రాష్ట్రానికి రెండేళ్లలో పెట్టుబడులు రూ.33,323.2 కోట్లు | Investment to AP in two years is above Rs 33,323 crore | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి రెండేళ్లలో పెట్టుబడులు రూ.33,323.2 కోట్లు

Published Sat, May 22 2021 4:31 AM | Last Updated on Sat, May 22 2021 4:31 AM

Investment to AP in two years is above Rs 33,323 crore - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 మహమ్మారి ఉన్నప్పటికీ కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం ముందంజలో ఉందని సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడైంది. గడచిన రెండేళ్ల కాలంలో రాష్ట్రంలోకి రూ.33,323.2 కోట్ల విలువైన నూతన పెట్టుబడులు వచ్చినట్టు సర్వే లెక్క గట్టింది. 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో పెద్ద, మెగా, ఎంఎస్‌ఎంఈ రంగాల్లో మొత్తం 13,789 యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటిద్వారా 1,41,276 మందికి ఉపాధి లభించినట్టు సర్వే వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం 2020–23, ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం వైఎస్సార్‌ జగనన్న బడుగు వికాసం,  సింగిల్‌ విండో క్లియరెన్స్‌ కోసం ‘వైఎస్సార్‌ ఏపీ వన్‌’ వంటివిధానాలు అమలు చేయడం వంటి పెట్టుబడుల ఆకర్షణకు దోహదపడినట్టు తేలింది. పెట్టుబడులు, ఉపాధి కల్పనలో ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, విశాఖ జిల్లాలు ముందంజలో ఉన్నాయి. 

60 భారీ కంపెనీల ఏర్పాటు
గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో 60కి పైగా భారీ, అతి భారీ యూనిట్లు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రాష్ట్రంలోకి రూ.28,188.75 కోట్ల విలువైన పెట్టుబడులు రాగా.. 29,531 మందికి ఉపాధి లభించింది. అత్యధికంగా అనంతపురం జిల్లా రూ.12,041 కోట్లు, చిత్తూరు జిల్లా రూ.11,194.72 కోట్లు,  విశాఖ జిల్లా రూ.2,461.19 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి.

చిన్న పరిశ్రమల్లో భారీ ఉపాధి
ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ రంగానిదే అగ్రస్థానమని మరోసారి నిరూపణ అయ్యింది. రెండేళ్లలో రాష్ట్రంలో ఈ రంగం ద్వారా 1,11,745 మందికి ఉపాధి లభించింది. 2019–20, 2020–21 కాలంలో రాష్ట్రంలో మొత్తం 13,729 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా యూనిట్లు రాగా.. వీటిద్వారా రూ.5,134.45 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. 1,596 యూనిట్ల ఏర్పాటుతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. 16,377 మందికి ఉపాధి కల్పించడం ద్వారా ప్రకాశం జిల్లా ముందంజలో ఉంది. వైఎస్సార్‌ నవోదయం కింద ఆర్థికంగా కష్టాల్లో ఉన్న యూనిట్లు పునరుద్ధరించడానికి చేయూతనివ్వడం, రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద కోవిడ్‌ సమయంలో రాయితీ బకాయిల చెల్లింపు, లాక్‌డౌన్‌ కాలానికి విద్యుత్‌ బిల్లుల మాఫీతో ఈ రంగంలో పెట్టుబడులు పెరగడానికి కారణమైందని ఆర్థిక సర్వే పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement