రైల్వే బడ్జెట్ వల్ల ఉపయోగం శూన్యం
విజయనగరం ఫూల్‌బాగ్ : రైల్వే బడ్జెట్ వల్ల రాష్ట్రానికి గాని జిల్లాకు గాని ఒరిగిందేమీ లేదని అఖిల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ. జగన్మోహనరావు అన్నారు. బడ్జెట్‌కు నిరసనగా బుధవారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించి ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైల్వేలో దేశ వ్యాప్తంగా 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా కేవలం 4 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామనడం అన్యాయమన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన మోడీ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు.
జిల్లా నుంచి హైదరాబాద్, విజయవాడ, తదితర ప్రాంతాలకు నేరుగా ఒక్క ట్రైన్ కూడా లేదన్నారు. ఈ ప్రాంతం నుంచి నిత్యం కూలీలు ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారని, వారిని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రం నుంచి ట్రైన్ వేయాలని పలుమార్లు కోరినా ఫలితం లేకపోయిందన్నా రు. ప్రతి ఆరు నెలలకొకసారి రైల్వే చార్జీలు పెం చేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారని, దీనివల్ల ఎప్పటికప్పుడు ప్రజలపై భారం పడుతుందని చెప్పారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం రైల్వే శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకులు త్రినాథ్, శ్రీరామ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.గణేష్, సరేష్, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్రకు మొండిచేయి
విజయనగరం ఫూల్‌బాగ్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి అన్నారు. స్థానిక బాలగంగాధరరావు భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బడ్జెట్ వల్ల ప్రజలపై భారం పడిందన్నారు. కనీసం జిల్లా నుంచి ఒక్క రైలు కూడా కొత్తగా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ దేశ, విదేశాల్లోని పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని విమర్శించారు. రైళ్లు నడిపే విభాగం మినహా మిగతా విభాగాలన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, ఇది ఎంతమత్రం మంచిది కాదన్నారు. ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉందని, దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఉత్తరాంధ్రకు ఎటువంటి ప్రాజెక్టులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. వీక్లీ ట్రైన్స్ (నాగావళి, బిలాస్‌పూర్, సమత, యశ్వంత్‌పూర్, తిరుపతి)ను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.