లీగల్
ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – గ్రాట్యుటీని బ్యాంకు వారు లోన్ బకాయిల రీత్యా జమ కట్టుకోవచ్చా?
ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న మాధవరావు (పేరు మార్చాము) అనే ఒక వ్యక్తి కోవిడ్ సమయంలో సేవలు నిర్వహిస్తూ కన్నుమూశారు. ఆయన మరణానంతరం తన వారసులకు –భార్యకు రావలసిన కుటుంబ పెన్షన్, గ్రాట్యుటీ వంటి అంతిమ ఆర్థిక ప్రయోజనాలు (టెర్మినల్ బెనిఫిట్స్) భార్య అకౌంట్లోకి వచ్చాయి. అయితే, అలా అకౌంట్ లోకి వచ్చిన వెంటనే సదరు బ్యాంకు అధికారులు పెన్షన్ మొత్తాన్ని మాధవ రావు బతికుండగా తీసుకున్న లోన్ బకాయి కింద జమ కట్టుకున్నారు.
ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించిన సదరు ఉద్యోగి భార్యను ‘ఇది మా హక్కు‘ మీ ఆయన మా బ్యాంకులో లోను తీసుకోవడమే కాక, తన టెర్మినల్ బెనిఫిట్స్ నుంచి కూడా రికవరీ చేసుకోవచ్చు అని మాకు రాసి ఇచ్చారు. అంతేకాక మీ భర్త పని చేసిన డిపార్ట్‌మెంట్ వారికి, మా బ్యాంకుకు మధ్య ఒక ఒప్పందం కూడా ఉంది. అందువలన మేము ఆ మొత్తాన్ని లోను కింద జమ కట్టుకున్నాము‘ అని చెప్పి ఆవిడని వెళ్ళిపొమ్మన్నారు. అప్పుడు ఇద్దరు మైనర్ పిల్లల తల్లి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.
వాదోపవాదాలు విన్న తర్వాత, పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఆధారం చేసుకుని, మరీ ముఖ్యంగా సి.పి.సి లోని సెక్షన్ 60 (1) నిబంధనల ప్రకారం ‘‘టర్మినల్ బెనిఫిట్స్ లోనుంచి వచ్చిన నిధులను, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ (పీ.ఎఫ్) వంటి సామాజిక సంక్షేమ పథకాల ద్వారా సంక్రమించిన నిధులను ఏ బ్యాంకు అయినా, కోర్టు అయినా అలా తీసుకోవడానికి, అటాచ్మెంట్ చేయడానికి వీలు లేదు’’ అని తీర్పునిస్తూ ‘‘ఆ మహిళ అకౌంట్‌లో నుంచి లోను బకాయి పేరుతో బ్యాంకు వారు తీసేసుకున్న డబ్బులు మొత్తం తిరిగి ఆ మహిళకు చెల్లించవలసిందే’’ అని ఆదేశించింది. అప్పటికీ కూడా బ్యాంకు వారు తిరిగి చెల్లించక΄ోవడంతో గౌరవ హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు కూడా వేయాల్సి వచ్చింది.
మొత్తానికి సదరు మహిళకి ఆ డబ్బులు మొత్తం బ్యాంకు వారు తిరిగి చెల్లించారు. బ్యాంకు వారికి లోన్ రికవరీ చేసే అధికారం వున్నప్పటికీ, చట్ట పరిధిలో ఉండి మాత్రమే రికవరీ చేయాల్సి వుంటుంది. లోన్ తీసుకునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... బ్యాంకు లోన్ తీసుకున్నెప్పుడు ‘లోన్ ఇన్సూరెన్స్’ అనే పథకాన్ని ఎంచుకోవాలి. అంటే, రుణ బకాయీలు ఉండగా లోన్ తీసుకున్న వ్యక్తి మరణించినా, ఏదైనా శాశ్వత వైకల్యం వంటివి కలిగి ఉపాధి కోల్పోయిన సమయాలలో వారు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా ఉండచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ వారు మీ బదులు లోన్ కడతారు. మీ కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది. కొన్ని లోన్‌ఖాతాలకి లోన్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అయినప్పటికీ, బ్యాంకు వారు కూడా లోన్ ఇన్సూరెన్స్ గురించి అందరికీ చెప్పి, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకునేలా చేస్తే మంచిది.
– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్
Comments
Please login to add a commentAdd a comment