
న్యూఢిల్లీ: దేశీయంగా వ్యాపారాల నిర్వహణను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ తెలిపారు. ఇందులో భాగంగా ఫార్మా రంగానికి అనేకానేక నిబంధనల పాటింపు భారాన్ని తగ్గించడంపై కసరత్తు చేస్తోందని వివరించారు. ’ది ఇండియా ఫార్మా 2021, ఇండియా మెడికల్ డివైజ్ 2021’ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ‘2030 నాటికి 130 బిలియన్ డాలర్ల టర్నోవరు లక్ష్య సాధనకు అవసరమైన సామర్థ్యాలు దేశీ ఫార్మా పరిశ్రమకు పుష్కలంగా ఉన్నాయి. అలాగే, 2025 నాటికి వైద్య పరికరాల పరిశ్రమ 50 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందగలదు‘ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో సంస్కరణలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఫార్మా రంగంపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ సందర్భంగా తెలిపారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 145వ స్థానం నుంచి 79వ స్థానానికి వచ్చాం. ఫార్మాలోనూ మన ర్యాంకింగ్ మెరుగుపడి 63వ స్థానానికి చేరాము. సంస్కరణల అమలుకు ఇదే నిదర్శనం‘ అని ఆయన పేర్కొన్నారు.
అందుబాటు ధరల్లో ఔషధాలు అందించాలి ..
వృద్ధి సాధనతో పాటు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఔషధాలను అందించే ఉన్నత లక్ష్యాలకు కూడా పరిశ్రమ కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నట్లు గౌడ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఫార్మా రంగానికి ఇప్పటికే రూ. 6,564 కోట్ల ప్రోత్సాహకాలిచ్చే ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసిందని, అలాగే మరో రూ. 15,000 కోట్ల మద్దతుతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) స్కీమును కూడా ఆమోదించిందని ఆయన చెప్పారు. తయారీ రంగ సంస్థలు అంతర్జాతీయ దిగ్గజాలుగా ఎదిగేందుకు తోడ్పాటు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని గౌడ పేర్కొన్నారు. బయోఫార్మా, సంక్లిష్టమైన జనరిక్ ఔషధాలు వంటి స్పెషలైజ్డ్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన సామర్థ్యాలను దేశీయంగా రూపొందించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని వివరించారు. స్వావలంబన భారత్ నినాదంలో భాగంగా రూ. 3,400 కోట్లతో బల్క్ డ్రగ్, మెడికల్ డివైజ్ పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
అనుమతులు సులభతరం చేయాలి ..
నియంత్రణ వ్యవస్థ విధానాలను మరింత సరళతరం చేయాలని .. ముఖ్యంగా ఔషధాలకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని జైడస్ గ్రూప్ చైర్మన్, ఫిక్కీ ఫార్మా కమిటీ మెంటార్ పంకజ్ ఆర్ పటేల్ కోరారు. కొత్తగా ట్యాక్స్ రీఫండ్ స్కీమును ప్రవేశపెట్టాలని కోరారు. వివిధ శాఖలు, విభాగాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫార్మా రంగ అవసరాలన్నింటి కోసం ఒకే శాఖ, ఒకే డిపార్ట్‌మెంటు విధానాన్ని అమలు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment