Employees' Provident Fund Organisation
-
ఏటీఎం నుంచే పీఎఫ్ నిధుల డ్రా
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు అతి త్వరలోనే తమ భవిష్యనిధి (పీఎఫ్) క్లెయిమ్‌ల మొత్తాన్ని ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సభ్యుల ఆన్లైన్ క్లెయిమ్ ఆమోదానికి 7–10 రోజుల సమయం తీసుకుంటోంది. క్లెయిమ్ పరిష్కారం తర్వాత ఆ మొత్తాన్ని సభ్యుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ప్రతిపాదిత కొత్త విధానంలో సభ్యులకు ప్రత్యేకమైన కార్డులు అందించనున్నారు. వీటి ద్వారా ఏటీఎం నుంచి క్లెయిమ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఏడు కోట్లకు పైగా సభ్యులకు బ్యాంక్‌ల మాదిరి సేవలు అందించాలన్నది ఈపీఎఫ్‌వో ఆలోచనగా పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో తన ఐటీ సదుపాయాలను మెరుగుపరుచుకుంటోందని కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు. కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే పీఎఫ్ ప్రయోజనాలు, బీమా ప్రయోజనాలను ఏటీఎంల నుంచే పొందొచ్చని చెప్పారు. -
ఈపీఎఫ్‌వో కిందకు 15.62 లక్షల సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో 15.62 లక్షల మంది సభ్యులు డిసెంబర్ నెలలో చేరారు. 2023 నవంబర్ నెలతో పోలిస్తే సభ్యుల చేరికలో 12 శాతం వృద్ధి నమోదైంది. అదే 2022 డిసెంబర్ నెల చేరికలతో పోలిస్తే 4.62 శాతం వృద్ధి కనిపించింది. ఉపాధి అవకాశాల పెరుగుదల, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహన, మరిన్ని సంస్థలకు చేరువ అయ్యేందుకు ఈపీఎఫ్‌వో చేపడుతున్న కార్యక్రమాలు సభ్యుల పెరుగుదలకు సాయపడుతున్నట్టు కేంద్ర కారి్మక శాఖ ప్రకటించింది. 8.41 లక్షల మంది ఈపీఎఫ్‌వో కింద మొదటిసారి నమోదు అయ్యారు. అంటే తొలిసారి వీరు సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. 2023 నవంబర్‌తో పోలిస్తే కొత్త సభ్యుల పెరుగుదల 14 శాతంగా ఉంది. పైగా డిసెంబర్ నెలకు సంబంధించిన నికర కొత్త సభ్యుల్లో 57 శాతం మంది 18–25 వయసులోని వారే కావడం గమనార్హం. మిగిలిన సభ్యులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం ద్వారా తమ ఈపీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకున్నారు. 2.09 లక్షల మంది మహిళలు.. 8.41 లక్షల కొత్త సభ్యుల్లో 2.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. 2023 నవంబర్ నెలతో పోలిస్తే 7.57 శాతం అధికం. రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది చేరారు. డిసెంబర్ నెలకు సంబంధించి కొత్త చేరికల్లో 58.33 శాతం ఈ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ఇందులో మహారాష్ట్ర వాటా 21.63 శాతంగా ఉంది. ఐరన్ అండ్ స్టీల్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్, జనరల్ ఇన్సూరెన్స్ రంగాలు ఎక్కువ మందికి అవకాశం కల్పించాయి. -
ఆధార్ కార్డు ఆధారం కాదు - లిస్ట్ నుంచి తొలగించిన ఈపీఎఫ్ఓ
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఇకపై పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డుని పరిగణించబోమని తెలిసింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధ్రువీకరించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ ఇటీవల అధికారికంగా విడుదల చేసిన సర్క్యులర్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ఖాతాదారులు తప్పకుండా గమనించాలి. ఇప్పటికే పలు న్యాయస్థానాల్లో ఆధార్ కార్డుని జనన ధ్రువీకరణ పత్రంగా పరిగణించబోమని ప్రకటించడంతో.. ఈపీఎఫ్ఓ సంస్థ కూడా ఇదే బాటలో అడుగులు వేస్తూ ఎట్టకేలకు ధ్రువీవీకరించింది. EPFO కోసం పుట్టిన తేదీకి రుజువుగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్స్ ఏదైనా గుర్తింపు పొందిన ప్రభుత్వ బోర్డు లేదా యూనివర్సిటీ జారీ చేసిన మార్క్‌షీట్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (SLC) స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (TC) SSC సర్టిఫికేట్ (పేరు, పుట్టిన తేదీ ఉంటుంది) పాన్ కార్డ్ కేంద్ర/రాష్ట్ర పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ప్రభుత్వం జారీ చేసిన డొమిసైల్ సర్టిఫికేట్ పాస్‌పోర్ట్ ప్రభుత్వ పెన్షన్ ఐడీ సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఇదీ చదవండి: ఉద్యోగులకు షాకిచ్చిన సుందర్ పిచాయ్ - మరిన్ని లేఆప్స్ పక్కా! పైన తెలిపిన డాక్యుమెంట్స్ ఈపీఎఫ్ఓలో పుట్టిన తేదీ కరెక్షన్ కోసం సమర్పించవచ్చు. వీటిలో పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు మ్యాచ్ అయ్యేలా ఉండాలి. అయితే ఆధార్ అనేది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే. కాబట్టి దీనిని పుట్టిన తేదీ నిర్దారణ కోసం పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. -
ఫిబ్రవరిలో భారీ ఉపాధి కల్పన!
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ బాడీ– ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) 2023 ఫిబ్రవరి 13.96 లక్షల మంది నికర చందాదారులను నమోదు చేసుకుంది. వీరిలో దాదాపు 7.38 లక్షల మంది మొట్టమొదటిసారి కొత్తగా ఈపీఎఫ్ఓ పరిధిలోనికి వచ్చినవారని కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటన ఒకటి తెలిపింది. ప్రకటనలో ముఖ్యాంశాలు.. ► కొత్తగా చేరిన సభ్యుల్లో అత్యధికంగా 2.17 లక్షల మంది సభ్యులు 18–21 ఏళ్ల మధ్య వయస్సు గలవారు. 1.91 లక్షల మంది సభ్యులు 22–25 ఏళ్ల మధ్య వయస్సు గలవారు. ► మొత్తం కొత్త సభ్యులలో 18–25 సంవత్సరాల మధ్య వయస్కులు 55.37 శాతం మంది. దేశంలోని సంఘటిత రంగంలో భారీగా ఉపాధి అవ కాశాలు కలిగినట్లు ఈ సంఖ్య తెలియజేస్తోంది. ► నికర మహిళా సభ్యుల నమోదు 2.78 లక్షలు. ఈ నెలలో నికర సభ్యుల చేరికలో ఇది దాదాపు 19.93%. నికర మహిళా సభ్యుల సంఖ్యలో 1. 89 లక్షల మంది మహిళా సభ్యులు కొత్తగా చేరారు. ► నికర సభ్యుల చేరికలో నెలవారీగా పెరుగుతున్న ధోరణిని చూస్తే, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మొదలైన రాష్ట్రాలు తొలి వరుసలో ఉన్నాయి. ► పరిశ్రమల వారీగా చూస్తే.. నిపుణుల సేవల విభాగం (మానవ వనురుల సరఫరాదారులు, సాధారణ కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ సర్వీసెస్, ఇతర కార్యకలాపాలు మొదలైనవి) మొత్తం సభ్యుల చేరికలో 41.17 శాతంగా ఉంది. ► తోలు ఉత్పత్తులు, వస్త్రాల తయారీ, కొరియర్ సేవలను అందించడంలో నిమగ్నమైన సంస్థలు, చేపల ప్రాసెసింగ్, నాన్–వెజ్ ఫుడ్ ప్రిజర్వేషన్ మొదలైన పరిశ్రమలకు సంబంధించి ఈపీఎఫ్ఓలో అధిక నమోదులు ఉన్నాయి. నిరంతర ప్రక్రియ... ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి (సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్ర తా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యు డు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 7 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్లకు పైగా మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.15 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఈపీఎఫ్ఓ ఇటీవలే ఆమోదముద్ర వేసింది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసు కుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీ ఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. -
ఈపీఎస్ నుంచీ డబ్బు తీసుకోవచ్చు
న్యూఢిల్లీ: సంఘటిత రంగంలోని ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) తీసుకుంది. ఒక ఉద్యోగి ఒక సంస్థలో చేరి ఆరు నెలల్లోపు మానేస్తే, కేవలం తన పీఎఫ్ ఖాతాలోని బ్యాలన్స్ వరకే వెనక్కి తీసుకోగలరు. పెన్షన్ ఖాతా (ఈపీఎస్–95)లోని జమలను తీసుకోవడానికి లేదు. కానీ, ఆరు నెలల సర్వీసు కూడా లేకుండా ఉద్యోగం మానేసే వారు పెన్షన్ ఖాతాలోని బ్యాలన్స్‌ను సైతం వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సోమవారం నాటి 232వ సమావేశంలో నిర్ణయించింది. ఇక ఈటీఎఫ్‌లలో తన పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన విధానానికీ ఆమోదం తెలిపింది. 2018లో కొనుగోలు చేసిన ఈటీఎఫ్ యూనిట్లకు సంబంధించి లాభాలను వెనక్కి తీసుకుని, 2022–23 సంవత్సరానికి వడ్డీ ఆదాయం లెక్కింపులోకి పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. -
ఈపీఎఫ్‌వోలోకి 18.36 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహించే సామాజిక భద్రతా పథకంలోకి జూన్ నెలలో కొత్తగా 18.36 లక్షల మంది సభ్యులు చేరారు. అంతక్రితం ఏడాది జూన్ నెలలో కొత్త సభ్యులు 12.83 లక్షలతో పోలిస్తే మంచి వృద్ధి నమోదైంది. ఇందుకు సంబంధించి పేరోల్ గణాంకాలను కార్మిక శాఖ విడుదల చేసింది. ఈ ఏడాది మేనెలలో కొత్త సభ్యుల చేరికతో పోల్చి చూసినా జూన్‌లో 9.21 శాతం వృద్ధి కనిపిస్తోంది. (వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) ఇక జూన్‌లో నికర కొత్త సభ్యులు 18.36 లక్షల మందిలో 10.54 లక్షల మంది ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్, 1952 కింద మొదటసారి చేరిన వారు కావడం గమనించాలి. 7.82 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరడం వల్ల కొత్త సభ్యుల్లో భాగంగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచీ ప్రతి నెలా కొత్త సభ్యుల్లో వృద్ధి కనిపిస్తోంది. 22–25 వయసు నుంచి 4.72 లక్షల మంది కొత్తగా చేరిన వారున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల నుంచే 12.61 లక్షల మంది కొత్తగా చేరారు. మొత్తం కొత్త సభ్యుల్లో మహిళలు 4.06 లక్షల మంది ఉన్నారు. ఈపీఎఫ్‌వో మొత్తం సభ్యుల్లో మహిళల శాతం మే చివరికి 20.37 శాతంగా ఉంటే, జూన్ చివరికి 22.09 శాతానికి తగ్గింది. (Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్ విషయాలు) -
రిటైర్మెంట్ ఫండ్ సంస్థకు ‘ఈటీఎఫ్’ బొనాంజా
న్యూఢిల్లీ: ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి రిటైర్మెంట్ ఫండ్ సంస్థ– ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) భారీ బొనాంజా పొందుతోంది. కార్మిక, ఉపాధి వ్యవహారాల శాఖ మంత్రి రామేశ్వర్ తెలి వెల్లడించిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► మార్చి 2022 వరకు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో ఈపీఎఫ్ఓ రూ. 1,59,299.46 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడుల ప్రస్తుత (నోషనల్) మార్కెట్ విలువ రూ. 2,26,919.18 కోట్లు. 2019–20లో రూ.31,501 కోట్లు, 2020–21లో రూ.32,071 కోట్లు, 2021–22లో రూ.43,568 కోట్లు ఈటీఎఫ్‌లలోకి ఈపీఎఫ్ఓ పెట్టుబడులు వెళ్లాయి. ► ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య ఈటీఎఫ్‌ల్లో ఈపీఎఫ్ఓ పెట్టుబడి విలువ రూ.12,199.26 కోట్లు. ఇదే కాలంలో డెట్ ఇన్స్ట్రమెంట్లలోకి వెళ్లిన మొత్తం పెట్టుబడి విలువ రూ.84,477.67 కోట్లు ► నిఫ్టీ 50, సెన్సెక్స్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ), భారత్ 22 సూచీల ఆధారంగా ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. 15 శాతం వరకే పెట్టుబడులు పరిమితి... ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 6 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో దాదాపు రూ.300 కోట్ల మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఇటీవలే కేంద్రం ఆమోదముద్ర వేసింది. గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో (1977–78లో ఈపీఎఫ్ 8 శాతం) కనిష్ట వడ్డీరేటు ఇది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ప్రారంభంలో ఈపీఎఫ్ఓ తన పెట్టుబడి పరిమితుల్లో 5 శాతం స్టాక్ మార్కెట్లలో పెట్టాలని నిర్ణయించుకుంది. తరువాత ఈ నిష్పత్తిని 2016–17లో 10 శాతానికి పెంచడం జరిగింది. 2017–18లో 15 శాతానికి పెంచారు. డెట్ ఇన్‌స్ట్రమెంట్లలో 85 శాతం నిధులను పెట్టుబడులుగా పెట్టే అవకాశం ఉంది. (క్లిక్: ఇన్కమ్ టాక్స్ నుంచి 143 (1) నోటీసు వచ్చిందా?..అప్పుడేం చేయాలి ?) -
ఇంటి రుణంపై ‘టాపప్’
కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు. ఆ తర్వాత అయినా లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేస్తారన్న విషయమై స్పష్టత లేదు. ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. నిత్యావసరాలు మినహా మిగిలిన దుకాణాలను తెరిచే పరిస్థితి లేదు. లాక్డౌన్ క్రమంగా ఎత్తివేసిన తర్వాత కూడా పరిస్థితులు తిరిగి ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాయన్నదీ ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు. ఎంతో మంది ఉద్యోగాలను కోల్పోయారు. వేతనాల్లో కోతలను కూడా చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా ఎదురయ్యే కష్టాల నుండి గట్టెక్కేందుకు ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) నుంచి మూడు నెలల వేతనాన్ని ఉపసంహరించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ మొత్తం చాలని వారు, ఈపీఎఫ్ అవకాశం లేని వారు బ్యాంకులు ఆఫర్ చేస్తున్న టాపప్ హోమ్‌లోన్‌ను పరిశీలించొచ్చు. పర్సనల్ లోన్ కంటే ఈ టాపప్ రుణాలపై వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉండడాన్ని పరిశీలించాలి. తక్కువ వడ్డీ రేటుకే లభిస్తున్న టాపప్ హోమ్ రుణం తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే తీసుకున్న ఇంటి రుణానికి అనుబంధంగా ఇచ్చే రుణమే టాపప్ హోమ్ లోన్. గరిష్టంగా మంజూరు చేసే రుణం, కాల వ్యవధి అనేవి బ్యాంకుల మధ్య వేర్వేరుగా ఉండొచ్చు. ప్రస్తుతం తాము ఇంటి రుణం తీసుకున్న బ్యాంకు నుంచి టాపప్ హోమ్‌లోన్ తీసుకోవచ్చు. లేదా ఇతర బ్యాంకు నుంచి తీసుకోవాలనుకుంటే ప్రస్తుత బ్యాంకు నుంచి ఇంటి రుణాన్ని బదలాయించుకున్న తర్వాతే అందుకు వీలు పడుతుంది. ముఖ్యంగా ఈ రుణాలపై వడ్డీ రేటు చాలా తక్కువగా ఉండడం ఆకర్షణీయమని చెప్పుకోవాలి. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐ టాపప్ హోమ్‌లోన్‌పై తక్కువ రేటును వసూలు చేస్తోంది. ఎస్బీఐలో టాపప్ హోమ్ లోన్‌పై రేటు 7.6 శాతంగా ఉంటే, ఇతర బ్యాంకుల్లో ఇది 7.85 శాతం నుంచి ప్రారంభమవుతోంది. రుణాన్ని వినియోగించుకునే విషయంలో షరతుల్లేకపోవడం మరో అనుకూల అంశం. ఈ మొత్తాన్ని పిల్లల విద్యావసరాలు, రోజువారీ అవసరాలు, ఇంటి నవీకరణ, వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం కోసం వినియోగించుకోవచ్చు. కనుక కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకు ఈ టాపప్ లోన్ అనుకూలమనే చెప్పుకోవాలి. అయితే, ‘‘లాక్డౌన్ సమయంలో ఇంటి రుణాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇందుకోసం న్యాయ, సాంకేతిక మదింపు అవసరం అవుతుంది’’ అని రిటైల్ లెండింగ్ డాట్ కామ్ డైరెక్టర్ సుకన్యకుమార్ తెలియజేశారు. లాక్డౌన్ కాలంలోనే రుణం కావాలంటే వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చని సూచించారు. అర్హతలు... ప్రస్తుత ఇంటి రుణ గ్రహీతలు టాపప్ హోమ్‌లోన్ తీసుకునేందుకు అర్హులు. ఇంటి మార్కెట్ విలువ, చెల్లింపుల చరిత్ర, క్రెడిట్ స్కోర్ ఇవన్నీ రుణ అర్హతలను నిర్ణయిస్తాయి. టాపప్ హోమ్‌లోన్ తీసుకునేందుకు అప్పటికే కనీసం 9 నెలల నుంచి ఏడాది కాలానికి క్రమం తప్పకుండా రుణ చెల్లింపులు చేసిన చరిత్ర ఉండాలి. కొన్ని బ్యాంకులు నిర్మాణంలో ఉన్న వాటికి కాకుండా.. నిర్మాణం పూర్తి చేసుకున్న గృహాలపైనే టాపప్ హోమ్ లోన్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఇంటి మార్కెట్ విలువలో అప్పటికే తీసుకున్న రుణ మొత్తాన్ని మినహాయించి, మిగిలిన విలువలో 80% వరకు బ్యాంకులు ఈ రుణాన్ని ఇస్తున్నాయి. అయితే, కరోనా సంక్షోభంతో దేశవ్యాప్తంగా ఆస్తుల ధరలు పడిపోయాయి. దీంతో ఇంటి మార్కెట్ విలువ తగ్గి ఉంటుంది కనుక అది రుణ అర్హతలను ప్రభావితం చేయగలదు. అన్నీ చూసిన తర్వాతే... టాపప్ హోమ్ లోన్ తీసుకోవడానికి ముందు.. వడ్డీ రేట్లు వివిధ బ్యాంకుల్లో ఎలా ఉన్నాయి, ప్రాసెసింగ్ ఫీజు, రుణ కాల వ్యవధి ఈ అంశాలన్నింటినీ చూడాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రస్తుతం మీ ఇంటి రుణం ఏ బ్యాంకులో తీసుకుని ఉంటే ఆ బ్యాంకు నుంచే తీసుకోవడం సౌకర్యం. లేదంటే ఇంటి రుణాన్ని వేరే బ్యాంకుకు బదలాయించుకున్న తర్వాత రుణాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇందుకోసం సమయం తీసుకుంటుంది. ఇది లాక్డౌన్ కాలం కనుక బయటకు వెళ్లి అన్ని పనులు చేసుకునే అవకాశం లేదు. కనుక ఇంటి రుణం ఇచ్చిన బ్యాంకును సంప్రదించడమే సౌలభ్యం. ముఖ్యంగా కొన్ని బ్యాంకులు టాపప్ హోమ్ లోన్‌ను ఆస్తిపై ఇస్తున్న రుణంగా పరిగణిస్తూ అధిక రేటును వసూలు చేస్తున్నాయి. ఈ జాబితాలో మీ బ్యాంకు కూడా ఉందేమో పరిశీలించుకోవాలి. ఒక వేళ రేటు గరిష్ట స్థాయిలో ఉంటే అప్పుడు వేరే మార్గాన్ని పరిశీలించాలి. బ్యాంకు ఆఫర్ చేస్తున్న టాపప్ హోమ్‌లోన్‌లో లాకిన్ పీరియడ్ ఉందేమో కూడా పరిశీలించుకోవాలి. ఎందుకంటే లాకిన్ పీరియడ్ ఉందనుకుంటే.. ఆ కాలంలో ముందుగానే రుణాన్ని తీర్చివేయాలనుకుంటే మిగిలిన రుణ బ్యాలన్స్ మొత్తంపై బ్యాంకులు 2 శాతం చార్జీని వసూలు చేయవచ్చు. అన్ని అంశాలు తెలుసుకోవాలి రుణం ఏదైనా కానీయండి.. అది మీ చివరి ఎంపికగానే ఉండాలి. ముఖ్యంగా వేతనాల్లో కోతలు, ఉద్యోగాల్లోంచి తొలగించే ప్రస్తుత పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే రుణం తీసుకున్న తర్వాత నుంచి ఈఎంఐలు మొదలవుతాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే ముందుగా అత్యవసర నిధి ఉంటే దాన్ని వినియోగించుకోవాలి. అది లేని సందర్భాల్లో ఈక్విటీ లేదా డెట్‌లో పెట్టుబడులు ఉంటే వాటిని విక్రయించుకోవాలి. లేదా బంగారం ఉన్నా కానీ విక్రయించి ఈ సంక్షోభ సమయాన్ని గట్టెక్కడం మంచిది. ఇవేవీ లేని సందర్భాల్లో ఈపీఎఫ్ నుంచి మూడు నెలల వేతనాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇంటి రుణానికి అనుబంధంగా వచ్చే టాపప్ హోమ్‌లోన్ కాల వ్యవధి దీర్ఘకాలంతో ఉంటుంది. అయితే, ఓ ఏడాది రెండేళ్ల తర్వాత తిరిగి చెల్లించే సామర్థ్యం మీకు ఏర్పడితే.. అందుకు బ్యాంకు అవకాశం ఇస్తుందా.. జరిమానాలు, పెనాల్టీలు ఏవైనా ఉన్నాయేమో విచారించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. -
జవాబు పత్రాలు ఇవ్వాల్సిందే!
భవిష్యనిధి కార్యాలయంలో ఈఓ, ఏఓలుగా ఉద్యోగోన్నతి కోసం నిర్వహించిన పరీక్షలో అభ్యర్థులు తెలిపిన అనేక అభ్యం తరాలలో ఎన్నింటిని ఆమోదించారు? అందరికీ సమానంగా ప్రయోజనం కలిగిం చారా? ఎంపికైన అభ్యర్థులు రాసిన సమాధాన పత్రాల ప్రతులను ఇవ్వండి అంటూ సమాచార హక్కు చట్టం కింద శైలేంద్ర కుమార్ సింగ్ అడిగారు. మొదటి మూడు అంశాలకు సమాధానం ఇచ్చారు. ఇతరుల సమాధాన పత్రాలు సెక్షన్ 8(1)(ఇ) (ట్రస్టీ హోదాలో ఇచ్చిన సమాచారం) (జె) వ్యక్తిగత సమాచారం అనే మినహా యింపుల కింద ఇవ్వనవసరం లేదని జవాబు ఇచ్చినారు. ఆబ్జెక్టివ్ తరహాతో కూడిన మూడు పరీక్షల నమూనా సమాధానాలు వెల్లడిచేశారు. శైలేంద్ర నాలుగో పరీక్ష నమూనా సమాధానాలు ఇవ్వాలని కోరారు. నాలుగోది వివరమైన సమాధానాల పరీక్ష కావడంతో వారు మోడల్ సమాధాన పత్రాన్ని తయారు చేయలేదు కనుక ప్రకటించలేదు. మొత్తం మూడు వేలమంది పరీక్ష రాస్తే కేవలం అయిదుగురు ఎంపికైనారు. తాను ఎందుకు ఎంపిక కాలేకపోయాను, ఆ అయిదుగురు ఏమేరకు తన కన్నా ప్రతి భావంతులో తెలుసుకోవడం కోసం వారి సమాధాన పత్రాలు అడుగుతున్నానని ఆయన వాదించారు. సీబీఎస్ఈ వర్సెస్ ఆదిత్య బంధోపాధ్యాయ కేసులో (2011) 8 ఎస్ సి సి 497) లో తన సొంత సమాధాన పత్రం అడిగి తీసుకునే హక్కు ఉందా లేదా అనే వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించింది. తన పత్రం తాను చూసుకోగలిగితే తనకు ఇంకా ఎక్కువ మార్కులు రావాలని, లేదా తన సమాధానాలకు అన్యాయంగా తక్కువ మార్కులు ఇచ్చారని, కనుక వాటిని సరిచేయాలని కోరడానికి వీలవుతుంది. సీబీఎస్ఈ మూడు ప్రధానమైన కారణాలను కోర్టు ముందుకు తెచ్చింది. ఒకటి సమాధాన పత్రం తమకు ధర్మకర్త హోదాలో అభ్యర్థులు ఇచ్చిన సమాచారం కనుక ఇతరులకు ఇవ్వడం ధర్మకర్త బాధ్యతలకు భిన్నం అవుతుంది. రెండు: మూల్యాంకనం చేసిన సమాధాన పత్రం వ్యక్తిగత సమాచారం అవుతుంది కనుక ఇవ్వడానికి వీల్లేదు. మూడు: ఇతరుల సమాధాన పత్రాలు అడిగితే ఇవ్వడం సాధ్యం కాదు. అందరూ అందరి పత్రాలు అడిగితే సంక్షోభం ఏర్పడుతుంది. తాము ధార్మిక సంస్థ వంటి వారిమనీ, తమకు ధర్మకర్తల హోదాలో అందిన సమాచారాన్ని ఇతరుల ప్రయోజనాలు రక్షించడం కోసమై తాము ఇవ్వడం సాధ్యం కాదని సీబీఎస్ఈ వాదించింది. ఎవరి సమాధాన పత్రాన్ని వారు చూడాలన్నా వీల్లేదని సీబీఎస్ఈ మొండికేసింది. అభ్యర్థులు నిజానికి ఏ సమాచారమూ ఇవ్వడం లేదు. ధర్మకర్తల హోదా ప్రస్తావనే రాదు. ఎందుకంటే అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వారు రాస్తారు. వాటికి తగిన విధంగా అధ్యాపకులు మార్కులు వేయాలి. కనుక మూల్యాం కనం చేయని పత్రాలు, చేసిన తరువాత సమాధాన పత్రాలు కూడా ధార్మికంగా దాచవలసిన సమాచారం అనడానికి ఆస్కారం లేదు. అభ్యర్థులు వ్యక్తిగత సమాచారం ఇస్తున్నారనడం కూడా సరి కాదు. విజ్ఞాన విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు తన సమాధానాలు అవి. అవి వ్యక్తిగత సూచనలు కావు.13 లక్షల మంది పరీక్ష రాసినప్పుడు ఎవరి పత్రాలు వారికి ఇవ్వాలన్నా, ఇతరుల సమాధాన పత్రాలు కావాలన్నా తీవ్ర గందరగోళం, సంక్షోభం వస్తుందని కనుక సాధ్యం కాదన్నది సీబీఎస్ఈ. 1984లో సుప్రీంకోర్టు ఇందుకు అంగీకరించిందని చెప్పింది. అభ్యర్థి తన సమాధాన పత్రాన్ని అధికారులు ఏ విధంగా మూల్యాంకనం చేశారో తెలుసుకునేందుకు తన పత్రాన్ని తాను చూసుకునే అధికారం ఉందంటూ చరిత్రాత్మకమైన తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. ధర్మకర్తల హోదాలో వచ్చిన సమాచారం అనీ వ్యక్తిగత సమాచారం అనీ మినహాయింపులు వర్తించబోవని కూడా ప్రకటించింది. మూల్యాంకనం చేసిన సమాధాన పత్రాలు ఈ మినహాయింపు కిందికి రావని చివరకు సీబీఎస్ఈ కూడా అంగీకరించక తప్పలేదు. 13 లక్షల మంది అభ్యర్థులలో సగం మంది అడిగినా సంక్షోభం వంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. నిజమే.. కాని అన్యాయం జరిగితే అడిగే హక్కు లేదా? లక్షలాది మంది పరీక్షలు రాసిన సందర్భాలలో ఇతరుల పత్రాలు ఇవ్వనవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు సరైనవే అయినా చిన్న స్థాయిలో నియామకాలు, లేదా పదోన్నతి కోసం పరీక్షలు నిర్వహిస్తే అందులో ఎంపికైన వారి సమాధాన పత్రాలు అడిగినప్పుడు ఆచరణాత్మక ఇబ్బంది అనేది వర్తిం చదు. అయిదుగురి సమాధాన పత్రాలు ఇవ్వడంలో ఏ విధమైన సమస్యాలేదని కమిషన్ నిర్ధారించింది. పైగా నియామకాలు, పదోన్నతిలో అవినీతి నివారణ కావాలంటే పారదర్శకత తప్పదు. (CIC/EPFOG/A/2018/124927 శైలేంద్ర కుమార్ సింగ్ వర్సెస్ ఈïపీఎఫ్ఓ కేసులో జూన్ 7, 2018న సీఐసీ ఇచ్చిన తీర్పు ఆధారంగా) professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ -
0.5 శాతానికి ఈపీఎఫ్‌వో పరిపాలనా రుసుము
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)కు కంపెనీల యజమానులు చెల్లించే పరిపాలనా రుసుము 0.5 శాతానికి తగ్గింది. దీంతో అన్ని కంపెనీలకూ కలిపి ఏటా మొత్తంగా 900 కోట్ల రూపాయలు ఖర్చు తగ్గనుంది. ఉద్యోగులకు చెల్లించే మొత్తం వేతనంలో 0.65 శాతాన్ని పరిపాలనా రుసుము కింద కంపెనీలు ఇప్పటివరకు ఈపీఎఫ్‌వోకు చెల్లించేవి. వచ్చే నెల నుంచి ఈ రుసుమును 0.15 శాతం తగ్గించి 0.5 శాతంగా ఉండేలా ఈపీఎఫ్‌వో ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌వో చందాదారుల సంఖ్య పెరుగుతున్నందున తమ పరిపాలనా ఖర్చులకు అవసరమైన వాటికన్నా ఎక్కువ నిధులే వస్తున్నాయనీ, ఈ కారణంగానే చార్జీలను తగ్గిస్తున్నట్లు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ వీపీ జాయ్ చెప్పారు. -
పీఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ
సాక్షి, న్యూడిల్లీ : ప్రస్తుత (2016-17) సంవత్సరానికి గాను గత డిసెంబర్ లో నిర్ణయించిన విధంగానే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీని అందిస్తామని కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. ఈపీఎఫ్ వడ్డీ రేటును తగ్గించాలని ఆర్ధిక మంత్రిత్వ శాఖ వత్తిడి తెస్తోందని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. డిపాజిటర్లకు వడ్డీ రేటును తగ్గించేది లేదని దత్తాత్రేయ పేర్కొన్నారు. గురువారం జరిగిన ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ప్రత్యేక సమావేశానికి దత్తాత్రేయ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అవసరమైతే ఆర్ధిక మంత్రిత్వ శాఖతో చర్చిస్తామని, ఇప్పటికే 8.65 శాతం వడ్డీ రేటును ఆమోదించాలని ఆర్ధిక మంత్రిత్వ శాఖను కోరానని, వర్కర్లకు ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీని అందించాల్సిందేనని దత్తాత్రేయ చెప్పారు. సమర్ధవంతమైన సేవలు అందించడానికి అనువుగా సమాచార సాంకేతికతను విరివిగా వినియోగించాలన్న ప్రభుత్వ విధానానికి లోబడి ఈపీఎఫ్ ప్రయోజనాల అందుబాటును విస్తరించడానికి ఆధార్ సీడింగ్ అప్లికేషన్ ను దత్తాత్రేయ ప్రారంభించారు. ఈపీఎఫ్ ఖాతాదారులు మరణిస్తే, వారి కుటుంబానికి రూ. 2.5 లక్షల మేరకు కనీస హామీ ప్రయోజనం అందించాలన్న ప్రతిపాదనను సెంట్రల్ బోర్డ్ సిఫార్సు చేసింది. -
సారీ... సర్వర్ డైన్
సిటీబ్యూరో: ప్రావిడెంట్ ఫండ్ సర్వర్ ముప్పు తిప్పలు పెడుతోంది. ఫీఎఫ్ క్లైయిమ్స్ కోసం భవిష్య నిధి కార్యాలయం చుట్టూ ఖాతాదారుల ప్రదక్షిణ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కార్యాలయం (ఈఫీఎఫ్‌వో)లో 15 రోజుల నుంచి సర్వర్ సమస్య తలెత్తింది. హైదరాబాద్ నుంచి ప్రధాన కార్యాలయానికి గల ఆన్లైన్ సేవల ప్రధాన సర్వర్‌కు సాంకేతిక ఆటంకాలు తెలెత్తాయి. పెన్షన్, రుణాలు, ఖాతాల విత్ డ్రా, సెటిల్ మెంట్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. మరోవైపు కనీసం పీఎఫ్ సమాచారం కూడా తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయింది. అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ సొమ్ము చేతికి అందే పరిస్థితి లేకుండా పోయింది. పీఎఫ్ క్లైయిమ్స్ ను నమ్ముకొని పనులు పెట్టుకున్న వారికి పరిస్థితి మరింత ఆగమ్య గోచరంగా తయారైంది. సిస్టమ్ నాట్ వర్కింగ్ పీఎఫ్ ఆఫీస్‌లో కౌంటర్ల పై సిస్టమ్స్ నాట్ వర్కింగ్ నోటీసులు ప్రత్యక్షమయ్యాయి. 15 రోజులనుంచి సర్వర్ డౌన్ కావడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా కౌంటర్లపై కంప్యూటర్లు పనిచేయడం లేదని నోటీసులు అంటించి పీఎఫ్ అధికారులు చేతులు దులుపుకోవడం విస్మయానికి గురిచేస్తోంది.ఖాతాదారులు ఉన్నతాధికారులను కలిసేందుకు ప్రయత్నిస్తే సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుంటున్నారు. కనీసం ఆన్లైన్ సమస్య ఎప్పటి వరకు అధిగమిస్తారో వెల్లడించాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు. -
పీఎఫ్-ఆధార్ గడువు మరోసారి పెంపు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఖాతాలకు ఆధార్ అనుసంధానికి ప్రభుత్వం కల్పించిన గడువును మరోసారి పొడిగించింది. 2017 మార్చి 31వ తేదీనాటికి పీఎఫ్ చందాదారులు, పింఛన్ దారులు ఆధార్ కార్డును తప్పనిసరిగా సమర్పించాలని ఈపీఎఫ్‌వో తెలిపింది. పీఎఫ్ పథకాల ప్రయోజనాలు పొందాలంటే పీఎఫ్ చందాదారులు, పింఛనుదారులకు ఆధార్ తప్పనిసరి అని సష్టం చేసింది. సుమారు నాలుగు కోట్ల మంది ఈ వివరాలను అందించాలని కోరింది. గతంలో జనవరి 31, అనంతరం ఫిబ్రవరి 28 వరకు విధించిన గడువును ఖాతాదారులు మరియు ఫించన్ దారుల సౌలభ్యం మరోసారి పొడిగించింది. తమ ఆధార్ నంబర్‌ను, లేదా ఆధార్ కోసం దరఖాస్తు చేసిన పత్రాన్ని తమకు సమర్పించాలని తెలిపింది. -
పీఎఫ్ చందాదారులకు ఆధార్ తప్పనిసరి
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) పథకాల ప్రయోజనాలు పొందాలంటే పీఎఫ్ చందాదారులు, పింఛనుదారులకు ఆధార్ తప్పనిసరి అని ఆ సంస్థ తెలిపింది. ఈ నెల 31కల్లా వారు తమ ఆధార్ నంబర్‌ను, అది లేకుంటే ఆధార్ కోసం దరఖాస్తు చేసిన పత్రాన్ని తమకు సమర్పించాలని ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జ్యోతి వెల్లడించారు. ఈ నెలాఖర్లో సమీక్ష ఉంటుందని, గడువును పొడించే అవకాశముందని అన్నారు. 2017 జనవరి 31కల్లా పీఎఫ్ చందాదారులు, పింఛన్ దారులు ఆధార్ సమర్పించాలని కార్మిక శాఖ కూడా ఓ ప్రకటనలో తెలిపింది. -
వారం రోజుల్లో పీఎఫ్ మరణ క్లెయిమ్‌లకు పరిష్కారం
న్యూఢిల్లీ: చందాదారులు చనిపోయిన వారం రోజుల్లో వారి క్లెయిమ్‌లను పరిష్కరించేలా ప్రాంతీయ కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీచేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) తెలిపింది. అలాగే ఉద్యోగి విరమణ పొందడానికి ముందు లేదా అదే రోజు అతని రిటైర్మెంట్ సెటిల్మెంట్ను పూర్తిచేయాలనీఆదేశించినట్లు పేర్కొంది. ప్రధాని ఆదేశాల మేరకు సంస్థ చేపట్టిన చర్యలను మంగళవారం కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సమీక్షించారు. మరణ, విరమణ సెటిల్మెంట్లపై విస్పష్ట ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. సామాజిక మాధ్యమల్లో వెలిబుచ్చే సమస్యలపై సత్వరం స్పందించాలని కూడా నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉద్యోగుల భవిష్య నిధి చట్టం-1952 64వ దినోత్సవాన్ని మంగళవారం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ...సంస్థ సాధించిన విజయాలు, భవిష్యత్ మార్గసూచిపై అధికారులతో కలిసి సమీక్షించారు. -
‘ఈపీఎఫ్ఓ’లో 257 కొలువులు..
జాబ్ పాయింట్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు/అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. పోస్టుల సంఖ్య: మొత్తం 257. వీటిలో 21 పోస్టులను వికలాంగులకు కేటాయించారు. వేతన స్కేల్: రూ.9,300 నుంచి రూ.34,800 (గ్రేడ్ పే రూ. 4,600 అదనంగా చెల్లిస్తారు) వయోపరిమితి: 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయో సడలింపు ఉంటుంది. అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. లా, ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్/కంపెనీ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఇస్తారు. విధులు: వర్క్ ఎన్ఫోర్స్మెంట్, రికవరీ, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ క్యాష్, లీగల్ పెన్షన్, విచారణలు, నష్టపరిహారాల మదింపు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ తదితర విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. జమ్ముకశ్మీర్ తప్ప దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పని చేయాలి. ప్రొబేషన్: రెండేళ్లు ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.. రాత పరీక్ష ఇలా: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్ష ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ల్లో ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు విధిస్తారు. జనరల్ ఇంగ్లిష్, భారత స్వాతంత్య్ర సంగ్రామం, సమకాలీన అంశాలు - అభివృద్ధి, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపుల్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్, జనరల్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 23 దరఖాస్తు ప్రింట్‌ను సబ్మిట్ చేయడానికి చివరి తేదీ: జూన్ 24 వెబ్‌సైట్స్: www.upsc.gov.in, http://www.upsconline.nic.in -
ఈపీఎఫ్ఓ ఈక్విటీ పెట్టుబడులు పెంచుతాం...
కార్మిక మంత్రి దత్తాత్రేయ వెల్లడి హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్ఓ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఈ విషయమై బ్యాంక్‌లు, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లు, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అధికారులతో చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. వచ్చే నెలలో జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) సమావేశంలో ఈ విషయమై తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఈక్విటీ మార్కెట్లో రూ.6,000 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతకు మించి పెట్టుబడులు ఉండవచ్చని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి స్వల్ప కాలంలో ఎలాంటి లాభాలు రాలేదని, అయితే దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశాలున్నాయని వివరించారు. అందుకే ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సర ఈక్విటీ పెట్టుబడులపై ఒక నివేదిక రూపాందించామని పేర్కొన్నారు. -
మ్యూచువల్ ఫండ్ డెరైక్ట్ ప్లాన్‌కు మారాలంటే..
నేను ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు సంబంధించి రెగ్యులర్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. రెగ్యులర్ ప్లాన్ కంటే అదే స్కీమ్‌కు సంబంధించి డెరైక్ట ప్లాన్‌కు వ్యయాలు తక్కువగా ఉంటాయని, రాబడులు ఎక్కువగా ఉంటాయని మిత్రులంటున్నారు. నేను ఈ రెగ్యులర్ ప్లాన్ నుంచి డెరైక్ట్ ప్లాన్‌కు మారవచ్చా? ఇలా మారడాన్ని మ్యూచువల్ ఫండ్ సలహాదారుకు తప్పనిసరిగా వెల్లడించాలా ? మారడానికి సంబంధించిన విధి విధానాలేంటి? - సుధాకర్, ఖమ్మం ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు సంబంధించి రెగ్యులర్ ప్లాన్ నుంచి డెరైక్ట్ ప్లాన్‌కు మారవచ్చు. ఈ విషయాన్ని మీ మ్యూచువల్ ఫండ్ సలహాదారుకు వెల్లడించాలా, వద్దా అనేది మీ ఇష్టం. రెగ్యులర్ నుంచి డెరైక్ట్ ప్లాన్‌కు మారేటప్పుడు ఆన్లైన్లో డెరైక్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక ఆఫ్‌లైన్‌లో అయితే సదరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పేరు తర్వాత, ఏఆర్ఎన్ కోడ్ దగ్గర.. ఈ రెండు చోట్లా డెరైక్ట్ అని స్పష్టంగా తెలియజేయాలి. రెగ్యులర్ ప్లాన్ నుంచి డెరైక్ట్ ప్లాన్‌కు ఇన్వెస్టర్లు మారితే వారిపై ఎగ్జిట్ లోడ్‌ను ఇప్పుడు చాలా మ్యూచువల్ ఫండ్ సంస్థలు వసూలు చేయడం లేదు. అయినప్పటికీ, మీ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎగ్జిట్ లోడ్‌ను వసూలు చేస్తోందా లేదా అన్న విషయాన్ని ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఇలా ఒక ప్లాన్ నుంచి మరో ప్లాన్‌కు మారడాన్ని... ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యూనిట్లు విక్రయించి, మరో మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడంగా భావిస్తారు. కాబట్టి ఏమైనా మూలధన లాభాల పన్నులు చెల్లించాల్సి ఉంటుందేమోనని విషయాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రస్తుతం నేను ఎస్బీఐ మ్యాగ్నమ్ గ్లోబల్ ఫండ్, ఎస్బీఐ ఫార్మా ఫండ్, యూటీఐ టాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్, యూటీఐ మిడ్ క్యాప్ ఫండ్, యూటీఐ ఎంఎన్సీ ఫండ్, హెచ్డీఎఫ్సీ మిడ్-క్యాప్ అపర్చునిటీస్ ఫండ్ల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం నేను ఏమైనా పన్ను రాయితీలు పొందవచ్చా? - ప్రశాంతి, గుంటూరు మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)ల్లో లేదా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తేనే పన్ను రాయితీలు లభిస్తాయి. దురదృష్టవశాత్తూ మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్( ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్న వాటిల్లో ఏ ఒక్కటి కూడా ఈఎల్ఎస్ఎస్ ఫండ్ కాదు. అందుకని మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు ఎలాంటి పన్ను రాయితీలు లభించవు. ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. స్థలం కొనుగోలు కోసం ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్) నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకుందామనుకుంటున్నాను. దీనికి సంబంధించిన విధి విధానాలేంటి? ఏమేం డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది ? - భవానీ, హైదరాబాద్ నిర్దేశిత ఉద్యోగ సర్వీస్ పూర్తి చేస్తేనే మీరు ఈపీఎఫ్ నుంచి డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. స్థలం కొనుగోలు కోసం ఈపీఎఫ్ నుంచి మొత్తం కాకుండా పాక్షికంగానే డబ్బులను విత్‌డ్రా చేసుకునే వీలుంది. మీరు ఏ కారణం వల్ల డబ్బులను విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో, దానికి తగ్గట్లుగా మీ సర్వీస్ ఉండాలి. ఉదాహరణకు మీ ఉద్యోగ సర్వీస్ ఐదేళ్లు పూర్తయితేనే మీరు స్థలం కోసం ఈపీఎఫ్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. సంబంధిత డాక్యుమెంట్లతో పాటు పార్షియల్ విత్‌డ్రాయల్ పార్మ్ను మీ కంపెనీకి అందజేయాలి. మీ బ్యాంక్ ఖాతా వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. మీ క్లెయిమ్‌ను వెరిఫై చేసి, డబ్బులను మీ బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు. కొత్త నిబంధనల ప్రకారం, విత్‌డ్రాయల్ దరఖాస్తును నేరుగా ఈపీఎఫ్ఓ కార్యాలయంలో కూడా సమర్పించవచ్చు. నేను 2009, మార్చిలో హెచ్డీఎఫ్సీ యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్-2లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఏడేళ్ల పాటు ఏడాదికి రూ.12,000 చొప్పున ప్రీమియమ్‌లు చెల్లించాను. ఇప్పుడు నేను ఈ పాలసీని సరెండర్ చేస్తే, ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? - ప్రకాశ్ జైన్, హైదరాబాద్ హెచ్డీఎఫ్సీ యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్ టూ అనేది యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్(యూఎల్‌పీపీ), ఈ ప్లాన్‌ను ఇప్పుడు ఈ కంపెనీ నిలిపేసింది. ఈ పాలసీలో మీరు ఏడేళ్ల పాటు ప్రీమియమ్‌లు చెల్లించారు. కాబట్టి మీపై ఎలాంటి సరెండర్ చార్జీల భారం ఉండదు. మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి సరెండర్ వేల్యూపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఈ పాలసీని సరెండర్ చేసేటప్పుడు ఆ ఫండ్ విలువ ఎంత ఉంటుందో అదే దాని సరెండర్ వేల్యూగా పరిగణిస్తారు. యూఎల్‌పీపీలు కొంత సంక్లిష్టమైన ప్లాన్లే. ఈ ప్లాన్లపై మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అధిక చార్జీలు వసూలు చేస్తాయి. ఫలితంగా రాబడులు తగ్గుతాయి. రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఇక బీమా కోసం తగిన బీమా కవరేజ్ ఉండే టర్మ్‌బీమా పాలసీ తీసుకోవాలి - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
చంద్రబాబువి 420 ఆలోచనలు
వికృతరూపం.. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి ధ్వజం విజయవాడ బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు 420(ఫోర్ట్వంటీ) అలోచనలు వి కృతరూపం దాల్చుతున్నాయని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరరలతో మాట్లాడారు. ఎందుకంటే ఆయన పుట్టింది నాల్గో (ఏప్రిల్)నెల 20వ తేదీ అని, అందుకే చీటింగ్ మెంటాలిటీ ఉన్న ఆయన్ను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికే రైతుల బోర్లకు విద్యుత్ తొమ్మిది గంటలకు మించి ఉపయోగిస్తే యూనిట్‌కు రూ.మూడు నుంచి రూ.తొమ్మిది చొప్పున భారం మోపుతున్నారని మండిపడ్డారు. తాజాగా మంచినీటి కుళాయిలకు నీటి మీటర్లు ఏర్పాటుుకు ప్రయత్నాలు చేయడం ప్రజలను దగా చేయడమేనని మండిపడ్డారు. రాష్ట్రంలో 30 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టేందుకు చంద్రబాబు సర్కారు ప్రయత్నిస్తోందని విమర్శించారు. పీఎఫ్‌పై కేంద్రం వెనక్కి తగ్గడం శుభపరిణామం ఉద్యోగుల భవిష్యనిధి(పీఎఫ్)పై విధించిన ఆం క్షలపై ఉద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేంద్రం వెనక్కితగ్గడం శుభపరిణామం అన్నారు. కార్మిక వ్యతిరేక విధానలకు వ్యతిరేకంగా యూని యన్లు, కార్మికులు, ఉద్యోగులు సంఘటితంగా పోరాడి హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గౌతంరెడ్డితోపాటు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ విజయవాడ నగర అధ్యక్షుడు విశ్వనాథ రవి పాల్గొన్నారు. -
పీఎఫ్ సొమ్ముపై పన్నుకు 10న నిరసన
హైదరాబాద్: ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాలో జమయిన నగదును వెనక్కు తీసుకునే సమయంలో 60 శాతం మొత్తంపై పన్ను వేయాలని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రతిపాదించడాన్ని సీఐటీయూ, ఏఐటీయూసీ తీవ్రంగా ఖండించాయి. ఈ ప్రతిపాదనపై ఈనెల పదిన ఫ్యాక్టరీలు, పని ప్రదేశాల వద్ద ధర్నాలు నిర్వహించాలని సీఐటీయూ పిలుపివ్వగా పన్ను ప్రతిపాదనను పూర్తిగా ఉపసంహరించేంత వరకూ ఆందోళన చేయాలని కార్మికలోకానికి విజ్ఞప్తి చేసింది. కార్మిక సంఘాల వత్తిడితో కేంద్రప్రభుత్వం పన్ను ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కుతోందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కార్మికులు ఆరుగాలం కష్టపడి దాచుకున్న సొమ్మును పన్ను రూపంలో కాజేసేందుకు జరిగే కుయుక్తులను ప్రతిఘటింటేందుకు 10న ధర్నా చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రప్రభుత్వం గత రెండేళ్లలో బడా పారిశ్రామిక వేత్తలకు వేలాది కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చిందని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఓబులేసు ధ్వజమెత్తారు. పేదల కడుపు కొట్టి బ్యాంకుల్ని ముంచేసే పెద్దలకు రాయితీలు ఇస్తారా? అని ప్రశ్నించారు. పీఎఫ్ సొమ్ముపై అరుణ్‌జెట్లీ చేసిన ప్రతిపాదనను విరమించేంత వరకూ పోరాడాలని నిర్ణయించినట్టు తెలిపారు. -
ఉద్యోగులకు మేలు చేయండి.. దొంగలకు కాదు
ఈపీఎఫ్ ఉపసంహరణపై పన్ను వద్దు న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి ఉపసంహరణపై పన్ను విధించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. నల్లధనాన్ని చట్టబద్ధ ఆదాయంగా మార్చుకునే అవకాశమివ్వడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేయాలిగానీ దొంగలకు కాదని వ్యాఖ్యానించారు. గురువారం పార్లమెంటు ఆవరణలో రాహుల్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఉద్యోగులకు రక్షణగా ఉండే ఎంతో ముఖ్యమైన పీఎఫ్‌పై పన్ను విధించడం సరికాదు. ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం నింపాలని ప్రధాని మోదీని కోరుతున్నా..’’ అని రాహుల్ పేర్కొన్నారు. చిల్లర రాజకీయ ప్రసంగం పలు రంగాల్లో సంక్షోభం ఎదుర్కొంటున్న దేశానికి సాంత్వన చేకూర్చేలా ప్రధాని మోదీ ప్రసంగం లేదని కాంగ్రెస్ విమర్శించింది. రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై స్పందించకుండా చిల్లర రాజకీయాలకే ఆయన ప్రసంగం పరిమితమైందని ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. కృశ్చేవ్ వ్యాఖ్యలను మోదీ ఉటంకించడం ప్రమాదకర ధోరణికి సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, వ్యతిరేకించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ వైఫల్యాల గురించి కానీ, ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాల గురించి కానీ ఆయన ఒక్కమాటా మాట్లాడలేదు’ అన్నారు. నెహ్రూ వ్యాఖ్యలను మోదీ గుర్తు చేయడంపై వ్యంగ్యంగా స్పందిస్తూ.. ఈ మధ్య ప్రధాని కాస్త చదవడం ప్రారంభించినట్లున్నారు. -
ప్రతినెలా 15 లోపు భవిష్యనిధి చెల్లింపులు
గుంటూరు: ఉద్యోగుల భవిష్యనిధి చెల్లింపులు ఇక నుంచి ప్రతినెలా 15వ తేదీలోపు కట్టాలని రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పి.వీరభద్రస్వామి తెలిపారు. ఈపీఎఫ్ చట్టం కింద వివిధ వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు చెందిన యజమానులు ప్రతినెలా 15వ తేదీలోపు చెల్లింపులు చేయాల్సివుంటే, పెనాల్టీలు లేకుండా మరో ఐదు రోజుల గడువుతో చెల్లింపులకు అవకాశం ఇచ్చామన్నారు. ఫిబ్రవరి నుంచి ప్రతి నెలా 15 లోపు చెల్లింపులు జరపాలని, లేకుంటే ఆ మొత్తాలపై వడ్డీతోపాటు డామేజీలు కూడా ఉంటాయని తెలిపారు. ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన వ్యాపార, పారిశ్రామిక సంస్థల యజమానులు చెల్లింపులు చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు. -
ఈపీఎఫ్‌వో ఈటీఎఫ్ పెట్టుబడులు రూ.2,322 కోట్లు
న్యూఢిల్లీ: ‘ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్’ (ఈపీఎఫ్‌వో) ఈఏడాది అక్టోబర్ నాటికి రూ.2,322 కోట్లను ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో ఇన్వెస్ట్ చేసింది. ఈపీఎఫ్‌వో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్లను ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈపీఎఫ్‌వో ఆగస్ట్-అక్టోబర్ మధ్య కాలంలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రూ.2,322 కోట్లను క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టింది. సెన్సెక్స్ షేర్లలో రూ.588 కోట్లను, నిఫ్టీ షేర్లలో రూ.1,734 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. -
చిన్న సంస్థలకు ఈపీఎఫ్‌వో ఊరట...
న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధికి తమ వంతుగా కట్టాల్సిన మొత్తాన్ని జమ చేసే విధానం విషయంలో చిన్న సంస్థలకు ఈపీఎఫ్‌వో కొంత వెసులుబాటు కల్పించింది. ఇంతకు ముందు లాగానే సుమారు రూ. 1లక్ష కన్నా తక్కువగా జమ చేయాల్సిన మొత్తాన్ని చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌ల ద్వారా చెల్లించడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ దాకా ఈ వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత నుంచి మాత్రం ఆయా కంపెనీలు ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జమ చేయాల్సి ఉంటుందని ఈపీఎఫ్‌వో పేర్కొంది. -
ఈటీఎఫ్‌ల్లోకి ఈపీఎఫ్ఓ నిధులు
⇒ 2015-16లో 5 శాతం ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుమతి ⇒ మార్కెట్లోకి రూ.5,000 కోట్లు..! ⇒ ప్రణాళికను నోటిఫై చేసిన కార్మిక శాఖ న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నిధుల్లో కొంత మొత్తం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి రంగం సిద్ధమయ్యింది. ఈపీఎఫ్ఓ నిధుల్లో 5 శాతాన్ని ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో పెట్టుబడులుగా పెట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు పెట్టుబడుల ప్రణాళిక, విధివిధానాలను రెండు రోజుల క్రితం కార్మిక మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. కార్మిక శాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ ఇక్కడ ఈ విషయాన్ని విలేకరులకు తెలిపారు. తాజా నిర్ణయం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2015-16) దాదాపు రూ.5,000 కోట్ల ఈపీఎఫ్ఓ నిధులు మార్కెట్లోకి వస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలుత నిధిలో ఒక శాతాన్ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తామని, అటు తర్వాత దీనిని క్రమంగా ఐదు శాతం వరకూ పెంచుకుంటూ వెళ్లడం జరుగుతుందని అగర్వాల్ తెలిపారు. ఈటీఎఫ్ అంటే... ఈటీఎఫ్ ఒక ప్రత్యేక పత్రం లాంటిది. స్టాక్ ఎక్స్ఛేంజ్పై ఒక మామూలు స్టాక్ తరహాలో ఈటీఎఫ్ ట్రేడవుతుంది. 2001లో భారత్‌లో ఈటీఎఫ్‌ల ప్రొడక్ట్ ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 33 ఈటీఎఫ్‌లు ఉన్నాయి. వీటి కింద దాదాపు 6.2 లక్షల ఇన్వెస్టర్లకు చెందిన రూ.11,500 కోట్ల నిధుల నిర్వహణ జరుగుతోంది. భారత్ మార్కెట్లో గోల్డ్ ఈటీఎఫ్‌ల హవా భారీగా ఉంది. ఈపీఎఫ్ఓ తన నిధుల్లో కొంత భాగాన్ని సీపీఎస్ఈ ఈటీఎఫ్‌లో (ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్స్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పెట్టుబడులు పెట్టేలా ఇప్పటికే కార్మిక మంత్రిత్వశాఖతో పెట్టుబడుల శాఖ (డిజిన్వెస్ట్‌మెంట్ డిపార్ట్మెంట్- డీఓబీ) చర్చలు జరిపింది. డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శి ఆరాధనా జోహ్రీ ఇటీవల స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. దీనికి కార్మిక మంత్రిత్వశాఖ సానుకూలంగా ఉన్నట్లు కూడా సంకేతాలు ఇచ్చారు. 2014లో సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ను ఏర్పాటు చేశారు. 10 ప్రభుత్వ రంగ సంస్థల షేర్లతో ఈ ట్రేడెడ్ ఫండ్ బాస్కెట్ ఉంటుంది. ఈ ఫండ్‌లో పెట్టుబడుల ద్వారా ఇన్వెస్టర్లు ఓఎన్జీసీ, గెయిల్ ఇండియా, కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, ఆయిల్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, ఇంజినీర్స్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్‌లో సహవాటాదారుల అవకాశాన్ని పొందగలుగుతారు. సీపీఎస్ఈ ఈటీఎఫ్‌లో ఏ మేరకు పెట్టుబడులు పెట్టాలన్న అంశాన్ని త్వరలో నిర్ణయిస్తామని అగర్వాల్ పేర్కొన్నారు. నిధి... రూ.6.5 లక్షల కోట్లు... ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దాదాపు ఐదు కోట్ల మంది చందాదారులతో దాదాపు రూ.6.5 లక్షల కోట్ల నిధిని నిర్వహిస్తోంది. 2015-16 బడ్జెట్లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కూడా కనీసం 5 శాతం వరకూ ఈపీఎఫ్ఓ నిధులను ఈక్విటీ, సంబంధిత పథకాల్లో పెట్టుబడులను ప్రతిపాదించారు. గరిష్టంగా 15 శాతం వరకూ ఈ నిధులు ఉండవచ్చని సైతం ఆర్థిక శాఖ నిర్ణయించినట్లు స్వయంగా కార్మిక శాఖ కార్యదర్శి తెలిపారు. అయితే ఆచితూచి వ్యవహరిస్తూ, ఈ దిశలో ముందుకు వెళతామని ఆయన పేర్కొన్నారు. తొలుత ఈటీఎఫ్‌లలో మాత్రమే పెట్టుబడులు పెట్టడానికి ఈ ‘జాగరూకతే’ కారణమనీ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనుభవాలను చూస్తే... ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ వల్ల అధిక లాభాలు వస్తాయన్న విషయం రుజువవుతోందని కార్మిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 2014-15లో ఈపీఎఫ్ఓ ఇంక్రిమెంటల్ డిపాజిట్లు రూ.80,000 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇవి దాదాపు రూ. లక్ష కోట్ల వరకూ ఉంటాయని అంచనా. ఈపీఎఫ్ఓ సామాజిక భద్రతా పథకాల కింద కవరేజ్‌కు నెలవారీ వేతన సీలింగ్‌ను రూ.6,500 నుంచి రూ.15,000 కు గత ఏడాది సెప్టెంబర్‌లో పెంచడం దీనికి ఒక కారణం. -
ఈటీఎఫ్‌లలోకి ఈపీఎఫ్ఓ నిధులు!
- ఈటీఎఫ్‌ల్లో 5 శాతం వరకూ నిధులు - 2015-16లోనే రూ.17,000 కోట్లు పంప్... - త్వరలో నిబంధనల నోటిఫై! న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లు, ఈక్విటీ సంబంధిత పథకాలు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నిధులను మళ్లించడం దాదాపు ఖాయమయినట్లు కనబడుతోంది. ఇందుకు సంబంధించి నియమనిబంధనలను త్వరలో కార్మిక మంత్రిత్వశాఖ నోటిఫై చేసే అవకాశం ఉందని సమాచారం. మొత్తం ఈపీఎఫ్ఓ నిధుల్లో 5 శాతం వరకూ తొలుత ఈటీఎఫ్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు 2015-16 ఆర్థిక సంవత్సరంలోనే ఫండ్‌లోని దాదాపు రూ.17,000 కోట్లు ఈటీఎఫ్‌ల్లోకి మళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దాదాపు ఐదు కోట్ల మంది చందాదారులతో దాదాపు రూ.6.5 లక్షల కోట్ల నిధిని నిర్వహిస్తోంది. ఈటీఎఫ్ ఒక ప్రత్యేక పత్రం లాంటిది. స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఒక మామూలు స్టాక్ తరహాలో ఈటీఎఫ్ ట్రేడవుతుంది. సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ల్లో కూడా.... ఈపీఎఫ్ఓ తన నిధుల్లో కొంత భాగాన్ని సీపీఎస్ఈ ఈటీఎఫ్‌లో (ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్స్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పెట్టుబడులు పెట్టేలా ఇప్పటికే కార్మిక మంత్రిత్వశాఖతో పెట్టుబడుల శాఖ (డిజిన్వెస్ట్‌మెంట్ డిపార్ట్మెంట్- డీఓబీ) చర్చలు జరిపింది. డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శి ఆరాధనా జోహ్రీ ఇటీవల స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. 2001లో భారత్‌లో ఈటీఎఫ్‌ల శకం ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 33 ఈటీఎఫ్‌లు ఉన్నాయి. వీటి కింద దాదాపు 6.2 లక్షల ఇన్వెస్టర్లకు చెందిన రూ.11,500 కోట్ల నిధుల నిర్వహణ జరుగుతోంది. భారత్ మార్కెట్లో గోల్డ్ ఈటీఎఫ్‌ల హవా భారీగా ఉంది. -
ఈపీఎఫ్ఓ ఎస్ఎంఎస్ సేవలు ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తమ సభ్యుల కోసం ప్రవేశపెట్టిన సంక్షిప్త కోడ్ ఎస్ఎంఎస్ సేవలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ బుధవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ సార్వత్రిక ఖాతా నంబరు(యూఎన్ఏ)తో సేవలు పొందుతున్న సభ్యులకు సంక్షిప్త కోడ్ ఎస్ఎంఎస్ సేవ అందుబాటులో ఉంటుందని చెప్పారు. యూఎన్‌ఏలో రిజిష్టర్ అయిన సభ్యుల మొబైల్స్‌కు ఖాతాకు సంబంధించిన వివరాలు సంక్షిప్త సందేశాల రూపంలో అందుతాయన్నారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, తమిళం, మళయాలం, బెంగాలీ భాషల్లో సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. -
పీఎఫ్ డిపాజిట్లపై 8.75% వడ్డీ
ఈపీఎఫ్‌వో నిర్ణయానికి కేంద్రం ఆమోదం సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లోని 5 కోట్ల మంది చందాదారుల భవిష్య నిధి (పీఎఫ్) డిపాజిట్లపై 2014-15 ఆర్థిక సంవత్సరానికి కూడా 8.75 శాతం వడ్డీరేటును కొనసాగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణాయక సంస్థ అయిన కేంద్ర ట్రస్టీల బోర్డు(సీబీటీ) దీనిపై ఆగస్టు లో తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖ తాజాగా ఆమోదించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయాన్ని కార్మికశాఖ, ఆదాయపుపన్ను విభాగం ఇంకా నోటిఫై చేయాల్సి ఉందన్నాయి. నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుంచి వడ్డీరేటు అమల్లోకి వస్తుందని వివరించాయి. రూ. 1,000 పెన్షన్ పొడిగింపునకు ఓకే నెలకు కనీస పింఛన్ రూ. 1,000 చెల్లింపు పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరం తదుపరి కూడా కొనసాగించేందుకు సీబీటి అంగీకరించింది. చౌక గృహ రుణాలకు 15% నిధులను అందించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈపీఎఫ్ఓ నిధుల్లో 15 శాతం గృహరుణాల కోసం అందితే చౌక గృహాల నిర్మాణానికి రూ. 70,000 కోట్ల రుణ వితరణ ద్వారా, 3.5 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుందని గతంలో ప్రధాని కార్యాలయం సూచించింది. సంబంధిత ప్రతిపాదన పరిశీలనకు కమిటీని సీబీటీ నియమించనుంది. యాజమాన్య సంస్థల నుంచి ఇద్దరు, ఉద్యోగుల తరఫున ఇద్దరితో ఇది ఏర్పాటుకానుంది. కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సీబీటీకి అధ్యక్షత వహించారు. ఈపీఎఫ్, పెన్షన్ తదితరాలకు సంబంధించిన క్లెయిమ్‌ల పరిష్కార సమయాన్ని 30 రోజుల నుంచి 20 రోజులకు కుదించాలని నిర్ణయించింది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ప్రయివేట్ రంగ బాండ్లలో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తున్న 10% నిధుల ను 15%కు పెంచే ప్రతిపాదన పరిశీలనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీబీటీ నిర్ణయించింది. -
కొంపముంచిన ఈపీఎస్-95
కేంద్ర ప్రభుత్వం 1995లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీ మును ప్రారంభించి అప్పటివరకు ఉద్యోగులకు దీనిని కంపల్స రీ చేయడం జరిగింది. అప్పట్లో వేతనాన్ని నెలకు రూ. 6,000 లుగా లెక్కగట్టి పెన్షన్‌ను నిర్ణయించడంవల్ల రిటైరైన ఉద్యోగులకు పింఛను నెలకు వెయ్యి రూపాయలలోపే వస్తోంది. దీనికి కరువుభత్యంతో అనుసంధానం చేయకపోవడంవల్ల దశాబ్ద కాలంగా ఎదుగూబొదుగూ లేకుండాపోయింది. కొంత మంది పెన్షనర్లు తమ అవసరాల నిమిత్తం కొంత భాగాన్ని అమ్ముకు న్నారు. ప్రభుత్వ రూలు ప్రకారం ఈ భాగం తిరిగి పదిహేను సంవత్సరాల తరువాత పెన్షన్‌లో కలసిపోతుంది. కానీ, 95 నాటి ఈపీఎస్ స్కీములో ఉన్నవారికి ఈ రూలు వర్తించదట. అంటే వంద నెలల్లో అమ్మగా వచ్చిన మొత్తం బాకీ తీరిపోగా, వీరు జీవితాంతం కడుతూనే ఉండాలి. మరో విఘాతం ఏమిటంటే, ఈ పెన్షనర్లకు ఏ గవర్నమెంట్ ఆసుపత్రిలోనూ ఉచిత వైద్యం పొందే అవకాశం కల్పించలేదు. ప్రభుత్వ, లేదా బ్యాంకు ఉద్యోగులు.. డిపెండెంట్ల కింద వైద్య సదుపాయం పొందుదామంటే ప్రభుత్వ పెన్షను పొందుతున్నందున వీరు అర్హులుకారట. 1-4-2014 నుండి పెన్షన్‌ను రూ. వెయ్యి చేస్తామన్నారు. మరల 1-9-2014 నుంచి అన్నారు. కానీ రెండు నెలలు గడచినా పెంపు జరగలేదు. 1991లో మొదలైన నూతన ఆర్థిక విధానాల వల్ల ఆర్థికంగా నష్టపోయిన కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి 2002లో వేలాది ఉద్యోగులను బలవంతంగా వాలంటరీ సపరేషన్ స్కీం కింద తొలగించారు. ఉదాహరణకు అనేక రాష్ట్రాల్లోనున్న ఎరువుల కర్మాగారాలు (నేను రామగుండంలో పనిచేశాను). ఈ సంస్థల్లో 1992, 1997 లో జరగవలసిన వేతన సవరణలను జరపకుండా ఆపివేశారు. ఆ కారణంగా 1987లో ఉన్న వేతనాలమీద 2002లో వి.ఎస్.ఎస్ కింద కొంత అదనంగా కలిపి పంపించి వేశారు. ఈ విధంగా కూడా ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయారు. ఈ ఈపీఎస్-95 పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఏ ఒక్కరూ స్పందించలేదు. ఏ ఉద్యోగం చేయకపోయినా వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు బాగా పెంచారు. దశాబ్దాలపాటు ప్రభుత్వ ఉద్యోగం చేసినవారిని విస్మరిస్తున్నారు. 2002లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడున్నదీ బీజేపీ ప్రభుత్వమే. ఆవేదనతో రాసిన ఈ లేఖ చూసైనా మా ఈపీఎస్-95 పెన్షనర్లకు 1-1-2015 నుంచి నెలసరి పెన్షన్‌ను రూ. 7,500 లు (ప్రభుత్వం నిర్ణయించిన మినిమమ్ వేతనం 15,000 రూ.లను అనుసరించి) ఇస్తూ దీనివి కేంద్రం ఇచ్చే కరువు భత్యానికి అనుసంధానం చేయాలని విన్నవిస్తున్నాను. - ఎన్.ఎస్.ఆర్.మూర్తి రిటైర్డ్ ఆఫీసర్, రామగుండం ఎరువుల కర్మాగారం -
వచ్చే వారం 'పీఎఫ్ పై వడ్డీ'కి కేంద్రం ఆమోదం!
న్యూఢిల్లీ: పీఎఫ్ డిపాజిట్లపై 8.75 శాతం వడ్డీ చెల్లించాలన్న ఈపీఎఫ్‌వో నిర్ణయానికి కేంద్ర ఆర్థిక శాఖ వచ్చే వారంలో ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఆగస్టు 26న కార్మిక మంత్రి నరేంద్రసింగ్ తొమర్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఈపీఎఫ్‌వో కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశంలో పీఎఫ్ వడ్డీపై నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి కేంద్ర ఆర్థిక శాఖ లాంఛనంగా ఆమోదించాల్సి ఉంది. ఈపీఎఫ్‌వో 2012-13లో పీఎఫ్ డిపాజిట్లపై 8.50 శాతం వడ్డీ చెల్లించగా 2013-14లో 8.75 శాతం వడ్డీ చెల్లించింది. గతవారం ప్రకటించిన ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికశాఖ లాంఛనంగా ఆమోదించి అమలు చేయాల్సి ఉంది. ఈపీఎఫ్‌వోకు సుమారు 5 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. -
మూడు రోజుల్లోనే ‘పీఎఫ్’!
-
మూడు రోజుల్లోనే ‘పీఎఫ్’!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాదారులకు అందించే సేవల్లో మరింత పారదర్శక తెస్తామని కేంద్ర భవిష్యనిధి సంస్థ చీఫ్ కమిషనర్ కృషన్‌కుమార్ జలాన్ తెలిపారు. వచ్చే ఐదు నెలల్లో ఆన్లైన్ సేవలు పూర్తిగా అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఉద్యోగులు పీఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లోనే క్లెయిమ్‌లు పరిష్కరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున యూనివర్సల్ అకౌంట్ నంబర్లను కేటాయిస్తున్నామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల పీఎఫ్ కార్యాలయాల సిబ్బం దితో జలాన్ భేటీ అయ్యారు. అత్యాధునిక సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. సమావేశంలో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ ఎస్కేవీ సత్యనారాయణ, అదనపు కమిషనర్ కేవీ సర్వేశ్వరరావు పాల్గొన్నారు. ‘ఆన్లైన్ సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తే కేవలం 3 నుంచి 10 రోజుల్లోనే పీఎఫ్ ఖాతాదారుల సొమ్ము బ్యాంకు ఖాతాకు జమ చేయటం సాధ్యపడుతుంది. యాజమాన్యాల సంతకాలను డిజిటైజ్ చేయడం వల్ల వారి చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా సులభంగా పరిష్కరించే అవకాశం కలుగుతుంది. ఆన్లైన్లో సులభంగా క్లెయిమ్ చేసుకునేలా సరళీకరిస్తున్నాం. ఫిర్యాదులపై కేంద్ర నిఘా విభాగం, పీఎఫ్ కేంద్ర కార్యాలయం దృష్టి పెట్టింది.’ అని జలాన్ తెలిపారు. ఈ 3 తప్పనిసరి..: ఆన్లైన్ సేవలు అందించేందుకు పీఎఫ్ ఖాతాదారుల పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నట్టు జలాన్ తెలిపారు. ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాలు, పాన్, ఆధార్ కార్డు నంబర్లను పీఎఫ్ ఖాతాకు జత చేయాలన్నారు. ఈ మూడు డాక్యుమెంట్లు తప్పనిసరని, ఇవి ఉంటేనే యూనివర్సల్ నంబర్ ఇవ్వడం సాధ్యమవుతుందన్నారు. రేషన్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్ పత్రాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా పర్వాలేదన్నారు. పీఎఫ్ ఇచ్చిన బ్యాంకు ఖాతా మా ర్చుకుంటే వెంటనే ఆ సమాచారం అందజేయాలని కోరారు. ►పీఎఫ్ ఖాతాల్లో నిలిచిన సొమ్ము రూ. 32,000 కోట్లు ►దేశవ్యాప్తంగా గత 10 రోజుల్లో 50 లక్షల యూఎన్ఏ నెంబర్లు జారీ. ►ఈ నెలాఖరు కల్లా కనీసం కోటి మంది ఖాతాదారుల పూర్తి డేటా సేకరణకు సిద్ధం. ►ఉద్యోగులు సంస్థలు మారడం, చిరునామాలు సరిగా లేక పీఎఫ్ ఖాతాల్లో స్తంభించిన సొమ్ము దేశవ్యాప్తంగా గత మూడేళ్లలో రూ. 32 వేల కోట్లకు చేరుకుంది. -
కనీస పెన్షన్ అమలు
వేతన పరిమితి పెంపుపైనా ఈపీఎఫ్‌వో చర్యలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు పీఎఫ్ ఖాతాదారులకు కనిష్ట వేతన పరిమితి, కనీస పింఛను అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) తన సిబ్బందిని ఆదేశించింది. ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే కనిష్ట వేతన పరిమితిని ప్రస్తుతమున్న రూ. 6,500 నుంచి రూ. 15 వేలకు పెంచుతున్నట్లు, అలాగే ఉద్యోగుల పెన్షన్ పథకం(ఈపీఎస్) కింద పెన్షనర్లకు కనీసం వెయ్యి రూపాయల పింఛను అందిస్తామని ఇటీవలి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ దిశగా ఈపీఎఫ్‌వో సంస్థ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదలకానుందని, ఈ నిర్ణయాల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని తన సిబ్బందిని ఆదేశిస్తూ ఈపీఎఫ్‌వో కార్యాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి సర్వీస్ కాలంలోని చివరి 60 నెలల్లో పొందిన సగటు జీతాన్ని బట్టి పెన్షన్ మొత్తాన్ని లెక్కిస్తారు. ఇక పీఎఫ్ పరిధిలోకి వచ్చే కనిష్ట వేతన పరిమితిని కూడా పెంచిన నేపథ్యంలో అంతకన్నా అధిక మూల వేతనం పొందుతున్న ఉద్యోగులు ఆ మేరకు ఎక్కువ పీఎఫ్‌ను చెల్లించే విషయంపై అభిప్రాయాలు తీసుకోవాలని, వారి నిర్ణయాన్ని 6 నెలల్లో అమలు చేయాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఈపీఎఫ్‌వో ఆదేశించింది. వేతన పరిమితి పెంపు వల్ల మరో 50 లక్షల మంది ఉద్యోగులు ఈపీఎఫ్‌వో పరిధిలోకి రానున్నారు. అలాగే రూ. వెయ్యి కనీస పింఛ ను నిర్ణయం వల్ల దాదాపు 28 లక్షల మంది పెన్షనర్లు లబ్ధిపొందనున్నారు. కాగా, కనీసం పది మంది ఉద్యోగులున్న సంస్థలను ఈపీఎఫ్‌వో పరిధిలోకి తేచ్చే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ప్రస్తుతం కనీసం 20మంది ఉద్యోగులున్న సంస్థలకే పీఎఫ్‌ను వర్తింపజేస్తున్నారు. ఈ మేరకు చట్ట సవరణ చేయాలని యోచిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి విష్ణుదేవ్ సాయి రాజ్యసభలో ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అసంఘటిత రంగంలోని కార్మికులను ఈపీఎఫ్‌వో పరిధిలోకి తెచ్చే ఆలోచనేదీ ప్రస్తుతానికి లేదని కూడా తెలిపారు. -
పీఎఫ్ డిపాజిట్లపై 9% వడ్డీ!
మెరుగుపడిన మార్కెట్ పరిస్థితుల ఫలితం న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పీఎఫ్ డిపాజిట్లపై ఈ ఏడాది తొమ్మిది శాతం వడ్డీని అందజేసే అవకాశం కన్పిస్తోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో తన ఐదు కోట్లకు పైగా చందాదారులకు ఈపీఎఫ్ఓ 8.75 శాతం వడ్డీని చెల్లించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఈ వడ్డీని 0.25 శాతం మేరకు సులభంగా పెంచే అవకాశం ఉన్నట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందని ఈపీఎఫ్ఓ వర్గాలు వెల్లడించారుు. ముఖ్యంగా కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెరుగుపడిన మార్కెట్ పరిస్థితులు.. సంస్థ పెట్టిన వివిధ రకాల పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు సమకూరవచ్చనే అంచనాలను పెంచాయని ఆ వర్గాలు వివరించారుు. ఈపీఎఫ్ఓ సాధారణంగా రూ.5 లక్షల కోట్ల మూలనిధిని నిర్వహిస్తూంటుంది. 2013-14లో వివిధ సామాజిక భద్రతా పథకాల కింద తన ఖాతాదారుల నుంచి రూ.71,195 కోట్ల ఇంక్రిమెంట్ల సంబంధిత డిపాజిట్లను స్వీకరించింది. ఇది అంతకుమునుపు ఏడాది (రూ.61,143 కోట్లు)తో పోల్చుకుంటే 16% అధికం. మరోవైపు ప్రత్యేక డిపాజిట్ పథకం (ఎస్డీఎస్) కింద ఉన్న సుమారు రూ.55 వేల కోట్ల తన పెట్టుబడులను నగదుగా మార్చే యోచనలో ఈపీఎఫ్ఓ ఉంది. -
మరో ఈపీఎఫ్ స్కాం!
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: ఏపీ ఆయిల్‌ఫెడ్ అశ్వారావుపేట డివిజన్ కార్యాలయంలో మరో ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) కుంభకోణం వెలుగుచూసింది. దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన దొడ్డా రమేష్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలు ‘న్యూస్‌లైన్’కు అందాయి. వాటిలో పేర్కొన్న ప్రకారం డివిజన్ కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న 20 మంది కార్మికులకు ఈపీఎఫ్ చెల్లించడం లేదని డివిజనల్ ఆఫీసర్ రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు 2011 నుంచి ఇప్పటి వరకు అశ్వారావుపేటకు చెందిన బి. పిచ్చయ్య అనే లేబర్ కాంట్రాక్టర్ కార్యాలయానికి కార్మికులను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. - కాంట్రాక్టు ఒప్పంద పత్రాలను అడిగినప్పటికీ కార్యాలయ అధికారులు ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. కాంట్రాక్టు నిబంధనలు, కార్మికుల పనివేళలు, వేతనాల ఒప్పందం వివరాలను బయటకు వెల్లడించటంలేదు. వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో ఈ-ప్రొక్యూర్మెంట్, ఆన్లైన్ టెండర్ విధానంలో కాంట్రాక్టుల కేటాయింపులు జరుగుతున్నా.. ఆయిల్‌ఫెడ్‌లో మాత్రం నామినేషన్ విధానంపైనే నాలుగేళ్లుగా ఒకే కాంట్రాక్టర్‌కు ఫ్యాక్టరీని కట్టబెడుతున్నారు. కాంట్రాక్టు కేటాయింపు నిబంధనలకూ నీళ్లొదిలేశారు. ఎల్ 1 (తక్కువ ధర కోడ్ చేసిన మొదటి పాధాన్యత) బిడ్డర్ అయిన డి.సుబ్బారావును మినహాయించి ఎల్ 2 (తక్కువ ధర కోడ్ చేసిన రెండో ప్రాధాన్యత) బిడ్డర్ అయిన బి. పిచ్చయ్యకే కాంట్రాక్టు కట్టబెట్టారు. ఎక్కువ ధర కోడ్ చేసిన ఎల్1 కు ఎందుకు కాంట్రాక్టు కేటాయించలేదో వెల్లడించలేదు. ప్రతి లేబర్ కాంట్రాక్టుకూ ఏడాది లేదా రెండేళ్లు పరిమితి ఉంటుంది. కానీ ఈ కాంట్రాక్టుకు మాత్రం పరిమితి లేదు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పిచ్చయ్య కాంట్రాక్టు కొనసాగుతూనే ఉంటుంది. కాంట్రాక్టర్ కేవలం సర్వీస్ టాక్స్ మాత్రమే చెల్లిస్తూ 20మంది లోపు ఉన్న కాంట్రాక్టు కార్మికులకు పీఎఫ్ చెల్లించడం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఓ బిల్లు చెల్లించిన తర్వాత మరో బిల్లు చె ల్లించే ముందు గత చెల్లింపులో ఈపీఎఫ్ చెల్లింపుల వివరాలను పరిశీలించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. కానీ ఇక్కడ అలాంటివేవీ జరగడం లేదు. అశ్వారావుపేట డివిజనల్ కార్యాలయం ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ పనిచేసిన కొందరు అవినీతి అధికారులతో కాంట్రాక్టర్ కుమారుడు మధుకు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు దక్కుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈపీఎఫ్‌లు చెల్లించకున్నా యధాతథంగా బిల్లులు డ్రా అవుతున్నాయని అంటున్నారు. ఈ విషయమై ఆయిల్‌ఫెడ్ అశ్వారావుపేట డివిజనల్ ఆఫీసర్ రమేష్‌కుమార్‌రెడ్డిని ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా.. కాంట్రాక్టర్ ఈపీఎఫ్‌లు చెల్లించినట్లు కార్యాలయానికి ఇప్పటి వరకు తెలియజేయలేదన్నారు. ఈపీఎఫ్‌కు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. -
రూ.వెయ్యి పింఛన్‌కు త్వరలో శ్రీకారం
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) చందాదారులకు శుభవార్త. ఉద్యోగుల పింఛన్ పథకం(ఈపీఎస్-95) కింద... పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కనీస పింఛన్ రూ. వెయ్యి అందించాలన్న పథకం త్వరలో అమలు కానుంది. ఐదు లక్షల మంది వితంతువులు సహా.. 28 లక్షల మంది పెన్షనర్లకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది. ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావాల్సి ఉన్నా ఎన్నికల నియమావళి వల్ల అది సాధ్యంకాలేదు. ఎన్నికలు పూర్తయినందున ఇప్పుడీ ఈ పథకాన్ని (ఈపీఎస్-95) అమలు చేయనున్నట్టు ఈపీఎఫ్ఓ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు.కనీస పింఛన్ కింద రూ.వెయ్యిని అందజేసేందుకోసం కేంద్రం ఈపీఎఫ్‌వోకు రూ.1,217 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. -
ఇక ఆన్లైన్లో పీఎఫ్ చెల్లించొచ్చు
న్యూఢిల్లీ: వ్యవస్థీకృత రంగంలోని కంపెనీలు తమ ఉద్యోగుల ఫీఎఫ్ చందాల డబ్బును ఇకపై ఏ బ్యాంకు ద్వారానైనా ఆన్లైన్లోనే భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో)కు చెల్లించేందుకు వీలు కానుంది. ప్రస్తుతం ఎస్బీఐలో ఉద్యోగుల ఖాతాలున్న కంపెనీల నుంచి మాత్రమే పీఎఫ్ డబ్బులను ఆన్లైన్లో ఈపీఎఫ్‌వో స్వీకరిస్తోంది. మరో ఆరు నెలల్లో ఎస్బీఐ యేతర బ్యాంకుల్లో ఖాతాలున్న ఉద్యోగుల పీఎఫ్ డబ్బులు కూడా ఆన్లైన్లో స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖకు ఈపీఎఫ్‌వో ఓ లేఖలో తెలిపింది. -
కనీస పెన్షన్ రూ.1000
న్యూఢిల్లీ: అర్హులైన పెన్షన్‌దారులకు నెలవారీ కనీస పెన్షన్‌గా రూ.1,000 ఇవ్వాలని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) నిర్ణయించింది. ఈపీఎఫ్ఓలోని అత్యున్నత నిర్ణయ విభాగమైన ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ)’ బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోదించాల్సి ఉంది. అనంతరం సీబీటీ భేటీకి అధ్యక్షత వహించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కింది వివరాలను వెల్లడించారు. ఉద్యోగస్తుల పెన్షన్ పథకం(ఈపీఎస్-95) కింద కనీసం రూ. 1000 పెన్షన్‌గా ఇవ్వడం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల 5 లక్షల మంది భర్తను కోల్పోయిన మహిళలు సహా దాదాపు 28 లక్షల పెన్షన్‌దారులు తక్షణం లబ్ధి పొందుతారు. ఈపీఎస్ కింద ఉన్న మొత్తం పెన్షన్‌దారుల సంఖ్య 44 లక్షలు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,217 కోట్లను అదనంగా సమకూర్చాల్సి ఉంది. ఈపీఎఫ్ఓ చందాదారులు.. వయస్సు 58 ఏళ్లు దాటగానే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పెన్షన్‌కు అర్హమైన వేతనాన్ని గణించే పద్ధతిని కూడా మార్చారు. గతంలో 12 నెలల సగటు వేతనం ఆధారంగా గణించగా, ఇకనుంచి 60 నెలల సగటు వేతనం ఆధారంగా లెక్కిస్తారు. ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) పథకం కింద వేతన పరిమితినిరూ.6,500(మూలవేతనం, డీఏ కలిపి) నుంచి రూ.15 వేలకు పెంచాలని కూడా సీబీటీ నిర్ణయించింది. దీంతో మరో 50 లక్షల మంది ఈపీఎఫ్ఓ సామాజిక భద్రత పథకాల్లో చేరేందుకు అర్హులవుతారు. దీన్ని సీబీటీలోని కార్మిక సంఘాల ప్రతినిధులు వ్యతిరేకించారు. డీఏతో కూడిన మూల వేతనంపై 1.1 శాతం ఉన్న అడ్మినిస్ట్రేటివ్ చార్జీలను 0.85కి తగ్గించా రు. ఈ చార్జీలను యాజమాన్యం చెల్లించాలి. కేంద్రం నిధులను సమకూర్చాల్సి ఉన్నందున కార్మిక మంత్రిత్వ శాఖ త్వరలో ఈ ప్రతిపాదనను కేబినెట్ ముందు ఉంచుతారని ఈపీఎఫ్ఓ అధికారులు తెలిపారు. -
పింఛను స్కీం రిటైర్మెంట్ వయసు పెంపు!
ప్రతిపాదనను పరిశీలించనున్న ఈపీఎఫ్ఓ ట్రస్టీల బోర్డు న్యూఢిల్లీ: ఉద్యోగుల పింఛను పథకం పరిధిలోకి వచ్చే సంఘటిత రంగ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) అత్యున్నత నిర్ణాయక మండలి అయిన ట్రస్టీల కేంద్ర మండలి(సీబీటీ) నెల 5న జరిగే సమావేశంలో పరిశీలించనుంది. కేంద్ర కార్మిక మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ నేతృత్వంలో జరిగే ఈ భేటీలో.. 20 ఏళ్ల సర్వీసు ఉన్న వారికి రెండేళ్ల బోనస్‌ను విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించాలన్న ప్రతిపాదనపైనా చర్చించనున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్-95) కింద చందాదారులు సభ్యత్వాన్ని వదులుకుని పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అంటే వారు 58 ఏళ్ల తర్వాత పథకంలో కొనసాగలేరు. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలకు చందాలు జమచేయడానికి ఎలాంటి వయోపరిమితి లేదని ఈపీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఈపీఎస్ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచితే 27 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి కలుగుతుంది. కార్మిక శాఖకు అందజేసిన మెమొరాండంలో ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనలను పొందుపరచింది. ఈపీఎస్ పథకం కింద కనీస పింఛనును రూ.1,000కి పెంచేందుకు ఆర్థిక శాఖ ఆమోదించడం తెలిసిందే. -
పీఎఫ్‌పై వడ్డీ 8.75%
కేంద్రానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ప్రతిపాదన ఆర్థికశాఖ ఆమోదం అనంతరం అమలు మూల వేతనం నుంచి మరో 10% సేకరించి ఇళ్లు నిర్మించి ఇచ్చే అంశంపై పరిశీలన న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్) ఖాతాలకు చెల్లించే వడ్డీని స్వల్పంగా పెంచుతూ ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌పై వడ్డీ 8.5 శాతంగా ఉండగా.. 2013-14 ఆర్థిక సంవత్సరానికిగానూ 8.75 శాతంగా నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) ప్రకటించింది. సోమవారం ఢిల్లీలో కేంద్ర కార్మికశాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఆధ్వర్యంలో సీబీటీ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎఫ్‌పై వడ్డీ పెంపు నిర్ణయం దేశవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుందని కార్మికశాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిన వెంటనే పెంపు అమలవుతుందని కేంద్ర భవిష్యనిధి కమిషన్ చైర్మన్ కేకే జలాన్ చెప్పారు. ఈ ఏడాది మొత్తం పీఎఫ్ సొమ్ముపై సుమారు రూ. 25,048 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని.. అందులో 8.75% వడ్డీకి రూ. 25,005 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. మిగతా సొమ్ము నిల్వ ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు తక్కువ ఆదాయం వస్తున్న మార్గాల నుంచి మరింత మెరుగైన పథకాల్లోకి పీఎఫ్ నిధులను మళ్లిస్తామని జలాన్ చెప్పారు. ఉద్యోగుల మూల వేతనం నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్నదానికి అదనంగా మరో 10 శాతం తీసుకుని, వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగుల ప్రమాద బీమా పథకం కింద అందజేసే సొమ్మును 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఇక నుంచి బీమా కింద రూ. 1,56,000 ఇస్తారు. దాంతోపాటు ఈపీఎఫ్, ఈడీఎల్ఐ పథకాల నిర్వహణ కోసం వసూలు చేసే కనీస చార్జీలను రూ. 500, రూ. 200కు పెంచారు. -
పింఛనుదారులపైన పిడుగు
విశ్లేషణ: ఉద్యోగి మరణించినప్పుడు గానీ, రాజీనామా చేసినప్పుడు గానీ అతనికి, అతని కుటుంబానికి ఏ రకంగా లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని ఈ బిల్లులో స్పష్టపరచలేదు. 25-30 ఏళ్ల తరువాత ఈ ఫండ్ మేనేజర్‌పై ప్రభుత్వ అజమాయిషీ ఎంతవరకు ఉంటుంది? ఏజెన్సీ, సంబంధిత మార్కెట్ దివాళా తీసినా, మూతపడినా ఆ సంస్థలో జమ అయిన ఫండ్‌కు ఎవరు బాధ్యత వహిస్తారో ఈ బిల్లులో పొందుపరచలేదు. సంస్కరణలు, ప్రపంచీకరణ ల అసలు స్వరూపం రోజు రోజు కూ స్ఫుటంగా కనిపిస్తోంది. అమర్త్యసేన్ వంటివారు సంస్క రణలకు మానవీయ కోణం ఉం డాలని ఎంత చెప్పినా ప్రభుత్వా లకు పట్టడం లేదు. సంస్కర ణలు, వీటి పునాదిగా జరుగుతున్న ప్రభుత్వ నిర్ణయాలు అమానవీయంగానే ఉంటున్నాయి. ఆఖరికి ఉద్యోగులు దీర్ఘకాలంగా పోరాడి సాధించుకున్న పింఛను పథకం కూడా ఇక మార్కెట్ పరం కానుంది. ఉద్యోగుల పింఛను పథకానికి సంబంధించిన 80 బిలియన్ డాలర్లు బాండ్ మార్కెట్‌కు ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతించ నుంది. ఈ నిధిని కార్పొరేట్ బాండ్లలో మదుపు చేయడా నికి నిబంధనలు సరళం కానున్నాయి. కొత్త నిబంధనలు వెబ్‌లో మాత్రమే, రహస్యంగా కనిపిస్తాయి. ఇదంతా అమలులోకి రావడానికి ఇక మిగిలి ఉన్న లాంఛనం- ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఆమోదమే. భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేటురంగాలకు చెందిన ఎనిమిదిన్నర కోట్ల మంది పింఛను నిధి భవిష్య నిధి సంస్థ నిర్వహణలో ఉం ది. దీనిని ఇతర రంగాలలో మదుపు పెట్టడం నిబంధ నలకు విరుద్ధం. కానీ కొత్త నిబంధనల ప్రకారం మొత్తం పింఛను నిధిలో ఐదు శాతం వరకు ట్రెజరీ బిల్లులతో సహా మనీ మార్కెట్లో మదుపు చేయవచ్చు. ఈ నిధులను ఇప్పుడు 55 శాతం వరకు కూడా ప్రభుత్వ రంగ ఆర్థిక వ్యవస్థలలో మదుపు చేయవచ్చు. పారిశ్రామికవేత్తల కోసమే! విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు ఆసరాగా నిలిచే పింఛను నిధి నిల్వలను పెట్టుబడుల రూపంలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాల కోసం మళ్లించడానికి దీర్ఘకాలంగా మూల బడి ఉన్న పింఛను నిధి, నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) బిల్లు 2011ను 4 సెప్టెంబర్ 2013న లోక్ సభ ఆమోదించింది. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ల ఒత్తిడి మేరకు పెన్షన్ భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగుల ప్రయోజనాలను గాలికొదిలేసి ప్రైవేట్ పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమో దించిందనే దేశంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గా లు నమ్మవలసివస్తున్నది. ఈ బిల్లు ఆమోదానికి వ్యతిరే కంగా ఢిల్లీలో 12 డిసెంబర్ 2013న అభిల భారత ప్రభు త్వ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించే మహా ప్రదర్శనలో అన్ని రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఉద్యో గులు పాల్గొననున్నారు. ఎన్డీయే, యూపీఏల పాత్ర మొట్టమొదటిసారిగా ఈ పీఎఫ్ఆర్డీఏ బిల్లును 2003లో ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 6వ సీపీసీ (సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్, పాలసీ) ఈ బిల్లును పరిశీలించడానికి 2006లో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ తన నివేదికలో నూతన ఫింఛను విధానం అమలు చేయడం వలన పూర్వం నుంచి అమలులో ఉన్న ఉద్యోగుల పింఛను విధానం సందిగ్ధంలో పడింది. కనుక మరో కొత్త విధానాన్ని అమలు చేసేటప్పుడు జాగ్రత్తలు ఎంతైనా అవసరమని స్పష్టం చేసింది. 2011లో యూపీఏ ప్రభుత్వం ఈ బిల్లుకే కొన్ని సవరణలు చేసి పార్లమెంటు లో ప్రవేశపెట్టింది. దీని ద్వారా పింఛనుదారుల సొమ్ము లో కొంత భాగాన్ని మార్కెట్లలో మదుపుచేయడానికి వీలు కల్పించాలని కోరింది. ముఖ్యాంశాలు సైనిక బలగాలు మినహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు లలో 2004 జనవరి 1 నుంచి చేరిన ఉద్యోగులను ఈ బిల్లు పరిధిలోకి తెస్తారు. స్వచ్ఛంద ప్రవేశ ప్రాతిపదికన 2009 నుంచి పౌరులందరికీ వర్తిస్తుంది. ఈ చట్టం పరిధిలోని ఉద్యోగులు సాధారణ భవిష్యనిధిలో జమ చేసుకునేం దుకు వీలులేదు. ఈ పెన్షన్ ఫండ్‌పై అజమాయిషీ చట్ట పరమైన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి ఉంటుంది. ప్రతి ఉద్యోగి బేసిక్‌పే, డీఏ కలిపిన మొత్తంలో 10 శాతం ప్రతినెలా ఈ పింఛన్ ఫండ్‌లో జమ చేయాలి. ఇందులో జయ అయిన మొత్తాన్ని ఎట్టి పరిస్థితు ల్లోనూ పదవీ విరమణ దాకా ఉపసంహరించరాదు. ఈ బిల్లులో వ్యక్తిగత ఖాతా నుంచి డబ్బును తీసుకునేందుకు ప్రభుత్వానికి ఆమోదం లభించింది. ఈ బిల్లులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని మంత్రి మండలి 26 శాతంగా నిర్ణయించింది. దీనికి తోడు ప్రభుత్వం పెన్షన్ బాధ్యతలను తప్పించుకోవడానికి ఉద్యోగులు దాచుకున్న సొమ్మును పరిమితికి లోబడి ప్రభుత్వమే స్టాక్ మార్కెట్‌కు తరలించడం, పెన్షన్ నిర్వహణ సంస్థలోకి బీమా రంగం లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి తగిన చట్టబద్ధతను ప్రభుత్వం పొందింది. అన్నీ అస్పష్టతలే చందాదారులకు కనీస ఆదాయాన్ని ఇచ్చే విధంగా రూపొందించామన్న ఈ పెన్షన్ విధానంలో దాదాపు 30 నుంచి 35 సంవత్సరాలు ఒక ఉద్యోగి ప్రభుత్వ సర్వీసులో పనిచేసి ఈ నిధికి డబ్బు జమ చేసిన తరువాత పదవీ విర మణ చేస్తే ప్రతి రూపాయికి ఎంత పెన్షన్ వస్తుంది? కనీ సం వడ్డీ ప్రకటిస్తుందా? అన్న విషయాల్లో స్పష్టత లేదు. ఉద్యోగి మధ్యలో మరణించినప్పుడు గానీ, రాజీనామా చేసినప్పుడు గానీ అతనికి, అతని కుటుంబానికి ఏ రకం గా లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని ఈ బిల్లులో స్పష్టపర చలేదు. 25-30 ఏళ్ల తరువాత ఈ ఫండ్ మేనేజర్‌పై ప్రభు త్వ అజమాయిషీ ఎంతవరకు ఉంటుంది? ఏజెన్సీ, సం బంధిత మార్కెట్ దివాళా తీసినా, మూత పడినా ఆ సంస్థలో జమ అయిన ఫండ్‌కు ఎవరు బాధ్యత వహిస్తారో ఈ బిల్లులో పొందుపరచలేదు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వోద్యో గులకు మాత్రమే ఈ బిల్లును వర్తింపజేసి, సైనికోద్యోగు లకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో వివరించలేదు. ఈ బిల్లులో పీఎఫ్ఆర్డీఏ సంస్థకు చట్టబద్ధత లభించడం ఒక్కటేనా, ఇతరత్రా మార్పులేమైనా ప్రతిపాదించారా? అన్నది సగటు ఉద్యోగికి అర్థం కావడం లేదు. ఒడిదుడుకులలో పింఛన్ ఈ బిల్లు అమలైతే పెన్షన్‌లో పెంపుదల ఉండకపోవచ్చు. 2004 నుంచి అమలు చేస్తున్న సీపీఎస్ విధానంలో ఉద్యో గుల జీతాల నుంచి పెన్షన్ ఫండ్‌లోకి జమ అయ్యే మొత్తా నికి హామీ లేదు. ఉద్యోగి దాచుకున్న మొత్తమంతా పదవీ విరమణ వరకు అక్కడే చిక్కుకుపోయి ఉంటుంది. పాత పెన్షన్ విధానం వర్తించే వారికీ గ్రాట్యూటీ చెల్లింపు అను మానమే. మెచ్యూరిటీ సమయంలో 40 శాతం మొత్తాన్ని తదుపరి నెలవారిగా పింఛను అందుకోవడానికి పీఎఫ్ఆర్ డీఏ వద్దనే ఉండాలనడం సరికాదు. ఉద్యోగం వలన పొం దే స్థిర ఆదాయం నిలిచిపోయిన విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం ప్రతినెలా ఇచ్చే భృతి ఇక మార్కెట్ ఒడిదుడు కులకు లోనుకానుంది. వేతనజీవులకు జీతాల నుంచి దాచుకున్న సొమ్ముపై అధికారం ఉండదు. ప్రభుత్వానికే అధికారం లభిస్తుంది. సాధారణ భవిష్యనిధి (జీపీఎఫ్) లో ఇచ్చే విధంగా మధ్యలో అప్పు ఇచ్చే సౌకర్యం, నిధిలో పార్ట్ ఫైనల్ పేమెంట్లు కల్పించకపోవడం, వేతన సవర ణలు ప్రకటించినప్పుడల్లా పింఛనుదారులకు కూడా ఇస్తు న్న భృతి పెంచకపోవడం. ఆర్థిక సంస్కరణలు, పెట్టుబ డుల ఉపసంహరణ వంటి వాటితో యూపీఏ ఉద్యోగ వర్గాల నుంచి కొత్త సమస్యను కొని తెచ్చిపెట్టుకుంది. కార్మిక శంఖారావం మొత్తంగా ఈ వైఖరిని నిరసిస్తూనే జాతీయ స్థాయి కార్మిక సంఘాలు పార్లమెంటు ముందు నిరసన ప్రదర్శన నిర్వ హించాలని భావిస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఆపాలనీ, కార్మిక చట్టాలను పటిష్టం చేయాలనీ, కనీస వేతనాలు పెంచాలనీ కూడా ఈ ప్రదర్శనలో కార్మిక సంఘాలు గట్టిగా కోరనున్నాయి. ప్రధానిని కలిసి పది సూత్రాలను ప్రతిపాదించాలని కూడా కార్మిక నేతలు ఆశిస్తున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరే షన్లో వాటాల ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణ యించిన నేపథ్యంలో కార్మిక సంఘాలు ఈ నిరసనకు దిగుతున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.40 వేల కోట్లు పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా సేకరిం చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐఎన్టీయుసీ, ఏఐటీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ ఈ నిరసనలో పాల్గొంటున్నాయి. ఇంకా ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండి యా కార్మిక సంఘం కూడా పాల్గొంటున్నది. రాష్ట్రపతికి వినతి నిజానికి ఈ మేనెలలోనే పది అంశాలతో కూడిన ఒక విన తిపత్రాన్ని కార్మిక సంఘాలు ప్రధానమంత్రికి సమర్పిం చాయి. ఇందులో పెట్టుబడుల ఉపసంహరణ తక్షణం నిలిపివేయాలని , కనీస వేతనాలు వెంటనే పెంచాలని కోరారు. మొత్తంగా ఉద్యోగులకు, కార్మికులకు పింఛను సౌకర్యం వర్తింపచేయాలని కూడా కార్మిక సంఘాలు కోరు తున్నాయి.ఈ అంశాలను రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నాయకత్వంలోని మంత్రుల బృందానికి ప్రధాని అందచే శారు. మంత్రివర్గ బృందం మాత్రం వీటి గురించి ఆలోచిం చడానికి ఇంకా సమయం కావాలని కోరింది. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని, పెన్షన్ నిధుల ప్రైవేటీకరణ ఆ పాలని, ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదించరాదని, రాష్ర్టపతి అనుమతి ఇవ్వరాదని, ప్రస్తుత పాతపెన్షన్ విధా నాన్నే కొనసాగించాలని సంఘాలు కోరుతున్నాయి. - హరి అశోక్ కుమార్ గౌరవ అధ్యక్షులు రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం -
ఆన్లైన్లో పీఎఫ్ ఖాతాల వివరాలు
సాక్షి, హైదరాబాద్: ఇకనుంచి ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాల వివరాలను ఆన్లైన్లో చూసుకునే వెసులుబాటు కల్పించినట్లు హైదరాబాద్ ఈపీఎఫ్ కమిషనర్ పి.రాజశేఖరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. www.epfindia.com వెబ్సైట్లో ఈ వివరాలు లభిస్తాయన్నారు. ఈ సైట్‌లోని ఎస్టాబ్లిష్మెంట్ సెర్చ్ లో ఉద్యోగుల వివరాలు కూడా లభ్యమౌతాయన్నారు. నెలవారీగా ప్రతి ఉద్యోగి, యాజమాన్యాలు పీఎఫ్ ఖాతాల్లో జమచేసిన మొత్తాలు, పాస్‌బుక్‌లను ఈ సైట్లో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను ఆయా సంస్థల యజమానులు గడువులోగా చెల్లించాలని ఆయన స్పష్టంచేశారు. 1952 పీఎఫ్ చట్టం ప్రకారం ఉద్యోగుల వేతనం నుంచి కట్ చేసిన మొత్తం, యాజమాన్యం చెల్లించాల్సిన మొత్తాన్ని కలిపి నిర్ణీత గడువులోగా జమ చేయాల్సిన బాధ్యత సంబంధిత యాజమాన్యాలదేనన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు, ట్రేడ్యూనియన్లు, ఉద్యోగులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని కోరారు.