ఊరించి.. ఉసూరుమనిపించారు | district people disappointed in railway budget | Sakshi
Sakshi News home page

ఊరించి.. ఉసూరుమనిపించారు

Published Wed, Jul 9 2014 4:58 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

ఊరించి.. ఉసూరుమనిపించారు

ఊరించి.. ఉసూరుమనిపించారు

- రైల్వే బడ్జెట్లో జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిన సదానందగౌడ
- కడప-బెంగళూరు రైలు మార్గానికి ఒక్క పైసా విదల్చని దుస్థితి
- జిల్లాలో రైల్వేజోన్, డివిజన్ ఏర్పాటుపై నోరుమెదపని గౌడ
- తిరుపతికి ఒక్క కొత్త సర్వీసును కూడా మంజూరు చేయలేదు
- అన్యాయంపై సీఎం చంద్రబాబు స్పందించకపోవడంపై ప్రజాగ్రహం

 సాక్షి ప్రతినిధి, తిరుపతి : రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ జిల్లా ప్రజానీకాన్ని ఊరించి ఉసూరుమనిపించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ఊపిరిలూదే బెంగుళూరు-కడప, శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గాల కు ఒక్క పైసా నిధులను కూడా కేటాయించలే దు. చిత్తూరు-పలమనేరు-కుప్పం రైలుమార్గం ఊసే బడ్జెట్లో కనిపించలేదు. రైలు మార్గాల మా ట దేవుడెరుగు.. కనీసం కొత్త రైలు సర్వీసులను కూడా జిల్లాకు మంజూరు చేయలేదు. రైల్వే బడ్జెట్ చరిత్రలో ఎన్నడూ లేనిరీతిలో ఈ ఏడాది జిల్లాకు అన్యాయం జరిగినా ఏ ఒక్క టీడీపీ ప్రజాప్రతినిధి కూడా నోరుమెదపకపోవడంపై జనం నివ్వెరపోతున్నారు. వివరాల్లోకి వెళితే..
 
2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి రైల్వే బడ్జెట్‌ను మంత్రి సదానందగౌడ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వం కొలువుదీరాక ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో ఈ ఏడాది రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రధానంగా జిల్లాకు రైల్వే బడ్జెట్లో పెద్దపీట వేస్తారని ప్రగల్భాలు పలికారు. శ్రీకాళహస్తి-నడికుడి, బెంగళూరు-కడప రైలు మార్గాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు భారీ ఎత్తున నిధులు మంజూరు చేస్తారని చెప్పుకొచ్చారు. చిత్తూరు నుంచి పలమనేరు మీదుగా కుప్పం వరకూ కొత్త రైలుమార్గం నిర్మాణానికి సైతం రైల్వేశాఖ ఆమోదముద్ర వేస్తుందని బీరాలు పలికారు.

ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి నుంచి దేశంలోని ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలకు కొత్త రైలు సర్వీసులు మంజూరు చేస్తారని స్పష్టీకరించారు. చంద్రబాబు చెప్పిన వాటిల్లో ఒక్కటి కూడా మంగళవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ప్రకటించలేదు.
 
పూర్తయ్యేదెన్నడో..
కడప-మదనపల్లె-బెంగళూరు రైలుమార్గాన్ని 2009-10 బడ్జెట్లో రైల్వేశాఖ మంజూరు చేసింది. రూ.రెండు వేల కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును రైల్వే, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలని నిర్ణయించారు.
 ఈ ప్రాజెక్టుకు 2009-10 బడ్జెట్లో రైల్వేశాఖ రూ.40 కోట్లు కేటాయించింది. అప్పట్లో వైఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.40 కోట్లను కేటాయించడంతో రూ.80 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి.

2010-11 బడ్జెట్లో రూ.56 కోట్లు, 2011-12 బడ్జెట్లో రూ.60 కోట్లను రైల్వేశాఖ కేటాయించింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయలేదు. 259 కి.మీల పొడవున ఈ రైలుమార్గం నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతం 21 కి.మీ. పొడవున చేపట్టిన రైలు మార్గం పనులు కూడా నిలిచిపోయాయి. 2013-14 బడ్జెట్లో గానీ.. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోగానీ ఈ రైలు మార్గానికి ఒక్క పైసా నిధులను కేటాయించలేదు.

ఇప్పుడు మంత్రి సదానందగౌడ కూడా ఈ రైలుమార్గానికి ఒక్క పైసా కూడా విదల్చలేదు. ఒప్పందం ప్రకారం ఈ రైలుమార్గం 2015 నాటికి పూర్తికావాలి. నిధుల కేటాయింపు ఇలానే ఉంటే.. ఈ రైలుమార్గం పూర్తికావాలంటే కనీసం రెండున్నర దశాబ్దాలు పట్టే అవకాశం ఉంది. ఇక శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలని 2009-10 బడ్జెట్లో నిర్ణయించాయి.

రూ.1314 కోట్ల వ్యయంతో 309 కి.మీ. ల పొడవున ఈ రైలుమార్గం నిర్మించడానికి ప్రణాళిక రూపొం దించారు. ఈ రైలు మార్గానికి 2013-14 బడ్జెట్లో కేవలం రూ.కోటి మాత్రమే కేటాయించారు. ఆ నిధులు సర్వేకు కూడా సరి పోవు. ఈ ఏడాది బడ్జెట్లో ఆ రైలు మార్గానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అంటే.. ఈ రైలుమార్గం మరుగునపడినట్లే లెక్క!! చంద్రబాబు వల్లెవేసిన చిత్తూరు-పలమనేరు-కుప్పం రైలుమార్గం ఊసే బడ్జెట్లో కన్పించకపోవడం గమనార్హం.
 
కొత్త రైళ్లు ఏవీ..?
రైలుమార్గానికి నిధుల విషయంలోనే కాదు.. కనీసం కొత్త రైల్వే సర్వీసులను మంజూరు చేయడంలోనూ మంత్రి సదానందగౌడ జిల్లాకు తీరని అన్యాయం చేశారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి నుంచి దేశంలోని ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలకు కొత్త రైళ్లను మంజూరు చేస్తారనే భావనను సదానందగౌడ తుంచేశారు. తిరుపతి-వారణాసి, తిరుపతి-షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాగితాలకే పరిమితమయ్యాయి.రేణిగుంటలోని కోచ్ రిపేర్ వర్క్ షాప్ సామర్థ్యాన్ని విస్తరించడంపై కూడా రైల్వే బడ్జెట్లో స్పష్టత లేదు.

జిల్లాకే కాదు.. రాష్ట్రానికి అదే రీతిలో అన్యాయం జరిగింది. ఇంత అన్యాయం జరిగినా సీఎం చంద్రబాబుగానీ.. టీడీపీ ప్రజాప్రతినిధులుగానీ నోరుమెదపకపోవడం గమనార్హం. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు రైల్వే బడ్జెట్లలో రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూశానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. ఇప్పుడు చేతులెత్తేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
ఎఫ్‌డీఐల చాటున ప్రైవేటీకరణ
రైల్వే మంత్రి సదానందగౌడ రైల్వేల్లో ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తున్న ట్లు చెప్పడం వెనుక రైల్వే ప్రైవేటీకరణ దాగి ఉంది. అయితే రైల్వే ఆపరేషనల్ విభాగంలో ఎఫ్‌డీఐలను మినహాయిస్తున్నట్లు చెప్పి నా రైల్వే ప్రైవేటీకరణకు ఇది శ్రీకారం చుట్టినట్టే. ఈ అంశాన్ని ఉపసంహరించుకోకుంటే దేశవ్యాప్త ఆందోళనలు చేస్తాం.
 - కుప్పాల గిరిధర్‌కుమార్, రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ సెక్రటరీ
 
సీఎం సొంత జిల్లా అంటే లెక్కలేదా..?
రైల్వే బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు చూస్తే సీఎం జిల్లా అంటే కేంద్రానికి లెక్క లేనట్లుంది. కనీసం తిరుపతి, చిత్తూరును పరిగణనలోకి కూడా తీసుకోకుండా బడ్జెట్ ప్రకటన చేయడాన్ని సీఎం కూడా సీరియస్‌గా భావించి మార్పులు చేయించాలి. సీఆర్‌ఎస్ అభివృద్ధి ఊసే ఎత్తకపోవడం బాధాకరం.
 - కారుమంచి రాజు, జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రైల్వే ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ సంఘం
 
పెండింగ్ ప్రాజెక్ట్‌లకు కమిటీ నాన్చుడుకే..
విభజన జరిగాక ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్‌లపై ప్రత్యేక కమిటీని వేస్తున్నట్లు చెప్పడం నాన్చుడు ధోరణికే అని సామాన్యునికి కూడా అర్థమయింది. నిధులు, కొత్త రైళ్ల కేటాయింపులో తిరుపతికి ప్రతిసారీ అన్యాయమే జరుగుతోంది. దీన్ని రాష్ట్ర ఎంపీలు తీవ్రంగా పరిగణించాలి.
 - సుదర్శన్ రాజు, రైల్వే మజ్దూర్ యూనియన్ సెక్రటరీ
 
 దేశ సమగ్రత అంటే ఇదేనా?
 ఎన్నికలకు ముందు దేశ సమగ్రత అంటూ గొప్పలు చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో రైల్వే మంత్రి ప్రకటించిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రిక్తహస్తం చూప్పారు. ఇదేనా సమగ్రత అంటే? రాయలసీమకు రైల్వే జోనల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారనుకుంటే మొండిచేయి చూపారు. పీపీపీ విధానంతో ఉద్యోగులను సాగనంపడానికే ప్రాధాన్యం ఇచ్చారు.
 - గుండ్లూరు వెంకటరమణ, కాంగ్రెస్ జిల్లా నాయకుడు
 
 కొత్త సీసాలో పాత సారా..
 బీజేపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన రైల్వే బడ్జెట్‌ను పరిశీలిస్తే కొత్త సీసాలో పాత సారా పోసినట్లే ఉంది. గతంలో రైల్వే ఉద్యోగుల కోసం కనీసం కొద్దోగొప్పో కొన్ని పథకాలైనా ప్రకటించారు. ఈ సారి అది కూడా లేకపోగా, గుంతకల్ డివిజన్‌కే బీజేపీ ప్రభుత్వం మొండిచేయి చూపింది.
 - కే.కళాధర్, గుంతకల్ డివిజన్ ఆర్‌ఎంయూ కార్యదర్శి
 
 మహిళా రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి
 రైల్వేలో మహిళా ప్రయాణికుల రక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ దిశగా భద్రతా చర్యలను పటిష్టం చేసేందుకు ఏర్పాటు చేస్తామన్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుళ్లను తక్షణం నియమించాలి.
 - ఎన్.విజయలక్ష్మి, టీడీపీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు
 
 చంద్రబాబు ఇప్పుడేం చెబుతారు

 కాంగ్రెస్ హయాంలో నేను రైల్వే ప్యాసింజర్స్ అమినిటీస్ కమిటీ(పీఏసీ) సభ్యునిగా ఉన్నప్పుడే తిరుపతికి డబుల్ డెక్కర్ రైలును మంజూరు చేయించా. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు, సొంత జిల్లాకు రైల్వేలో ప్రాధాన్యం ఇప్పించుకోకపోవడంపై ప్రజలకు ఇప్పుడేం చెబుతారు? ఇది రాష్ట్ర ప్రజలకు అవమానం.
 - మబ్బు దేవనారాయణ రెడ్డి, మాజీ రైల్వే పీఏసీ సభ్యుడు
 
 అరచేతిలో వైకుంఠం చూపింది
 బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి, ఇప్పుడు ప్రతి అంశంలో మోసం చేస్తోంది. ధరల బాదుడుకు బీజేపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎన్నికల అనంతరం బీజేపీ అసలు రంగు బయట పడుతోంది.
 - బట్టు రామారావు,ఆర్టీసీ ఎన్‌ఎంయూ జిల్లా అధికార ప్రతినిధి
 
 చేతగానితనం
 చంద్రబాబు ప్రభుత్వం చేతగానితనానికి ఇదే నిదర్శనం. రైల్వే బడ్జెట్ రూపకల్పన సమయంలో చంద్రబాబు సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేసింది. అప్పట్లో ప్రతి పాదనలు పంపకుండా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మూడురోజుల ముందు హడావుడిగా ప్రతిపాదనలు పంపింది. నెల రోజుల ముందే వైఎస్సార్‌సీపీ ఎంపీలు రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం చేయాలని ప్రతిపాదనలు ఇచ్చాం. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం మేల్కొని ఉంటే రాష్ట్రానికి.. మన జిల్లాకు ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదు. కొత్త రైలు మార్గాల నిర్మాణానికి సమన్వయ కమిటీని నియమించడం కేవలం కాలయాపన చేయడం కోసమే. ఇంత అన్యాయం జరిగినా టీడీపీ ప్రజాప్రతినిధులు నోరుమెదకపోవడంలో ఆంతర్యమేమిటో..?
 - పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎంపీ, రాజంపేట
 
 ఇదెక్కడి చోద్యం..?
 రైల్వే బడ్జెట్లో రాష్ట్రంతోపాటూ జిల్లాకు న్యాయం చేయాలని నెల కిత్రం వైఎస్సార్‌సీపీ ఎంపీలు అందరూ కలిసి మంత్రి సదానందగౌడ, ఆ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందించాం. న్యాయం చేయకపోతే ఉద్యమిస్తామని స్పష్టం చేశాం. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం స్పందించి ఉంటే.. రాష్ట్రానికి, మన జిల్లాకు ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదు. ఇప్పుడైనా చంద్రబాబు స్పందిస్తున్నారా అంటే అదీ లేదు. చంద్రబాబు బీరాలు పలకడానికి తప్ప దేనికీ పనికిరాడన్నది మరోసారి స్పష్టమైంది. శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గానికి నిధులు, రేణిగుంట సీఆర్‌ఎస్ విస్తరణ, తిరుపతి నుంచి ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు మంజూరు చేసే వరకూ మడమ తిప్పకుండా పోరాటం చేస్తాం.
 - వరప్రసాద్, ఎంపీ, తిరుపతి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement