న్యూఢిల్లీ: ఒక ఉద్యోగి తన సుదీర్ఘ, అవిరామ, విశ్వాస, నిష్కళంక సేవలతో సంపాదించుకున్న సహజమైన ఆస్తే గ్రాట్యుటీ, పెన్షన్ అని, అవేమీ దయాదాక్షిణ్యాలపై వేసే భిక్ష కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. క్రిమినల్ లేదా శాఖాపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో ఎవరైనా ప్రభుత్వోద్యోగి నుంచి వాటిని దూరం చేయడం సరికాదని స్పష్టం చేసింది.
రాజ్యాంగంలోని 300ఎ అధికరణలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా ఆ ఆస్తిహక్కును నిరాకరించరాదని న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్, ఎ.కె.సిక్రిలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో రాంచీకి చెందిన జితేంద్ర కుమార్ శ్రీవాస్తవ అనే రిటైర్డ్ ఉద్యోగికి పదవీవిరమణ తదనంతర ప్రయోజనాలన్నింటినీ జార్ఖండ్ ప్రభుత్వం 2002లో నిలిపేసింది. పెన్షన్‌తో పాటు గ్రాట్యుటీ, ఆర్జిత సెలవుల మొత్తం చెల్లించలేదు. దీన్ని సవాల్ చేస్తూ జితేంద్రకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు... ఆయనకు పదవీవిరమణ తదుపరి లభించాల్సిన అన్ని ప్రయోజనాలను పరిష్కరించాలని ఆదేశిస్తూ 2007లో తీర్పు ఇచ్చింది. దీనిపై జార్ఖండ్ ప్రభుత్వం దాఖలుచేసిన అప్పీల్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది.
గ్రాట్యుటీ, పెన్షన్‌లు భిక్ష కాదు: సుప్రీంకోర్టు
Published Wed, Aug 21 2013 1:12 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement