భవిష్యనిధి కార్యాలయంలో ఈఓ, ఏఓలుగా ఉద్యోగోన్నతి కోసం నిర్వహించిన పరీక్షలో అభ్యర్థులు తెలిపిన అనేక అభ్యం తరాలలో ఎన్నింటిని ఆమోదించారు? అందరికీ సమానంగా ప్రయోజనం కలిగిం చారా? ఎంపికైన అభ్యర్థులు రాసిన సమాధాన పత్రాల ప్రతులను ఇవ్వండి అంటూ సమాచార హక్కు చట్టం కింద శైలేంద్ర కుమార్ సింగ్ అడిగారు. మొదటి మూడు అంశాలకు సమాధానం ఇచ్చారు. ఇతరుల సమాధాన పత్రాలు సెక్షన్ 8(1)(ఇ) (ట్రస్టీ హోదాలో ఇచ్చిన సమాచారం) (జె) వ్యక్తిగత సమాచారం అనే మినహా యింపుల కింద ఇవ్వనవసరం లేదని జవాబు ఇచ్చినారు. ఆబ్జెక్టివ్ తరహాతో కూడిన మూడు పరీక్షల నమూనా సమాధానాలు వెల్లడిచేశారు. శైలేంద్ర నాలుగో పరీక్ష నమూనా సమాధానాలు ఇవ్వాలని కోరారు. నాలుగోది వివరమైన సమాధానాల పరీక్ష కావడంతో వారు మోడల్ సమాధాన పత్రాన్ని తయారు చేయలేదు కనుక ప్రకటించలేదు. మొత్తం మూడు వేలమంది పరీక్ష రాస్తే కేవలం అయిదుగురు ఎంపికైనారు. తాను ఎందుకు ఎంపిక కాలేకపోయాను, ఆ అయిదుగురు ఏమేరకు తన కన్నా ప్రతి భావంతులో తెలుసుకోవడం కోసం వారి సమాధాన పత్రాలు అడుగుతున్నానని ఆయన వాదించారు.
సీబీఎస్‌ఈ వర్సెస్ ఆదిత్య బంధోపాధ్యాయ కేసులో (2011) 8 ఎస్ సి సి 497) లో తన సొంత సమాధాన పత్రం అడిగి తీసుకునే హక్కు ఉందా లేదా అనే వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించింది. తన పత్రం తాను చూసుకోగలిగితే తనకు ఇంకా ఎక్కువ మార్కులు రావాలని, లేదా తన సమాధానాలకు అన్యాయంగా తక్కువ మార్కులు ఇచ్చారని, కనుక వాటిని సరిచేయాలని కోరడానికి వీలవుతుంది. సీబీఎస్‌ఈ మూడు ప్రధానమైన కారణాలను కోర్టు ముందుకు తెచ్చింది. ఒకటి సమాధాన పత్రం తమకు ధర్మకర్త హోదాలో అభ్యర్థులు ఇచ్చిన సమాచారం కనుక ఇతరులకు ఇవ్వడం ధర్మకర్త బాధ్యతలకు భిన్నం అవుతుంది. రెండు: మూల్యాంకనం చేసిన సమాధాన పత్రం వ్యక్తిగత సమాచారం అవుతుంది కనుక ఇవ్వడానికి వీల్లేదు. మూడు: ఇతరుల సమాధాన పత్రాలు అడిగితే ఇవ్వడం సాధ్యం కాదు. అందరూ అందరి పత్రాలు అడిగితే సంక్షోభం ఏర్పడుతుంది. తాము ధార్మిక సంస్థ వంటి వారిమనీ, తమకు ధర్మకర్తల హోదాలో అందిన సమాచారాన్ని ఇతరుల ప్రయోజనాలు రక్షించడం కోసమై తాము ఇవ్వడం సాధ్యం కాదని సీబీఎస్‌ఈ వాదించింది.
ఎవరి సమాధాన పత్రాన్ని వారు చూడాలన్నా వీల్లేదని సీబీఎస్‌ఈ మొండికేసింది. అభ్యర్థులు నిజానికి ఏ సమాచారమూ ఇవ్వడం లేదు. ధర్మకర్తల హోదా ప్రస్తావనే రాదు. ఎందుకంటే అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వారు రాస్తారు. వాటికి తగిన విధంగా అధ్యాపకులు మార్కులు వేయాలి. కనుక మూల్యాం కనం చేయని పత్రాలు, చేసిన తరువాత సమాధాన పత్రాలు కూడా ధార్మికంగా దాచవలసిన సమాచారం అనడానికి ఆస్కారం లేదు. అభ్యర్థులు వ్యక్తిగత సమాచారం ఇస్తున్నారనడం కూడా సరి కాదు. విజ్ఞాన విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు తన సమాధానాలు అవి. అవి వ్యక్తిగత సూచనలు కావు.13 లక్షల మంది పరీక్ష రాసినప్పుడు ఎవరి పత్రాలు వారికి ఇవ్వాలన్నా, ఇతరుల సమాధాన పత్రాలు కావాలన్నా తీవ్ర గందరగోళం, సంక్షోభం వస్తుందని కనుక సాధ్యం కాదన్నది సీబీఎస్‌ఈ. 1984లో సుప్రీంకోర్టు ఇందుకు అంగీకరించిందని చెప్పింది. అభ్యర్థి తన సమాధాన పత్రాన్ని అధికారులు ఏ విధంగా మూల్యాంకనం చేశారో తెలుసుకునేందుకు తన పత్రాన్ని తాను చూసుకునే అధికారం ఉందంటూ చరిత్రాత్మకమైన తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. ధర్మకర్తల హోదాలో వచ్చిన సమాచారం అనీ వ్యక్తిగత సమాచారం అనీ మినహాయింపులు వర్తించబోవని కూడా ప్రకటించింది. మూల్యాంకనం చేసిన సమాధాన పత్రాలు ఈ మినహాయింపు కిందికి రావని చివరకు సీబీఎస్‌ఈ కూడా అంగీకరించక తప్పలేదు. 13 లక్షల మంది అభ్యర్థులలో సగం మంది అడిగినా సంక్షోభం వంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. నిజమే.. కాని అన్యాయం
జరిగితే అడిగే హక్కు లేదా?
లక్షలాది మంది పరీక్షలు రాసిన సందర్భాలలో ఇతరుల పత్రాలు ఇవ్వనవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు సరైనవే అయినా చిన్న స్థాయిలో నియామకాలు, లేదా పదోన్నతి కోసం పరీక్షలు నిర్వహిస్తే అందులో ఎంపికైన వారి సమాధాన పత్రాలు అడిగినప్పుడు ఆచరణాత్మక ఇబ్బంది అనేది వర్తిం చదు. అయిదుగురి సమాధాన పత్రాలు ఇవ్వడంలో ఏ విధమైన సమస్యాలేదని కమిషన్ నిర్ధారించింది. పైగా నియామకాలు, పదోన్నతిలో అవినీతి నివారణ కావాలంటే పారదర్శకత తప్పదు. (CIC/EPFOG/A/2018/124927 శైలేంద్ర కుమార్ సింగ్ వర్సెస్ ఈïపీఎఫ్‌ఓ కేసులో జూన్ 7, 2018న సీఐసీ ఇచ్చిన తీర్పు ఆధారంగా) professorsridhar@gmail.com
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment