న్యూఢిల్లీ : ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆధార్ లేదన్న సాకు చూపించి, పింఛన్‌దారులకు చెల్లింపులు నిలిపివేయరాదని ఈపీఎఫ్‌ఓ బ్యాంకులను ఆదేశించింది. దీనికి బదులు ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల ఆధారంగా నెలవారీ చెల్లింపులు జరపాలని సూచించింది. దీనికి సంబంధించి పెన్షన్ పంపిణీ చేసే పోస్టల్ సర్వీసులకు, బ్యాంకు అధికారులకు ఈపీఎఫ్‌ఓ ఓ సర్క్యూలర్ జారీచేసింది. ఆధార్ లేని వారి గుర్తింపును ప్రత్యామ్నాయ విధానాల్లో నిర్ధారించుకోవాలని పేర్కొంది. అదేవిధంగా బ్యాంకులు పెన్షనర్లకు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. గుర్తింపు కోసం ఫింగర్‌ప్రింట్‌తో ఇబ్బందులు పడుతున్న వారికోసం, ఐరిస్ స్కానర్‌ను కూడా బ్యాంకులు ఏర్పాటు చేయాలని తెలిపింది.
నెలవారి పింఛన్‌ను అందుకోవడంలో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2016 నుంచి పెన్షనర్లు తమ పింఛన్‌ను పొందడానికి జీవన్ ప్రమాణ్ అనే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను పొందాల్సి ఉంటుంది. ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను పరిశీలించిన అనంతరం, బ్యాంకులు ఆధార్ ఫింగర్‌ప్రింట్ ప్రామాణీకరణను చేపడతాయి. అనంతరం పెన్షన్‌ను అందిస్తాయి. అయితే వయసు పైబడటంతో, లబ్దిదారుడి ఫింగర్‌ప్రింట్ ప్రామాణీకరణ సరిగ్గా నమోదు అవడం లేదు. ఇలాంటి సమస్యలన్నింటిన్నీ పరిగణనలోకి తీసుకున్న భవిష్య నిధి సంస్థ బ్యాంకులకు కొన్ని సూచనలు చేస్తూ ఈ సర్క్యూలర్ జారీచేసింది. జీవన్ ప్రమాణ్ లేదని లేదా ఆధార్ ప్రామాణీకరణ సరిగ్గా నమోదు అవడం లేదని పెన్షనర్లకు పింఛన్ ఇవ్వడం నిరాకరించవద్దని తాము బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్టు కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ డాక్టర్. వీపీ జాయ్ తెలిపారు.ఆధార్ గుర్తింపు లేని వ్యక్తుల నుంచి సాధారణ ధ్రువీకరణ పత్రాలను తీసుకొని పెన్షన్ చెల్లించాలని స్పష్టం చేసినట్టు తెలిపారు.
అలాగే నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు ఆధార్ కార్డు పొందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బ్యాంకులను కోరింది. ఆధార్ అనుసంధానం పూర్తికానంత మాత్రాన వృద్ధులకు పెన్షన్ చెల్లింపుల్లో జాప్యం చోటుచేసుకోరాదని కేంద్ర సమాచార కమిషన్ కూడా తేల్చిచెప్పింది. ఏటా నవంబరులో పెన్షన్‌దారుల నుంచి అవసరమైన సర్టిఫికేట్లను సేకరించడంతోపాటు పెన్షన్ తీసుకోవడం కోసం సంతకం చేసిన ఒప్పంద పత్రాలను బ్యాంకులు తీసుకోవాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment