
పిల్లల ఆరోగ్యం విషయంలో మారుతున్న తల్లిదండ్రుల ధోరణి
వారిని సెల్‌ఫోన్ వ్యసనానికి దూరం చేసే ప్రయత్నం
శారీరక శ్రమ ఉండేలా ఏదో ఒక అంశంలో శిక్షణ ఇప్పించాలని కోరిక
‘మావాడు ఇంట్లో సెల్‌ఫోన్‌కు బానిసయ్యాడు. ఏమాత్రం శారీరక శ్రమ లేక బరువు కూడా బాగా పెరిగాడు. ముందు మావాడి ఫిజికల్ యాక్టివిటీ పెంచండి. ఆ తర్వాత ఆట నేర్పించండి. అప్పుడైనా సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంటాడు.’ ఇటీవల హిట్‌కొట్టిన ఓ సినీ హీరో కుమారుడి పరిస్థితిపై క్రీడా కోచ్‌కు బాలుడి తల్లి చేసిన వినతి ఇది.
హైదరాబాద్‌లో ఓ చార్ట్టర్డ్ అకౌంటెంట్ తన కుమారుడిని క్రికెట్‌కు అంకితం చేశారు. డ్రైవర్‌తో పాటు కారు, అన్ని వసతులు సమకూర్చారు. స్కూల్ నుంచి ప్రత్యేక పర్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడా కుర్రాడు ఏజ్ గ్రూప్‌లో సెంచరీల మీద సెంచరీలు కొడుతూ అండర్–19 జాతీయ జట్టుకు ఎంపికయ్యేలా ఎదిగాడు.
నేటి ఆధునిక జీవనశైలి (Life Style) కారణంగా శారీరక శ్రమకు దూరం కావడంతోపాటు సెల్‌ఫోన్ (Cellphone) వ్యసనానికి బానిసలవుతున్న పిల్లలను గాడినపెట్టేందుకు ఇటీవల కాలంలో తల్లిదండ్రులు వారిని క్రీడల వైపు మళ్లిస్తున్నారు. శారీరక, మానసిక వికాసం కోసం వారిని మైదానాల బాట పట్టిస్తున్నారు. అల్లరి మాన్పించేందుకు కొందరు.. ఊబకాయం వంటి అనారోగ్య సమస్యల నుంచి దూరం చేసేందుకు మరికొందరు, క్రీడలనే కెరీర్‌గా మలుచుకొనేలా చూసేందుకు ఇంకొందరు తమ పిల్లలను స్పోర్ట్స్ క్లబ్‌లకు తీసుకెళ్తున్నారు.
సంపన్నులతోపాటు మధ్యతరగతి, కొందరు కిందిస్థాయి ఉద్యోగులు, చిరు వ్యాపారులు సైతం పిల్లలను ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో చేరుస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి తర్వాత ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన పెరగడంతో పిల్లలను ఏదో ఒక క్రీడలో శిక్షణ ఇప్పించాలనే కోరిక తల్లిదండ్రుల్లో కలుగుతోంది. దీంతో మూడేళ్ల నుంచి మైదానాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. రోజువారీ శిక్షణ కోసం గ్రామాల నుంచి జిల్లా కేంద్రాలు, పట్టణాలకు వస్తున్న వారూ ఉంటున్నారు.
చదువును నిర్లక్ష్యం చేయకుండానే..
పిల్లలకు నచ్చిన క్రీడలో ప్రవేశం కల్పించి వారు అందులో రాణిస్తుంటే భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. హైదరాబాద్ వంటి చోట్ల భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే పిల్లల కెరీర్ కోసం వర్క్ ఫ్రమ్ హోం చేస్తూనో లేదా ఒకరు జాబ్ వదిలేయడమో చేస్తున్న ఉదాహరణలు కూడా ఉంటున్నాయి. పిల్లలు చదువును నిర్లక్ష్యం చేయకుండానే క్రీడల్లో వారు పాల్గొనేలా చూసుకుంటున్నారు. ఒకవేళ ఏదో ఒకటి తేల్చుకోవాల్సి వస్తే క్రీడల వైపే మొగ్గుచూపుతున్న వారూ ఉన్నారు. ఉన్నతవిద్యా కోర్సుల్లో క్రీడా కోటా ఉండటమే దీనికి కారణం. క్రీడల్లో సత్తాచాటి సర్టీఫికెట్ సాధిస్తే ఎంబీబీఎస్, ఇంజనీరింగ్‌తోపాటు అన్ని ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాల్లో 0.5 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్ ఉంది.
వెంటనే అద్భుతాలు ఆశించొద్దు..
జట్టు క్రీడాంశాల్లో విజయం దక్కాలంటే సమష్టి ప్రదర్శన కీలకం. అందుకని తల్లిదండ్రులు వ్యక్తిగత క్రీడాంశాల వైపు మొగ్గుచూపుతున్నారు. అందరి దృష్టిలో పడేందుకు, ఆటతీరు బేరీజు వేసుకొని మెరుగుపర్చుకొనేందుకు వ్యక్తిగత క్రీడాంశాలైతే పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే ఏ రంగంలోనైనా లక్ష్య సాధనకు సరైన కార్యాచరణ రూపొందించుకోవడం.. పక్కా ప్రణాళికతో అమలు పరచడం ముఖ్యం. క్రీడలూ దీనికి మినహాయింపు కాదు. పిల్లలు వెంటనే అద్భుతాలు చేయాలని ఆశించకుండా కావాల్సినంత సమయం ఇవ్వాలి.
⇒ ప్రతిరోజూ సగటున పిల్లలు 5–7 గంటలు స్క్రీన్ ముందు గడుపుతున్నారు. క్రీడల ద్వారా ఈ స్క్రీన్ టైమ్‌ను తగ్గిస్తే పిల్లల్లో దృష్టి సమస్యలు, మానసిక ఒత్తిడి తగ్గి మనోవికాసం మెరుగుఅవుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
⇒ నాన్ డిజిటల్ గేమ్స్ ఆడేవారిలో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుందని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి.
⇒ క్రీడలు ఆడే వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. సానుకూల దృక్పథం, క్రమశిక్షణ, పట్టుదల ఏర్పడతాయి. గెలుపోటములను సమానంగా స్వీకరించే తత్వం అలవడుతుంది.
⇒ పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు..
⇒ఆటలు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. వ్యక్తిగా ఎదిగేందుకు దోహదపడతాయి.
‘మావాడు ఇంట్లో సెల్‌ఫోన్‌కు బానిసయ్యాడు. ఏమాత్రం శారీరక
శ్రమ లేక బరువు కూడా బాగా పెరిగాడు. ముందు మావాడి ఫిజికల్ యాక్టివిటీ పెంచండి. ఆ తర్వాత ఆట నేర్పించండి. అప్పుడైనా సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంటాడు.’ ఇటీవల
హిట్‌కొట్టిన ఓ సినీ హీరో కుమారుడి పరిస్థితిపై క్రీడా కోచ్‌కు బాలుడి తల్లి చేసిన వినతి ఇది.
ఆటలు.. అంకెలు
⇒ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం పిల్లలకు కనీసం రోజుకు 60 నిమిషాల శారీరక శ్రమ (ఫిజికల్ యాక్టివిటీ) తప్పనిసరి.
⇒ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం భారత్‌లో 90% పిల్లలు సిఫార్సు చేసిన శారీరక వ్యాయామాన్ని పాటించట్లేదు.
⇒ ఆస్ట్రేలియా జనాభాలో 71.8%, జపాన్‌లో 60.3% స్పోర్ట్స్ ఆడుతున్నారు. ఇండియాలో వీరు 6% మాత్రమే.
బుమ్రా స్టయిల్.. హార్దిక్ ఆటిట్యూడ్
కొందరు పిల్లలపై భారత జాతీయ క్రీడాకారుల ప్రభావం చాలా ఉంటోంది. క్రికెట్ అకాడమీల్లో పదేళ్ల వయసు పిల్లలు టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్రీ్పత్ బుమ్రా డిఫరెంట్ బౌలింగ్ స్టయిల్‌ను ప్రాక్టీస్ చేస్తున్నారు. మరికొందరు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆటిట్యూడ్‌ను ఫాలో అవుతున్నారు. మాజీ క్రికెటర్ మిథాలీరాజ్ జీవిత కథ ఆధారంగా నిర్మించిన ‘శభాష్ మిథు’వంటి సినిమాలు చూసి స్ఫూర్తి పొంది గ్రౌండ్‌కు వెళ్తున్న బాలికలూ ఉండడం గమనార్హం. మరికొందరు అమ్మాయిలైతే బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును ఆరాధిస్తున్నారు.
మైదానాల్లో పెరిగిన పిల్లల సంఖ్య
⇒ హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని ఓ ప్రైవేటు క్రికెట్ కోచింగ్ సెంటర్‌లో రెండేళ్ల కిందటి వరకు 20 మంది పిల్లలు కూడా ఉండేవారు కాదు. ఇప్పుడు వారి సంఖ్య 80కి పెరిగింది.
⇒ మహబూబ్‌నగర్ మెయిన్ స్టేడియంలో వాలీబాల్, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, ఆర్చరీ, బ్యాడ్మింటన్‌లో దాదాపు 200 మంది శిక్షణ తీసుకుంటున్నారు. ఖేలో ఇండియా ఫుట్‌బాల్ సెంటర్‌లోనే 35 మంది ఉన్నారు. 30 నుంచి 40 మంది కరాటే మాస్టర్లు వందలాది మందికి శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో 200మంది దాక చిన్నారులు తైక్వాండో శిక్షణ పొందుతున్నారు.
⇒ నల్లగొండ అవుట్‌డోర్ స్టేడియంలో హాకీ, క్రికెట్‌లో ప్రత్యేక శిక్షణకు వందల మంది వెళ్తున్నారు.
⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మార్షల్ ఆర్ట్స్, క్రికెట్, యోగా, స్విమ్మింగ్ శిక్షణ కోసం విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
సెల్‌ఫోన్ నుంచి చెస్ వైపు..
మంచిర్యాల పట్టణానికి చెందిన అరుకల వేణుగోపాల్, కీర్తన దంపతులు తమ పిల్లలు అక్షయ (14), జశ్విత్(12)లు సెల్‌ఫోన్, టీవీ చూడడం తగ్గించేందుకు చెస్ నేర్పించడం మొదలుపెట్టారు. రెండేళ్లుగా చదరంగంలో ప్రావీణ్యం సంపాదించారు. రాష్ట్రస్థాయి టోరీ్నలో ఆడుతున్నారు. చదువులోనూ రాణిస్తున్నారు.
ఒకే సెంటర్లో 30 మంది అమ్మాయిలు
సంగారెడ్డిలోని ఓ క్రికెట్ కోచింగ్ సెంటర్లో 85 మంది శిక్షణ పొందుతుంటే వీరిలో 30 మంది అమ్మాయిలు గ్రామీణ ప్రాంతాలవారే కావడం గమనార్హం. పరిసర గ్రామాలకు చెందిన వీరు నిత్యం 20 కి.మీ. ప్రయాణించి కోచింగ్ తీసుకుంటున్నారు.
ఆటో డ్రైవరే అయినా.. ఆటలను వదల్లేదు
మహబూబ్‌నగర్‌కు చెందిన ఈ బాలిక పేరు సాయి వైష్ణవి. అథ్లెటిక్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. ఆమె అన్న మూడేళ్ల క్రితం స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్‌లో సత్తాచాటి హైదరాబాద్ శివార్లలోని హకీంపేట స్కూల్‌లో ప్రవేశం పొందాడు. 8వ తరగతి చదువుతూ ఫెన్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. తండ్రి రాములు ఆటో డ్రైవర్. సాయి వైష్ణవి తండ్రి రాములు మూడుసార్లు ఆర్మీ, నాలుగుసార్లు పోలీస్ ఉద్యోగ పరీక్షలకు వెళ్లి ఉత్తీర్ణత కాలేకపోయాడు. దీంతో పిల్లలను క్రీడల్లో ఉన్నతస్థానాల్లో చేర్చాలనే లక్ష్యంతో శిక్షణ ఇప్పిస్తున్నాడు. జిల్లా, రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్‌లో సాయి వైష్ణవి ఎంపికయ్యేలా రోజూ స్టేడియానికి తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తున్నాడు.
శారీరకంగా, మానసికంగా ఎదిగేందుకు
నా కూతురు యోధ రెండో తరగతి చదువుతోంది. భర్త బాలునాయక్ సూర్యాపేట రూరల్ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఆయన నిత్యం బిజీగా ఉంటారు. పిల్లలు ఇంటి నుంచి వచ్చాక సెల్‌ఫోన్‌లు చూసేందుకే మక్కువ చూపుతున్నారు. ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో రాణించేలా చేయాలని భావించా. తనకు ఏది ఇష్టమో అడిగితే క్రికెట్ అని చెప్పింది. దీంతో కోచింగ్ ఇప్పిస్తున్నా. – రోజా, విద్యార్థిని తల్లి, సూర్యాపేట
అమ్మ ప్రోత్సాహంతో..
జీవితంలో ఎదగాలంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నది మా అమ్మ ఆకాంక్ష. ఆమె ప్రోత్సాహంతో రెండేళ్లుగా కరాటేలో శిక్షణ తీసుకుంటున్నా. పది వరకు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాను. ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోగలననే ఆత్మవిశ్వాసం నాకు ఏర్పడింది.
– ఇ.ప్రణీష, హనుమకొండ
అమ్మాయి బలంగా ఎదిగేలా..
రెండేళ్లుగా మా అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పిస్తున్నా. లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తూనే పాపను ఉదయం, సాయంత్రం ట్రైనింగ్ క్లాసులకు తీసుకెళ్తున్నా. శారీరక, మానసిక దృఢత్వంతోపాటు అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత.
– అనిత, అధ్యాపకురాలు, హనుమకొండ
పిల్లల్ని అథ్లెటిక్స్‌లో చేర్పించి..
డోర్నకల్‌కు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు మాలోతు రామ్‌కుమార్, రైల్వే ఉద్యోగి రోజా దంపతులకు ఇద్దరు పిల్లలు కీర్తన (మూడో తరగతి), దామోదర్ (నాలుగో తరగతి). కరోనా వేళ ఆన్‌లైన్ క్లాసుల కోసం పిల్లల చేతికి సెల్‌ఫోన్లు ఇవ్వాల్సి రావడంతో ఇతర విషయాలపై వారికి ఆసక్తి పెరిగింది. దీంతో కీర్తనను అథ్లెటిక్స్‌లో చేరి్పంచారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో సీటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.