
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధికి సంబంధించిన చెల్లింపులను స్వీకరించేందుకు కొత్తగా మరో 15 బ్యాంకులను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) తమ ప్యానెల్‌లో చేర్చింది. దీంతో మొత్తం బ్యాంకుల నెట్‌వర్క్ 32కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సమక్షంలో ఈపీఎఫ్‌వో, ప్రభుత్వ.. ప్రైవేట్ రంగ బ్యాంకులు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఫెడరల్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ మొదలైనవి కొత్తగా ప్యానెల్‌లో చేరిన వాటిలో ఉన్నాయి.
78 లక్షల పైచిలుకు పింఛనుదారులు ఏ బ్యాంకు ఖాతా నుంచైనా పింఛన్లను పొందేందుకు కూడా ఇది తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. నవ భారత లక్ష్యం దిశగా దేశ పురోగతికి ఈపీఎఫ్‌ఓలాంటి సంస్థలు దోహదపడుతున్నాయని తెలిపారు. 8 కోట్ల మంది పైగా యాక్టివ్ సభ్యులు, 78 లక్షల మందికి పైగా పెన్షనర్లకు .. సంస్థ సామాజిక భద్రత ప్రయోజనాలను కలి్పస్తోందని ఆయన చెప్పారు. 2024–25లో 6 కోట్ల పైగా క్లెయిమ్‌లను సెటిల్ చేసిందని తెలిపారు. 2023–24లో నమోదైన 4.45 కోట్లతో పోలిస్తే ఇది 35 శాతం అధికమని మాండవీయ వివరించారు.