రైల్వే బాదుడు?
నిధుల కొరతతో ప్రయాణ చార్జీలు పెంచే యోచన
♦ 5% నుంచి 10% పెరిగే అవకాశం
న్యూఢిల్లీ: ప్రయాణికులకు షాక్ ఇచ్చేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. నిధుల కొరత నేపథ్యంలో ప్రయాణ చార్జీలు పెంచాలని యోచిస్తోంది. రానున్న బడ్జెట్‌లో రైల్వే ప్రయాణికుల చార్జీలను 5 నుంచి 10 శాతం పెంచే అవకాశం ఉంది. ప్రయాణ, సరుకు రవాణా చార్జీల ద్వారా ఏటా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గడం, ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు రూ. 32 వేల కోట్ల అదనపు భారం పడిన నేపథ్యంలో ప్రయాణ చార్జీల పెంపు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు రైల్వే శాఖ వర్గాలు చెపుతున్నాయి.
స్థూల బడ్జెట్ తోడ్పాటు కింద రైల్వేలకు ఇచ్చే నిధుల్లో 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక శాఖ రూ. 8 వేల కోట్ల మేరకు కోత విధించడమూ ఈ ప్రతిపాదనకు ఊతం ఇస్తోంది. అయితే ప్రయాణికుల చార్జీల, సరుకు రవాణా చార్జీల పెంపుతో పాటు పలు ప్రతిపాదనలు ఉన్నాయని, ఇప్పటి వరకూ దేనిపైనా తుది నిర్ణయం తీసుకోలేదని రైల్వే వర్గాలు చెపుతున్నాయి. ప్రయాణ చార్జీలు పెంచాలా లేదా అనేదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపాయి. అయితే బడ్జెట్‌లోనే చార్జీలు పెంచడం తప్పనిసరి కాదని, ఎప్పుడైనా చార్జీలు పెంచొచ్చన్నాయి. అయితే ఈ నెల 25న ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌లో ప్రయాణ చార్జీలు పెంచే అవకాశం ఉందని రైల్ భవన్‌లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.
మార్చిలో వేసవి సీజన్ ప్రారంభం కానుండటంతో ప్రయాణాల జోరు పెరిగే నేపథ్యంలో చార్జీలు పెంచి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నట్టు చెపుతున్నాయి. ప్రస్తుతం ఏసీ తరగతి చార్జీలు, సరుకు రవాణా చార్జీలు ఎక్కువగానే ఉన్నాయి. ఒకవేళ వీటి ధరలు పెంచినట్లయితే స్టీల్, సిమెంట్, కోల్, ముడి ఇనుము, ఎరువుల రవాణా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరి వరకూ ప్రయాణ చార్జీలు, సరుకు రవాణా చార్జీలు కలిపి రైల్వే శాఖ మొత్తం ఆదాయం రూ. 1,36,079.26 కోట్లు. ఇందులో సుమారు 3.77 శాతం తగ్గుదల నమోదైంది. ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తర్వా త 2014లో అన్ని రకాల ప్రయాణ చార్జీలను 14 శాతం పెంచింది. గత ఏడాది మరో పది శాతం పెంచింది.