రాజమహేంద్రవరం ఎంపీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు
అయినప్పటికీ పురందేశ్వరి నియోజకవర్గంపై చిన్నచూపు
రైల్వే బడ్జెట్‌లోనూ మొండిచేయే.. పట్టాలెక్కని నూతన ప్రాజెక్టులు
2027లో గోదావరి పుష్కరాలు అయినా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధుల కరువు
చిన్నమ్మకు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం చేతకావడం లేదా.. ఎంపీగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదా.. బీజేపీ పెద్దల వద్ద ఆమె మాట చెల్లడం లేదా.. టీడీపీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారనే అనుమానంతో చిన్నమ్మను కేంద్రం దూరం పెట్టిందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఇటీవలి కేంద్ర బడ్జెట్టే దీనికి నిదర్శనంగా నిలుస్తూండగా.. రైల్వే బడ్జెట్‌లో సైతం జిల్లాకు కేటాయింపులు లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
సాక్షి, రాజమహేంద్రవరం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వలస వచ్చినా ఇక్కడి ప్రజలు ఆమెను ఆదరించారు. 54.82 శాతం ఓట్లు వేసి, 2,39,139 ఓట్ల మెజార్టీతో పట్టం కట్టారు. ఆమె ద్వారా జిల్లాకు మరిన్ని మంచి రోజులు వస్తాయని, తమ గళం ఢిల్లీ వరకూ వినిపిస్తుందని భావించారు. కానీ, ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. తనపై అంత అభిమానం చూపిన జిల్లా ప్రజల అభ్యున్నతి, అభివృద్ధిపై చిన్నమ్మ కనీస శ్రద్ధ కూడా చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొక్కుబడిగా సమావేశాలకు రావడం, వెళ్లడం తప్ప గోదారోళ్ల గుండె ఘోష తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించకపోవడమే ఇందుకు నిదర్శనమని పలువురు పెదవి విరుస్తున్నారు. స్వయానా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికే నిధులు రాబట్టుకోలేని చిన్నమ్మ నిస్సహాయతను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కనీసం రైల్వే అభివృద్ధికి కూడా పాటు పడిన దాఖలాలు లేకపోవడంతో కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు అలాగే మిగిలిపోయాయి.
ప్రత్యామ్నాయ మార్గం ప్రస్తావనేదీ?
రాష్ట్రంలో రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రతి రోజూ సుమారు 200కు పైగా ప్రయాణికుల, గూడ్సు రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తూంటాయి. మామూలు రోజుల్లో 30 వేల మంది, పండగ సమయాల్లో 40 వేల మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో రాకపోకలు సాగిస్తూంటారు. ఆదాయంలోనూ ఈ స్టేషన్ మేటిగా నిలుస్తోంది. ఏటా రూ.123 కోట్లకు పైగా ఆదాయంతో ఎన్‌ఎస్‌జీ–2 హోదా సొంతం చేసుకుంటోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం బడ్జెట్‌లో నయా పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం.
రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌లు నిత్యం రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉంటాయి. ఈ దృష్ట్యా గోదావరి బ్రిడ్జిల పైన, కొవ్వూరు, ఔటర్‌లోను పలు సందర్భాల్లో రైళ్లను నిలిపివేస్తూ, ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి కడియం నుంచి నిడదవోలు వరకూ ప్రత్యామ్నాయ రైల్వే లైన్ వేయాలనే ప్రతిపాదన ఉంది. తద్వారా గూడ్స్ రైళ్లను అటు మళ్లించడంతో రాజమండ్రి స్టేషన్‌కు ట్రాఫిక్ ఒత్తిడి లేకుండా చేయవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, ఈ రైల్వే లైన్ నిర్మాణ విషయం బడ్జెట్‌లో ప్రస్తావనకు రాలేదు. నిధుల కేటాయింపుపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
గత నిధులనే ఇప్పుడిచ్చినట్లు!
రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.271 కోట్లు కేటాయించారు. పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ప్రస్తుత రైల్వే బడ్జెట్‌లో మరోసారి కేటాయింపులు ఉంటాయని భావించారు. కానీ, గతంలో మంజూరైన నిధులనే కొత్తగా ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చారు. కేంద్రం తెలివితేటలు చూసి, జిల్లా ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.
ఆర్వోబీల ఏర్పాటుపై నీలినీడలు
రైల్వే గేట్ల వద్ద ప్రమాదాలు నివారించాలంటే ఆర్వోబీల నిర్మాణం చేపట్టాలని రైల్వే శాఖ భావించింది. దీనికి గాను 2027 నాటికి గేట్లను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం నగరంలోని అన్నపూర్ణమ్మపేట, కేశవరం, అనపర్తి ఆర్వోబీల ఏర్పాటుకు రైల్వే శాఖ పంపిన ప్రతిపాదనలకు తాజా బడ్జెట్‌లో దిక్కూమొక్కూ లేకుండా పోయింది.
కొవ్వూరు – కొత్తగూడెం రైల్వే లైన్ ఊసే లేదు
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరాన్ని సుమారు 130 కిలోమీటర్ల మేర తగ్గించాలనే ఉద్దేశంతో కొవ్వూరు నుంచి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం వరకూ కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని చాలా కాలం కిందటే ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఇటీవల తిరిగి పట్టాలెక్కినట్టు కనిపించింది. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిగింది. ఈ రైల్వే లైను నిర్మాణం అన్నివిధాలుగా ఉపయోగకరమని నివేదికలు సైతం స్పష్టం చేశాయి. దీనికి ప్రస్తుత బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని భావించినా నిరాశే ఎదురైంది.
పుష్కర నిధులపై స్పష్టత ఏదీ?
గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు రూ.1,286 కోట్లు అవసరమని ప్రజాప్రతినిధులు, అధికారులు లెక్కలు వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరుగుతుందని భావించారు. కానీ, ఎటువంటి ప్రకటనా లేకపోవడంతో అసలు పుష్కరాలకు కేంద్రం తన వాటా ఇస్తుందా, లేదా.. ఇస్తే ఏ మేరకు అనే ప్రశ్న తలెత్తుతోంది. పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమీక్ష నిర్వహించిన ఎంపీ పురందేశ్వరి నిధుల మంజూరుపై దృష్టి సారించలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. అలాగే, రైల్వే సమస్యలపై కూడా ఆమె ఎందుకు శ్రద్ధ చూపలేదని ప్రశ్నిస్తున్నారు.
అమృత్ స్టేషన్ల అభివృద్ధేదీ?
అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా నిడదవోలు జంక్షన్, కొవ్వూరు, రాజమహేంద్రవరం, కడియం, ద్వారపూడి (కోనసీమ జిల్లా), అనపర్తి స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. ప్రకటనలే తప్ప ఈ పనులు నత్తకు మేనత్తలా మారాయి. ప్రస్తుత బడ్జెట్‌లో వీటికి భారీగా నిధులు కేటాయిస్తారని భావించారు. కానీ, నయాపైసా కూడా ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment