రైల్వే బడ్జెట్‌లో సౌకర్యాలకే పెద్దపీట!
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తాను ప్రవేశపెట్టనున్న తొలి రైల్వే బడ్జెట్‌లో ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తోంది. మెరుగైన సదుపాయాలు, ప్రతి బోగీలోనూ పారిశుధ్య సిబ్బందితో కూడిన కొత్త డిజైన్ బోగీలను 2014-15 బడ్జెట్‌లో ప్రతిపాదించనుంది. ఈ నెల 8వ తేదీన రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రైలు బోగీలను నిరంతరం శుభ్రంచేయటానికి, రైల్వే స్టేషన్లను శుభ్రంగా ఉంచటానికి, చర్యలు ప్రకటించనుంది. బోగీల్లో అంతర్గత సదుపాయాలను మరింతగా మెరుగుపరుస్తూ పైలట్ ప్రాజెక్టుగా 12 బోగీలను తయారు చేయనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన సదుపాయాలతో కూడిన 25 ఏసీ, నాన్-ఏసీ బోగీలతో ఒక రైలును ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. అలాగే రైలు బోగీల్లో రంగులను సమీక్షించటం కోసం ప్రొఫెషనల్ సంస్థలను రంగంలోకి దించాలని నిర్ణయించినట్లు తెలిసిం ది. ఈ ఏడాది కొత్తగా 4,000 బోగీలను తయారు చేయాలని రైల్వేశాఖ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ప్రయాణికుల భద్రత, రక్షణ కోసం రైల్వేమంత్రి సదానందగౌడ చర్యలు ప్రకటించవచ్చని తెలుస్తోంది.