
2024–25లో పింఛన్లకు రూ.10,514.32 కోట్లు అందజేత
లబ్దిదారుల్లోబీసీలు 54.8 శాతం, ఓసీలు 14.6 శాతం
వృద్ధులు, వితంతు పించన్లు 30 లక్షల పైచిలుకు.. సామాజిక, ఆర్థిక సర్వేలో ప్రభుత్వం వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో చేయూత సామాజిక పింఛన్ల కింద 2024–25 ఆర్థిక సంవత్సరంలో లబ్దిదారులకు మొత్తం రూ.10,514.32 కోట్లు (మార్చిలో చెల్లించాల్సిన రూ.982.20 కోట్లు కలిపి) అందజేసినట్లు సామాజిక ఆర్థిక సర్వే 2024–25లో ప్రభుత్వం తెలిపింది. 2024–25 బడ్జెట్‌లో ఈ పింఛన్ల కోసం 14,628.91 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 2025–26 వార్షిక బడ్జెట్‌లో పింఛన్లకు రూ.14,861 కోట్లు కేటాయించింది. మొత్తం 11 కేటగిరీల్లో 42,51,341 మందికి పింఛన్లు అందిస్తున్నారు.
వీరిలో దివ్యాంగులకు నెలకు రూ.4,016 చొప్పున, వృద్ధులు, వితంతువులు, ఇతర కేటగిరీలవారికి రూ.2,016 చొప్పున ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం వృద్ధులు ఇతర కేటగిరీల పింఛన్లను రూ.2,016 నుంచి రూ.4 వేలకు, దివ్యాంగులకు రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంపుదల ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందనేదానిపై స్పష్టత కొరవడింది. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.23 వేల కోట్ల వరకు బడ్జెట్ పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment