కొత్త రైల్వే మార్గాల ఊసేలేదు
రాష్ట్రానికి మొత్తం రూ.1,307కోట్ల కేటాయింపులు
‘బి’ కేటగిరిలోని రైల్వేస్టేషన్‌లలో అందుబాటులోకి రానున్న వై-ఫై
బెంగళూరు: కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రానికి వరాల జల్లు కురిపించిన కేంద్ర రైల్వేశాఖ ప్రస్తుతం మోడు పోయింది. రాష్ట్రానికి చెందిన పలువురు కేంద్ర రైల్వే శాఖ మంత్రులుగా ఉన్న నేపథ్యంలో పలు పథకాలను అప్పట్లో తీసుకువచ్చారు. ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ రాష్ట్రానికి ఎలాంటి కొత్త రైళ్ల ప్రకటన లేకుండానే సాగిపోయింది. చాలా కాలంగా రాష్ట్ర వాసులు డిమాండ్ చేస్తున్న వివిధ రైలు మార్గాలతో పాటు గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తూ వస్తున్న ‘బెంగళూరు సబర్బన్’ రైలుకు సంబంధించి కూడా బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన లభించక పోవడం కన్నడిగుల్లో కాస్తంత నిరాశనే కలిగించిందని చెప్పవచ్చు. ఇక ఈ బడ్జెట్‌లో రాష్ట్రంలోని రైల్వే పధకాలు, రైల్వే స్టేషన్‌ల ఆధునికీకరణ తదితర పనుల కోసం మొత్తం రూ.1,307 కోట్లను కేటాయించారు. కాగా ఇందులో వివిధ రైల్వేలైన్ల పనుల కోసం మొత్తం రూ.195 కోట్లను రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు కేటాయించారు. ఇందులో కడూరు-చిక్కమగళూరు మార్గానికి రూ.10కోట్లు, హాసన-బెంగళూరు మార్గానికి రూ.55కోట్లు, బెంగళూరు-సత్యమంగళ(రూ.10కోట్లు), హుబ్లి-అంకోళా(రూ.22కోట్లు), రాయదుర్గ-తుమకూరు(రూ.15కోట్లు), బాగల్‌కోట-కొడచి(రూ.45కోట్లు), కుట్టూరు-హరిహర(రూ.10కోట్లు), తుమకూరు-చిత్రదుర్గ-దావణగెరె(రూ.14కోట్లు)తో పాటు మరికొన్ని మార్గాలకు సంబంధించిన పనులకు, లైన్‌ల ఆధునికీకరణకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు.
అయితే ఆయా రైల్వే మార్గాలను పూర్తి చేయడంతో పాటు వాటి ఆధునికీరణకు ఈ నిధులు ఎంత మాత్రం సరిపోవని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఇక రైల్వే స్టేషన్‌లలో వై-ఫై సౌకర్యాన్ని ‘బి’ కేటగిరీ స్టేషన్‌లకు సైతం విస్తరిస్తామన్న సురేష్‌ప్రభు ప్రకటనతో రాష్ట్రంలోని 15 రైల్వేస్టేషన్‌లలో ప్రయాణికులకు వై-ఫై సౌకర్యం అందుబాటులోకి రానుంది. బెంగళూరు, మైసూరు, హుబ్లీ డివిజన్‌లలోని 15 రైల్వేస్టేషన్‌లు ఆధునికతను సంతరించుకొని వై-ఫై సౌకర్యాన్ని ప్రజలకు అందించనున్నాయి. వీటిలో బాగల్‌కోటె, గదగ్, కొప్పాళ, లోండా, తోరణగళ్లు, బానసవాడి, మండ్య, తుమకూరు, యలహంక, అరసికెరె, భద్రావతి, బీరూరు, హరిహర, హావేరి, హాసన రైల్వేస్టేషన్‌లలో ప్రయాణికులకు ఉచిత వై-ఫై సౌకర్యం అందుబాటులోకి రానుంది. వీటితో పాటు మొత్తం 34 రైల్వేస్టేషన్‌లలో విడతల వారీగా వై-ఫై సౌకర్యం ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
బెంగళూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.2కోట్లు.... ఇక బెంగళూరులోని సిటీ రైల్వేస్టేషన్‌లో మౌళిక సదుపాయాల కల్పన కోసం ఈ బడ్జెట్‌లో రూ.2కోట్లను కేటాయించారు. ఎంపీ నిధుల నుంచి ఈ మొత్తాన్ని కేటాయించినట్లు సురేష్ ప్రభు తెలిపారు. బెంగళూరు సెంట్రల్ ఎంపీ పి.సి.మోహన్ తన ఎంపీ నిధుల నుంచి ఈ మొత్తాన్ని రైల్వేస్టేషన్‌లో మౌళిక సదుపాయాల కల్పన కోసం అందజేశారు. ఈ నిధులతో బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీరు, బయో టాయిలెట్, పార్కింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
సిగ్నల్ పడింది
Published Fri, Feb 27 2015 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM
Advertisement
Advertisement