స్వీటు ఆశిస్తే.. నోటిపై జెల్ల
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఢిల్లీలో పాలకులు మారినా, జిల్లాలో ప్రజా ప్రతినిధులు మారినా..కథ మారలేదు. ఈ గడ్డ అభివృద్ధికి దోహదపడే రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి మళ్లీ నిరాశ తప్పలేదు. మంగళవారం సదానందగౌడ్ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ కూడా పాతపంథాలోనే జిల్లావాసుల ఆశలకు పూచికపుల్ల విలువనివ్వలేదు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసే ప్రతి నేతా రైల్వే ప్రాజెక్టులను సాధిస్తామని ఎన్నికల్లో..‘బొగ్గు ఇంజన్ కూత’లా బిగ్గరగా వాగ్దానం చేస్తుంటారు. తీరా ఎన్నికయ్యాక.. తమ హయాంలో ప్రవేశపెట్టే ఏ రైల్వేబడ్జెట్‌లోనూ జిల్లావాసుల కలలు సాకారమయ్యేందుకు కించిత్తు కృషి చేయకుండానే పదవీకాలం ముగించేస్తున్నారు. యూపీఏ-2 సర్కారు పోయి, ఎన్డీయే ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. జిల్లా నుంచి ముగ్గురు ఎంపీలుగా ఆ కూటమిలో భాగస్వామియైన తెలుగుదేశం వారే ఎన్నికయ్యారు. అయినా రైల్వే బడ్జెట్ షరామామూలుగానే జిల్లావాసుల ఆశలను.. తాయిలం కోసం ఎదురు చూసిన పిల్లల నోటిపై గుద్దినట్టు.. చిత్తు చేసింది. పెండింగ్‌లో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టునూ సాధించ లేకపోయిన ఎంపీలు పార్లమెంటు సమావేశాల అనంతరం జిల్లాకు ఏ ముఖం పెట్టుకుని వస్తారని వారు మండిపడుతున్నారు.
వారూ వీరూ.. ఒకటే తీరు
సార్వత్రిక ఎన్నికల ముందు రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రాన్ని ఒప్పించి సాధిస్తామన్న ముగ్గురు ఎంపీలు తోట నరసింహం, మురళీమోహన్, పండుల రవీంద్రబాబు ఏమీ సాధించలేక చేతులెత్తేశారు. మంగళవారం రైల్వే మంత్రి సదానందగౌడ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు మొండిచేయి చూపడంతోనే వారి వైఫల్యం తేటతెల్లమైంది. తొలి ప్రాధాన్యం పిఠాపురం-కాకినాడ మెయిన్ రైల్వేలైన్ అని కాకినాడ ఎంపీ తోట ఎన్నికల సందర్భంగా పలు చోట్ల చెప్పారు. ఇదివరకు ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎంఎం పళ్లంరాజు ఒకసారి మెయిన్ లైన్ వద్దని, మరోసారి అవసరమని పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేశారే తప్ప ప్రాజెక్టు సాధించలేకపోయారు. కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్ సాధనే తన లక్ష్యమని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన అమలాపురం ఎంపీ రవీంద్రబాబు ఎన్నికల్లో జనాన్ని నమ్మించారు.
ఇదివరకు ఇదే ప్రాజెక్టు కోసం గంభీరోపన్యాసాలు చేసిన అప్పటి ఎంపీ హర్షకుమార్ కూడా ఇదే రకంగా ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ఇప్పుడు రవీంద్రబాబు కూడా నిధుల సాధనలో విఫలమయ్యారు. దక్షిణ మధ్య రైల్వేకు రూ.900 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించిపెడుతున్న జిల్లా పట్ల ఈసారి రైల్వేబడ్జెట్‌లో కూడా వివక్షనే చూపడంపై జిల్లావాసులు, మేధావి వర్గ ప్రతినిధులు నిప్పులు చెరుగుతున్నారు. గత దశాబ్దంగా యూపీఎ- 1, 2 సర్కార్ల హయాంలో ఏటా రైల్వే బడ్జెట్‌లలో మొండిచేయే ఎదురైంది. గత ఫిబ్రవరి 12న అప్పటి రైల్వేమంత్రి మల్లిఖార్జునఖార్గే ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్‌లో జిల్లా మీదుగా కొత్తగా సికింద్రాబాద్-విశాఖపట్నం ఏసీ ఎక్స్‌ప్రెస్ మినహా ఒరిగిందేమీ లేదు. ఎన్డీఏ సర్కారైనా జిల్లాకు సముచిత ప్రాతినిధ్యం ఇస్తుందని ఆశిస్తే..‘దొందూ దొందే’ అన్నట్టు యూపీఏలాగే జిల్లాకు జెల్ల కొట్టింది.
అన్ని డిమాండ్లపైనా చిన్నచూపే..
జిల్లా కేంద్రం కాకినాడను మెయిన్‌లైన్‌కు అనుసంధానించాలన్నది దశాబ్దాల కల సాకారం కావాలంటే కాకినాడ-పిఠాపురంల మధ్య 21 కిలోమీటర్ల బ్రాడ్‌గ్రేజ్ లైన్ వేయాలి. రూ.126 కోట్ల అంచనాతో కూడిన ఈ ప్రాజెక్టు ఈసారి కూడా పట్టాలెక్కలేదు. ఆ దిశగా లోక్‌సభలో టీడీపీ పక్షనేత, కాకినాడ ఎంపీ తోట చేసిన ప్రయత్నం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. లోక్‌సభ దివంగత స్పీకర్ బాలయోగి కృషితో 2000లో పునాదిరాయి పడిన కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌కి ఈసారి కదలిక ఉంటుందని కోనసీమ వాసులు ఆశించగా ఈ బడ్జెట్‌లోనూ వెక్కిరింతే మిగిలింది. 55 కిలోమీటర్ల ఈ లైన్ నిర్మాణ వ్యయం ఏటా పెరుగుతూ ఇప్పుడు రూ.1100 కోట్లకు చేరింది.
భూ సేకరణ పూర్తయిన ఈ ప్రాజెక్టుకు ఇంతవరకు రూ.70 కోట్లు మాత్రమే కేటాయించారు. నిర్మాణవ్యయంలో 25 శాతం ఇచ్చేందుకు దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చినా కేంద్రం పట్టించుకోలేదు. ఈ రెండు ప్రధాన డిమాండ్‌లతో పాటు 2012 బడ్జెట్‌లో ఆమోదం తెలిపిన కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ సర్వేను సైతం ఈ బడ్జెట్‌లో గాలికొదిలేశారు. కాకినాడ నుంచి ఢిల్లీ, కోల్‌కతా, వారణాసిలకు కొత్త రైళ్లు, కాకినాడ రాజమండ్రిల మీదుగా హైదరాబాద్, తిరుపతిలకు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, పుదుచ్చేరి వరకు సర్కార్ ఎక్స్‌ప్రెస్ పొడిగింపు డిమాండ్లు కాగితాలకే పరిమితమయ్యాయి. చెన్నై నుంచి విశాఖకు వారానికి ఒకసారి ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన రైలు జిల్లా మీదుగా వెళ్లడం మినహా సదానందగౌడ బడ్జెట్‌తో జిల్లాకు ఒరిగిందేమీ లేదు.