మళ్లీ నిరాశపరిచిన రైల్వే బడ్జెట్
రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు ఎప్పటిలాగే నిరాశే ఎదురైంది. 2014-15 బడ్జెట్‌ను పార్లమెంటులో మంగళవారం ప్రవేశపెట్టిన రైల్వే మంత్రి సదానంద గౌడ జిల్లా వాసులను నిరాశపరిచారు. ఏళ్ల నాటి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు మోక్షం కలగలేదు. గత ఏడాది బడ్జెట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే ఒక్క రైలు ప్రవేశపెట్టి చేతులు దులుపుకోగా, అదే బాటలో పయనించిన ప్రస్తుత మోడీసర్కారు ఒకే ఒక్క వీక్లీ రైలుతో సరిపెట్టేసింది. జిల్లా వాసుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో విశాఖను ప్రత్యేక జోన్‌గా కేటాయించేందుకు ఎంపీలు ఇచ్చిన ప్రతిపాదన విషయాన్ని కనీసం ప్రస్తావించలేదు. ప్రైవేటీకరణే ధ్యేయంగా ప్రతి అంశాన్ని ముడిపెడుతూ ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ ప్రత్యేక కార్యాచరణకు దిగారు. పాత వాటి ఊసులేదు... కొత్తవాటికి గ్రీన్ సిగ్నల్ లేదు. ఒక్క వీక్లీ రైలుతో జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదు.
విజయనగరం టౌన్ : కేంద్రంలో మోడీ సర్కారు ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు మొండిచేయి చూపించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా జిల్లాలో ఉన్న సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉండిపోయాయి. లాభార్జనే ధ్యేయంగా రైల్వే మంత్రి సదానంద గౌడ తన బడ్జెట్‌ను రూపకల్పన చేశారు. విశాఖ రైల్వేజోన్ అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు. పారదీప్ నుంచి విశాఖ వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్ రైలును మాత్రం వారంలో ఒకరోజు వచ్చేలా ఏర్పాటుచేశారు. ఇది తప్ప జిల్లాకు ఉపయోగపడే మరో అంశం ఏదీ బడ్జెట్‌లో లేదు. అన్ని ప్రధాన రైల్వేస్టేషన్‌లలో సీనియర్ సిటిజన్లకు బ్యాటరీ కార్లు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా గమ్యం చేరుకోబోయే ముందు ప్రయాణికులకు అలర్ట్ వేకప్ కాల్స్ సదుపాయం, అన్ని రైళ్లల్లో ఇంటర్‌నెట్ వైఫే సౌకర్యం, పార్కింగ్ కమ్ ఫ్లాట్ ఫామ్ టికెట్లను ఒకే దాంట్లో ఇవ్వడం, ప్రయాణికులకు పోస్టల్, నెట్ తదితర వాటి ద్వారా అన్నిరకాల రైల్వే సౌకర్యాలు కల్పించడం చేశారు. అయితే చాలా ఏళ్ల నుంచి జిల్లా ఎంపీలు యత్నిస్తున్నా అంశాలలో ఏ ఒక్కటీ సాఫల్యం కాలేదు. గత బడ్జెట్‌లో కూడా విశాఖ -గుణుపూరు పాసింజర్ రైలు తప్పితే మనకేదీ దక్కలేదు.
పట్టాలెక్కని హామీలివే....
ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో విశాఖను ప్రత్యేక జోన్‌గా చేయాలన్న ఆశ అడియాశగానే మిగిలింది.
విజయనగరం నుంచి రాజాం మీదుగా పలాసకు ప్రత్యేక రైల్వే లైను, బొబ్బిలి రైల్వే స్టేషన్ ఆధునీకరణ ఊసేలేదు. విజయనగరం రైల్వే స్టేషన్‌లో అవుట్ పేషెంట్ విభాగం, వ్యాధి నిర్ధారణ కేంద్రం తదితరవన్నీ గతంలో పేర్కొన్నవే. అయితే వీటిలో దేనికీ ప్రత్యేకించి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. ఇక ఏళ్ల నాటి డిమాండ్‌లైన పలాస-విశాఖ రైలు, సాధారణ బోగీలతో విశాఖ నుంచి హౌరా ఎక్స్‌ప్రెస్‌ను నడపాలన్నది అలాగే ఉండిపోయింది.
సుమారు రూ.కోటీ 55 లక్షలతో విజయనగరంలో నిర్మించిన రైల్వే మామిడి యార్డ్‌కు ప్రత్యేక లైన్ ఏర్పాటు డిమాండ్ నెరవేరలేదు. ఇక రూ.10 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూరుస్తున్న గూడ్స్ షెడ్ అభివృద్ధి కూడా ఏళ్ల నాటి డిమాండ్ జాబితాలో చేరిపోయింది. ‘లోకో మోటివ్ షెడ్(రైలు బయలుదేరు ప్రదేశం)’పరిస్థితి కూడా ఒక డిమాండ్‌గానే మిగిలిపోయింది.
విజయనగరం రైల్వే స్టేషన్‌లో 5వ ప్లాట్‌ఫామ్ నుంచి చివరి ప్లాట్‌ఫామ్ వరకు ఫుట్‌ఓవర్ బ్రిడ్జిను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించలేదు. ఈ బ్రిడ్జి పనులు పిల్లర్ల స్థాయితో అర్ధాంతరంగా ఆగిపోయాయి. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్ధం విజయనగరం రైల్వేస్టేషన్‌లో చివరి వరకూ షెల్టర్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ఆ పనులు కూడా నెరవేరలేదు. విజయగనం పట్టణంలో వీటీ అగ్రహారం బీసీ కాలనీ వద్ద రైల్వే గేట్ ఏర్పాటుచేయాలన్న వినతులను పట్టించుకోలేదు.