.36 శాతం, సేవా రంగం వాటా 4.45 శాతంగా ఉంది.
సామాజిక ఆర్థిక సర్వే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్‌ జగన్, తదితరులు   

విద్య
► మనబడి నాడు – నేడు ద్వారా మూడు దశల్లో పాఠశాలల్లో మౌలిక వసతులు పటిష్టం.
► తొలిదశ కింద రూ.3,669 కోట్లతో 15,717 పాఠశాలల అభివృద్ధి. మూడేళ్లలో 57,189 పాఠశాలలు, 3,280 ఇతర విద్యా సంస్థల్లో రూ.16,022 కోట్లతో మౌలిక వసతుల కల్పన. 
► చదువులను ప్రోత్సహిస్తూ జగనన్న అమ్మ ఒడి ద్వారా రూ.19,617.60 కోట్లు వ్యయం.
► జగనన్న విద్యా కానుక కింద ఒకటి నుంచి 10వ తరగతి చదివే 47.4 లక్షల మంది విద్యార్థులకు రూ.2,368 కోట్లు...........
► జగనన్న గోరుముద్ద కోసం రూ.3,239 కోట్లు వ్యయం.
► జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌తో 24.75 లక్షల మంది విద్యార్థులకు రూ.9,249 కోట్ల మేర ప్రయోజనం.
► జగనన్న వసతి దీవెనతో హాస్టళ్లలో ఉంటున్న 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.3,366 కోట్లు లబ్ధి.

వైద్యం – మహిళా సంక్షేమం
► ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులను నియ­మిం­చి ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధానం అమలు.
► వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా 3,255 ప్రొసీజర్లకు ఉచితంగా వైద్యం. ఇప్పటివరకు 1.41 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం.
► నాడు – నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు బలోపేతం.
► 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, 528 అర్బన్‌ హెల్త్‌ కేర్‌ క్లినిక్స్‌ ఏర్పాటు 
► వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ ద్వారా 35.7 లక్షల మంది గర్భవతులు, బాలింతలు, పిల్లల్లో రక్తహీనత నివారించి పౌష్టికా­హారం అందించేందుకు రూ.6,141 కోట్లు వ్యయం.
► ప్రస్తుతం ఉన్న 11 మెడికల్‌ కాలేజీలకు అదనంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు.

మహిళా సాధికారత
► వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 26.7 లక్షల మంది మహిళలకు రూ.14,129 కోట్లు పంపిణీ.
► వైఎస్సార్‌ ఆసరాతో స్వయం సహాయక సంఘాలకు చెందిన 78.74 లక్షల మంది మహిళలకు రూ.12,758 కోట్లు.
► వైఎస్సార్‌ సున్నా వడ్డీ ద్వారా పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలకు రూ.3,615 కోట్ల వడ్డీ చెల్లింపు. 1.02 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం.

 సుస్థిరాభివృద్ధి..
► నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానం.
► ఎస్‌డీజీ ఇండియా 2020–21 నివేదికలో నాలుగో స్థానం సాధించిన ఏపీ.
► ఎస్‌డీజీ–7 లక్ష్యంలో మొదటి ర్యాంకు, ఎస్‌డీజీ 14 లక్ష్యంలో రెండో ర్యాంకు.
► రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక పాలన విధానాలను అనుసరిస్తున్న ఇతర రాష్ట్రాలు. 
► ఆర్బీకేలు, సచివాలయాలు, భూముల సమగ్ర సర్వే తదితర కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు.

 గృహ నిర్మాణం
► పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా మహిళలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన 30.65 లక్షల ఇళ్ల పట్టాలు జారీ.
► ఇప్పటివరకు 21.25 లక్షల ఇళ్లు మంజూరు చేయగా 4.4 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి. వివిధ దశల్లో కొనసాగుతున్న మిగతా ఇళ్లు.
► వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.32,909 కోట్ల వ్యయం.
► వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద ప్రతీ నెలా 64.45 లక్షల మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు రూ.66,823.79 కోట్ల పంపిణీ.

రైతుల సంక్షేమం కోసం..
► అన్నదాతలకు సేవలన్నీ ఒకేచోట అందించే విధంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు. 
► వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం కింద 52.38 లక్షల మంది రైతులకు రూ.27,063 కోట్ల మేర ఆర్థిక సాయం.
► ఉచిత పంటల బీమా పథకంతో రూ.6,872 కోట్ల ప్రీమియం చెల్లించిన ప్రభుత్వం.
► వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 73.88 లక్షల మంది రైతులకు రూ.1,834.55 కోట్ల వడ్డీ సబ్సిడీ చెల్లింపు.
► వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ కోసం రూ.27,800 కోట్ల సబ్సిడీ చెల్లింపు, ఆక్వా రైతులకు రూ.2,647 కోట్ల సబ్సిడీ చెల్లింపు.
► పామాయిల్, బొప్పాయి, కోకో, టమాటా, కొబ్బరి, ఎండుమిర్చి ఉత్పత్తిలో మొదటి ర్యాంకులో ఆంధ్రప్రదేశ్‌.
► వైఎస్సార్‌ జలకళ కింద 9,629 మంది రైతులు లబ్థి పొందేలా రూ.188.84 కోట్ల విలువైన 6,931 బోర్ల తవ్వకం.
► వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద 1.20 లక్షల మంది మత్స్యకార కుటుంబాలకు రూ.422 కోట్లు పంపిణీ.


పరిశ్రమలు
► మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో విజయవంతంగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నిర్వహణ.
► 386 ఎంవోయూల ద్వారా రూ.13.11 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు. 6 లక్షల మందికిపైగా ఉపాధి.
► రూ.19,115 కోట్ల పెట్టుబడితో 1.52 లక్షల ఎంఎస్‌ఎంఈల ఏర్పాటు. 13.63 లక్షల మందికి ఉపాధి.
► రూ.1.35 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 69 భారీ ప్రాజెక్టుల నిర్మాణ పనులు.
► వరుసగా మూడేళ్లుగా సులభతర వాణిజ్యం ర్యాంకుల్లో మొదటి స్థానం దక్కించుకుంటున్న ఏపీ.
► మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం, కాకినాడ సెజ్‌లో పోర్టులతోపాటు తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం.

ఇతర సంక్షేమ పథకాలు
► జగ్జీవన్‌ జ్యోతి పథకం కింద 15.14 లక్షల మంది ఎస్సీలు, 4.5 లక్షల మంది ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌.
► సొంత ఆటోలు, ట్యాక్సీలున్న 2.74 లక్షల మందికి వైఎస్సార్‌ వాహనమిత్ర కింద నాలుగేళ్లుగా రూ.1,041 కోట్లు పంపిణీ.
► వైఎస్సార్‌ నేతన్న నేస్తం ద్వారా 81,783 చేనేత కుటుంబాలకు రూ.788.50 కోట్లు. 
► వైఎస్సార్‌ కాపునేస్తం కింద 3.56 లక్షల మంది మహిళలకు రూ.1,518 కోట్లు.
► వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 3.94 లక్షల మందికి రూ.595.86 కోట్ల మేర లబ్ధి.
► జగనన్న చేదోడు కింద 3.30 లక్షల మందికి రూ.927.49 కోట్లు.
► వైఎస్సార్‌ లా నేస్తం ద్వారా 4,248 మంది యువ న్యాయవాదులకు రూ.35.40 కోట్లు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement