
ఈసారి బడ్జెట్ రూ.12,393 కోట్లు
గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.825 కోట్లు అధికం
రాజీవ్ ఆరోగ్యశ్రీకి రూ.1,143 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖకు 2025–26 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.12,393 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ రూ.11,468 కోట్లతో పోలిస్తే రూ.825 కోట్లు అధికం. ఈ కేటాయింపుల్లో నిర్వహణ పద్దు కింద రూ. 5,666.86 కోట్లు కేటాయించగా, అభివృద్ధి కోసం రూ. 6,070 కోట్లు కేటాయించారు. ఇందులో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు కలిపి రూ. 680.63 కోట్లు కేటాయించగా.
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ (డీఎంఈ)కు రూ. 3,011 కోట్లు కేటాయించారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాధిపతికి రూ. 554.24 కోట్లు కేటాయించారు. ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్ పరిధిలోని కార్యక్రమాలకు రూ. 1686.80కోట్లు కేటాయించడం గమనార్హం. ఇవి కాకుండా ఆయుష్ కోసం రూ.133.52 కోట్లు, డ్రగ్స్ కంట్రోల్ విభాగాధిపతికి రూ.2.10 కోట్లు కేటాయించారు.
ఆరోగ్యశ్రీ చెల్లింపులకు ఎలా?
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 1,143 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచడంతోపాటు వైద్యం ఖర్చుల స్లాట్లను కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఆసుపత్రులతోపాటు కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా రోగులకు చికిత్సలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1200 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా.
తమకు బకాయిలు చెల్లించాలని రెండు నెలల క్రితం నెట్‌వర్క్ ఆసుపత్రులు సమ్మె కూడా చేశాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో కేవలం రూ.1,143 కోట్లను కేటాయించడాన్ని ఆరోగ్య శ్రీ చెల్లింపులకు కొంత ఇబ్బంది కలిగించే విషయంగా ప్రైవేటు ఆసుపత్రులు చెపుతున్నాయి. ఇందులో నిర్వహణ ఖర్చులు పోను మిగిలే రూ. 695.79 కోట్లు మాత్రమే ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌కు చేరే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment