Right to Information Act
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారానికి నీతి ఆయోగ్ చెక్
సాక్షి, న్యూఢిల్లీ: పచ్చమీడియా విషప్రచారాన్ని అండగా చేసుకుని చెలరేగిపోయి, రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించాలని చూసిన చంద్రబాబు నాయుడికి దిమ్మదిరిగే షాక్ నీతి ఆయోగ్ రూపంలో తగిలింది. ఎన్నికల ప్రచారంలో దూషణలు, పనికిమాలిన అబద్ధాలు చెప్పి ప్రజలను వంచించాలని చూసిన ఈ పచ్చపార్టీ అధినేతకు ఇది శరాఘాతమే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు గణం చేసిన దుష్ప్రచారానికి నీతి ఆయోగ్ ఫుల్స్టాప్ పెట్టింది. ఈ చట్టానికి సంబంధించి కీలక సమాచారాన్ని వెల్లడించింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఈ చట్టం వల్ల భూములన్నీ మరింత భద్రంగా ఉంటాయని... భూ పరిపాలన మరింత సులువవుతుందని పేర్కొంది. భూములపై రైతులకు సర్వహక్కులూ లభిస్తాయని... ఈ చట్టంతో పటిష్ఠమైన భూ యాజమాన్య నిర్వహణ సాధ్యమవుతుందని వెల్లడించింది.సమాచార హక్కు చట్టం కింద సాక్షి టీవీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ నాగిళ్ల వెంకటేష్ అడిగిన ప్రశ్నలకు నీతి ఆయోగ్‌లోని జల, భూవనరుల శాఖ ఈ విషయమై స్పష్టతను ఇచ్చింది. ఆ శాఖ అండర్ సెక్రటరీ రవీందర్ కౌర్ గురువారం ఒక లేఖ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు సంబంధించిన ముసాయిదాను కేంద్ర భూవనరుల శాఖతో పాటు అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే పంపించామని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. -
వందేభారత్ రైళ్లు: గంటకు 180 కి.మీ. గరిష్ట వేగం.. యావరేజి స్పీడ్ 83 కి.మీ.
న్యూఢిల్లీ: దేశంలో వందేభారత్ రైళ్లు సరాసరిన గంటకు 83 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో నడిచేలా తయారైన ఈ రైళ్లను 130 కి.మీ. వేగంతో నడపవచ్చు. రైలు మార్గాల్లో నాణ్యత లేమి వల్ల తక్కువ వేగంతోనే నడుపుతున్నట్లు సమాచార హక్కు చట్టం కింద అందిన దరఖాస్తుకు రైల్వే శాఖ బదులిచ్చింది. ‘‘అత్యల్పంగా గంటకు 64 కి.మీ. సరాసరి వేగంతో ముంబై–షిర్డీ వందేభారత్ రైలు, గరిష్టంగా 95 కి.మీ. వేగంతో న్యూఢిల్లీ–వారణాసి రైలు నడుస్తోందని చెప్పారు. ఆగ్రా కంటోన్మెంట్– తుగ్లకాబాద్ రైలు మాత్రం గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది’’ అని పేర్కొంది. -
RTI Act: సామాన్యుడి వజ్రాయుధం
ఎన్నో ఏళ్ళ ఉద్యమాల ఫలితంగా 2005 అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం భారత్‌లో అమలులోకి వచ్చింది. ప్రభుత్వాలు ప్రజలకు మరింత జవాబుదారీగా ఉండటానికీ, పౌరులకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచడానికీ ఈ చట్టం రూపొందింది. తెలంగాణ సమాచార కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2017 సెప్టెంబర్ 9న వేరయింది. ఈ సమయంలో బదిలీ అయిన పిటీషన్లు 6,825 కలుపుకొని... తెలంగాణ రాష్ట్రంలో దాఖలైన మొత్తం దరఖాస్తులు 38,000. అందులో ఇప్పటివరకూ 32,000 పరిష్కారం అయ్యాయి. పెండింగ్‌లో ఉన్నవి కేవలం 6,000 మాత్రమే. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్నప్పుడు కూడా కొంతకాలం టెలిఫోన్ ద్వారా కేసులు విచారించి, పరిష్కరించిన చరిత్ర మన కమిషన్‌ది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ప్రకారం ఒక బోర్డు ఏర్పాటై ఉంటుంది. దాని మీద ప్రజా సమాచార అధికారి ఫోన్ నంబర్ ఉంటుంది. తమకు కావలసిన సమాచారం కోసం ఆ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి 10 రూపాయలు చెల్లించి లేక తెల్ల రేషన్ కార్డు ఉంటే ఒక జిరాక్స్ పెట్టి సెక్షన్ 6(1) కింద దరఖాస్తు చేసుకుంటే చాలు. గ్రామపంచాయతీ కార్యాలయంలో అయితే ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మండల స్థాయిలో రూ. 5, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలలో రూ. 10 రుసుం చెల్లించాలి. (క్లిక్ చేయండి: జడ్జి ప్రశ్నలకు జవాబులున్నాయా?) మీరు దరఖాస్తు చేసుకున్న నాటినుంచి సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల్లో అందులో కోరిన సమాచారం ఇవ్వాలి. 8, 9 సెక్షన్ల కింద మినహాయింపు పొందిన సమాచారం తప్ప... మిగతా సమా చారాన్ని ఇవ్వాలి. సమాచారాన్ని నిరాకరిస్తే మొదటి అప్పిలేట్ అధికారికి సెక్షన్ 19 (1) కింద దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ కూడా సమాచారం నిరాకరిస్తే సెక్షన్ 19 (3), సెక్షన్ 18(1) కింద సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మొత్తం మీద సమాచార హక్కు చట్టాన్ని సామాన్యుడి చేతిలో వజ్రాయుధంగా చెప్పవచ్చు. – డాక్టర్ గుగులోతు శంకర్ నాయక్, తెలంగాణ సమాచార కమిషనర్ (అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు) -
‘వెబ్సైట్లో ఎందుకు ఉంచట్లేదు’?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖలు జారీ చేసే ఉత్తర్వులను వెబ్సైట్లో ఎందుకు ఉంచట్లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. జీవోలను ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచకపోవడం సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ జీఎంఎన్‌ఎస్ దేవి(నెల్లూరు), కె.శ్రీనివాసరావు(గుంటూరు), ఎస్.ఆర్.ఆంజనేయులు(అనంతపురం) వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని సీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు జి.శ్రీకాంత్, ఇంద్రనీల్, బాలాజీ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం ఇకపై జీవోలన్నింటినీ ఏపీ ఈ–గెజిట్ వెబ్సైట్లో ఉంచుతామని ఇటీవల చెప్పిందని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఓ వెబ్సైట్ బదులు మరో వెబ్సైట్లో ఉంచుతామని ప్రభుత్వం చెబుతోందిగా, దానివల్ల నష్టమేంటని ప్రశ్నించింది. అయితే జీవోలను రహస్యం, అత్యంత రహస్యం, గోప్యం అంటూ వర్గీకరించిందని.. వాటికి సంబంధించిన జీవోలను వెబ్సైట్లో ఉంచబోమని ప్రభుత్వం చెప్పిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. గత విధానాన్నే అనుసరిస్తున్నాం.. ఏపీ సచివాలయ మాన్యువల్ రూల్స్‌తో పాటు ఏపీ బిజినెస్ రూల్స్‌కు.. ఆ మూడింటికీ ఉన్న నిర్వచనాలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ ధర్మాసనానికి వివరించారు. ఆ రూల్స్‌కు అనుగుణంగా వర్గీకరణ చేశామన్నారు. ఇలాంటి జీవోలను వెబ్సైట్లో ఉంచకపోవడమన్నది ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఎప్పుడో రూపొందించిన నిబంధనలను ఇప్పటికీ అమలు చేస్తామంటే ఎలా? అని ప్రశ్నించింది. ఆ నిబంధనలను సవరించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. అనంతరం కౌంటర్ దాఖలుకు గడువిస్తూ.. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
అధికారుల నిర్లక్ష్యంతోనే వనరుల దోపిడీ
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంవల్లే ప్రకృతి వనరుల దోపిడి యథేచ్ఛగా సాగుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. చర్యలు తీసుకోకుండా అధికారులు చోద్యం చూస్తూ ఉండటంవల్లే అక్రమార్కులకు అడ్డూఅదుపు లేకుండాపోతోందని తెలిపింది. ప్రధాన కాలువను మూసేసి దానిపై ఏకంగా రోడ్డే వేసేశారంటే అధికారుల చర్యలు ఎంత కఠినంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు రాత్రికి రాత్రే జరగవని తెలిపింది. వీటిపట్ల తాము మౌనంగా ఉండబోమని.. వేగవంతమైన చర్యలు ఉంటాయని హైకోర్టు స్పష్టంచేసింది. కృష్ణాజిల్లా, కంచికచర్ల మండలం, పరిటాల గ్రామ పరిధిలో ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ దాఖలైన ఈ వ్యాజ్యాన్ని, కొండపల్లి అటవీ ప్రాంతం ధ్వంసంపై మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)తో జతచేయాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పలువురు ప్రభుత్వాధికారులకు, మైనింగ్ చేస్తున్న ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. పరిటాల గ్రామ పరిధిలో ఎలాంటి అనుమతుల్లేకుండా అక్రమ మైనింగ్ చేస్తున్నా, భారీ పేలుడు పదార్థాలు ఉపయోగించి కొండలను పిండి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ పరిటాల గ్రామానికి చెందిన మాగంటి ధర్మారావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అనంత వెంకట దుర్గారావు వాదనలు వినిపిస్తూ.. పరిటాలలో జరుగుతున్న మైనింగ్‌కు ఎలాంటి అనుమతులు లేవన్నారు. సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలను ప్రభుత్వమే తెలియజేసిందని చెప్పారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. అధికారుల నిర్లక్ష్యంవల్లే యథేచ్ఛగా ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో తాము తగిన విధంగా స్పందిస్తామని స్పష్టంచేసింది. ఏకంగా ప్రధాన కాలువనే మూసివేశారని, ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా అంగీకరించిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొండపల్లి అటవీ ప్రాంతం ధ్వంసంపై దాఖలైన వ్యాజ్యం సెప్టెంబర్ 6న విచారణకు రానున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని కూడా ఆ వ్యాజ్యంతో జతచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. రెండింటిని కలిపి ఆ రోజు విచారిస్తామంది. -
వరంగల్‌లో దళారీ దందా
సాక్షి, హన్మకొండ : జిల్లా కేంద్రంలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రభుత్వ కార్యాలయం ఏదైనా ఉందంటే అది కాజీపేట తహసీల్దార్ కార్యాలయమే అని చెప్పాలి. జిల్లాల విభజన, కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు క్రమంలో హన్మకొండ, ధర్మసాగర్ మండలాల నుంచి కొన్ని గ్రామాలను కలిపి కాజీపేట మండలాన్ని ఏర్పాటు చేశారు. తొలుత మడికొండలో ఏర్పా టు చేసిన ఈ కార్యాలయాన్ని ఆ తర్వాత కాజీ పేట మినీ మునిసిపాలిటీ భవనంలోకి మార్చారు. ప్రస్తుతం ఒకే హాల్లో కొనసాగుతున్న ఈ కార్యాలయంలో దళారులు రాజ్యమేలుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా రెవెన్యూ కార్యాలయానికి ఏదైనా పనిపై వెళ్లాలంటే ఉద్యోగులు ఎన్ని కొర్రీలు పెడతారోననే అంతా ఆందోళన చెందుతారు. కానీ ఇక్కడ మాత్రం దళారుల తీరు ఆ ఉద్యోగులకే ముచ్చెమటలు పట్టిస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ వ్యవసాయ భూములే... కాజీపేట తహసీల్ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎక్కువగా వ్యవసాయ భూములు ఉన్నాయి. గత దశాబ్దాల కాలంగా ఆయా గ్రామాల్లో పనిచేసిన వీఆర్వోలు, ఇతర రెవెన్యూ అధికారుల కారణంగా గ్రామాల్లో భూసమస్యలు కోకొల్లలు. ఇక రికార్డుల్లో పేర్లు లేకున్నా రైతుల దగ్గర పాస్ పుస్తకాలు ఉంటాయి. పుస్తకాల్లో ఒక పేరుం టే రికార్డుల్లో మరో పేరు ఉంటుంది. ఇలా ఈ మండలం పరిధిలోని ఒక్కో గ్రామానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. ఇలాంటి అంశాలే ప్రసుత్తం దళారులకు ఆదాయ వనరులుగా మారాయి. కాజీపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిత్యం పదుల సంఖ్యలో దళారులు సమస్యలపై వచ్చిన రైతులు, బాధితులను వలలో వేసుకుంటున్నారు. అన్నన్నా మనోడే కార్యాలయానికి వచ్చే బాధితులను దళారులు ఆవరణలో కలిసి మాట కలుపుతారు. ఆ తర్వాత ఏ పని పై వచ్చింది తెలుసుకుంటారు. ఆ పని చేయాలంటే కార్యాలయంలో పెద్ద మొత్తంలో డబ్బు అడుగుతారని బెదిరిస్తారు. అయితే, తమకు కొద్ది మొత్తం ఇస్తే చాలు పని చేయిస్తామని నమ్మబలికి వారి దరఖాస్తు తీసుకుని సెటిల్ చేసుకుంటున్నారు. ఇక అధికారుల వద్దకు వెళ్లి ‘అన్నా మనోడే.. చాలా దగ్గర’ పని చేసి పెట్టాలని చెపుతున్నారు. అయితే, ఎవరైనా అధికారి కానీ ఉద్యోగి కానీ ఈ దళారుల వ్యవహారాన్ని గమనించి ఇదేంటని ప్రశ్నించినా, పనిచేయకుండా దరఖాస్తు పక్కన పెట్టినా.. ఇక వారికి చుక్కలు చూపిస్తున్నారు. దళారులంతా ఒక్కటై ఉద్యోగుల విషయంలో అధికారుల ఫిర్యాదు చేయడం... ఆకాశ రామన్న ఉత్తరాలు రాయడం, పలు సంఘాల నాయకులు, లోకల్ లీడర్లతో ఫోన్ చేయిండం వంటివి నిత్యకృత్యమయ్యాయి. దీంతో చేదేసేం లేక ఉద్యోగులు తమ ఇబ్బందులను అధికారులకు మొరపెట్టుకున్నారు. స.హ. చట్టం పేరుతో... మరికొందరు దళారులు తమ మాట వినని అధికారికి చుక్కలు చూపించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. సమాచార హక్కు చట్టం ద్వారా దశాబ్దాల రికార్డులు కావాలని దరఖాస్తు చేయడం.. సమయానికి సమాచారం ఇవ్వకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడాన్ని అలవాటుగా పెట్టుకున్నారు. ఒకే వ్యక్తి పేరుతో పదే పదే దరఖాస్తులు రావడంతో అధికారులకు అనుమానం వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ సమాచారం ఇవ్వలేని పక్షంలో పైఅధికారులకు అప్పీల్ చేసుకోవాలని సూచించినా గొడవలకు దిగుతున్నారు. దీంతో అధికారులు చేసేదేం లేక దళారులకు తొలిప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సమస్యను అధిగమిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఇదే ఇబ్బందిగా మారుతోంది. లేనిపోని గొడవలు తమకెందుకని నేరుగా వచ్చిన దరఖాస్తులు పక్కన పెట్టి మరీ దళారులతో వచ్చిన వారికి ముందు పనిచేసి పెడుతున్నారని ఆరోపణలు ఉద్యోగులపై ఎక్కువయ్యాయి. అధికారుల మందలింపు దళారుల ఆగడాలు పెచ్చుమీరి పోవడంతో చేసేది లేక స్వయంగా ఉన్నతాధికారే... ఇటీవల కొందరిని పిలిచి సుతిమొత్తగా మందలించినట్లు తెలిసింది. ‘చూడండి ఆఫీస్‌కు వచ్చే ప్రతివారిని మీరే అడ్డగించి మా వారే అంటూ పైరవీ చేస్తే కష్టం... ఏదో ఒకటి రెండు పనులు ఉంటే రండి, చేయించుకోండి వెళ్లండి. కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా కార్యాలయం, ఆవరణలో మీరే ఉంటే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.’ అంటూ స్వయంగా కార్యాలయంలోని ఉన్నతాధికారులు దళారులతో మాట్లాడారంటే కార్యాలయంలో వారి హవా ఏంటో తెలుస్తోంది. ఇప్పటికైనా వీరి విషయంలో అధికారులు కఠిన నిర్ణయం తీసుకోకపోతే తాము పనిచేయడం కష్టమని ఉద్యోగులు వాపోతున్నారు. పక్కనే మినీ మునిసిపల్ కాజీపేట మినీ మున్సిపల్ కార్యాలయం కూడా కాజీపేట తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉం టుంది. అక్కడా నిత్యం పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు సమస్యలపై వస్తుంటారు. అలాంటి వారిని దళారులు అడ్డగించి తాము పనిచేయిస్తామని డబ్బు లాగుతున్నట్లు సమాచారం. -
ఇందూరు ఎన్నికలపై అనుమానాలు: అరవింద్
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల తీరుపై అక్కడి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌ను సోమవారం ఆయన సచివాలయంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. సమాచార హక్కు చట్టం కింద నిజామాబాద్ లోక్‌సభ పోలింగ్‌కు సంబంధించిన వివరాలను అందజేయాలని సీఈఓను కోరారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద తమ పార్టీ ప్రతినిధులను కాపలా పెట్టుకోవడానికి అనుమతించాలని కోరగా, సీఈఓ సానుకూలంగా స్పందించారు. సమావేశం అనంతరం అరవింద్ విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ శాతంతో పాటు పలు అంశాలపై సమాచారం అందించాలని ఆర్టీఐ కింద సీఈఓకు దరఖాస్తు చేశామని తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారాన్ని అందజేస్తామని సీఈఓ హామీ ఇచ్చారని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత కొన్ని యంత్రాలు ఆలస్యంగా స్ట్రాంగ్ రూమ్‌కు రావడంపై అనుమానాలు వ్యక్తం చేశామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, అక్కడ ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని సీఈఓ హామీ ఇచ్చారని వెల్లడించారు. -
సమాచారమా...కష్టం!
వక్కంటి జనార్దన్ అనే వ్యక్తి హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఓ సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నెలరోజులు దాటినా అతనికి సమాచారం రాలేదు. దీంతో అతను సమాచార కమిషన్‌ను ఆశ్రయించాడు.అక్కడికి సంబంధిత అధికారి కూడా విచారణకు హాజరయ్యారు. ఆ వ్యక్తి అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కమిషనర్ అధికారికి ఆదేశాలు జారీ చేశారు.ఆదేశాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ అతనికి సమాచారం లభించలేదు. ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సమాచార హక్కు చట్టంపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సమాచారం అడిగినా స్పందించడంలేదు. చూస్తున్నాం.. పరిశీలిస్తున్నాం అంటూ సమాచారం ఇవ్వకుండా దాటవేస్తున్నారు. దరఖాస్తుదారుడు కమిషన్‌ను ఆశ్రయించినపుడు కావలసిన సమాచారం ఇస్తామని కమిషనర్ ఎదుట హామీ ఇస్తోన్న అధికారులు తరువాత ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. జరిమానాలు విధించకపోవడం వల్లేనా? దరఖాస్తుదారుడికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని సమాచార కమిషనర్ నోటీసులు ఇచ్చినా అధికారులు çపట్టించుకోకపోవడంతో చట్టం సరిగా అమలు కావడం లేదు. ఒకవేళ సదరు అధికారి పదోన్నతి, లేదా బదిలీల కారణంగా సీటు మారితే ఇక అంతే సంగతులు. ఆ సమాచారం ఫైలు అటకెక్కుతుంది. సమాచారం ఇవ్వడంలో కావాలని జాప్యం చేసే అధికారులపై చర్యలు తీసుకునే అధికారం కమిషన్‌కు ఉంటుంది. రోజుకు రూ.250 చొప్పున రూ.25,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అధికారులకు జరిమానాలు విధించకపోవడంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుడు పరిష్కారమవుతాయో! సమాచార హక్కు కింద దరఖాస్తులు కొంతకాలంగా వేల సంఖ్యలో పేరుకుపోతున్నాయి. వీటిలో అధికారులు కావాలని జాప్యం చేసేవే అధికం కావడం గమనార్హం. గతంలో జాప్యం చేసిన అధికారులపై కమిషన్ చర్యలు తీసుకునేది. ఈ ఏడాది అక్టోబర్ వరకు దాదాపు 14 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో కేవలం ఆరు వేల ఫైళ్లు మాత్రమే క్లియర్ అయ్యాయని, ఇంకా 9 వేలకుపైగా ఫైళ్లు పెండింగ్‌లోనే ఉన్నాయని సమాచారం. ఆశించిన సమాచారం లభించకపోవడంతో దరఖాస్తుదారులు విసిగిపోతున్నారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ప్రవేశపెట్టిన సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చడానికే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 100 శాతం దరఖాస్తుల్లో తెలంగాణలో కేవలం 30 శాతం మాత్రమే పరిష్కారమవడం ఇందుకు నిదర్శనమని వారంటున్నారు. చాలామందికి ఏడాది అవుతున్నా సరైన సమాచారం రావడం లేదని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. సమాచార హక్కు చట్టం కోరలు లేని పులిలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం: బుద్ధామురళి, ఆర్టీఐ కమిషనర్ సమాచారం ఇవ్వని అధికారులపై తప్పకుండా చర్యలు ఉంటాయి. కమిషన్ నోటీసులను నిర్లక్ష్యం చేసిన విషయాన్ని దరఖాస్తుదారులు మా దృష్టికి తీసుకురావాలి. అప్పుడు తప్పకుండా విచారించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. వీలైనంత త్వరగా కేసులను పరిష్కరించేందుకే ప్రయత్నిస్తున్నాం. -
గోప్యత పేరుతో అడ్డుకోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: గోప్యత పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్లకు సమాధానం ఇవ్వకుండా తిరస్కరించేందుకు వీల్లేదని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు స్పష్టం చేశారు. శ్రీధర్ ఆచార్యులు రచించిన ‘ప్రైవసీ యాజ్ సీక్రసీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం ఢిల్లీలోని సమాచార కమిషన్ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షీ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీధర్ ఆచార్యులు మాట్లాడుతూ.. ‘సమాచార హక్కును గోప్యత పేరుతో అడ్డుకోరాదు. గోప్యత హక్కును దుర్వినియోగం చేసి సమాచారాన్ని నిరాకరించరాదు. ఇదే విషయాన్ని ఈ పుస్తకంలో వివరించా. గోప్యత పేరుతో ప్రజలకు ఇవ్వాల్సిన సమాచారాన్ని నిరాకరించే ఆఫీస్ మెమోరాండంను ప్రభుత్వాలు వెనక్కు తీసుకోవాలి. అడిగిన వివరాలు వెల్లడించాల్సిందే అనే విషయాన్ని స్పష్టంగా చెబుతూ డీవోపీటీగానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ మరో ఆఫీస్ మెమోరాండంను విడుదల చేయాలి. అప్పుడే గోప్యత హక్కు దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది’ అని అన్నారు. -
సీఓఏ పరోక్షంగా సహకరించింది!
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావడంపై ఊహించినట్లుగానే బోర్డులో ఒక్కసారిగా ప్రకంపనలు రేగుతున్నాయి. బీసీసీఐని ఇప్పటి వరకు స్వతంత్ర వ్యవస్థగా నడిపిస్తూ వచ్చిన ఆఫీస్ బేరర్లు కొత్త పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే దీనిపై కోర్టుకెక్కాలని కూడా యోచిస్తున్నారు. అసలు దీనికి కారణం క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) వ్యవహార శైలే అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వారి కారణంగానే తాజా ఉత్తర్వులు వెలువడ్డాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆర్టీఐ విషయంలో చట్టపరంగా బీసీసీఐ ముందుకు వెళ్లే హక్కును సీఓఏ కాలరాసింది. ఇది వారంతా కావాలని చేసిందే అని మా గట్టి నమ్మకం. బీసీసీఐని ఎందుకు ఆర్టీఐ పరిధిలోకి తీసుకు రావద్దో చెప్పాలంటూ వాదనలు వినిపించేందుకు జూలై 10న సమాచార శాఖ కమిషన్ అవకాశం కల్పించింది. అయితే ఆ షోకాజ్ నోటీస్‌కు బోర్డు నుంచి కనీస స్పందన లేదు. బోర్డు ఎన్నికలకు ముందు ఆర్టీఐని మా మెడకు చుట్టాలని సీఓఏ భావించింది. ఇప్పుడు దీనిని హైకోర్టులో చాలెంజ్ చేయడం తప్ప మాకు మరో అవకాశం లేదు. దురదృష్టవశాత్తూ సుప్రీం కోర్టు ఆదేశాలను సీఓఏ తప్పుగా వాడుకుంది’ అని ఆ అధికారి అన్నారు. బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రావడం వల్ల ఎలాంటి ప్రశ్నలు ప్రజల నుంచి ఎదురవుతాయనే విషయంపై కూడా బోర్డు అధికారి తన అభిప్రాయం వెల్లడించారు. జట్టు ఎంపిక, ఐపీఎల్ యాజమాన్యం పాత్ర, పెట్టుబడులు, అధికారుల ప్రవర్తన, ఒక యువ ఆటగాడికి వరుసగా అవకాశాలు ఇస్తుంటే అతనికి మేనేజ్మెంట్ కంపెనీలు, బ్రాండ్లతో ఉన్న సంబంధాలు ఎలాంటివి అనే అంశాలన్నంటిపైనా ప్రశ్నల వర్షం కురుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
జవాబు పత్రాలు ఇవ్వాల్సిందే!
భవిష్యనిధి కార్యాలయంలో ఈఓ, ఏఓలుగా ఉద్యోగోన్నతి కోసం నిర్వహించిన పరీక్షలో అభ్యర్థులు తెలిపిన అనేక అభ్యం తరాలలో ఎన్నింటిని ఆమోదించారు? అందరికీ సమానంగా ప్రయోజనం కలిగిం చారా? ఎంపికైన అభ్యర్థులు రాసిన సమాధాన పత్రాల ప్రతులను ఇవ్వండి అంటూ సమాచార హక్కు చట్టం కింద శైలేంద్ర కుమార్ సింగ్ అడిగారు. మొదటి మూడు అంశాలకు సమాధానం ఇచ్చారు. ఇతరుల సమాధాన పత్రాలు సెక్షన్ 8(1)(ఇ) (ట్రస్టీ హోదాలో ఇచ్చిన సమాచారం) (జె) వ్యక్తిగత సమాచారం అనే మినహా యింపుల కింద ఇవ్వనవసరం లేదని జవాబు ఇచ్చినారు. ఆబ్జెక్టివ్ తరహాతో కూడిన మూడు పరీక్షల నమూనా సమాధానాలు వెల్లడిచేశారు. శైలేంద్ర నాలుగో పరీక్ష నమూనా సమాధానాలు ఇవ్వాలని కోరారు. నాలుగోది వివరమైన సమాధానాల పరీక్ష కావడంతో వారు మోడల్ సమాధాన పత్రాన్ని తయారు చేయలేదు కనుక ప్రకటించలేదు. మొత్తం మూడు వేలమంది పరీక్ష రాస్తే కేవలం అయిదుగురు ఎంపికైనారు. తాను ఎందుకు ఎంపిక కాలేకపోయాను, ఆ అయిదుగురు ఏమేరకు తన కన్నా ప్రతి భావంతులో తెలుసుకోవడం కోసం వారి సమాధాన పత్రాలు అడుగుతున్నానని ఆయన వాదించారు. సీబీఎస్ఈ వర్సెస్ ఆదిత్య బంధోపాధ్యాయ కేసులో (2011) 8 ఎస్ సి సి 497) లో తన సొంత సమాధాన పత్రం అడిగి తీసుకునే హక్కు ఉందా లేదా అనే వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించింది. తన పత్రం తాను చూసుకోగలిగితే తనకు ఇంకా ఎక్కువ మార్కులు రావాలని, లేదా తన సమాధానాలకు అన్యాయంగా తక్కువ మార్కులు ఇచ్చారని, కనుక వాటిని సరిచేయాలని కోరడానికి వీలవుతుంది. సీబీఎస్ఈ మూడు ప్రధానమైన కారణాలను కోర్టు ముందుకు తెచ్చింది. ఒకటి సమాధాన పత్రం తమకు ధర్మకర్త హోదాలో అభ్యర్థులు ఇచ్చిన సమాచారం కనుక ఇతరులకు ఇవ్వడం ధర్మకర్త బాధ్యతలకు భిన్నం అవుతుంది. రెండు: మూల్యాంకనం చేసిన సమాధాన పత్రం వ్యక్తిగత సమాచారం అవుతుంది కనుక ఇవ్వడానికి వీల్లేదు. మూడు: ఇతరుల సమాధాన పత్రాలు అడిగితే ఇవ్వడం సాధ్యం కాదు. అందరూ అందరి పత్రాలు అడిగితే సంక్షోభం ఏర్పడుతుంది. తాము ధార్మిక సంస్థ వంటి వారిమనీ, తమకు ధర్మకర్తల హోదాలో అందిన సమాచారాన్ని ఇతరుల ప్రయోజనాలు రక్షించడం కోసమై తాము ఇవ్వడం సాధ్యం కాదని సీబీఎస్ఈ వాదించింది. ఎవరి సమాధాన పత్రాన్ని వారు చూడాలన్నా వీల్లేదని సీబీఎస్ఈ మొండికేసింది. అభ్యర్థులు నిజానికి ఏ సమాచారమూ ఇవ్వడం లేదు. ధర్మకర్తల హోదా ప్రస్తావనే రాదు. ఎందుకంటే అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వారు రాస్తారు. వాటికి తగిన విధంగా అధ్యాపకులు మార్కులు వేయాలి. కనుక మూల్యాం కనం చేయని పత్రాలు, చేసిన తరువాత సమాధాన పత్రాలు కూడా ధార్మికంగా దాచవలసిన సమాచారం అనడానికి ఆస్కారం లేదు. అభ్యర్థులు వ్యక్తిగత సమాచారం ఇస్తున్నారనడం కూడా సరి కాదు. విజ్ఞాన విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు తన సమాధానాలు అవి. అవి వ్యక్తిగత సూచనలు కావు.13 లక్షల మంది పరీక్ష రాసినప్పుడు ఎవరి పత్రాలు వారికి ఇవ్వాలన్నా, ఇతరుల సమాధాన పత్రాలు కావాలన్నా తీవ్ర గందరగోళం, సంక్షోభం వస్తుందని కనుక సాధ్యం కాదన్నది సీబీఎస్ఈ. 1984లో సుప్రీంకోర్టు ఇందుకు అంగీకరించిందని చెప్పింది. అభ్యర్థి తన సమాధాన పత్రాన్ని అధికారులు ఏ విధంగా మూల్యాంకనం చేశారో తెలుసుకునేందుకు తన పత్రాన్ని తాను చూసుకునే అధికారం ఉందంటూ చరిత్రాత్మకమైన తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. ధర్మకర్తల హోదాలో వచ్చిన సమాచారం అనీ వ్యక్తిగత సమాచారం అనీ మినహాయింపులు వర్తించబోవని కూడా ప్రకటించింది. మూల్యాంకనం చేసిన సమాధాన పత్రాలు ఈ మినహాయింపు కిందికి రావని చివరకు సీబీఎస్ఈ కూడా అంగీకరించక తప్పలేదు. 13 లక్షల మంది అభ్యర్థులలో సగం మంది అడిగినా సంక్షోభం వంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. నిజమే.. కాని అన్యాయం జరిగితే అడిగే హక్కు లేదా? లక్షలాది మంది పరీక్షలు రాసిన సందర్భాలలో ఇతరుల పత్రాలు ఇవ్వనవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు సరైనవే అయినా చిన్న స్థాయిలో నియామకాలు, లేదా పదోన్నతి కోసం పరీక్షలు నిర్వహిస్తే అందులో ఎంపికైన వారి సమాధాన పత్రాలు అడిగినప్పుడు ఆచరణాత్మక ఇబ్బంది అనేది వర్తిం చదు. అయిదుగురి సమాధాన పత్రాలు ఇవ్వడంలో ఏ విధమైన సమస్యాలేదని కమిషన్ నిర్ధారించింది. పైగా నియామకాలు, పదోన్నతిలో అవినీతి నివారణ కావాలంటే పారదర్శకత తప్పదు. (CIC/EPFOG/A/2018/124927 శైలేంద్ర కుమార్ సింగ్ వర్సెస్ ఈïపీఎఫ్ఓ కేసులో జూన్ 7, 2018న సీఐసీ ఇచ్చిన తీర్పు ఆధారంగా) professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ -
స.హ.చట్టం బాగా పనిచేస్తోంది: మాడభూషి
హైదరాబాద్: దేశంలో సమాచార హక్కు(స.హ)చట్టం సక్రమంగా పనిచేస్తోందని ప్రతీ ఏడాది 60– 70 లక్షల మంది చట్టాన్ని విని యోగించుకుంటున్నారని కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, యుగాంతర్ సంస్థల ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడా రు. అంతకుముందు యూఆర్టీఐ.ఇన్ వెబ్ సైట్‌ను ఆవిష్కరించారు. వ్యవస్థల పనితీరు, అందులోని లోటుపాట్లు ప్రశ్నించేందుకు ఆర్టీఐను ఉపయోగించుకోవాలన్నారు. ఒక పత్రికలో వార్తను చూసి వంద ఆర్టీఐలు వేయవచ్చన్నారు. రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రానికి ఉం దని, కాని కమిషనర్‌కు జీతం అంశా న్ని మాత్రం కేంద్రం నిర్ణయిస్తుందని తెలిపారు. అయితే దీన్ని ఏ రాష్ట్రం ప్రశ్నించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ సంస్థలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలుండాలని, జాతీయ మహిళా కమిషన్‌లో ఆ కమిటీ ఉందా? అని ప్రశ్నించారు. ఐజేయూ ప్రధాన కార్యదర్శి, మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు శిక్షణ, పరిశోధనకు ఒక సంస్థ ఉండాలనే దీన్ని ఏర్పాటు చేశా మని త్వరలోనే మరికొన్ని కోర్సుల్ని ప్రారం భించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వెబ్సైట్ నిర్వాహకుడు సుశీల్, యుగాంతర్ డైరెక్టర్ శశికుమార్, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీసీసీఐని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురండి: లా కమిషన్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలని ‘లా’ కమిషన్ ప్రతిపాదించింది. అది ప్రజా అధికారమని కమిషన్ స్పష్టం చేసింది. దీని వల్ల క్రికెట్లో బీసీసీఐ గుత్తాధిపత్యం తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ‘ప్రజా పరిశీలన పరిధిలోకి తీసుకొస్తే జవాబుదారీతనం పెరుగుతుంది. ఇలాంటి వాతావరణాన్ని పోత్సహించేందుకు తోడ్పడుతుంది’ అని లా కమిషన్ బుధవారం తెలిపింది. బీసీసీఐని సమాచార హక్కు చట్టం కిందకు తేవాలనుకుంటున్నారా అని 2016 జూలైలో సుప్రీం కోర్టు లా కమిషన్‌ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. -
పిల్లాడి పాటి బుద్ధి కేంద్రానికి లేదా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఘరానా కార్పొరేట్ కంపెనీలు తీసుకున్న అక్షరాల 2.4 లక్షల కోట్ల రూపాయలను మొండి బకాయిల కింద ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు ఎంతో ఉదారంగా ఇటీవల రద్దు చేసిన విషయం తెల్సిందే. ఎవరి బకాయిలను రద్దు చేశారో వెల్లడించాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ఇటీవల పార్లమెంట్లో ఓ సభ్యుడు లిఖిత పూర్వకంగా కోరగా, అందుకు ఆ శాఖ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు–1934 చట్టంలోని 45ఈ సెక్షన్ ఇందుకు అనుమతించడం లేదని, ఈ విషయాన్ని ఆర్బీఐ స్వయంగా మంత్రిత్వ శాఖకు తెలియజేసిందని సదురు మంత్రిత్వ శాఖ సుస్పష్టం చేసింది. అంతకుముందు ఇదే విషయమై ఓ సామాజిక కార్యకర్త సమాచార చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తును కూడా ఆర్బీఐ తోసిపుచ్చింది. ఎక్కడైనా ప్రజాస్వామ్య దేశంలో లక్షల కోట్ల రూపాయలను ఎగవేసి బ్యాంకింగ్ వ్యవస్థ ఉనికికే ప్రమాదం తెస్తున్న కార్పొరేట్ల బాగోతాన్ని బయట పెట్టవద్దని చట్టం చెబుతుందా ? చెబుతుంటే అలా చెప్పే చట్టం చెల్లుతుందా? ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటి చట్టానికి కాలం మూడదా, పాడె కట్టరా? సుప్రీం కోర్టు 2015లో అదే చేసింది. ఆర్బీఐ వర్సెస్ జయంతిలాల్ ఎన్ మిస్త్రీ మధ్య నడిచిన కేసులో సమాచార చట్టాన్ని ఉల్లంఘించే ఏ చట్టం చెల్లదని స్పష్టం చేసింది. ప్రజల సమాచార హక్కుకు ప్రాధాన్యతనిస్తున్న సమాచార చట్టంలోని 22వ సెక్షన్‌ను ఆర్బీఐ యాక్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఎప్పుడూ అడ్డుకోలేవని, ముఖ్యంగా సమాచార సేకరణకు సంబంధించిన పారదర్శక చట్టమే చెల్లుతుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ‘దేశంలోని ఆర్థిక సంస్థలు తమ అవకతవలకు స్వచ్ఛత లేదా పారదర్శకత లేని చట్టాలను అడ్డం పెట్టుకుంటున్నాయి. అలాంటి చట్టాలు ఇక చెల్లవు. అవకతవకల ఆర్థిక సంస్థలకే ఆర్బీఐ కొమ్ముకాస్తూ ప్రజా సమీక్ష నుంచి తప్పించుకోవాలని చూడడం భావ్యం కాదు. అగౌరవ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. గతంలో కూడా ప్రజలను బ్యాంకుల ఇలా మభ్యపెట్టడం గురించి మాకు తెలుసు. ఇలాంటి చర్యలు దేశ ప్రయోజనాలకుగాని, ప్రజల ప్రయోజనాలకుగానీ ఎంత మాత్రం మంచివి కాదు. వాచ్డాగ్ సంస్థగా సమాచార హక్కు చట్టం కింద ప్రజలు అడిగిన సమాచారాన్ని వెల్లడించేందుకు ఉత్సాహం చూపాల్సిన ఆర్బీఐ, బ్యాంకుల అవకతవకలను దాచిపెట్టడం దిగ్భ్రాంతికరం’ అంటూ 2015లో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. ఆర్బీఐ చట్టంలోని 45ఈ సెక్షన్ కింద బ్యాంకులకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు తమకు హక్కు ఉందని, అలాగే చట్టంలోని 45ఈ (3) సెక్షన్ కింద సదరు సమచారాన్ని కోర్టులుగానీ, ట్రిబ్యునల్‌గానీ, మరే ఇతర అథారిటీగానీ వెల్లడించడానికి వీల్లేదంటూ ఆర్బీఐ చేసిన వాదనలను కూడా సుప్రీం కోర్టు నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. అంతేకాకుండా దేశ ఆర్థిక ప్రయోజనాలు భంగం లేదా హాని కలిగించే సమాచారాన్ని తాము సమాచార చట్టంలోని 8 (1)(ఏ), 8 (1)(డీ) సెక్షన్ల మేరకు వెల్లడించాల్సిన అవసరం లేదని కూడా ఆర్బీఐ వాదించింది. ఈ సెక్షన్లను ఉటంకిస్తూనే సమచార వెల్లడికి సంబంధించి కేంద్ర సమాచార కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను కూడా ఆర్బీఐ అనేక సార్లు త్రోసి పుచ్చింది. ఈ వాదనను నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చిన సుప్రీం కోర్టు ఆర్బీఐ వైఖరిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ‘సమాచారాన్ని వెల్లడిస్తే దేశ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయంటూ ఆర్బీఐ చేస్తున్న వాదనలో ఆధారాలే కాదు, ఎలాంటి పస లేదు. పైగా అది అర్థంపర్థంలేని వాదన. ప్రజలు కోరిన సమాచారాన్ని ఇవ్వడం వల్ల ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయని, ఇవ్వక పోవడం వల్ల దేశ ప్రయోజనాలే కాదు, ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయంటూ కేంద్ర సమాచార కమిషన్ చెప్పడంలో అర్థం ఉంది. ప్రజాస్వామ్య దేశంలో సార్వభౌములైన ప్రజలు అడిగిన సమాచారాన్ని వెల్లడించకుండా, అది దేశ ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం అనడం ఎంత అర్థరహితం!’ అంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఆర్టీఐతో వేధిస్తే నష్టపరిహారమే!
విశ్లేషణ జవాబుదారీతనాన్ని, పారదర్శకతను సాధించడానికి కాకుండా, అవినీతిని ఎదిరించాలనే లక్ష్యంతో సంబంధం లేకుండా, ఆర్టీఐ కింద ఇష్టం వచ్చిన సమాచారాన్ని విచక్షణారహితంగా డిమాండ్ చేస్తే దుష్పరిణామాలు సంభవిస్తాయి. జేపీ సైనీ కొన్ని ఫైళ్లనుంచి పత్రాల ప్రతులు కావాలని ఆర్టీఐ దరఖాస్తు పెట్టుకున్నారు. తన ఫిర్యాదు పైన తీసుకున్న చర్యలు, ఫలానా అధికారి మరో అధికారికి రాసిన ఉత్తరం. అవీ ఇవీ బోలెడు అడిగాడాయన. సీపీఐఓ తనకు అందుబాటులో ఉన్న అనేక పత్రాలను తీసి ఇచ్చారు. మొదటి అప్పీలు వేశారు. ఇవ్వవలసిన పత్రాలన్నీ ఇచ్చారని ఇక ఇచ్చేదేమీ లేదని ఆయన తేల్చేసారు. కానీ సైనీ అనేకానేక దరఖాస్తులు పెడుతూనే ఉన్నారు. అధికారులు జవాబులు ఇస్తూనే ఉన్నారు. కమిషన్ కూడా సైనీ అప్పీళ్లు ఎన్నో విని తీర్పులు కూడా ఇచ్చింది. అయినా కొత్త అప్పీళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇదివరకు సైనీ భివానీలో సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఒక మహిళా ఉద్యోగిపై ఈయన లైంగిక వేధింపులు చేసారన్న ఆరోపణతో శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొన్నారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారించిన తరువాత సాక్ష్యాలు లేవని వదిలేశారు. మహిళా బాధితురాలు కోర్టులో కూడా కేసు వేశారు. అందులో కూడా ఆయన విడుదలైనారు. ఆ తరువాత సైనీ ప్రతిభావిశేషాలకు మెచ్చి ప్రమోషన్ కూడా ఇచ్చారు. గ్రూప్ ఎ అధికారి హోదా ఇస్తూ సహాయ పోస్ట్‌మాస్టర్ జనరల్ పదవిని కట్టబెట్టారు. 2011లో ఆయన పదవీ విరమణ చేశారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యంచెప్పిన ఒక అధికారి పైన సైనీ ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తులు పెట్టడం మొదలు పెట్టారు. ఆయన పైన ఫిర్యాదులు చేయడం, ఆ ఫిర్యాదులమీద ఏ చర్యలు తీసుకున్నారని అడగడం. ఇక వేధింపులకు అంతులేదు. తన పదవీ విరమణ సమయాన్ని దీనికే వినియోగిస్తున్నారు. మొత్తం 255 ఆర్టీఐ దరఖాస్తులు పెట్టారు. ఇంత సమయాన్ని ఇంకేదయినా మంచి పనికి కేటాయిస్తే ఎంత బాగుండేది? లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు, విచారణ, పర్యవసానాలనుంచి మచ్చ లేకుండా బయటపడడమే అదృష్టం అనుకోకుండా సాక్ష్యం చెప్పిన వారిమీద పగతీర్చుకోవడానికి ప్రయత్నించడం దురదృష్టకరం. వ్యక్తిగత కక్షలతో వేధించడానికి సమాచార చట్టాన్ని వినియోగించడాన్ని కమిషన్ అనుమతించదు. ఆర్టీఐ దరఖాస్తునుంచి రెండో అప్పీలుదాకా వేధిం పును కొనసాగించడం దుర్మార్గమైన చర్య. ఇటువంటి వ్యక్తులను, ఆర్టీఐని వారు దుర్వినియోగం చేయడాన్ని ప్రోత్సహించకూడదు. ప్రతి దరఖాస్తుపైన చట్టం ప్రకారం ప్రభుత్వ సంస్థ ప్రతిస్పందన ఇవ్వవలసి ఉంటుంది. నెలరోజుల్లో జవాబు తయారు చేసి పోస్ట్ చేయడం వంటి పనులకు ఎంతో ప్రజాసమయం, డబ్బు వినియోగం అవుతూ ఉంటుంది. తప్పుడు పనులు చేసిన ఉన్నతాధికారుల మీద ఫిర్యాదులు చేయకుండా ఈ ఆర్టీఐ దుర్వినియోగం నిరోధిస్తుంది. వేధింపులకు భయపడి ఫిర్యాదులూ చేయకపోవచ్చు. ఈ ఆరోపణలపై విచారణలో సాక్ష్యాలు చెప్పడానికి కూడా ఎవరూ ముందుకు రారు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణ అనేదే లేకుండా పోతుంది. తోటి ఉద్యోగుల మానవహక్కులను కూడా పరోక్షంగా రెండో అప్పీళ్లు హరిస్తాయి. ప్రభుత్వ సంస్థ పక్షాన ఈ పరిస్థితిపైన ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, సెక్షన్ 18(ఎఫ్) కింద ఇటువంటి దుర్వినియోగాల వల్ల క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు జరిపే విచారణలకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయో లేదో పరిశీలించి ఒక నివేదిక ఇవ్వాలని సీఐసీ ఆదేశించింది. ఈ కేసులో ప్రభుత్వ విభాగం ఈ దరఖాస్తుదారు దాఖలు చేసిన 251 దరఖాస్తులను విభిన్న ప్రభుత్వ శాఖలకు బదిలీ చేసింది. ఈ పనికిరాని సమాచార దరఖాస్తులకు జవాబివ్వడానికి, వాటిని వేరే శాఖలకు బదిలీ చేయడానికి కనీసం రూ. 5,742 రూపాయలు ఖర్చయిందని సీపీఐఓ కమిషన్‌కు వివరించారు. ప్రభు త్వశాఖ అయితే దానికన్న మరెంతో ఎక్కువగా తన వనరులను వ్యయం చేయవలసి వచ్చింది. స్టేషనరీ, మానవ పని సమయాలు, డబ్బు కూడా వెచ్చించారు. సైనీ కేసులో విచారణాధికారిగా ఉన్న వికాస్ మైన్వాల్ తాను ఎన్నో కేసులలో చాలా నిష్పాక్షికంగా విచారణా నివేదికలు ఇచ్చానని, తన విచారణలో సైనీపై సాక్ష్యాలు లేవని తేలిందని, ఆ తరువాత కూడా దురుద్దేశంతో వేధింపు ఆర్టీఐ దరఖాస్తులు వేస్తున్నారని కమిషన్‌కు వివరించారు. సైనీ ఇదివరకు క్లాస్ 1 అధికారిగా అయిదారేళ్లు సీపీఐఓగా కూడా పని చేశారు. అయినా ఆర్టీఐని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారంటే ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందని వేదప్రకాశ్ తన నివేదికలో పేర్కొన్నారు. పదవీ విరమణ చేయడం వల్ల వచ్చిన ఈ సౌకర్యానికి అర్థం తనకు మరొకరిని వేధించడానికి దక్కిన హక్కు కాదని ఆయన అన్నారు. సీబీఎస్ఇ వర్సెస్ ఆదిత్య బందోపాధ్యాయ కేసులో ఇటువంటి దుర్వినియోగదారులను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఏకే పట్నాయక్, ఆర్.వి. రవీంద్రన్ దుయ్యబట్టారు. జవాబుదారీతనాన్ని, పారదర్శకతను సాధించడానికి కాకుండా, అవినీతిని ఎది రించాలనే లక్ష్యంతో సంబంధం లేకుండా, ఆర్టీఐ కింద ఇష్టం వచ్చిన సమాచారాన్ని విచక్షణారహితంగా డిమాండ్ చేస్తే దుష్పరిణామాలు సంభవిస్తాయి. అధికారగణం పనికిరాని దరఖాస్తులకు జవాబులు ఇచ్చే పనిలో పడి అసలు పని వదిలేయవలసి వస్తుంది అని విమర్శిం చింది సుప్రీంకోర్టు. తన చెత్త దరఖాస్తుల ద్వారా ప్రభుత్వ శాఖ పరిపాలనా సమయాన్ని వృథా చేసి, రిజిస్టర్డ్ పోస్టు ద్వారా రు. 5,742 నష్టపరిచినందుకు గాను అంతసొమ్ము నష్టపరిహారంగా చెల్లించాలని కమిషన్ సైనీని ఆదేశించింది. ఇంకా చట్టపరమైన చర్యలు ఏవైనా తీసుకోవడానికి వీలుందేమో చూడాలని కూడా సూచించింది. (జేపీ సైనీ వర్సెస్ పోస్టు విభాగం, CIC/ POS TS/A-/2017/161735 కేసులో 21.11.2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా). వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
ఆర్టీఐ పరిధిలోకి సీబీఐ!
న్యూఢిల్లీ: సీబీఐని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధి నుంచి మినహాయిస్తూ అప్పటి యూపీఏ ప్రభుత్వం 2011లో తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను న్యాయవాది అజయ్ అగర్వాల్ తొలుత అదే ఏడాది ఢిల్లీ హైకోర్టులో వేశారు. అయితే ఇలాంటి విన్నపాలు వేర్వేరు హైకోర్టుల్లో చాలా దాఖలవడంతో దీన్ని తాజాగా సుప్రీంకోర్టుకు బదిలీ చేశారు. తన పిటిషన్‌ను త్వరితగతిన విచారించాలని అజయ్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. సీబీఐని ఆర్టీఐ పరిధి నుంచి తప్పించిన సంగతిని ఆయన ఆనాడే లెవనెత్తగా... ఢిల్లీ హైకోర్టు 2011 జూలైలో కేంద్రం, సీబీఐకి నోటీసులు జారీచేసింది. సీబీఐకి ఆర్టీఐ నుంచి పూర్తిగా మినహాయింపు దక్కలేదని, ఇందులో న్యాయ వ్యవస్థ జోక్యం తగదని అప్పుడే కేంద్రం కోర్టుకు బదులిచ్చింది. తన తాజా పిటిషన్లో అజయ్ అప్పటి ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. -
ప్రతిఘటించాల్సిన తీర్పు
విశ్లేషణ ఈ తీర్పులో సుప్రీంకోర్టు అభిప్రాయ వ్యక్తీకరణ స్వాతంత్య్రంలో సమాచార స్వాతంత్య్రం కూడా ఉందని గుర్తించింది. తద్వారా ప్రభుత్వ పత్రాల దాపరికపు పరిధిని సర్వోన్నత న్యాయస్థానం కుదించింది. ప్రజల స్వాతంత్య్రాల్ని రక్షించినా, నియమపాలనను నిర్ధారించినా, పారదర్శకతను గురించి పద్ధతులను నిర్దేశిం చినా మన సర్వోన్నత న్యాయ స్థానం వల్లనే సాధ్యం. న్యాయ మూర్తుల నియామక వివరా లన్నీ ప్రజల ముందుండాలని ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం (1982) 2 ఎస్సీఆర్ 365 తీర్పు చెప్పింది. న్యాయశాఖ మంత్రి, ఢిల్లీ ప్రధాన న్యాయ మూర్తి, భారత ప్రధాన న్యాయమూర్తికి మధ్య న్యాయ మూర్తుల నియామకం, బదిలీ వంటి అంశాలపై సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రివిలేజ్ చాటున దాచడం న్యాయం కాదని చట్టం ప్రకారం ఆ అంశాలను వెల్లడిం చాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆనాటి తీర్పు ఈనాటి పారదర్శక శాసనాలకు, సమాచార హక్కు చట్టానికి మూలాధారం. కేంద్రం ఇద్దరు న్యాయమూర్తుల నియామకపు సిఫార్సులను తిరస్కరించింది. దీనికి సంబంధించిన ప్రతులన్నిటినీ ఇవ్వాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలైంది. మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహాను ఏ కోర్టూ విచారించడానికి వీల్లేదని భారత రాజ్యాంగం ఆర్టికల్ 74(2) చెబుతున్నది. ప్రచురితం కాని రాజ్య వ్యవహారాల అధికారిక పత్రాలను ఆయా శాఖల అధిప తుల అనుమతి లేకుండా సాక్ష్యంగా తీసుకోవడానికి వీల్లేదని భారత సాక్ష్య చట్టం సెక్షన్ 123 నిర్దేశించింది. కనుక ఆ న్యాయమూర్తుల నియామక లేఖాయణాన్ని వెల్లడించనవసరం లేదన్న ప్రభుత్వ వాదాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి భగవతి తిరస్కరించారు. పార దర్శక భాగస్వామ్య ప్రజాస్వామ్యానికి జవాబుదారీ తనం అవసరం. ప్రభుత్వ పాలనకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఆర్టికల్ 19(1)(ఎ) కింద అభిప్రాయప్రకటనా స్వాతంత్య్రంలో అంతర్లీనంగా ఉన్న తెలుసుకునే హక్కు నుంచి పారదర్శకపాలనా సూత్రం నేరుగా రూపొందింది. కేవలం ప్రజాప్రయో జనం కోసమే, నిక్కచ్చిగా అవసరమైనప్పుడే దాపరికం సమంజసమవుతుందని సుప్రీంకోర్టు వివరించింది. జడ్జీల నియామకంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రెండే రెండు కారణాలపైన సవాలు చేయవచ్చు: (1) కేంద్రప్రభుత్వంతోనూ ఇతర అధికారులతోనూ జరపవ లసినంతగా సంప్రదింపులు జరపలేదనీ, (2) నిర్ణయం అసమంజసమైన కారణాల ఆధారంగా తీసుకోవడం. ఈ ప్రశ్నలపై న్యాయనిర్ణయం కోసం మంత్రికి ప్రధాన న్యాయమూర్తులకు మధ్య సాగిన ఉత్తరాలను పరి శీలించాల్సిందే. ఫలానా పత్రాన్ని వెల్లడించడం వల్ల ప్రజాప్రయోజనానికి నష్టమా కాదా అని పరిశీలించాలి. ఈ తీర్పులో సుప్రీంకోర్టు అభిప్రాయ వ్యక్తీకరణ స్వాతంత్య్రంలో సమాచార స్వాతంత్య్రం కూడా ఉందని గుర్తించింది. తద్వారా ప్రభుత్వ పత్రాల దాపరికపు పరి ధిని సర్వోన్నత న్యాయస్థానం కుదించింది. కెనరా బ్యాంక్ వర్సెస్ సీఎస్ శ్యాం కేసులో సుప్రీంకోర్టు ఆగస్టు 31, 2017 నాటి తీర్పు సుప్రీంకోర్టు ఇదివరకటి అనేక మంచి తీర్పులకు, ముఖ్యంగా ఎస్పీ గుప్తా తీర్పునకు పూర్తిగా విరుద్ధం. కెనరా బ్యాంకు గుమాస్తాలను నియమించిన తేదీ, చోటు, వారిని బదిలీ చేసిన వివరాలు, బదిలీలకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు ఇవ్వాలని శ్యాం కోరారు. పీఐఓ తిరస్కరించారు. మొదటి అప్పీలు అధి కారి సమర్థించారు. సీఐసీ రెండో అప్పీలులో ఇది వ్యక్తి గత సమాచారం కాదని, ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. కేరళ హైకోర్టు సీఐసీ ఉత్తర్వును సమర్థించింది. డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. కెనరాబ్యాంక్ సుప్రీం కోర్టుకు రిట్ అప్పీలు చేసింది. న్యాయమూర్తులు అభయ్ మనోహర్ సప్రే, ఆర్కే అగ్రవాల్‌తో కూడిన డివిజన్ బెంచ్ 2017 ఆగస్టు 31న ఇచ్చిన తీర్పు ఎస్పీ గుప్తా తీర్పునకు పూర్తిగా విరుద్ధం. అక్కడ న్యాయ మూర్తుల ఎంపిక నియామకానికి సంబంధించి అగ్ర స్థాయిలో సాగిన ఉత్తరప్రత్యుత్తరాలే రహస్యం కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే, ఇక్కడ ఈ కేసులో గుమాస్తాల నియామక తేదీ, వారిని నియమించిన చోటు, బదిలీ చేసిన చోటు, బదిలీ చేసిన అధికారి పేరు, నియమావళి రహస్యాలని, అవి ఆ గుమాస్తాల వ్యక్తిగత సమాచారం అని తీర్పునిచ్చింది. గిరీశ్ రామచంద్ర దేశ్‌పాండే, ఆర్కే జైన్ కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఇద్దరు న్యాయమూర్తులు వివరించారు. గిరీశ్ కేసులో ప్రభుత్వ ఉద్యోగులపైన అధికారులు తీసుకున్న క్రమశిక్షణా చర్యలు, వారి ఆదా యపు పన్ను రిటర్న్‌లు అడగొద్దని తీర్పు ఇచ్చారు. ఇదీ అన్యాయమే. జైన్ కేసులో ఏసీఆర్ రిపోర్టులలో వచ్చిన వ్యతిరేక వాక్యాలపై ఏ చర్య తీసుకున్నారని అడిగారు. అదీ వద్దన్నారు. కెనరా బ్యాంకు కేసులో ఆ వివరాలు అడగలేదు. అయినా తిరస్కరించారు. సెక్షన్ 4(1)(బి) ఆర్టీఐ చట్టం కింద నియామకాలు బదిలీలు పోస్టింగ్‌ల సమాచారం తమంత తామే ఇవ్వాలని పార్లమెంటు నిర్దేశిస్తున్నది. ఈ తీర్పులో అన్యాయాన్ని వివరిస్తూ సుప్రీంకోర్టును పునఃపరిశీలించాలని పౌరులు కోరాలి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
సమాచార హక్కు బేఖాతరు
ఏళ్లు గడుస్తున్నా పట్టింపులేదు జమ్మికుంటరూరల్: సమాచార హక్కు చట్టం నియమనింబధనల మేరకు 30 రోజుల్లోపు సంబంధిత అధికారులు పూర్తి సమాచారాన్ని దరఖాస్తుదారునికి అందించాలి. కానీ.. జమ్మికుంట ఎంపీడీవో కార్యాలయంలో మాత్రం అవేమి కనిపించడం లేదు. కొందరు దరఖాస్తుదారులు సమాచారం కోసం దరఖాస్తులు చేసి ఏళ్లు గడుస్తున్నా.. అధికారులు తగిన సమాచారాన్ని ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. సహ చట్టం కార్యకర్తలు, యువకులు, ప్రజాప్రతినిధులు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరితే ఏదో ఒక సాకుతో దాటవేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. మండలంలోని కోరపల్లి గ్రామానికి చెందిన యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ దొగ్గల ప్రకాష్ నాలుగు నెలల క్రితం ఎంపీడీవో రమేష్ రూట్డైరీ వివరాలు..? సర్పంచ్‌లు, ఎంపీటీసీలు గెలిచినప్పటినుంచి ఇప్పటివరకు ఎంతమంది.. ఎన్నిసార్లు సమావేశాలకు హాజరయ్యారు..? సర్వసభ్య సమావేశాలకు ఎంతమంది అధికారులు గైర్హాజరు అయ్యారు..? ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు..? ప్రజాప్రతినిధులు, ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటివరకు అధికారులు తీసుకున్న చర్యల వివరాలు కోరారు. అయితే నెలలు గడుస్తున్నా.. ఇంకా ఇవ్వడం లేదని ప్రకాశ్ పేర్కొన్నారు. కొన్నేళ్లక్రితం మండలంలోని పలు గ్రామాలలో సర్పంచ్‌లు ఎన్నిక అయిన నాటి నుండి 14వ, ఆర్థిక సంఘం నిధులు, టీఎఫ్సీ, ఎస్ఎఫ్సీ, బీఆర్జీఎఫ్, ఆదాయ, వ్యయాలను కోరగా కొన్ని గ్రామాలకు మాత్రమే ఇచ్చినట్లు రాంరాజయ్య తెలిపారు. వైరమణారెడ్డి అనే పంచాయతీ కార్యదర్శి జమ్మికుంట మండలంలో ఎక్కడెక్కడ పనిచేశాడు..? ఇన్చార్జిగా ఎక్కడెకక్కడ వ్యవహరించాడు..? ఇతనిపై వచ్చిన ఫిర్యాదులపై ఏమేమీ చర్యలు తీసుకున్నారు..? అనే వివరాలు కోరగా రికార్డులు అందుబాటులో లేవని ఎంపీడీవో వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కొన్ని వివరాలను అధికారులు ఇవ్వకపోవడంతో ప్రకాష్ అధికారుల తీరుపై సమాచార హక్కు చట్టం కమీషనర్ హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే అడిగిన సమాచారం ఇవ్వడం లేదని పేర్కొంటూ ప్రకాశ్ హైదరాబాద్ కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
19మంది డిన్నర్, 18.29లక్షలు ఖర్చు
అమరావతి: అసలే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయింది. ఈమేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి యనమల రామకృష్ణుడు సైతం ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని కోరారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఖర్చులు ఖజానాపై ప్రభావం చూపున్నాయి. లక్షలకు లక్షలు ఖర్చులు పెట్టి ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారనేది రాష్ట్ర ప్రజల ఆవేదన. దీనికి ఉదాహణగా ఏపీ ప్రభుత్వం 19 మంది ప్రముఖుల భోజనాల కోసం సుమారు 19లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఇదేదో గాలి లెక్కలు కాదు. సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకున్నవివరాలు. ఈ ఏడాది ఫిబ్రవరి 23,24 తేదీల్లో ఏపీ ప్రభుత్వం విజయవాడలో "ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, కమర్షియల్ అండ్ ఎమర్జింగ్ లాస్" అనే అంశంపై రెండురోజుల పాటు అంతర్జాతీయ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈసమావేశానికి అనేక మంది ప్రముఖలు హాజరయ్యారు. వర్క్‌షాప్ అనంతరం వీరికోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ విందులో పాల్గొన్నది కేవలం 19మంది మాత్రమే. ఈ విందుకోసం ప్రభుత్వం రూ.13,38,720 ఖర్చు చేసింది. మరో రూ.4,90,705 లను వారి సదుపాయల నిర్వహణకు ఖర్చు చేసింది. మొత్తం 18,29,425 రూపాయలను ఏపీ ప్రభుత్వం వినియోగించింది. ఈవివరాలు అన్నీ ఒక సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించినవి. రాష్ట్ర అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రముఖులను ఆహ్వానించాల్సి ఉంటుంది. ఇందుకోసం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఒక విందు కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయడం సరైనదేనా అనేది సామాన్య పౌరుడి ప్రశ్న. -
చేతన కొరవడితే యాతనే!
సమకాలీనం పారదర్శకత గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చే అధినేతలకు పాలనావ్యవస్థల్లోని సమాచారం ప్రజలకు అందించడమంటేనే వెరపు! సమాచార వెల్లడితో కొత్త చిక్కుల్ని ఆహ్వానించే కన్నా గోప్యత ద్వారా పబ్బం గడుపుకోవచ్చన్న తప్పుడు ఆలోచనే ఇందుకు కారణం. సమాచారం నిరాకరించే, జాప్యం చేసే ప్రతి సందర్భంలోనూ, అంటే అన్ని ఫిర్యాదులు, అప్పీళ్లల్లో నిందితులుగా నిలవాల్సింది ప్రభుత్వ యంత్రాంగమే! తనను దోషిగా నిలబెట్టి ప్రశ్నించే ఏ పరిస్థితినైనా ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు సాఫీగా అనుమతిస్తుంది? ‘సదా అప్రమత్తంగా ఉండటమే స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు మనం చెల్లించే మూల్యం’ (Eternal vigillance is the price of liberty) అని తొలుత ఎవరు చెప్పారో కానీ, గడచిన రెండు శతాబ్దాలుగా ప్రపంచమంతా ప్రాచుర్యంలో ఉన్న మాట ఇది! ఇప్పటికీ వర్తిస్తున్న మాట! ఐరిష్ న్యాయవాది జాన్ ఫిల్‌పోట్ తొలుత చెప్పారనేదొక ప్రచారం. అమెరికాలో సాగిన బానిసత్వ వ్యతిరేక పోరులో క్రియాశీల కార్యకర్తగా వెండెల్ ఫిలిప్స్ 1882లో ఈ మాటన్నారనీ చెబుతారు. ఆధారాల్లేకపోయినా... అమెరికా నిర్మాతల్లో ఒకరైన థామస్ జెఫర్సన్ అంతకు ముందెప్పుడో అన్నట్టు ఆయన పేరిట ప్రచారముంది. ఎవరు చెప్పినా విశ్వవ్యాప్తంగా అనేక పౌర ఉద్యమాలకు ఊపిరులూదిన, ఇంకా ఊదుతున్న గొప్ప స్ఫూర్తి వాక్యం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు అతికినట్టు సరిపోయే ఆణిముత్యమీ మాట! పౌర సమాజం చైతన్యంతో ఉండి పోరాడితే తప్ప ప్రజాస్వామ్యపు మౌలిక హక్కులు కూడా దక్కని దుస్థితి క్రమంగా బలపడుతోంది. సమాచార హక్కు చట్టం అమలును చూస్తే అది తేటతెల్లమౌతోంది. రాజ్యాంగ స్ఫూర్తితో, చట్టం సాక్షిగా దక్కిన ఈ హక్కు అమలు పర్యవేక్షణకిక తెలుగునాట నేటితో కాలం చెల్లనుంది. పూనిక వహిస్తే తప్ప పునరుద్ధరణకు మరెంత కాలమో! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, నిరంతరాయంగా సాగాల్సిన చట్టం అమలు పర్యవేక్షణకు ఇప్పుడు గండి పడుతోంది. రేపట్నుంచి కొంత కాలంపాటు చట్ట శూన్యత, ఇంకా చెప్పాలంటే రాజ్యాంగ శూన్యత ఏర్పడే పరిస్థితులు దాపురించాయి. అడిగినా సమాచారం లభించని సందర్భాల్లో పౌరులు చేసుకొనే ఫిర్యాదులు, అప్పీళ్లు, చట్టం అమలును చూసే సమాచార కమిషన్ రేపట్నుంచి ఉనికిలో లేకుండా పోతోంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో, రెండు రాష్ట్రాలకు విడిగా రెండు కమిషన్లను సమకూర్చుకునే జాగ్రత్తలు తీసుకోకపోగా ఉన్న ఉమ్మడి కమిషన్‌కు కాలం చెల్లిపోతున్నా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. కొత్త కమిషన్, కమిషనర్ల నియామకాలు ఇంకా మొదలు కాలేదు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే ప్రక్రియకు తెరలేపుతున్నా ఏపీలో కనీసం ఆ ఊసే లేదు! సహజ మరణంలా కనపడేట్టు చంపుతున్నదెవరు? ప్రభుత్వాలు ఏ కొంచెం జాగ్రత్త తీసుకున్నా కమిషన్‌కు ఈ పరిస్థితి తలెత్తేదే కాదు. 2014 జూన్‌లో రాష్ట్ర విభజన తర్వాత మిగతా పలు విభాగాల్లాగే సమాచార కమిషన్నూ పంచుకోవాల్సింది. పంపకాల జాబితాలో మొదట ఎక్కడా కమిషన్ ప్రస్తావన కూడా లేకపోవడం అందరినీ విస్మయ పరిచింది. తర్వాత జ్ఞానోదయమై, పదో షెడ్యూల్ జాబితాలో చేర్చారు. నిబంధనల ప్రకారం ఏడాదిన్నరలో ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు సయోధ్యతో కమిషన్‌ను పంచుకోవాలి. ఇందులో పంచుకోవడానికీ, పంపకంలో వివాదాలు తలెత్తడానికీ ఆస్తు లేం లేవు! ఉన్నదల్లా కమిషనర్లను, ఇతర సిబ్బందిని పంచుకొని ఏ రాష్ట్రపు అప్పీళ్లు, ఫిర్యాదుల్ని ఆ కమిషన్ పరిష్కరించడం, అక్కడ చట్టం అమలును పర్యవేక్షించడం. ఇంత తేలిక వ్యవహారాన్నీ సర్కార్లు తేల్చలేదు, పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. ఏడాదిన్నర గడువు మీరితే కేంద్ర ప్రభుత్వం చేసిపెట్టాలి. అదీ జరక్కుండానే మొత్తం మూడేళ్లవుతోంది. ఈ మధ్య కాలంలో ఒక్కరొక్కరుగా ముఖ్య సమాచార కమిషనర్లు పదవీ విరమణ చేశారు. పదవిలో కొనసాగుతున్న నలుగురు కమిషనర్ల నియామకమే చెల్లదంటూ లోగడ హైకోర్టిచ్చిన తీర్పును ఈ మధ్యే సుప్రీంకోర్టు ఖరారు చేసింది. దాంతో వారు ఇంటిబాట పట్టారు. అది జరిగిన ఒకట్రెండు రోజుల్లోనే అప్పటివరకు ఆపద్ధర్మ ముఖ్య కమిషనర్‌గా ఉన్న రతన్ పదవీ విరమణ చేశారు. ఇక కమిషన్‌లో మిగిలిన ఏకైక కమిషనర్ విజయబాబుకు ఈ రోజు (శుక్రవారం) ఆఖరి పనిదినం. ఇక కమిషన్ ఉనికిలో లేనట్టే! ఎందుకంటే, చట్టంలో నిబంధనలలా ఉన్నాయి. సమాచార హక్కు చట్టం–2005 సెక్షన్ 15(4) ప్రకారం ‘కమిషన్ నిత్యనిర్వహణ, దిశా నిర్దేశం అన్నది కమిషనర్ల సహకారంతో ముఖ్య కమిషనర్ నిర్వహించాలి...’ అని ఉంది. ఏ వ్యవహారమైనా కమిషనర్లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించజాలవు, నిర్వహించకూడదు. ముఖ్య కమిషనర్, ఇతర కమిషనర్లెవరూ లేనప్పుడు కమిషన్ ఉనికిలో లేనట్టే అని గుజరాత్, ఉత్తరాఖండ్ కమిషన్ల నిర్వహణ వివాదంలో అక్కడి ఉన్నత న్యాయస్థానాలు ఇదివరకే తేల్చిచెప్పాయి. లోగడ ఆ తీర్పులతో జడిసిన ఆయా ప్రభుత్వాలు ముఖ్య కమిషనర్‌ను (గుజరాత్), ఇతర కమిషనర్లను (ఉత్తరాఖండ్) సత్వరమే నియమించుకున్నాయి. అందుకే ప్రభుత్వాలు ఈ శూన్యత రాకుండా ఉండటానికి తగినంత ముందుగానే ప్రక్రియ ప్రారంభిస్తాయి. చివరి కమిషనర్ పదవీ విరమణ నాటికి కొత్తగా నియమితులైనవారు బాధ్యత తీసుకునేలా ప్రక్రియను పూర్తి చేస్తాయి. ఆ తెలివిడి ఇప్పుడు రెండు ప్రభుత్వాలకూ లేకుండా పోయింది. సర్కార్లకు శీతకన్నెందుకు? సమాచార హక్కు చట్టం పట్లనే ఈ ప్రభుత్వాలకు సదుద్దేశమున్నట్టు లేదు! అమలు చేయకుంటే నేం? అన్న ధీమాతోనే ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తుండవచ్చని ఆర్టీఐ క్రియాశీల కార్యకర్తలంటున్నారు. పాలకుల ఈ భావనలకు ఉన్నతాధికార వ్యవస్థ అనాసక్తి తోడవుతోంది. దాంతో చట్టం అమలు నీరుగారుతోంది. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న అమలు, పర్యవేక్షణ ఇక కమిషన్ కూడా లేకుంటే మరింత కుదేలవడం ఖాయం. ఇలా కమిషన్ ఉనికే లేని పరిస్థితికి నెట్టడం సర్కార్ల నిర్లక్ష్యానికి నిదర్శనం. పాలకులు, ఉన్నతాధికార వ్యవస్థ నుంచి ప్రత్యక్షంగా–పరోక్షంగా అందే సంకేతాలను బట్టే కింది స్థాయి అధికారులు, సిబ్బంది పనితీరు ఉంటుంది. అదే ఆర్టీఐ విజయ–వైఫల్యాలను నిర్ణయిస్తుంది. పారదర్శకత గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చే అధినేతలకు పాలనావ్యవస్థల్లోని సమాచారం ప్రజలకు అందించడమంటేనే వెరపు! పూర్వపు/తమ నిర్వాకంలోని అలసత్వం, ఆశ్రిత పక్షపాతం, అక్రమ– అవినీతి వ్యవహారాలు బట్టబయలవుతాయనే భయం కూడా కారణం కావచ్చు. సమాచార వెల్లడితో కొత్త చిక్కుల్ని ఆహ్వానించే కన్నా గోప్యత ద్వారా పబ్బం గడుపుకోవచ్చన్న తప్పుడు ఆలోచనే ఇందుకు కారణం. దాంతో సమాచార హక్కు చట్టం అమలంటేనే తప్పించుకునే దొంగదారులు వెతుకుతారు. సమాచారం నిరాకరించే, జాప్యం చేసే ప్రతి సందర్భంలోనూ, అంటే అన్ని ఫిర్యాదులు, అప్పీళ్లల్లో నిందితులుగా నిలవాల్సింది ప్రభుత్వ యంత్రాంగమే! తనను దోషిగా నిలబెట్టి ప్రశ్నించే ఏ పరిస్థితినైనా ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు సాఫీగా అనుమతిస్తుంది? అందుకే ఈ అవరోధాలు. సమాచార వెల్లడికి సంబంధించి తామిచ్చే ఆదేశాలను అధికార యంత్రాంగం పాటించడం లేదని, ఈ విషయంలో సర్కారు సహకరించకుంటే నిర్వహణ కష్టమని కమిషనర్లే తమ వార్షిక సదస్సులో బాహాటంగా చేతులెత్తేసిన దుస్థితి విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో వెల్లడైంది. విభజనానంతరం ఇక ఆ కమిషన్ ఎవరికీ పట్టని సంస్థగానే మిగిలింది. ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం. ఒక దశలో కమిషన్ ఆర్థిక నిర్వహణ, కమిషనర్లు ఇతర సిబ్బంది జీతభత్యాలకూ తిప్పలు తప్పలేదు. ఇది రాజ్యాంగ విహిత బాధ్యత సమాచారం తెలుసుకోవడం అన్నది పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పుల్లో వెల్లడించింది. పౌరులు తమ వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ (అధికరణం 19 (1) (ఎ)లో అంతర్భాగంగా) వినియోగించుకునే క్రమంలోనే ఈ హక్కు సంక్రమిస్తుందనీ స్పష్టం చేసింది. దీన్ని సక్రమంగా అమలు పరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థాయిల్లో కమిషన్లను ఏర్పాటు చేసి, నిర్వహించాలని సమాచార హక్కు చట్టం (సెక్షన్లు 12, 15) నిర్దేశిస్తోంది. ఈ నిర్వహణ లేకుంటే కచ్చితంగా ఇది చట్టోల్లంఘన, రాజ్యాం గోల్లంఘన కిందకే వస్తుందని పౌర సమాజం పేర్కొంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సత్వరమే ముఖ్య, ఇతర కమిషనర్ల నియామక ప్రక్రియ చేపట్టాలని ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులకు ఆర్టీఐ జాతీయ ప్రచార వేదిక (ఎన్సీపీఆర్ఐ) ఇటీవలే విడివిడిగా వినతిపత్రాలు సమర్పించింది. అరుణరాయ్, నిఖిల్‌డే, శైలేశ్ గాంధీ, రాకేశ్‌రెడ్డి, రామకృష్ణంరాజు తదితరులు ఇందులో ఉన్నారు. యోగ్యత కలిగిన సమర్థుల్ని కమిషనర్లుగా నియమిస్తూ, ఆ నియామక ప్రక్రియనూ పౌరులకు తెలిసేలా పారదర్శకంగా జరిపించాలనీ కోరారు. ‘నమిత్‌శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో, నియామకాలకు ఏ ప్రక్రియను పాటించమందో కూడా ఈ వినతిపత్రంలో వారు ప్రస్తావించారు. సుప్రీం తీర్పుననుసరించి కేంద్ర ప్రభుత్వం లోగడ కేంద్ర సమాచార కమిషనర్లను నియమించేటప్పుడు పత్రికల్లో ప్రకటన జారీ చేసి ఆసక్తి గల అర్హుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించింది. సమాచార హక్కు చట్టం (సెక్షన్లు 12(5), 15(5) లలో) నిర్దేశించినట్టు ప్రజాజీవితంలో ప్రముఖులై ఉండి న్యాయ, శాస్త్ర–సాంకేతిక, సమాజసేవ, పత్రికారంగం, పాలన, నిర్వహణ తదితర రంగాల్లో విస్తృత పరిజ్ఞానం కలిగిన వారి దరఖాస్తుల్ని పరిశీలించాలి. ఎవరి అర్హతలేమిటో నిర్దిష్టంగా పేర్కొంటూ, జాబితా కుదింపు ప్రక్రియలో ప్రతి పేరు పక్కన మినిట్స్ నమోదు చేస్తూ ఈ సమాచారాన్ని పౌరులకు అందుబాటులో ఉంచాలి. అలా కుదించిన జాబితా నుంచి అవసరమైనన్ని పేర్లను ముఖ్యమంత్రి, విపక్షనేత, సీనియర్ మంత్రితో కూడిన త్రిసభ్య సంఘం గవర్నర్‌కు ప్రతిపాదిస్తుంది. ఆయన పరిశీలించి ఖరారు చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిది సత్వరం జరగాల్సి ఉంది. దీనికి చాలా సమయమే పట్టొచ్చు! చెవి మెలితిప్పితే తప్ప....! కొన్ని వ్యవహారాల్లో ప్రభుత్వ నిర్వాకాలు చిత్రాతిచిత్రంగా ఉంటాయి. న్యాయస్థానాలతో మొట్టికాయలు వేయించుకునే వరకు తెలిసి తెలిసీ నిస్సిగ్గుగా చట్టాల్ని, రాజ్యాంగాన్నీ ఉల్లంఘిస్తుంటాయి. ఆర్టీఐ అమలు విషయంలో ఇప్పుడిదే జరుగుతోంది. ఒక్క ఆర్టీఐ అనే కాదు, చాలా వ్యవహారాల్లో జరుగుతున్నదిదే. రెండు రాష్ట్రాల్లోనూ మానవహక్కుల సంఘం దాదాపు లేనట్టే! ఛైర్మన్, సభ్యులెవరూ లేకపోవడంతో కార్యదర్శిగా ఉన్న అధికారే ఇప్పుడు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. తెలంగాణలో పరిపాలనా ట్రిబ్యునల్ లేదు. ఇంకా చాలా సంస్థల్ని క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారు. అధికార–విపక్షమనే రాజకీయ వ్యవస్థల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం, అధికారాన్ని అడ్డుపెట్టుకొని విపక్షాల్ని బలహీనపరచడం ద్వారా ఆధిపత్య సాధన! ఇదే, ఇప్పుడు జరుగుతున్న వ్యూహాత్మక తంతు! ఇతర ఏ ప్రజాస్వామ్య వ్యవస్థల్నీ మననీయకుండా చూడటం కుట్రలా సాగుతోంది. అయితే మొత్తానికి లేకుండా చేయడం, కుదరక కొనసాగినా... నిర్వహణ పరంగా వాటిని నిర్వీ ర్యపరచడం పాలకులకు రివాజయింది. ఫలితంగా నష్టపోవడం ప్రజల వంతవుతోంది. ఈ దుస్థితిని అధిగమించడానికి పౌర చైతన్యమే మిగిలిన మార్గం. హక్కుల్ని, హక్కులు కాపాడే ప్రజాస్వామ్య సంస్థల్ని బతికించుకోవడమే పౌరసమాజ తక్షణ కర్తవ్యం. ప్రభుత్వాలేవైనా ప్రజలు గ్రహించాల్సిందిదే! ఎక్కడో శివసాగర్ (కె.జి.సత్యమూర్తి) అడిగిన ప్రశ్న గుర్తొస్తుంది. ‘ఏ పులి మేకను సంరక్షిస్తుంది? ఇది చరిత్ర చెప్పిన సత్యం!’. వ్యాసకర్త: దిలీప్ రెడ్డి ఉమ్మడి ఏపీ సమాచార పూర్వ కమిషనర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
‘తిలక్’ నిధులు మింగేశారు!
న్యూఢిల్లీ: బాల గంగాధర్ తిలక్‌పై సినిమా రూపొందించేందుకంటూ తీసుకున్న రూ. 2.5 కోట్ల నిధులను మింగేశారు. సినిమా కోసం 2005లో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు సంబంధించిన వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం ద్వారా వీఆర్ కమలా పుర్కర్ అనే వ్యక్తి సాంస్కృతిక శాఖకు దరఖాస్తు చేశారు. నిర్మాత వినయ్ ధుమాలేకు రూ.2.5 కోట్లు ఇచ్చామని, అయితే ఆయన సినిమాను రూపొందించలేదని ఆ శాఖ.. .సమాచార కమిషన్‌కు తెలిపింది. రికార్డులేవీ తమ వద్ద లేవని చెప్పింది. ‘ధుమాలేకి రెండు విడతల్లో మొత్తం డబ్బు బదిలీ చేశారు. కానీ అతడు సినిమా రూపొందించలేదు’ అని సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు పేర్కొన్నారు. ఫైళ్ల మిస్సింగ్‌పై విచారణ జరపాలని, 60 రోజుల్లోగా నివేదిక అందజేయాలని సాంస్కృతిక మంత్రిత్వ శాఖను ఆదేశించారు. -
జీజీ నడ్కుడలో సాంఘిక బహిష్కరణ
సమాచార హక్కు చట్టం ఉపయోగించినందుకు.. నందిపేట(ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం జీజీ నడ్కుడలో రాజుగౌడ్ అనే గీత కార్మికుడి కుటుంబాన్ని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సాంఘిక బహిష్కరణ చేశారు. గ్రామంలో 8 నెలల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామంలో గృహావసర, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయో తెలపాలంటూ రాజు సమాచార హక్కు చట్టం కింద విద్యుత్ శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని ట్రాన్స్‌కో అధికారులు గ్రామాభివృద్ధి కమిటీకి తెలిపారు. తమకు సమాచారం ఇవ్వకుండా ట్రాన్స్‌కోకు దరఖాస్తు చేసుకోవడంపై ఆగ్రహం చెందిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు రూ. 60 వేల జరిమానా చెల్లించాలని, లేకపోతే గ్రామం నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. విద్యుత్ శాఖతో గ్రామానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకపోతే డబ్బులు తిరిగి ఇవ్వడా నికి అంగీకరించారు. దీంతో రాజుగౌడ్ జరిమానా చెల్లిం చాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇటీవల ఎన్నికైన గ్రామాభివృద్ధి నూతన కమిటీ సభ్యులను రాజుగౌడ్ కోరగా వారు తిరస్కరించారు. దీంతో అతడు పోలీసు లను ఆశ్రయించాడు. ఆగ్రహించిన గ్రామాభివృద్ధి కమి టీ సభ్యులు ఐదు రోజుల క్రితం రాజుగౌడ్ కుటుంబానికి మరోసారి సాంఘిక బహిష్కరణ శిక్ష విధించారు. అతడి కుటుంబంతో మాట్లాడితే రూ. 3 వేల జరిమానా విధి స్తామని గ్రామస్తులను హెచ్చరించారు. -
చట్టాలపై అవగాహన ఎంతో ముఖ్యం
ప్రజల్లో చైతన్యం వస్తేనే ఇది సాధ్యం కామారెడ్డి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎండీ అబ్దుల్ సలీం సమాచార హక్కు చట్టంపై విద్యార్థులకు అవగాహన భీమ్‌గల్(బాల్కొండ) : చట్టాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యమని, ప్రజల్లో చైతన్యం రావడం ద్వారానే చట్టాలపై అవగాహన కలుగుతుంద ని సమాచార హక్కు చట్టం రాష్ట్ర డైరెక్టర్, కామారెడ్డి జ్యుడీషియల్ మెజిస్త్రేట్ ఎండీ అబ్దుల్ సలీం అన్నారు. గురువారం ఆయన భీమ్‌గల్‌లోని ఐటీఐ కళాశాలలో విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రసంగించారు. చట్టమనేది ఎవరికీ చుట్టం కాదన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు వివిధ చట్టాలపై అవగాహన ఎంతో ముఖ్యమన్నారు. గృహ హింస, నిర్భయ, వరకట్న వేధింపులు, బాలకార్మిక హక్కు చట్టం, విద్యా హక్కు చట్టాలతో పాటు సమాచార హక్కు చట్టం గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. సమాచార హక్కు చట్టం రాకముందు ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యులకు సమాచారం లభించేదికాదన్నారు. ఇప్పుడు ప్రతి భారతీయ పౌరుడు స్వేచ్ఛగా సమాచారం పొం దే వీలుందన్నారు. దీని ద్వారా అవినీతిని బట్టబయ లు చేయవచ్చన్నారు. ఈ చట్టం వచ్చాకే రూ. 1.86 లక్షల కోట్ల టూజీ స్పెక్ట్రం కుంభకోణం వెలుగుచూసిందన్నా రు. ఢిల్లీలో 2008–09లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో అప్పటి సీఎం షీలా దీక్షిత్ రూ. 86 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఈ చట్టం ద్వారానే బయటపడిందన్నారు. ఇలా ఎన్నో అక్రమా లు వెలుగు చూశాయన్నారు. విద్యార్థులు దీనిపై అవగాహన పెంచుకోవడం ద్వారా సమాజంలో పేరుకుపోయిన అవినీతిని వెలికితీయవచ్చన్నారు. సమావేశంలో ఆర్టీఐ కామారెడ్డి జిల్లా స్పోక్స్ పర్సన్, న్యాయవాది ఏక శ్రీనివాస్‌రావ్, న్యా యవాది టి.లక్ష్మీనర్సింహాచారి, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దొనకంటి నర్సయ్య, సర్పంచ్ గుగులోత్ రవినాయక్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ గంగేశ్వర్, ఎంపీటీసీ సభ్యులు ఎంఏ మోయిజ్, బాలకిషన్ పాల్గొన్నారు. -
వాళ్ల సమాచారం మాదగ్గర లేదు...
ఇండోర్: దేశంలో నోట్ల రద్దు సమయంలో రూ 2.5 లక్షలు, అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వారి వివరాలు తమ దగ్గర లేవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ రూ 2.5 లక్షలు డిపాజిట్ చేసిన వారి వివరాలు కోరారు. గతేడాది నవంబర్ 8నుంచి డిసెంబర్30 వరకూ పాత రూ500, 1000 నోట్లతో రూ 2.5 లక్షలు, అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వారి సమాచారం కావాలని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ ఈ సమాధానమిచ్చింది. ఆర్బీఐ వద్ద కోపరేటివ్ బ్యాంకుల్లోరూ. 2.5లక్షలు డిపాజిట్ చేసిన వారి వివరాలు లేవని సమాధానం ఇచ్చినట్లు గౌడ్ తెలిపారు. -
‘మోదీతోపాటు పాసైన వారి వివరాలు చూసుకోనివ్వండి’
-
‘మోదీతోపాటు పాసైన వారి వివరాలు చూసుకోనివ్వండి’
న్యూఢిల్లీ: 1978లో బీఏ డిగ్రీ పాసైన విద్యార్థులందరి వివరాలను చూసుకోడానికి సమాచార హక్కు దరఖాస్తుదారుడిని అనుమతించాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)ను కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. ప్రధాని మోదీ 1978లో డిగ్రీ పాసయ్యారని డీయూ గతంలో పేర్కొనడం తెలిసిందే. 1978లో డీయూలో బీఏ పరీక్షలు ఎంతమంది రాశారు, ఎంత మంది పాసయ్యారు తెలపాల్సిందిగా నీరజ్ అనే వ్యక్తి దరఖాస్తు చేశారు. ఆ వివరాలన్నీ వ్యక్తిగత సమాచారం కిందకు వస్తాయంటూ విశ్వవిద్యాలయ కేంద్ర ప్రజా సమాచార అధికారి మీనాక్షి సహాయ్ వాటిని ఇచ్చేందుకు నిరాకరించారు. ఆ వివరాలను తనిఖీ చేసుకోడానికి అనుమతించడంతోపాటు ఒక కాపీని ఉచితంగా దరఖాస్తుదారుడికి ఇవ్వాల్సిందేనని సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు తాజాగా మీనాక్షి సహాయ్ని ఆదేశించారు. ఇదే కేసుకు సంబంధించి ఢిల్లీకి చెందిన న్యాయవాది మహమ్మద్ ఇర్సద్ వేసిన పిటిషన్‌ను విచారిస్తూ మీనాక్షికి రూ.25,000 జరిమానాను కూడా మాడభూషి విధించారు. -
అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది: మర్రి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలకు ఎక్కువ కరెన్సీ పంపుతూ, కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్బీఐని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా నియంత్రిస్తున్నారని ఆరోపించారు. సమాచారహక్కు చట్టం కింద నవంబర్ 9 నుంచి డిసెంబర్ 31 వరకు ఏ బ్యాంకుకు ఎంత కరెన్సీ పంపించారో చెప్పాలని ఆర్బీఐని కోరినట్లు తెలపారు. సమాచారాన్ని ఇవ్వలేమని ఆర్బీఐ సమాధానమిచ్చినట్లు ఆయన తెలిపారు. సమాచారహక్కు చట్టాన్ని ఆర్బీఐ అవహేళన చేస్తోందని పేర్కొన్నారు. -
అక్రమార్కుల ‘ఉపాధి’ రూ.28 కోట్లు..!
ఏళ్లు గడుస్తున్నా రికవరీ చేయని అధికారులు నోటీసులు, మెమోలు ‘మామూలే..’ మూలన పడ్డ ఫైళ్లు.. అధికారులపై చర్యలు శూన్యం దర్జాగా విధులు నిర్వర్తిస్తున్న అక్రమార్కులు సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి.. ఆదిలాబాద్ కల్చరల్ : గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. అందిన కాడికి అధికారులు దండుకోవడంతో అభాసుపాలవుతోంది. గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు చేసే చిన్నపాటి పొరపాట్లకు సస్పెండ్ చేస్తూ తొలగించే అధికారులు.. నిధులు కాజేసి, లెక్క చూపని అధికారులపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోగా.. షోకాజు నోటీసులతో అధికార యంత్రాం గం సరిపెడుతోంది. రికవరీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన ఆర్టీఐ యాక్టు వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఠాకూర్ జోగేందర్‌సింగ్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు ఆర్టీఐ యాక్టు ద్వారా దరఖాస్తు చేసుకోగా.. గత ఏడాది నవంబర్‌లో వివరాలు వెల్లడించా రు. అక్రమార్కుల వివరాలు ఇందులో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో అధికారులు అక్రమాలకు పాల్పడి రూ.28 కోట్లు దుర్వినియోగం చేశారు. ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందనే విమర్శలున్నాయి. చేయని పనులు చేసినట్లుగా, మట్టి, మొరం రోడ్లు వేసినట్లుగా, పనులు చేయకుండా చేసినట్లుగా, చెరువుల్లో మట్టితీత.. వంటి పలు రకాల పనులు చేయించినట్లు మస్టర్లు రికార్డు చేసి రూ.కోట్లలో ఉపాధి నిధుల ు దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఈ విషయం సామాజిక తనిఖీ బృందాల పరిశీలనలో వెల్లడైంది. ఎవరెంత దుర్వినియోగం చేశారంటే.. : నిధులు దుర్వినియోగం చేసిన వారిలో ఉమ్మడి జిల్లాలోని ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఏఈఈలు, ట్రైబ ల్వెల్పేర్ ఏఈలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎంపీడీవోలు మొ త్తం రూ.కోటీ 9 లక్షల 31,593 దుర్వినియోగం చేసినట్లు సామాజిక తనిఖీ లో తేలింది. పంచాయతీ రాజ్ ఏఈఈలు 40 మంది రూ.కోటి 8 లక్షల 16,102 దుర్వినియోగం చేయగా.. రికార్డులు కూ డా అప్పగించని నిధులు రూ.10 కోట్ల 7 లక్షల 74,584 దుర్వినియోగం చేశారు. మొత్తం రూ.11కోట్ల 15 లక్షల 90,686 పంచాయతీరాజ్ ఏఈఈలు 40 మంది స్వాహా చేశారు. ట్రైబల్ వెల్పేర్ ఏఈలు 17 మంది రూ.14 లక్షల 49,861 తప్పుడు లెక్కలతో కాజేసినట్లు సామాజిక తనిఖీలో తేలింది. రికార్డులు కూడా అందించకుండా రూ.16 కోట్ల 33 లక్షల 58,947.. మొత్తం రూ. 16 కోట్ల 48 లక్షల 08,808 అక్రమాలకు గురైనట్లు సామాజిక తనిఖీ బృం దం తేల్చింది. ఉమ్మడి జిల్లా లో ఎంపీడీవోలు, పీఆర్ ఏఈఈలు, టీడబ్ల్యూఏఈలు కలిసి మొత్తం రూ.28 కోట్ల 73 లక్షల 31,087 దుర్వినియోగం చేశారు. ఉన్నతాధికారుల హస్తం ఉండడంతోనే రికవరీ చేయడం లేదనే ఆరోపణలున్నాయి. అక్రమాలకు పాల్పడిన కొందరు విధుల్లోనే ఉన్నారు. రూ.కోట్లల్లోనే అవినీతి..: కుభీర్ ఎంపీడీవో సత్యనారాయణ రూ. 95,09, 752 దుర్వినియోగం చేశారు. 2010లో పంచాయతీ రాజ్ కమిషనర్ చార్జి మెమో జారీ చేశారు. పలుమార్లు చార్జి మెమోలు అందించినా ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోగా రికవరీ కూడా చేయడం లేదు. ఉట్నూర్‌కు చెందిన ఎంపీడీవో చందర్ 9 లక్షల నిధులకు లెక్కలు చూపలే దు. మిగతా ఎంపీడీవోలు లక్షల్లో నిధులను జేబుల్లో వేసుకున్నారనే ఆరోపణలున్నాయి. తాండూరు పీఆర్ ఏఈఈ రూ.10,51,905, కెరమెరి ఏఈఈ రూ.18,51,717, ఉట్నూర్‌కు చెందిన ఏఈఈ రూ.17,12,428, జైనథ్ ఏఈ ఈ రూ.7,55,357, తాండూరుకు చెందిన ఏఈఈ రూ.5,61,987 నిధులు దుర్వినియోగం చేశారు. తాంసి ఏఈఈ రూ.94 లక్షల 63,531, భీమిని ఏఈఈ రూ.2 కోట్ల 75 లక్షల 86,110, ఆదిలాబాద్ ఏఈఈ రూ.కోటీ 3 లక్షల 49,200, దహెగాం ఏఈఈ 90 లక్షల 94,476 నిధులకు లెక్కలు చూపలేదు. వీరితోపాటు వాంకిడి, జన్నారం, తదితర మండలాల పీఆర్ ఏఈఈ, ఏటీడబ్ల్యూ ఏఈలు, ఎంపీడీవోలు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలింది. -
గవర్నర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి..!
ఎమ్మెల్సీల నియామక పత్రాలు సృష్టించిన మోసగాడు అరెస్టు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యుడిని నియమిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసినట్లు ఫోర్జరీ పత్రాలు సృష్టించడంతోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పోస్టులను గవర్నర్ కార్యాలయం మంజూరు చేసినట్లు మరో మూడు ఫోర్జరీ పత్రాలను సృష్టించిన ఘరానా మోసగాడు మారంరాజు రాఘవరావు (62)ను సీఐడీ శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పొల్కంపల్లి గ్రామానికి చెందిన రాఘవరాజు సికింద్రాబాద్‌లోని భాస్కరరావు నగర్లో నివాసముంటున్నాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇతడిపై గతంలో పలు చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. మరో నిందితుడు మట్ట రఘువంశీని రాజ్యసభ సభ్యుడిగా చూపించేందుకు కేంద్ర హోం శాఖ గెజిట్‌ను ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను సృష్టించాడు. అలాగే నామినేటెడ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పోస్టులను గవర్నర్ కార్యాలయం మంజూరు చేసినట్లు మరో మూడు ఫోర్జరీ పత్రాలను సృష్టించాడు. ఈ క్రమంలో ఏకంగా గవర్నర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. తమ పత్రాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తూ రఘువంశీ ఏకంగా గవర్నర్ కార్యాలయానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశాడు. ఈ దరఖాస్తుతోపాటు ఫోర్జరీ పత్రాలను జత చేయడంతో మోసం బయటపడింది. గవర్నర్ కార్యాలయం ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సీఐడీ.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించింది. రాఘవరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. -
అది యూజీసీ బాధ్యతే!
విశ్లేషణ ‘జ్ఞాన్ విజ్ఞాన్ విముక్తయే’ తమకు స్ఫూర్తి అనే యూజీసీ జ్ఞానాన్ని కాకపోరుునా, కనీసం సమాచారమైనా ఇవ్వాలి. చట్టబద్ధ సంస్థ యూజీసీ తాను గుర్తించిన కోర్సుల విలువ, నాణ్యతల సమాచారాన్ని ఇవ్వాల్సిందే. కెరీర్ అడ్వాన్ ్సమెంట్ స్కీంలో పదోన్నతికి యోగ్యతనిచ్చే కోర్సుల వివరాలను ఒక అధ్యా పకుడు ఆర్టీఐ కింద యూజీసీని, ఇగ్నో (ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం) ను అడిగాడు. ఇగ్నో ఆ దరఖాస్తును యూజీసీకి బదిలీ చేసింది. వివరణలు ఇవ్వవలసిన బాధ్యత ఆర్టీఐ కింద తమకు లేదని యూజీసీ తిరస్కరించింది. అండర్ సెక్రటరీ స్థారుు అధికారి (పీఐఓ) వివరణలిచ్చే బాధ్యత లేదనడం సమంజసమా? జాయింట్ సెక్రటరీ (మొదటి అప్పిలేట్ అధి కారి) డాక్టర్ రేను బాత్రా కూడా ఈ అవసరాన్ని గుర్తిం చలేదు. యూజీసీ చట్టం సెక్షన్ 12 ప్రకారం అది దేశ, విదేశ విశ్వవిద్యాలయాల నుంచి అవసరమైన సమాచా రాన్ని సేకరించి ఇక్కడి విశ్వవిద్యాలయాలకు ఇవ్వాలి. అక్రమ వసూళ్లు ఆపే అధికారం 1984లో యూజీసీ చట్టాన్ని సవరించి ఫీజు రెగ్యులేషన్, డొనేషన్ల నిషేధ అధికారాలను ఇచ్చారు. రెగ్యులేషన్‌లో పేర్కొన్న పరిధులు దాటి విద్యాసంస్థలు అధికంగా ఫీజులు, చార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు. కోర్సులో ప్రవేశానికి, కొనసాగించడానికి పరోక్షంగా చెల్లింపులు, విరాళాలు, బహుమతుల కోసం ఒత్తిడులు చేయడానికి వీల్లేదు. డిగ్రీలు ప్రదానం చేయకుండా విద్యాసంస్థలను నిషేధించేందుకు, ప్రభుత్వ అంగీకారంతో ఉత్తర్వులు జారీ చేసే అధికారం యూజీసీకి ఉంది. కమిషన్ సిఫా ర్సులను నిరాకరించినా, రెగ్యులేషన్లను, సెక్షన్ 12 ఏ నియమాలను ఉల్లంఘించినా ఆ విశ్వవిద్యాలయానికి ప్రతిపాదిత గ్రాంట్లను నిలిపివేసే అధికారం కూడా యూజీసీకి ఉంది. కోర్సుల ఫీజులను, ప్రమాణాలను క్రమబద్ధీకరించాలి. ఆ అంశాలపై యూజీసీ కనుక అభ్యంతరం తెలిపితే ఆ కళాశాల గానీ యూనివర్సిటీ గానీ ఆ కోర్సుకు సంబంధించిన డిగ్రీలు ప్రదానం చేయడానికి వీల్లేదు. సమాచారాన్ని సేకరించి ఇచ్చే బాధ్యత, విద్యా ప్రమాణాలను, సమంజసమైన ఫీజులను క్రమబద్ధీ కరించే బాధ్యత కలిగి ఉన్న యూజీసీ ఆ కోర్సుల వివ రణలు ఇవ్వవలసిన అవసరం లేదని నిరాకరించడం సమంజసం కాదు. ‘జ్ఞాన్ విజ్ఞాన్ విముక్తయే’ (విముక్తి కలిగించేది జ్ఞానమూ, విజ్ఞానమే) అని స్ఫూర్తిగా పెట్టు కున్న యూజీసీ ఆ లక్ష్య సాధన కోసం జ్ఞానం కాక పోరుునా, కనీసం సమాచారమైనా ఇవ్వవలసి ఉంటుంది. చట్టబద్ధ సంస్థ యూజీసీ తాను గుర్తించిన కోర్సుల విలువ. నాణ్యతల సమాచారాన్ని ఇవ్వాల్సిందే. ఆ వివరణలు యూజీసీ తప్ప మరెవరూ ఇవ్వలేనపుడు, ఇంకెవరిని అడిగే వీలుంటుంది? విధాన లోపం ఇలా వివరణలు ఇవ్వబోను అని యూజీసీ నిర్ణరుుంచు కోవడం విధాన లోపం అనిపిస్తున్నది. ఈ సంగతి ఈ ఆర్టీఐ అర్జీ ద్వారా తేలింది. ఆర్టీఐ చట్టాన్ని యూజీసీ చట్టంతో కలిపి చదివితే, సెక్షన్ 4(1)(సీ)(డీ) కింద విద్యావిధానానికి సంబంధించిన అంశాలను తమంత తామే వెల్లడించాల్సిన బాధ్యత యూజీసీకి ఉందని తేలుతుంది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు అడిగిన సందేహాలను గుర్తించి, అర్థం చేసుకుని, తీర్చవలసి ఉంటుంది. అందుకు తరచు అడిగే ప్రశ్నలకు సమా ధానాలు తయారుచేసే బృందాన్ని అధికారికంగా నియమించాలి. వారు ఆర్టీఐ దరఖాస్తులలో వెల్లడైన సందే హాలను పరిశీలించి ఊఅఖ సమాధానాలు తయారు చేయాలి. సెక్షన్ 2(ఎఫ్) కింద వివరణలు, అభిప్రా యాలు ఇవ్వడం ిపీఐఓకు సాధ్యం కాదనడానికి వీలున్న మాట నిజమే. కానీ యూజీసీ వంటి విద్యావిధాన రూప కల్పనా సంస్థ, కోర్సుల నాణ్యత వివరించి, ఏయే సంద ర్భాలలో వాటిని యోగ్యతా పత్రాలుగా స్వీకరించాలో నిర్ణరుుంచి, ఆ వివరాలు ఇవ్వడం మౌలిక బాధ్యత. అది విధానపరమైన బాధ్యత. కనుక ఆర్టీఐ కింద వివరణ ఇవ్వడమే యూజీసీ బాధ్యత. ఆర్టీఐ చట్టం సెక్షన్ 19(8)(ఏ) నాలుగో భాగం ప్రకారం పబ్లిక్ అథారిటీ కొన్ని కొత్త ప్రక్రియలను, పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా సమాచారాన్ని వెల్లడి చేయాలని సూచించే అధికారం సీఐసీకి ఉంది. కనుక ఊఅఖ రూపకల్పన ద్వారా ఇటువంటి వివరణలు ఇవ్వా లని, తమంత తామే వీటిని వెబ్సైట్లో ఉంచాలని కమిషన్ ఆదేశించింది. సెక్షన్ 4ను అమలుచేసే అధి కారం కమిషన్‌కు లేదు. కాని ఆ సెక్షన్ కింద వెల్లడి చేయాల్సిన సమాచారం ఇవ్వనపుడు, ఆర్టీఐ కింద అడి గిన సందర్భంలోనైనా ఇవ్వాలి. ఆ దశలో సెక్షన్ 4ను సెక్షన్లు 3, 6, 20 ద్వారా అమలు చేసే అధికారం కమి షన్‌కు ఉంటుంది. ఇవ్వవలసిన సమాచారం ఇవ్వనం దుకు యూజీసీ ిపీఐఓకి జరిమానా ఎందుకు విధించ కూడదో తెలియజేయాలని కమిషన్ కారణ వివరణ నోటీసు జారీ చేసింది. (రామకిషన్ శర్మ వర్సెస్ యూజీసీ కేసు నంబర్ cic/cc/A//2014/001770 కమి షన్ 27.09.2016 తీర్పు ఆధారంగా). వ్యాసకర్త మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార కమిషనర్ ఈమెయిల్: professorsridhar@gmail.com -
'చీఫ్ కమిషనర్‌ను నియమించాలి'
ఒంగోలు : సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్‌ను వెంటనే నియమించాలని ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు సంఘం రాష్ట్ర కార్యదర్శి జి. బాలకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి పుష్కర కాలమైనా ఇంకా బాలారిష్టాలను ఎదుర్కొంటూనే ఉందని విచారం వ్యక్తం చేశారు. 2010లో నియమించిన చీఫ్ కమిషనర్ జన్నత్‌హుస్సేన్ అనంతరం ఇప్పటివరకు ఎవరినీ నియమించలేదన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఉమ్మడి కమీషన్ కార్యాలయం హైదరాబాద్‌లోనే కొనసాగుతోందన్నారు. చిన్న చిన్న సమస్యలు కూడా స్థానికంగా పరిష్కారం కాకపోవడంతో సంబంధిత వ్యక్తులు హైదరాబాద్ వెళ్లలేక మధ్యలోనే ఆగిపోతున్నారన్నారు. కమిషనర్ల సంఖ్యను పెంచి చీఫ్ కమిషనర్ కార్యాలయాన్ని రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేసులు వాయిదా వేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. సమాచార హక్కు చట్టం అమలుచేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లా కో ఆర్డినేషన్ కమిటీని కలెక్టర్ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
నేడు సమాచార హక్కు చట్టంపై సదస్సు
ఏలూరు సిటీ: సమాచార హక్కు చట్టంపై ఆదివారం ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొల్లపల్లి ములగయ్య తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.నర్సింహమూర్తి, నగర కమిషనర్ వై.సాయి శ్రీకాంత్ హాజరవుతారని పేర్కొన్నారు. -
కోహినూర్‌పై వివరాలు అందించలేం: కేంద్రం
న్యూఢిల్లీ: కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యల సమాచారాన్ని అందించలేమని కేంద్రం పేర్కొంది. లండన్‌లోని బ్రిటన్ రాణి కిరీటంలో ఉన్న వజ్రాన్ని భారత్‌కు తిరిగి తీసుకురావడంలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుపై ప్రభుత్వం ఈ అభిప్రాయం వెల్లడించింది. ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున ఎటువంటి సమాచారాన్ని అందించలేమని పురావస్తు శాఖ పేర్కొంది. -
ప్రజా ప్రతినిధులు జవాబుదారీ వహించరా?
ఎమ్మెల్యే సమాచార హక్కు చట్టం కింద ఎందుకు జవాబుదారీ కాకూడదు? ఎమ్మెల్యేలతో కూడిన లెజిస్లేచర్ పార్టీని పబ్లిక్ అథారిటీగా ఎందుకు పరిగణించకూడదు? ఎమ్మెల్యే ఎంపీలు, సభాపక్షాలు, రాజకీయ పార్టీలు ఆర్టీఐ కింద ఎందుకు జవాబు చెప్పకూడదో ఆలోచించాలి. నిజమైన పాలనాధికారం అధికారంలో ఉండే రాజకీయ పార్టీలదే. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కీలక మైన శాఖలలో కొనసాగుతు న్నప్పటికీ వారిపైన ఉండే మంత్రులు, ముఖ్యమంత్రులే పాలిస్తారు. కీలకమైన నిర్ణ యాలను తీసుకుంటూ, రాష్ట్రపతికి, గవర్నర్లకు సలహాలు ఇస్తూ వారే పరిపా లిస్తారు. వీరంతా ఎన్నికైన శాసనసభ్యుల నుంచే ఎంపికవుతారు. అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత రాజకీయ పార్టీలది. సభాపక్షాలే ప్రభుత్వాలను గానీ ప్రతిపక్షాలను గానీ ఏర్పాటు చేస్తాయి. తమను నిలబెట్టిన పార్టీని వదిలి మరో పార్టీకి ఫిరాయించే ప్రతినిధులకు సమాచార హక్కు చట్టం కింద జవాబు చెప్పే బాధ్యత లేదా? తప్పుడు సమాచారం ఇచ్చిన అభ్యర్థులను, పార్టీలను, సభాపక్షాలను నిలదీసే శక్తి ఆర్టీఐకి లేదా? నాగాలాండ్ నుంచి ఎన్నికైన ఒక ఎమ్మెల్యే నెఫ్రిజో కెడిట్సు తాను ఎంబీబీఎస్ చదివిన డాక్టరునని అంటూనే, తాను పూర్తి కాలపు వ్యాపారినని కూడా చెప్పుకున్నారు. మరి ఆయన డాక్టరా లేక వ్యాపారా? తెలియజేయాలని, వైద్యశాస్త్ర పట్టా ప్రతిని ఇవ్వాలని సహ చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారు. డిగ్రీ సర్టిఫికెట్ ప్రతిని యూనివర్సిటీ నుంచే అడగాలని, అదీ గాక అది ఆయన వ్యక్తిగత సమాచారమని, ఇవ్వడం కుదరదని చెప్పారు. ఎమ్మెల్యే కెడిట్సుపైన వచ్చిన ఈ తీవ్రమైన ఆరోపణ గురించి ఆయనకు చెప్పుకునే అవ కాశం ఇవ్వకుండా, ఆయన వైద్య పట్టా గురించిన సమా చారం ఇవ్వాలో లేదో నిర్ణయించకూడదు. ఇది తీవ్ర వివాదమై హైకోర్టులో రిట్ పిటిషన్లను కూడా దాఖలు చేశారు. కెడిట్సు గారిని ఎంచుకున్న రాజకీయ పార్టీ నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్‌కు ఇటువంటి ప్రశ్నలకు జవాబు ఇచ్చే బాధ్యత ఉండదా? ఎన్నికైన ఎమ్మెల్యేలతో కూడిన నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ వారి లెజిస్లేచర్ పార్టీ ఎందుకు జవాబుదారీ కాదు? రామ్చరిత్ అనే ఎంపీ షెడ్యూల్డ్ కులాలకు చెందిన నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. కాని, ఆయన కులం షెడ్యూల్డ్ కులం కాదని ఫిర్యాదు వచ్చింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ నియమించిన ఒక కమిటీ ఈ ఫిర్యాదును విచారిస్తున్నది. ఈ కుల వివాదం కూడా కోర్టుల్లో ఉంది. ఈ వ్యక్తిని అభ్యర్థిగా ఎంపిక చేసే ముందు కులాన్ని పరిశీలించవలసిన బాధ్యత ఉన్న బీజేపీ రాజకీయ పార్టీ దీనికి జవాబు ఇవ్వవలసిన అవసరం లేదా? ఎంపికైన ఎంపీలతో కూడిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఈ వివాదంపైన వచ్చే ప్రశ్నలకు జవాబు ఇవ్వవలసిన పనిలేదా? ఒక ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి తను ఇల్లు మారానని, అందుకని తన ఓటును ఆ ఇంటి చిరునామాతో మార్చాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. ఓటు మారిందో లేదో గానీ, ఆ ఎమ్మెల్యే ఓటు మార్పు సంబంధిత పత్రాల ప్రతులన్నీ తనకు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద వకీలు నీరజ్ కోరాడు. దానికి జిల్లా ఎన్నికల అధికారి ప్రతిస్పందిస్తూ ఆ దరఖాస్తును ఆ ఎమ్మెల్యే తరువాత ఉపసంహరించుకు న్నారని, కనుక తాము ఏ పత్రమూ ఇవ్వలేమని జవాబు ఇచ్చారు. నీరజ్ కేంద్ర సమాచార కమిషన్ ముందు అప్పీలు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ నివాసి అయిన ఆ ఎమ్మెల్యే తాను ఢిల్లీ నివాసిని అని చెప్పుకుంటూ, ఓటు మార్పును కోరారు కనుక ఆ పత్రాలన్నీ తనకు ఇవ్వాలని వకీలు వాదించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 5(1)(సి) కింద ఢిల్లీ నివాసి కాని వ్యక్తికి ఢిల్లీ పౌరుడిగా ఓటరు కార్డు ఇవ్వడం సాధ్యం కాదని వాదించారు. ఫారం 8 కింద ఓటరు కార్డు మార్పు కోసం ఇచ్చిన దరఖాస్తును, ఓటు హక్కు మార్పు దరఖాస్తు ఉపసంహరణ పత్రాన్ని కూడా ఇవ్వడానికి సమస్య ఏమిటని కమిషనర్ అడిగారు. ఎమ్మెల్యే మూడుసార్లు అడ్రసు మారానంటూ ఫారం 8 ద్వారా మార్పు కోరుకున్నారని, తప్పుడు అడ్రసుతో ఓటరు కార్డుకు దరఖాస్తు చేయడం నేరమని, అది రుజువు కాకుండా ఆ ఎమ్మెల్యేను కాపాడుతున్నారని నీరజ్ ఆరోపించారు. తప్పుడు సమాచారం ఇచ్చారని రుజువు చేయవలసి ఉంటుంది. ఓటు మార్పు దరఖాస్తుపై అభ్యంతరాలు కోరిన తరువాత, ఆ అభ్యంతరాలను సహాయ ఎన్నికల అధికారి పరిశీలించి తిరస్కరించారు. ఎమ్మెల్యే ఎక్కడ నివసించే వారని విచారణ చేసే అవకాశం సమాచార కమిషనర్‌కు ఉండదు. కోరిన సమాచారం ప్రభుత్వ అధికారి దగ్గర ఉన్నదా, లేదా? ఉంటే ఇవ్వవచ్చునా, లేదా? అనేదే నిర్ణయించవలసిన సమస్య. ఎమ్మెల్యే ఓటు మార్పు కోసం ఇచ్చిన దరఖాస్తు ఉపసంహరణ వల్ల రద్దయిందని కనుక ఇవ్వలేమని నీరజ్‌కు జవాబిచ్చారు. నీరజ్ ఇవికాక మరికొంత సమాచారం కోరారు. ఆ సమాచారం ఎమ్మెల్యే గారే చెప్పగలుగుతారు కాని అధికారులు ఇవ్వజాలరు. అడ్రసు వివరాలు ఎమ్మెల్యేకు మాత్రమే పరిమి తమైన సమాచారం. కనుక ఆ సమాచారం ఇవ్వాలంటే అందుకు ఆయననే అడగాల్సి ఉంటుంది. ఆయన అభ్యంతరాలను తెలుసుకునే అవసరం కూడా ఉంది. ఎమ్మెల్యే సమాచార హక్కు చట్టం కింద ఎందుకు జవాబుదారీ కాకూడదు? ఎమ్మెల్యేలతో కూడిన లెజిస్లేచర్ పార్టీని పబ్లిక్ అథారిటీగా ఎందుకు పరిగణిం చకూడదు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, సభాపక్షాలు, రాజకీయ పార్టీలు ఆర్టీఐ కింద ఎందుకు జవాబు చెప్ప కూడదో ఆలోచించాలి(ఈ మూడు కేసుల్లో జవాబు చెప్పాలని సీఐసీ నోటీసులు జారీ చేసింది). వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ - మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
ఆదోని తహసీల్దారుకు వడ్డన
► రూ.25వేల జరిమానా విధింపు ► సకాలంలో సమాచారం ఇవ్వని ఫలితం ఆదోని: సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వని ఫలితంగా ఆదోని తహసీల్దారు శ్రీనివాసరావుకు రూ.25వేల జరిమానా విధిస్తూ సమాచార హక్కు కమిషనరు తాంతియా కుమారి తీర్పు చెప్పారు. ఈ నెల 4న వెలువరించిన తీర్పు ప్రతులు తనకు 23న అందాయని ఆదోనికి చెందిన దరఖాస్తుదారు ఎం గౌస్‌బాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తీర్పు ప్రతులను కూడా జత చేశారు. మండగిరి పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 211, 212, 217, 218 స్థలాలను ఎవరెవరికి పంపిణీ చేశారో తెలియజేయాలని సమాచార హక్కు చట్టం కింద గౌస్‌బాషా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఏ సమాచారం కావాలో దరఖాస్తులో స్పష్టత లేదని పేర్కొంటూ తహసీల్దార్ ఆయనకు తిరిగి లేఖ రాశారు. దీంతో ఆయన సమాచారహక్కు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తరువాత తనకు సమాచారం అందించినా సకాలంలో స్పందించలేదని గౌస్‌బాషా తెలిపారు. విచారణ జరిపిన కమిషనర్ తహసీల్దారుకు జరిమానా విధించడంతోపాటు సంజాయిషీ కోరారన్నారు. తహసీల్దార్‌తో మాట్లాడగా సమాచార హక్కు కమిషన్ నుంచి తనకు ఎలాంటి తాఖీదులు రాలేదని తెలిపారు. -
ట్రంప్‌కు నిరసనల సెగ
ప్రతి సభలోనూ ఆందోళనకారుల అలజడి వారిని జైల్లో పెట్టాలన్న ట్రంప్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ టికెట్ రేసులో ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ను నిరసనలు వెంటాడుతున్నాయి. ఎన్నికల ప్రచార చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా నిరసనలు ఎదురవుతున్నాయి. షికాగో ర్యాలీతో మొదలైన ఆందోళనకారుల నిరసన శనివారమూ కొనసాగింది. ఒహాయోలోని డేటన్లో జరిగిన సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ ఆందోళనకారుడు బారికేడ్లు దూకి వేదిక వద్దకు వచ్చేందుకు ప్రయత్నించాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతన్ని అడ్డుకుని ట్రంప్‌కు రక్షణ కల్పించారు. ట్రంప్ అతనిపై నోరు పారేసుకున్నారు. ‘ఆ వ్యక్తి ఉగ్రవాది అయి ఉండొచ్చు. ఐసిస్ మద్దతుదారైనా అయి ఉండొచ్చు. అతన్ని జైల్లో పెట్టాలి. మన కోర్టులు అతన్ని అంత తేలిగ్గా వదలవని అనుకుంటున్నా’ అని అన్నారు. అనంతరం మిస్సోరీలోని కాన్సాస్‌లో మూడు సభల్లోనూ నిరసనకారులు ట్రంప్ ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకున్నారు. ట్రంప్ స్పందిస్తూ ‘వారు చెడ్డవాళ్లు, దేశానికి కీడు చేసేవాళ్లు, వాళ్లని జైల్లో పెట్టాలి’ అని విరుచుకు పడ్డారు. ప్రసంగాన్ని అడ్డుకున్న మహిళను అరెస్టు చేయాలని పోలీసులకు సూచించారు. కాగా, టికెట్ రేసుకు సంబంధించి వాషింగ్టన్, వ్యోమింగ్ ఎన్నికల్లో ట్రంప్ తన ప్రత్యర్థులైన రూబియో, కాషిష్ల చేతిలో ఓడిపోయారు. చైనా సూట్లు ధరిస్తూ వారిపై విమర్శలా..? చైనీస్, భారతీయులు అమెరికన్ల ఉద్యోగాలు లాక్కొంటున్నారని విమర్శలు గుప్పించే ట్రంప్ చైనాలో తయారైన షర్ట్లు, టైలు ధరిస్తారని అమెరికా మీడియా వెల్లడించింది. -
ఆర్టీఐ పరిధిలోనే మంత్రులు
{పజలకు జవాబుదారీగా ఉండాలి కేంద్ర, రాష్ట్ర మంత్రులకు సూచించిన సీఐసీ న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్రాల కేబినెట్ మంత్రులు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి వస్తారని, ప్రజా సేవకులైన వారు పౌరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాల్సిందేనని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) స్పష్టం చేసింది. ఆర్టీఐ చట్టం ప్రకారం నిర్దేశిత అభ్యర్థనతో ప్రజలు ప్రశ్నలను నేరుగా మంత్రులకు పంపొచ్చని తెలిపింది. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రతి మంత్రికీ సమకూర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సు చేసింది. ఈ మేరకు సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ఆదేశాలు జారీ చేశారు. ‘గోప్యతా ప్రమాణం’ స్థానంలో ‘పారదర్శకతా ప్రమాణం’ పాటించాలని సూచించారు. పార్లమెంట్ ఆమోదించిన ఆర్టీఐ చట్టాన్ని ప్రతి మంత్రీ గౌరవించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర కేబినెట్ మంత్రులను ప్రజలు కలిసే సమయాలను తెలపాలంటూ అహ్మద్‌నగర్‌కు చెందిన హేమంత్ ధాగే దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా గంట కొడితే శ్రీరాముడు అంతఃపురం నుంచి వెంటనే బయటకు వచ్చి వారిని కలిసి సమస్యేమిటో తెలుసుకుని పరిష్కరించేవాడన్నారు. కానీ... ప్రజలకు మంత్రి అందుబాటులో ఉండే సమయం తెలుసుకోవడానికి ఓ పౌరుడు ఆర్టీఐ చట్టాన్ని ఆశ్రయించాడంటే విచారించాల్సిన విషయమన్నారు. ‘సెక్షన్ 4(1)(బీ) ప్రకారం మంత్రులు స్వయంగా ఇలాంటి సమాచారాన్ని అందించాలి. అలాంటి సదుపాయం లేకపోతే మంత్రి కార్యాలయం ఆ విషయం చెప్పాలి. మంత్రికి ఇవన్నీ చూసుకోవడం కుదరకపోతే అందుకు తగిన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలి’ అని చెప్పారు. ఆర్టీఐకి సంబంధించి ఓ కచ్చితమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర, రాష్ర్ట మంత్రులకు సూచించారు. -
సమాచార హక్కు చట్టం.. ప్రజా చుట్టం
విజయవాడ : ఒకప్పుడు ప్రభుత్వ పాలనకు సంబంధించిన విషయాలన్నిటినీ గోప్యంగా ఉంచేవారు. దీనివల్ల అవినీతి వ్యవహారాలు బయటకు పొక్కేవి కాదు. ప్రజాధనం దుర్వినియోగమయ్యేది. ఈ నేపథ్యంలోను సామాన్యుడు సైతం ప్రభుత్వ వ్యవహారాలు తెలుసుకునే విధంగా సమాచార హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. చట్టం ప్రధాన ఉద్దేశం ఈ చట్టం పరిధిలోకి అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్న సంస్థలన్నింటిని తీసుకొచ్చారు. అయితే, సెక్షన్ 8(ఏ) ప్రకారం దేశ రక్షణ, దేశ సార్వభౌమాధికారానికి భంగం కల్గించే విషయాలు, విదేశీ వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలను ఈ చట్టం నుంచి మినహాయించారు. పౌర సమాచార అధికారి విధులు దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి సదరు పౌర సమాచార అధికారి కనిష్టంగా 48 గంటల నుంచి 30 రోజుల్లోగా సమాచారాన్ని అందజేయాలి. దరఖాస్తు అసమగ్రంగా ఉన్నా, నిర్ణీత ఫీజు చెల్లించకపోయినా తిరస్కరించవచ్చు. సమాచార పత్రాలు, సీడీలు కావాలంటే అదనపు ఫీజు చెల్లించవలసినదిగా దరఖాస్తుదారుడిని కోరవచ్చు. నిర్ణీత సమయంలో సమాచారం ఇవ్వడంలో సమాచార అధికారి విఫలమైతే దరఖాస్తుదారుడు అప్పిలేట్ సమాచార అధికారికి తన వద్ద ఉన్న ఆధారాలతో ఫిర్యాదు చేయాలి. అప్పిలేట్ అధికారి కింది అధికారి నుంచి సమాచారం ఇప్పించాల్సి ఉంటుంది. అప్పిలేట్ అధికారి కూడా నిర్ణీత సమయంలో సమాచారాన్ని అందించకపోతే రాష్ట్ర సమాచార కమిషనర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. రాష్ర్ట సమాచార కమిషన్ ఆ ఫిర్యాదుపై విచారణ జరిపి.. ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని ఇవ్వలేదని నిరూపణ అయితే సదరు అధికారికి రూ.25 నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే.. సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని పొందాలనుకునే వారు నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని పూర్తిచేసి, నిర్దేశిత రుసుమును కోర్టు ఫీజు స్టాంప్‌తో, పోస్టల్ ఆర్డర్ రూపంలో చెల్లించి ఏ విభాగానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారో సదరు కార్యాలయంలోని పౌర సమాచార అధికారికి అందజేయాలి. దరఖాస్తు ఇచ్చినట్టుగా తగిన రశీదు పొందాలి. తెల్లరేషన్ కార్డుదారులు తమ కార్డు నకళ్లను దరఖాస్తుతో జత చేస్తే ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. -
విషయం అడిగితే విషం చిమ్మడమా?
విశ్లేషణ నెలరోజుల్లో జవాబివ్వండి అని చట్టం ద్వారా ఆదేశించినా వినరు. పోనీ మొదటి అప్పీలు అధికారిగా ఉన్న తమ సీనియర్ అధికారి ఆదేశించినా పాటించకపోతే ఏమిటన్నట్లు? చెత్త ప్రశ్నలు అడుగుతున్నా రంటూ అడిగే వారిని నిందిం చడం అలవాటయింది. కాని చెత్త జవాబులు ఇచ్చే ప్రభుత్వాధికారుల సంగతేమిటి? సమాచార హక్కును దుర్వినియోగం చేస్తున్న మాట నిజమే కానీ జనం కన్నా ఎక్కువగా అధికారులు కూడా ఈ చట్టం ఇచ్చిన అధికారాన్ని సరిగ్గా వినియోగించ కుండా, అడిగిన వాడిని ఏడిపించేందుకు దుర్వినియోగం చేస్తున్నారు. అడగడం హక్కైతే చెప్పడం బాధ్యత. సమాధాన సమాచారాలు ఇవ్వడం జరగకపోతే సమా చార హక్కు చట్టం దుర్వినియోగమైనట్టే. అడిగినవన్నీ ఇవ్వాల్సిందే అని ఎవ్వరూ అనడం లేదు. అమ్మ కూడా అడిగిందంతా పెట్టదు. కానీ ఎందుకు ఇవ్వరో చెప్పడం అనే బాధ్యతను నిర్వర్తించకుండా వదిలేస్తే వారికేమిటి శిక్ష? విషయం చెప్పమని అడిగితే విషం చిమ్మే పరిస్థితు లను ఎందుకు కల్పిస్తారు? ఎవరు బాధ్యులు? అడిగిన సమాచారం ఇవ్వకపోవడమే కాదు, ఇవ్వకుండా ఉండేం దుకు ప్రజలసొమ్మును విరివిగా ఖర్చు చేయడం దుర్మార్గం. ఏ స్పందనా లేకుండా సమాచార అభ్యర్థనను వదిలేసే ప్రభుత్వ సంస్థకు మొదటి అప్పీలు ఆదేశం పాటించడం తప్ప మరో బాధ్యత లేదు. ఆ పనిచేయక పోగా మొదటి అప్పీలులో, రెండో అప్పీలులో కూడా లాయర్లను నియమించి జనం డబ్బు తగలేసి జవాబు ఇవ్వరేమిటి? జాతీయ పర్యావరణ న్యాయస్థానం (ఎన్జీటీ - నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)కి వచ్చిన కొన్ని సమాచార దరఖాస్తుల ప్రతులు, వాటిపై చర్యల దస్త్రం, తొలి అప్పీళ్లు, మూడో వ్యక్తికి ఇచ్చిన నోటీసుల కాపీలు ఇవ్వా లని ఆర్కె జైన్ కోరారు. నెలరోజుల్లో ఇవ్వలేదు. మొదటి అప్పీలు అధికారి ఆదేశించారు. సమాధానం లేదు. ఈ నిరాకరణ వెనుక దురుద్దేశముందని జైన్ ఆరోపించారు. జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని కారణ వివరణ లేఖ జారీ చేశారు. దానికీ జవాబు లేదు. నోటీసు విచారణకు నియమితమైన తేదీ నాడు కూడా రాలేదు. హఠాత్తుగా ఒక లాయర్ గారిని కమిషన్ వద్దకు వెళ్లమని చెప్పారు కానీ ఎందుకు వెళ్లాలో ఏం చేయాలో చెప్పలేదు. సి.పి.ఐ.ఒ. (కేంద్ర ప్రజా సమాచార అధికారి) వారం పైగా సెలవులో ఉంటే ఆ బాధ్యతలను నిర్వహించడానికి మరొకరిని నియమించ కపోవడం మంచి పాలనా? అధికారి ఇచ్చిన వివరణ తప్పుల తడక అని జైన్ వాదించారు. 20 పేజీల సమాచారం ఇవ్వడానికి తనను 40 రూపాయలు అడిగారని, సమాచారం ఇమ్మని ప్రథమ అప్పీలు అధికారి ఆదేశించినా వేల రూపా యలు ఖర్చు చేస్తూ మొదటి రెండో అప్పీళ్లలో లాయర్లను నియ మిస్తూ సమాచారం ఇవ్వకుండా దాట వేస్తున్నారని జైన్ ఆరోపించారు. ఎన్జీటీ ఒక్కొక్క లాయర్‌కు 31 వేల రూపాయల భత్యం, 700 రూపా యల రవాణా ఖర్చు నెలకు ఇస్తూ ప్రతి లాయర్‌కు మొదటి అప్పీలుకు 11 వేలు, రెండో అప్పీలుకు 21 వేలు ఇవ్వాలని ప్రతిపాదిం చిందని వివరించే నోట్‌ను జైన్ మరొక ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సంపాదించారు. మొదటి అప్పీలులోనూ, రెండో అప్పీలులోనూ లాయర్‌ను నియమించి తనకు సమాచారం ఇవ్వ కుండా పోరాడుతున్నారని విమర్శించారు. సెక్షన్ 20 ప్రకారం సమంజసమైన కారణం లేకుండా సమాచారం ఇవ్వకపోతే జరిమానా విధించాల్సి ఉంటుంది. కానీ మొదటి అప్పీలు అధికారి ఆదేశాన్ని పాటించనందుకు మరే కారణమూ అవసరం లేకుండానే జరిమానా విధించే వీలుంది. ఆదేశించిన అధికారి సి.పి.ఐ.ఓ. కంటే పై అధికారి. ఆయనకు ఎక్కువ అనుభవం, శాఖాపరమైన పరిచయం ఉంటుంది. ఆయన ఉత్తర్వును పాటించకపోవడం క్రమశిక్షణ అనిపించు కోదు. ఒకవేళ పై అధికారి ఉత్తర్వులో ఏదైనా లోప ముంటే సీపీఐఓ కూడా అప్పీలుకు వెళ్లవచ్చు. లేని పక్షంలో ఆ ఆదేశాన్ని పాటించడం తప్ప మరో మార్గం లేదు. కాని ఆ ఆదేశాల పాలనకోసం పౌరుడు రెండో అప్పీలుకు వెళ్లే పరిస్థితి కల్పించడం అన్యాయం, అస మంజసం. దాన్ని చట్టం ఒప్పుకోదు. ఈ కేసులో మొదటి అప్పీలు అధికారి ఆదేశాన్ని పాటించకపోవడం, వారికి ఇస్తానన్న సమాచారాన్ని అంగీకరించిన తేదీలోగా ఇవ్వకపోవడం, ఆ తరువాత కూడా ఇవ్వకపోవడం వల్ల ప్రజా సమాచార అధికా రిపైన 25 వేల రూపాయల జరిమానా విధించక తప్ప దని కమిషన్ నిర్ణయించింది. చట్ట ప్రకారం ఇవ్వవలసిన సమాచారాన్ని ఇవ్వ కుండా ఏవేవో కుంటిసాకులు చూపుతూ పౌరుడిని అప్పీళ్ల చుట్టూ తిప్పడం సమాచార చట్టాన్ని భంగ పరచడమే అవుతుంది. రెండు అప్పీళ్లలో లాయర్లు హాజరయ్యారు కనుక ఎన్జీటీ కనీసం 32 వేల రూపాయలు ఖర్చు చేసినట్టే భావించాలి. ఇటువంటి వృథా ఖర్చులను ఎందుకు పెడుతున్నారు? ఒక పౌరు డికి చట్ట ప్రకారం ఇవ్వవలసిన సమాచారం ఇవ్వ కుండా ఉండేందుకు ప్రజల ధనాన్ని ఈ విధంగా వెచ్చించవచ్చా? ఇటువంటి నిర్ణయం ఎవరు తీసుకున్నారో పరిశీలించి, ఆ అధికారి బాధ్యుడైతే, అతని నుంచి ఈ కేసుల మీద ఖర్చు చేసిన మొత్తం సొమ్మును ఎన్జీటీ వద్ద డిపాజిట్ చేయించాలని కమిషన్ సూచిం చింది. ఎన్జీటీ అధ్యక్షులు మాజీ సుప్రీంకోర్టు న్యాయ మూర్తి కనుక ఈ అన్యాయ ఖర్చులు నివారించేందుకు ఈ సమస్యను వారి ముందుంచాలని కమిషన్ సూచించింది. (ఇఐఇ/అ/ఇ/2014/000461 జైన్ వర్సెస్ ఎన్జీటీ కేసులో తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
రెండేళ్లలో 16 కోట్ల రూపాయి నోట్ల ముద్రణ
ముంబై: ఆర్థిక శాఖ గత రెండేళ్లలో 16 కోట్ల రూపాయి నోట్లను జారీ చేసింది. ఈ నోట్ల ముద్రణ ఆపేసిన దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో రూపాయి నోట్లను జారీ చేసింది. 1994-95లో దాదాపు 4 కోట్ల రూపాయి నోట్ల ముద్రణయ్యాయని, ఒక్కో నోటుకు ముద్రణ వ్యయం రూ.1.48 అయిందని, ఆ తర్వాత ఈ నోట్లను ముద్రించలేదని ప్రభుత్వం తెలిపింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 50 లక్షలు, ఈ ఏడాదిలో 15.5 కోట్లు చొప్పున రూపాయి నోట్లను ముద్రించామని పేర్కొంది. సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు వెల్లడయ్యాయి. -
'ఏపీ సర్కారు కారణంగా స.హ చట్టం నిర్వీర్యం'
ఏలూరు (పశ్చిమ గోదావరి) : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సమాచార హక్కు చట్టం ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదని ఆ చట్టం కమిషనర్ పసుపులేటి విజయబాబు అభిప్రాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమాచార హక్కు చట్టానికి ప్రభుత్వమే తూట్లు పొడుస్తోందని అసహనం వ్యక్తం చేశారు. పదేళ్లనాటి చట్టానికి నేటికీ పూర్తిస్థాయిలో సిబ్బంది లేరని, నిధులు సైతం విడుదల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా ఇప్పటికీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన హై పవర్ కమిటీ సమావేశం జరగలేదని చెప్పారు. ప్రభుత్వ విధానాల వల్లే సమాచార హక్కు చట్టం సామాన్యులకు సమాచారాన్ని అందించలేకపోతోందన్నారు. దేవస్థానాల విషయమే ఇందుకు ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారులు విధులు నిర్వహించే టీటీడీలో కూడా ఆర్టీఐ అమలు కావడం లేదని దేవాదాయ శాఖ చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలోనూ సమాచార హక్కు చట్టాన్ని భాగస్వామ్యం చేయాలని విజయబాబు పేర్కొన్నారు. -
700 ఎలుకలకు రూ.24.47 లక్షలు!
రాష్ట్ర చట్టసభల్లో ఎలుకను పట్టేందుకు గత ఏడేళ్లలో ప్రభుత్వం రూ. 24.47 లక్షలు ఖర్చు చేసింది. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన ఓ ప్రముఖ సంస్థ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నుంచి ఈ సమాధానం లభించింది. 2015 ఫిబ్రవరి నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు విధానసౌధతో పాటు వికాసౌధలో ఎలుకలతో పాటు క్రిములును తొలగించేందుకు గాను రూ.4,96,333లను చెల్లించేలా ఓ ప్రైవేట్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ లెక్కన గత ఏడేళ్లలో ఎలుకల కోసం రూ.24.47 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేసింది. కాగా, ఈ ఏడేళ్లలో 700 ఎలుకలు పట్టుబడ్డాయని ప్రభుత్వం తెలియజేసింది. - సాక్షి, బెంగళూరు -
పార్టీలు ఆర్టీఐలోకి రావు!
సుప్రీం కోర్టుకు కేంద్రం స్పష్టీకరణ న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురాకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పార్టీలను ఆర్టీఐ చట్ట పరిధిలోకి తీసుకురావడం వల్ల వాటి సంస్థాగత పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అలాగే, రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ఉద్దేశాలతో సమాచారం కోరుతూ దరఖాస్తులు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టుకు కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం(డీఓపీటీ) ఒక అఫిడవిట్ సమర్పించింది. అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలను పబ్లిక్ అథారిటీలుగా ప్రకటించి, వాటిని ఆర్టీఐ చట్ట పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పంపిన నోటీసులకు కేంద్రం పై విధంగా స్పందించింది. ఆర్టీఐ చట్టాన్ని రూపొందించిన సమయంలో.. రాజకీయ పార్టీలను దాని పరిధిలోకి తీసుకురావాలనే అంశం పార్లమెంటు పరిగణనలోకి తీసుకోలేదని కేంద్రం ఆ అఫిడవిట్లో పేర్కొంది. పార్టీల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత తీసుకువచ్చేందుకు అవసరమైన నిబంధనలు ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఆదాయ పన్ను చట్టాల్లో ఉన్నాయని వివరించింది. ఆర్టీఐ చట్టంలోని 2(హెచ్) సెక్షన్ ప్రకారం రాజకీయ పార్టీలు పబ్లిక్ అథారిటీల కిందకు వస్తాయని, అందువల్ల అవి ఆర్టీఐ చట్ట పరిధిలోకి వస్తాయంటూ కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) 2013లో ఇచ్చిన తీర్పును కేంద్రం తప్పుబట్టింది. ఆ సెక్షన్‌ను సీఐసీ తప్పుగా అన్వయించిందని పేర్కొంది. ‘పబ్లిక్ అథారిటీ’ నిర్వచనం నుంచి రాజకీయ పార్టీలకు మినహాయింపునిచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును గత ప్రభుత్వ హయాంలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేసింది. అయితే, ఆ బిల్లు ఆమోదం పొందకముందే ఆ లోక్‌సభ రద్దైయిందని వివరించింది. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు ఆర్టీఐ పరిధిలోకి తేవాలని, ఆ పార్టీలకు వచ్చే అన్ని విరాళాల(రూ. 20 వేల లోపు విరాళాలు సహా) వివరాలను వెల్లడించాలని కోరుతూ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 7న సుప్రీంకోర్టు విచారణ జరిపి, స్పందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, ఆరు ప్రముఖ రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. -
సమాచార హక్కుతో సుపరిపాలన
కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్ సెంట్రల్ యూనివర్సిటీ: సమాచార హక్కు చట్టం దేశంలో రెండో స్వాతంత్య్ర సంగ్రామం లాంటిదని కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు. యూజీసీ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘సమాచార హక్కు చట్టం తీరుతెన్నులు’ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు సుపరిపాలన అందించేందుకు ఆర్టీఐ ఎంతో దోహదపడిందన్నారు. 2005లో మొదలైన ఆర్టీఐ ద్వారా సామాన్యులు సైతం విలువైన సమాచారాన్ని పొందగలిగారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. యూనెటైడ్ నేషన్స్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ప్రతినిధి ఎస్.రామారావు మాట్లాడుతూ 1990లో 13 దేశాలు మాత్రమే ఆర్టీఐని అమలు చేస్తే.. ప్రస్తుతం 100 దేశాల్లో ఈ చట్టం విజయవంతంగా అమలవుతోందన్నారు. రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ ఎస్.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యంలో మైలు రాయి వంటిదని కొనియాడారు. స్వల్ప కాలంలో తక్కువ ఖర్చుతో ప్రజలకు అవసరమైన సమాచారం ఈ చట్టం ద్వారా పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీయూ ఇన్చార్జి వీసీ ఆర్.పి శర్మ, యూజీసీ హ్యుమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సెంటర్(హెచ్‌సీయూ) ఇన్చార్జి డెరైక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీఐతో కేసుల పరిష్కారం సులువైంది
సాక్షి, న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టంతో పూర్తిస్థాయి సమాచారం అందుబాటులోకి వస్తోందని, న్యాయస్థానాల్లో కొన్ని కేసుల పరిష్కారం సులభతరమవుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. కేంద్ర సమాచార కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు రచించిన ‘ఆర్టీఐ యూజ్ అండ్ అబ్యూజ్’ పుస్తకాన్ని గురువారమిక్కడ జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు. పదేళ్ల ఆర్టీఐ చట్టంపై రూపొందించిన మరో పుస్తకాన్ని కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ విజయ్‌శర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ... సమాచార హక్కు చట్టం అమల్లో లేని సమయంలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. కొన్ని కేసులకు సంబంధించి న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు కూడా ప్రభుత్వ శాఖల నుంచి పూర్తి సమాచారం అందేది కాదన్నారు. మాడభూషి రచించిన ఈ పుస్తకం అన్ని వర్గాలకు ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ విజయ్‌శర్మ మాట్లాడుతూ.. ఈ పుస్తకం భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. 2014లో ఢిల్లీ వచ్చిన తర్వాత తాను ఇచ్చిన అనేక ఉత్తర్వుల ఆధారంగా పుస్తకాన్ని రాసినట్లు మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు. త్వరలోనే తెలుగు అనువాద పుస్తకాన్ని తీసుకురానున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సమాచార మాజీ ప్రధాన కమిషనర్ వజాహత్ హబీబుల్లా, ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్, న్యాయవాదులు, మేధావులు పాల్గొన్నారు. -
ఆర్టీఏ అంటే అంతచులకనా?
రెవెన్యూ అధికారులపై ఆర్టీఏ కమిషనర్ ఆగ్రహం తిరుపతి మంగళం: సమాచార హక్కు చట్టం(రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్) అంటే రెవెన్యూ అధికారులకు అంత చులకనా?, ఆర్టీఏ అంటే ఏమిటో చూపి స్తా అంటూ సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియాకుమారి హెచ్చరించారు. తిరుపతి ఆర్డీవో కార్యాల యంలో శుక్రవారం రెవెన్యూ అధికారులు, ఫిర్యాదుదారులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూలో ఏ చిన్న సమాచారం అడిగినా చెప్పడం లేదని, చివరకు సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా రెవెన్యూ అధికారులు ఎలాంటి సమాధానం చెప్పడం లేదని అర్జీదారులు ఆర్టీఏ కమిషనర్ తాంతియ కుమారి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆర్టీఏ కమిషనర్ తాంతి యాకుమారి మాట్లాడుతూ రెవె న్యూ అధికారులకు సమాచార హక్కు చట్టం గురించి ఇంకా పూర్తిగా తెలిసినట్లు లేదన్నారు. సామాన్య ప్రజలు సైతం ఆర్టీఏ కింద రెవెన్యూలో ఎలాంటి సమాచారాన్ని అడిగినా ఇవ్వాలన్నారు. ఏర్పేడు తహశీల్దార్ ఎవరు ఎలాంటి సమాచారం అడిగినా ఇవ్వడంలేదని అనేక ఫిర్యాదులు అందాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుసార్లు మందలించినా ప్రయోజనం కని పించడంలేదని, ఆర్టీఏ సత్తా ఏమిటో స వి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంటి పట్టా ఉన్నప్పటికీ అందులో కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, తమకు ఇంటి స్థలం చూపాలని అర్జీ పెట్టుకున్న సుభాషిణి అనే వికలాంగురాలికి న్యాయం చేయాలని పలుసార్లు అర్బన్ తహశీల్దార్‌ను ఆదేశించినా ఎందుకు పట్టించుకోవడం లేదని, ఆర్టీఏ కమిషనర్ అంటే లెక్కలేదా?, అంత నిర్లక్ష్యమా అని మండిపడ్డారు. తాను ఇక్కడికి తహశీల్దార్‌గా వచ్చి ఆరు నెలలు మాత్రమే అవుతోందని, వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏదో ఒక అదనపు బాధ్యతలను మోస్తున్నామని తెలిపారు. ఎన్ని బాధ్యతలు ఉన్నా ముందుగా సుభాషిణికి న్యాయం చేయాలని ఆదేశించారు. ఆ అధికారం తమ చేతుల్లో లేదని, కలెక్టర్ ఆదేశిస్తే వెంటనే అమలు చేస్తానని ఆమెకు వివరణ ఇచ్చారు. దీనిపై ఇదివరకు అర్బన్ తహశీల్దార్లుగా పనిచేసిన ముగ్గురు తహశీల్దార్లకు నోటీసులు జారీ చేయాలని ఆర్టీఏ కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మయ్య, చిత్తూరు ఆర్డీవో పెంచల కిషోర్, తాహశీల్దార్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
వివరాలు వెల్లడించాల్సిందే!
అధికారులకు సంబంధించిన వివరాలపై సీఐసీ స్పష్టీకరణ న్యూఢిల్లీ: విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా రాజకీయ కార్యనిర్వాహక వ్యవస్థకు, అధికార యంత్రాంగానికి సంబంధించిన వివరాలు వెల్లడించాల్సిందేనని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఉద్ఘాటించింది. హరియాణాకు చెందిన ప్రజావేగు (విజిల్ బ్లోయర్) ఐఎఫ్ఎస్ అధికారి సంజీవ్ చతుర్వేది విషయంలో సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖకు, ప్రధాని కార్యాలయానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను వెల్లడించాల్సిందిగా కేంద్రాన్ని ఓ ఉత్తర్వులో ఆదేశించింది. వ్యక్తిగత విషయాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావన్న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వాదనలను కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ తిరస్కరించారు. ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగ్రవాల్ పిటిషన్ విచారణ సందర్భంగా.. నిజాయతీగా పనిచేసే అధికారులు ఎదుర్కొనే రాజకీయ ఒత్తిళ్లను బహిర్గతం చేయాల్సిందేనని, ఇది వారి రక్షణకు సంబంధించిన విషయమని సీఐసీ స్పష్టం చేసింది. హరియాణా ప్రభుత్వం నుంచి చతుర్వేది వేధింపులకు గురయినట్లు అగ్రవాల్ పేర్కొన్నారు. అయితే ఈ అంశానికి సంబంధించిన సమాచారం బహిర్గత పరిచేందుకు నిరాకరించడం చట్ట వ్యతిరేకమని పేర్కొంది. ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ అధికారిగా ఉన్న చతుర్వేదిని వైద్యశాఖ తొలగించింది. ఝాంఝర్లోని హెర్బల్ పార్క్ కుంభకోణంలోని అధికారుల పాత్రను బయట పెట్టినందుకే ఉద్యోగం నుంచి తొలగించారని క్యాట్ ముందు వాపోయారు. -
పార్టీలూ... పారదర్శకత
రాజకీయ పార్టీలు తప్పించుకోవాలని ప్రయత్నించినకొద్దీ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) వాటిని వెన్నాడుతోంది. ‘మిమ్మల్ని ఆర్టీఐ పరిధిలోకి ఎందుకు తీసుకు రాకూడదో ఆరు వారాల్లో చెప్పాల’ని మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజకీయ పార్టీలు ఆర్టీఐ పరిధిలోకి వస్తాయని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) రెండేళ్లక్రితం తీర్పునిచ్చినప్పుడు చాలా విలువైన మాటలు చెప్పింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు జవాబుదారీగా ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. అదే సంగతిని మరోసారి మొన్న మార్చిలో చెప్పింది. కానీ రాజకీయ పార్టీల్లో కదలిక రాలేదు. అవి ఈ విషయంలో ఏం ఆలోచిస్తున్నాయో ఇంతవరకూ ఎవరికీ తెలియదు. ప్రతి అంశంలోనూ హడావుడి చేసే పార్టీలు ఇలా మౌనంగా ఉండటంలోని ఆంతర్యమేమిటో అర్ధంకాలేదు. పర్యవసానంగా ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకెళ్లింది. ప్రజాస్వామ్యంలో జనం ఆకాంక్షలకు స్వరాన్నిచ్చి వాటికోసం కృషి చే సేవి రాజకీయ పార్టీలే. ఈ క్రమంలో ఆయా పార్టీల సిద్ధాంతాలు, ఆచరణ...వాటి విషయమై సాగే చర్చ, స్పర్థ వంటివి ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేస్తాయి. దాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్తాయి. కొత్త ఆలోచనలకూ, పరిష్కారాలకూ దోవ కల్పిస్తాయి. అయితే ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేసే పార్టీలు తమ సంస్థాగత విషయాల్లో గోప్యత పాటిస్తున్నాయి. పార్టీని నడిపించడానికి అవసరమైన నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయో...వాటిని ఎలా ఖర్చు చేస్తున్నారో చెప్పడానికి నిరాకరిస్తున్నాయి. పార్టీలనేవి వాటి ఆచరణరీత్యా చూసినా, స్వభావ రీత్యా చూసినా ప్రజా సంస్థలుగా పరిగణనలోకి వస్తాయి. ఆ పార్టీల నడత పారదర్శ కంగా ఉంటే అది ఆ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పెంపొందింపజేస్తుంది. అంతిమంగా అది ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టికి ఉపయోగపడుతుంది. కానీ బీజేపీ, కాంగ్రెస్ మొదలుకొని ప్రధాన రాజకీయ పక్షాలేవీ ఈ విషయంలో కలిసిరావడంలేదు. సీఐసీ ఇచ్చిన ఆదేశాల్లోని స్ఫూర్తిని అర్థం చేసుకోవడంలేదు. ఇటీవలికాలంలో రాజకీయ పార్టీల తీరుతెన్నులు మరీ ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయాల్లోకి వద్దామని ఉత్సాహపడేవారిని నీరసింపజేస్తున్నాయి. పార్టీలు కూడా ప్రజా సంస్థల నిర్వచనంలోకొస్తాయని చెబుతూ ఇచ్చిన ఆదేశాల్లో సీఐసీ అందుకు కారణాలను కూడా చెప్పింది. రాజకీయ పార్టీలు ప్రభుత్వాలనుంచి ఉచితంగా లేదా సబ్సిడీ రేట్లకు స్థలాలు పొందడం దగ్గరనుంచి అనేక రాయితీలను, మినహాయింపు లను స్వీకరిస్తాయి. ఇవన్నీ ప్రజలకు సంబంధించినవే. ఇన్ని ఉపయోగించుకుంటూ కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండటానికీ, పారదర్శకంగా వ్యవహరించడానికీ నిరాకరించడం ఏమేరకు సహేతుకమో పార్టీలే చెప్పాలి. మన దేశంలో రాజకీయ పక్షాలకు నిధులెలా వస్తాయన్నది రహస్యమేమీ కాదు. వాటికి వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు కోట్లాది రూపాయలు అందజేస్తాయి. వ్యాపారవేత్తలైనా, పారిశ్రామికవేత్తలైనా ఇటీవలికాలంలో విరాళాలిచ్చి మాత్రమే ఊరుకోవడంలేదు. తాము కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజా ప్రతినిధులవుతు న్నారు. మంత్రులవుతున్నారు. రాజకీయాలు ఎవరికీ అస్పృశ్యమైనవి కాదు గనుక వారు రావడంలో తప్పేమీ లేదు. అయితే అలా రావడం కోసం విచ్చలవిడిగా వెదజల్లే డబ్బు దేశ ఆర్థిక వ్యవస్థనే తలకిందులు చేస్తున్నది. నిజంగా ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చేవారికి రాజకీయాల్లో స్థానం లేకుండాపోతున్నది. ఇప్పుడు సుప్రీంకోర్టులో రాజకీయ పార్టీలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని పిటిషన్ దాఖలు చేసిన ప్రజాస్వామ్య సంస్కరణల సంఘమే... నిరుడు జరిగిన ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల జమాఖర్చుల వివరాలను వెల్లడించింది. ఆ వివరాలు దేశ పౌరులకు దిగ్భ్రమకలిగించాయి. బీజేపీకి అత్యధికంగా రూ. 588.45 కోట్లు వస్తే ఆ పార్టీ రూ. 712.48 కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్‌కు రూ. 350.39 కోట్లు రాగా... 486.21 కోట్లు ఖర్చుచేసింది. ఈ లెక్కల్లోని నిజానిజాల సంగతలా ఉంచి రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఎంతగా పెరిగిపోయిందో అర్ధం చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. వాస్తవానికి పార్టీలన్నీ తమకొచ్చే విరాళాల వివరాలను 24-ఏ పత్రంలో పొందుపరిచి ఎన్నికల సంఘానికి ఇవ్వాలన్న నిబంధన ఉంది. దాని ప్రకారం రూ. 20,000కు పైబడిన విరాళాలను ప్రతి రాజకీయ పక్షమూ చూపాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనను సాకుగా తీసుకుని పార్టీలు సంపూర్ణ వివరాలు ఇవ్వడంలేదు. తమకు అందే విరాళాల్లో రూ. 20,000కు మించినవి పది శాతం ఉన్నాయని ఒక పార్టీ...15 శాతం ఉన్నాయని మరో పార్టీ కాకిలెక్కలు చెప్పి చేతులు దులుపుకుంటున్నాయి. ‘చిల్లర విరాళాల’ ముసుగులో కోట్లాది రూపాయల విరాళా లను దాచిపెడుతున్నాయి. ఇలా వచ్చే విరాళాలను ఎన్నికల సమయంలో విచ్చల విడిగా వెదజల్లి తమ అభ్యర్థులను గెలిపించుకుంటున్నాయి. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో మూడురోజులక్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బలం లేకపోయినా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడానికి ఇలా డబ్బులు వెదజల్లడమేనన్న ఆరోపణలొచ్చాయి. చంద్రబాబు, రేవంత్‌రెడ్డిల ఆడియో, వీడియో టేపుల వ్యవహారం మన రాజకీయాలు ఎంత భ్రష్టుపట్టిపోయాయో వెల్లడించాయి. నానాటికీ దిగజారుతున్న ఇలాంటి పరిస్థితులను చూసే మొన్న మార్చిలో సమర్పించిన 225వ నివేదికలో లా కమిషన్ ఎన్నికల సంస్కరణలకు గట్టిగా సిఫార్సుచేసింది. పార్టీలకు రూ. 20,000 లోపు చొప్పున వచ్చే విరాళాలు... మొత్తం విరాళాల్లో 20 శాతం మించినా... లేదా వాటి విలువ రూ. 20 కోట్లు మించినా అలాంటి విరాళాలిచ్చినవారి పాన్ కార్డు వివరాలతోసహా అన్నిటినీ వెల్లడించేలా నిబంధన విధించాలని సూచించింది. నిర్ణీత మొత్తం రుసుముగా చెల్లించేవారికి విరాళాల వివరాలు అందజేసే ఏర్పాటుండాలని అభిప్రాయపడింది. అనుమతిలేని దాతలనుంచి విరాళాలు పొందే పార్టీలకు అవి స్వీకరించిన విరాళానికి అయిదు రెట్ల మొత్తాన్ని పెనాల్టీగా విధించాలని పేర్కొంది. సీఐసీ చెప్పిన రెండేళ్ల తర్వాత కూడా ఉలుకూ పలుకూ లేకుండా ఉన్న తమ వైఖరివల్లా, సహాయ నిరాకరణవల్లా ప్రజాస్వామ్యానికి ఇప్పటికే ఎంతో అపచారం జరిగిందని పార్టీలు గ్రహించాలి. నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన తాము ఎన్నికల సంస్కరణలను అడ్డుకోవడంద్వారా నల్లడబ్బు పెచ్చరిల్లడానికి కారకులమవుతున్నా మని గుర్తించాలి. కట్టుదప్పిన ప్రవర్తన అరాచకానికీ, అనైతికతకూ... అంతిమంగా ప్రజాస్వామ్య క్షీణతకూ మాత్రమే దారితీస్తుందని గమనించాలి. -
సమాచార హక్కు హుళక్కి!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమాచార హక్కు అమలు తీరు అధ్వానంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల చేతిలో వజ్రా యుధమైన సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి సుమారు పది సంవత్సరాలు కావస్తున్నా, ఆయా శాఖల ప్రజా సమాచార అధికారులకు నేటివరకు సరైన అవగాహన లేకపోవడం గమనార్హం. పాలనలో పారదర్శకత, జవాబు దారీతనం పెంపు, అవినీతి నిర్మూలనకు దోహదపడే స.హ. చట్టంను పాలకులు, అధికారులే నిర్వీర్యం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల ముందు సమాచార హక్కు చట్టానికి సంబంధించి ఎలాంటి బోర్డులు కానరావడం లేదు. వివిధ సమస్యలపై వివిధ కార్యాలయాలకు దరఖాస్తు చేసినా నెల రోజుల గడువులోపు సమాచారం రాకపోవడం, దరఖాస్తు దారులలో ఆందోళనను పెంచడం సర్వసాధారణం అయి పోయింది. రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో ద్వితీ య అప్పీళ్లు కూడా పెండింగులో ఉండటం, రాష్ట్రాలు వేరు పడినా ఉమ్మడిగానే కమిషన్ ఉండటం దరఖాస్తుదారులకు ఇబ్బందిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం దీనిపై స్పందిం చి సమాచార హక్కు చట్టాన్ని రాష్ట్రంలో పకడ్బందీగా అమ లు జరిగేలా చూడాలి. కామిడి సతీష్‌రెడ్డి పరకాల, వరంగల్ -
సల్మాన్ కేసు ఫైళ్లు కాలిపోయాయి
ముంబై: నటుడు సల్మాన్‌ఖాన్‌కు సంబంధించిన 2002 నాటి హిట్అండ్న్ ్రకేసు సమాచార మేదీ మహారాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో లేదట. 2012, జూన్ 21న సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఈ కేసు పత్రాలు కాలిపోయాయని సమాచార హక్కు చట్టం కిం ద వెల్లడైంది.ఈ కేసులో ప్రభుత్వంనియమించిన న్యాయనిపుణుల సంఖ్యను కోరుతూ ముంబై వాసి మన్సూర్దర్వేష్ ఆర్టీఐ కింద చేసిన దరఖాస్తుకు ప్రభుత్వం పైవిధంగా స్పందించింది. -
రేషన్ మేస్తున్నారు..!
ఈ రెండు చిత్రాలు కేవలం ఉడికిన అన్నంలో రెండు మెతుకుల్లాంటివే. జిల్లాలోని ఒక్క మండలంలో రేషన్ సరుకులు అమ్మిన విధానాన్ని తెలియజేసేవే. రేషన్ పంపిణీలో జరిగే అక్రమాలకు నిదర్శనంగా నిలిచేవే...సమాచార హక్కు చట్టం ద్వారా ఆలస్యంగా వెలుగులోనికి వచ్చిన ఈ వాస్తవాల వెనుక అంతులేని దోపిడీ ఉంది. - జిల్లాలో యథేచ్ఛగా నిత్యావసర సరుకుల దోపిడీ - పౌరసరఫరాల అధికారులు, డీలర్ల కుమ్మక్కు - పక్కదారి పడుతున్న టన్నుల కొద్దీ బియ్యం - ఒకే వేలిముద్రలతో రేషన్ సరుకుల పంపిణీ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సమాచార హక్కు చట్టం ద్వారా 2013 జనవరి నుంచి 2014 జనవరి వరకు నల్లగొండ మండలంలో రేషన్ పంపిణీకి సంబంధించిన రిజిస్టర్లు, ప్రజాపంపిణీ వ్యవస్థ గురించి వివరాలు సేకరించారు హక్కు చట్టం కార్యకర్త కొత్తపల్లి శివాజీ. ఈయన వివరాలు సేకరించడానికే చాలా సమయం పట్టింది. వాటిని పరిశీలించి వాస్తవాలు తేల్చేందుకు నెలల సమయమే తీసుకుంది. సమాచార హక్కు చట్టం కింద వెలుగులోనికి వచ్చిన ఈ వాస్తవాలను పరిశీలిస్తే ముక్కు మీద వేలు వేసుకోక తప్పదు. నిజంగా ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల అధికారులు ఏం చేస్తున్నారనే అంశం అంతుపట్టదు. విజిలెన్స్ విభాగాలు, ఆకస్మిక తనిఖీలు వీటిని ఎందుకు అడ్డుకోలేకపోతున్నాయో అర్థం కాదు. ఒక్కసారి ఆ చిత్ర విచిత్ర రేషన్ పంపిణీ విన్యాసాలను చూద్దామా..! కొన్ని షాపుల కీ రిజిస్టర్లలో వేలిముద్రలు మొత్తం ఒకే రకంగా ఉన్నాయి. కొన్ని షాపుల కీ రిజిస్టర్లలో కిరోసిన్ అమ్మకాలకు సంబంధించి రేషన్‌కార్డుదారుల సంతకాలు లేవు కానీ, కిరోసిన్ మొత్తం అమ్మినట్టు జీరో బ్యాలెన్స్ మాత్రం చూపించారు. లబ్ధిదారుల సంతకాలకు సంబంధించి అనేక ఎత్తులు వేశారు రేషన్ డీలర్లు. ఒకే వ్యక్తి పేరు పది చోట్ల సంతకాలుగా ఉపయోగించారు. ఒకరి పేరు కార్డుపై ఉంటే మరో వ్యక్తి పేరిట సంతకం ఉంటుంది. వేలిముద్రలైతే ఎవరూ గుర్తుపట్టలేరు కనుక అద్దుడే అద్దుడు. అడ్డగోలుగా అద్ది, పేర్లు మార్చి సంతకాలు పెట్టి సరుకులను మాయం చేసినట్టు ఆధారాలు చెపుతున్నాయి. స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలిస్తే సరుకులు 15వ తేదీలోపు అమ్మేసినట్టు ఉంటుంది. అదే కీ రిజిస్టర్‌ను పరిశీలిస్తే నెల మొత్తం సరుకులు అమ్మినట్టు ఉంటుంది. మరి ఆ సరుకులు ఎప్పుడు ఎవరికి అమ్మారో, ఏ రిజస్టర్ సరైందో ఆ రేషన్ డీలర్లు, అధికారులకే తెలియాలి. లబ్ధిదారులు సంతకాలు పెట్టాల్సిన గడులు మాత్రం చాలా ఖాళీగానే కనిపిస్తాయి. కానీ స్టాక్ ఏమీ లేదని, అంతా అమ్మేశామని స్టాక్ రిజిస్టర్లో కనిపిస్తుంది. ప్రతి నెలా కీ రిజిస్టర్లను తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించి కొత్త కీ రిజిస్టర్లు పట్టుకె ళ్లాలి. కానీ అదేమీ లేకుండానే కొత్త కీ రిజిస్టర్లను తీసుకెళ్లిపోయారు రేషన్ డీలర్లు. ఎందుకంటే సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించిన వ్యక్తి సమాచారం ప్రకారం అతనికి కీ రిజిస్టర్లు చూపించేందుకు 20 రోజులకుపైగా పట్టింది. ఎందుకంటే అవి తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో లేవు. డీలర్ల వద్దే ఉండిపోయాయి. ఇక, స్టాక్ రిజిస్టర్ల విషయానికి వస్తే గోదాము నుంచి వచ్చిన సరుకు, గత నెలలో నిల్వ ఉన్న సరుకు కలిపితే వచ్చిన మొత్తాన్ని ఆ నెలలో అమ్మాలి. కానీ అమ్మింది తక్కువైనా బ్యాలెన్స్ మాత్రం నామమాత్రంగా చూపెడుతున్నారు. ఆ తేడా మొత్తం సరుకులను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారని అర్థమవుతుంది. కొందరు డీలర్లు మధ్యాహ్న భోజన బియ్యానికి సంబంధించిన స్టాక్‌రిజిస్టర్లు నిర్వహించడం లేదు. అలాట్మెంట్లో, ఆర్వో రిజిస్టర్లలో బియ్యం ఇచ్చినట్టు చూపెడుతున్నారు కానీ తాము ఆ బియ్యాన్ని దిగుమతి చేసుకున్నామని రేషన్ డీలర్లు స్టాక్రిజిస్టర్లలో చూపడం లేదు. పైగా వేసవి సెలవులు ఉండే మే నెలలో కూడా మధ్యాహ్న భోజన బియ్యం ఇచ్చామని చెప్పి పేద విద్యార్థులకందాల్సిన బియ్యాన్ని కూడా పిండుకున్నారని అర్థమవుతుంది. కొందరు డీలర్లు రాసే స్టాక్రిజిస్టర్లలో రోజువారీ అమ్మకాల్లోనే తేడాలు రాస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. సార్లు ఏం చేస్తున్నారు? ఇంత జరుగుతున్నా అటు రెవెన్యూ, ఇటు పౌరసరఫరాల అధికారులు మాత్రం మనకెందుకులే అనే రీతిలోనే వ్యవహరిస్తున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే ఏడాది పొడవునా అక్రమాలు జరిగాయని సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన సమాచారం చెపుతుంటే దానిని అడ్డుకునే ప్రయత్నం కూడా జరగకపోవడం గమనార్హం. వాస్తవానికి ప్రతి నెలా సివిల్‌సప్లయ్ అధికారులు వారి పరిధిలో ఉన్న రేషన్‌షాపులను సందర్శించి స్టాక్రిజిస్టర్లలో ఉన్న ప్రకారం సరుకులు ఉన్నాయా లేవా అని చెక్ చేయాలి. డీలర్లు సరుకులు ఎలా అమ్ముతున్నారు? పేదలకు రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయా? లేదా అనే అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. కానీ, మన సార్లు అవేమీ చేసినట్టు కనిపించడం లేదని ఆధారాలు చెపుతున్నాయి. లెక్క చూస్తే మైండ్ బ్లాకే సమాచార హక్కు చట్టం ద్వారా నల్లగొండ మండలంలోని రేషన్ షాపుల పనితీరు ఆధారంగా ఒక చిన్న లెక్క చదివితే మీ మతి పోతుంది. ఎందుకో తెలుసా ఉజ్జాయింపుగా కడితేనే ఆ లెక్క దాదాపు రూ.80కోట్ల వరకు వచ్చింది. ఎలానో తెలుసుకుంటారా..? ఎంత లేదన్నా కనీసం నెలకు ఒక్కో రేషన్ షాపులో రూ.15వేల విలువైన సరుకులైనా పక్కదారి పడతాయని అంచనా. నల్లగొండ రూరల్ మండలం, పట్టణంలో ఉన్న రేషన్ షాపులు 75. అంటే నెలకు నల్లగొండ రూరల్ మండలంలోనే 11, 25,000 రూపాయల సరుకులు పక్కదారి పడుతున్నాయన్నమాట. అదే ఏడాదిలెక్క కడితే ఆ విలువ రూ.1.35 కోట్లు. అదే జిల్లా మొత్తానికీ వర్తింపజేస్తే 59 మండలాల్లో కలిపి ఏడాదికి రూ.79.65 కోట్లు. అంటే జిల్లాలో ఉన్న అన్ని రేషన్ షాపుల డీలర్లు అక్రమాలకు పాల్పడతారన్నది వాస్తవం కాదు కానీ.. ఓ చోట ఎక్కువైనా, ఇంకో చోట తక్కువైనా... మరో చోట అసలు లేకపోయినా సగటున అన్ని కోట్ల రూపాయల నిత్యావసరాల సరుకులు పక్కదారి పడుతున్నాయన్నది వాస్తవం. -
రెవెన్యూ శాఖలో భూ మాఫియా
అవినీతిలో రెవెన్యూ సిబ్బంది సమాచార హక్కు చట్టాన్ని గౌరవించాల్సిందే సమాచారం ఇవ్వని అధికారులపై చర్యలు ఆర్టీఐ రాష్ట్ర కమిషనర్ విజయబాబు వెల్లడి తిరుపతి కార్పొరేషన్: ‘రెవెన్యూ శాఖలో భూ మాఫియా ఉంది, భూ రికార్డులు తారుమారు చేసి పేదల కడుపుకొడుతున్నారు, తద్వారా రెవెన్యూ సిబ్బంది కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు’ అని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.విజయబాబు ఆరోపించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ భవనంలో మంగళవారం రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన సమాచార హక్కు చట్టం కేసుల విచారణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాచార హక్కు చట్టం కమిషన్ జారీచేసిన ఉత్తర్వులను సంబంధిత అధికారులు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పా టైన సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనన్నారు. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సమాచార హక్కు చట్టం 4(1),(బి) ప్రకారం సమాచారం ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీలో సమాచారం ఇవ్వకపోతే ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు రోజులుగా సమాచార హక్కు చట్టం కింద 30 కేసులు విచారించినట్టు ఆయన తెలిపారు. అందులో 3 కేసులు వాయిదా వేయగా, 9 కేసుల్లో షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. -
‘సమాచారం’ కోసం ఉగ్రవాది పోరాటం!
హైదరాబాద్: కర్ణాటకలోని ఉల్లాల్ పోలీ సులు తనపై నమోదు చేసిన కేసుకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారం అందించలేదంటూ ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాది మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి పోరాటం ప్రారంభిం చాడు. ప్రస్తుతం ముంబైలోని ఆథర్ రోడ్ జైల్లో ఉన్న ఇతడు బెంగళూరులో ఉన్న కర్ణాటక రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాడు. 2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లో గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ ల్లో చోటు చేసుకున్న పేలుళ్ల కేసులో ఇతడు నిం దితుడిగా ఉన్నాడు. మహారాష్ట్రలోని పుణేకు చెందిన అక్బర్ వృత్తిరీత్యా కంప్యూటర్ మెకానిక్. మంగుళూరు నుంచి పుణే మీదుగా అహ్మదాబాద్, ముంబై తదితర ప్రాంతాలకు పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు 2008లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇతడిని అరెస్టు చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మంగుళూరులో ఉన్న ఉల్లాల్ పోలీసుస్టేషన్లో ఇతడిపై ఓ కేసు నమోదు చేశా రు. దీనిపై పురోగతి లేకపోవడంతో గత ఏడాది ఫిబ్రవరి 28న సమాచార హక్కు చట్టం కింద కేసు వివరాలు కోరుతూ ఉల్లాల్ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నాడు. అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, పేలుడు పదార్థాల చట్టం కింద తనపై ఉల్లాల్ పోలీసులు నమోదు చేసిన కేసు సమాచారం అందించాల్సిందిగా కోరాడు. దీనిపై 30 రోజుల్లో సమాచారం అం దించాలని పోలీసుల్ని కమిషన్ ఆదేశించింది. -
పోస్టల్ పిన్‌కోడ్ కోసం ఖైదీ ఆర్టీఐ దరఖాస్తు
న్యూఢిల్లీ: పోస్టల్ పిన్‌కోడ్ కోసం సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా దరఖాస్తు చేసుకున్నాడో పేద ఖైదీ. మహారాష్ట్ర కొల్హాపూర్ జైలులో ఉన్న ఖైదీ జితేంత్ర ఆనందరావ్ చౌహాన్ తన ఇంటికి ఉత్తరాలు పంపడానికి పోస్టల్ పిన్‌కోడ్ అవసరమైంది. కేంద్ర సమాచార కమిషన్ వెబ్సైట్లో పిన్‌కోడ్ సమాచారం లేకపోవడంతో ఆర్టీఐకింద దరఖాస్తు చేసుకున్నాడు. స్పందించిన కేంద్ర సమాచార కమిషనర్ బసంత్ సేత్ పిన్కోడ్లు ఉన్న నకలు ఒకటి అతనికి ఉచితంగా ఇవ్వాలని తపాలా శాఖను ఆదేశించారు. అయితే ఖైదీగా ఉన్న చౌహాన్‌కు నేరుగా సమాచారం అందించడం కుదరదని, అతను ఇంటర్నెంట్ నుంచే పొందాలని తపాలా అధికారులు పేర్కొన్నారు. చౌతాలతో సహా ఈ జైలులో చాలా మంది ఖైదీలు తమ ఇళ్లకు పంపిన ఉత్తరాలు సరైన పిన్కోడ్లేని కారణంగా తిరిగి వచ్చాయి. వీరితోపాటు దేశంలోని వివిధ జైళ్లలో ఖైదీలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సమాచార క మిషనర్ బసంత్ సేత్ తపాలా శాఖకు సూచించారు. -
ప్రతి సమాచారాన్ని అందించాలి..
సమాచార హక్కు చట్టం సామాజిక తనిఖీ విభాగం కన్వీనర్ వీవీ రావు నిజామాబాద్ అర్బన్: ప్రజలు సమాచారం అడిగినప్పుడు కొందరు అధికారులు సక్రమంగా ఇవ్వడం లేదని సమాచార హక్కు చట్టం సామాజిక తనిఖీ విభాగం కన్వీనర్ వీవీ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం కదా, రాష్ట్రం వచ్చింది కదా.. అంటూ దాటవేసే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్ మహిళ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉద్యమాలలో పాల్గొన్నా నిబంధనల ప్రకారం సమాచారం ఇవ్వాల్సిందేనన్నారు. ప్రతి శాఖ వారు ఖచ్చితంగా సెక్షన్-4ను పాటించాలన్నారు. అడిగిన ప్రతి వ్యక్తికి పూర్తిస్థాయి సమాచారం ఇవ్వాలన్నారు. జాతీయ రాజకీయ పార్టీలు సమాచార హక్కు చట్టం ప్రకారం పీఓలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నేటికీ జాతీయ పార్టీలు వీరి ఉసే ఎత్తడం లేదన్నారు. చట్టప్రకారం జాతీయపార్టీలు కూడా సమాచారం ఇవ్వాల్సిందేనన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. చట్టం పూర్తిస్థాయిలో అమలైతేనే పారదర్శకత ఉంటుందని చెప్పారు. -
‘భవన ప్లాన్’ ప్రైజ్డ్ మెటీరియల్ కాదు
* విక్రయ నిమిత్తం దానికి ధర నిర్ణయించలేదని హైకోర్టు స్పష్టీకరణ * రూ.44,787 చెల్లిస్తేనే ప్లాన్ కాపీ ఇస్తామన్న జీహెచ్ఎంసీ ఉత్తర్వులు రద్దు సాక్షి, హైదరాబాద్: భవన సముదాయ ప్రణాళిక (ప్లాన్)ను సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టంలో నిర్దేశించిన ‘ప్రైజ్డ్ మెటీరియల్’గా పరిగణించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్లాన్‌కు బహిరంగ మార్కెట్లో విక్రయ నిమిత్తం ప్రభుత్వం దానికి అమ్మకపు ధర నిర్ణయించలేదు కాబట్టి, దానిని ప్రైజ్డ్ మెటీరియల్‌గా పరిగణించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి సమాచార హక్కు చట్టం కింద భవన ప్లాన్‌ను అందించాలని ఎవరైనా కోరినప్పుడు, దానికి ప్రైజ్డ్ మెటీరియల్ కింద కాకుండా ఇతర మెటీరియల్‌ను అందించేందుకు ఎంత మొత్తాన్ని వసూలు చేస్తున్నారో అంతే మొత్తాన్ని (పేజీకి రూ.2) మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. ముద్రిత సమాచారం, మ్యాపులు, ప్లాన్లు, ఫ్లాపీలు, సీడీలు, శ్యాంపిల్స్, మోడల్స్, ఇతర ఏ రూపంలోనైనా ఉన్న మెటీరియల్‌కు విక్రయ నిమిత్తం ధర నిర్ణయించి ఉంటే వాటిని మాత్రమే ఆర్టీఐ ప్రకారం ప్రైజ్డ్ మెటీరియల్‌గా భావించాలని తేల్చిచెప్పింది. ప్లాన్‌ను ప్రైజ్డ్ మెటీరియల్‌గా నిర్ణయించి, దానికి రూ.44,787 చెల్లించాలన్న జీహెచ్ఎంసీ సమాచార అధికారి ఉత్తర్వులను, వాటిని సమర్థిస్తూ సమాచార కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుపడుతూ, వాటిని రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఇటీవల తీర్పునిచ్చారు. స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఓ.ఎం.దేబరా అమీర్‌పేటలోని ఓ ఆస్తికి సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసిన ప్రణాళిక (శాంక్షన్డ్ ప్లాన్)ను అందచేయాలంటూ ఆర్టీఐ కింద 2007 జూన్ 6న జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేశారు. ప్లాన్ కాపీని పొందాలంటే రూ.44,787 చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఆదేశాలను దేబరా సమాచార కమిషన్ ముందు సవాలు చేశారు. కమిషన్ సైతం జీహెచ్ఎంసీనే సమర్థించింది. ఈ ఉత్తర్వులపై దేబరా 2008లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు ఇటీవల తీర్పు వెలువరించారు. -
సమాచారం దాచడానికి ప్రజాధనం వృథా!
సమాచార హక్కు చట్టం కింద సమాచారం పొందడానికి పంపుతున్న రూ.10ల పోస్టల్ ఆర్డర్‌ను సరిగా తీసుకోలేదని తిప్పి పంపించడంతో ప్రభుత్వానికి రెట్టింపు ఖర్చవుతోంది. ఇలా ప్రజాధనాన్ని వృథా చేయడం, దరఖాస్తుదారును వేధించడం కాకుండా చట్టాలను అమలు చేయడానికి వీలయిన వాతావరణం కల్పించవలసి ఉంది. సమాచార హక్కు చట్టంలో సమాచారం కోరుకుని తీసుకునే హక్కు ఉందన్న మాటే గాని ఆ అభ్యర్థన ఇవ్వడం, దానితోపా టు పది రూపాయల ఫీజు చెల్లిం చడం ఒక పెద్ద సమస్యగా మారి పోయింది. రూ.10ల కోసం అధికారులు వందల రూపాయ లు ఖర్చు చేస్తున్నారు. ప్రజాస మయం, ప్రభుత్వ ధనం, పాలనా సమయాన్ని వృథా చేస్తున్నారు. ఆరో తరగతిలో పంజాబీ భాషను మూడో భాషగా ఎన్ని పాఠశాలల్లో ప్రవే శపెట్టారో చెప్పాలని, ఇతర వివరాలను కూడా ఇవ్వాలని రఘుబీర్ సింగ్ కోరారు. కాని ఈ మామూలు సమాచా రాన్ని ఇవ్వకుండా ఒకటో అప్పీలుకు, రెండో అప్పీలుకు కూడా పంపించారు అధికారులు. సమాచారం ఇవ్వని అధి కారిపైన జరిమానా విధించాలని ఆయన కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. రఘుబీర్ సింగ్ సమాచార హక్కు చట్టం రావడానికి పోరాడిన వారిలో ఒకరు. చట్టం రూపకల్పన లో కూడా ఆయన పాత్ర ఉంది. కానీ ఈ చిన్న సమాచారం కూడా ఇవ్వకపోయే సరికి ఆయనకు నిరాశ కలిగింది. మనం సాధించిందేమిటని ప్రశ్నించారాయన. పది రూపా యల పోస్టల్ ఆర్డర్ అకౌంట్స్ ఆఫీసర్ పేరు మీద తీసుకు న్నారు. అదే సరైన విధానమని ఉద్యోగ శిక్షణా శాఖ నియ మాలు కూడా వివరిస్తున్నాయి. కాని ఆ పోస్టల్ ఆర్డర్ సరిగ్గా తీసుకోలేదంటూ అధికారి తిరిగి పంపారు. అదీ స్పీడు పోస్ట్‌లో. దానికి పాతిక రూపాయలు ఖర్చు చేశాడ తను. సుభాష్ చంద్ర అగర్వాల్ కేసులో కేంద్ర సమాచార కమిషన్ 2013 ఆగస్టులో సెక్షన్ 25(5) కింద ఒక సిఫా రసు చేసింది. పోస్టల్ ఆర్డర్‌ను అకౌంట్స్ ఆఫీసర్ పేరు మీద తీసుకుంటే వాటిని ఆమోదించాలని, తిరస్కరించకూ డదని కోరింది. పబ్లిక్ అథారిటీలన్నీ ఈ నియమాన్ని పా టించాలని డీఓపీటీ శాఖ ఆదేశించాలని కూడా కోరింది. 2007లో పోస్టల్ శాఖ ఆర్టీఐ దరఖాస్తులను ఇక్కడ తీసుకుంటామని పోస్టాఫీసులన్నీ ప్రదర్శించాలని, అదే కౌంటర్లో ఫీజు కూడా తీసుకోవాలని, అక్కడే అందరు సీపీఐఓల పేర్లు ప్రదర్శించాలని, 25,464 పోస్టాఫీసులు ఆర్టీఐ దరఖాస్తులు తీసుకునే ఏర్పాట్లు చేయాలని సమా చార కమిషన్ ప్రతిపాదించింది. కానీ పది రూపాయల ఆర్టీఐ స్టాంపులను ముద్రించడం సరైన ఆలోచన అనీ పోస్టల్ శాఖ వారు దీన్ని పరిశీలించాలని కమిషన్ ఆ తీరు్పులో కోరింది. రూ.10ల పోస్టల్ ఆర్డర్ అకౌంట్స్ ఆఫీ సర్ పేరు మీద తీసుకున్న తరువాత దాన్ని పాటించక పోవడం సమాచార హక్కు చట్టం ఉల్లంఘన అవుతుందని రఘుబీర్ కేసులో వివరించడమైనది. లోపమున్నా లేక పోయినా రూ.10ల పోస్టల్ ఆర్డర్‌ను ఆమోదించకపోతే చట్టంకింద చర్యలు తీసుకోవలసి వస్తుంది. కాని ఆ పోస్టల్ ఆర్డర్‌ను ఆమోదించడానికి బదులు, తిరస్కరించి ఆ రూ. 10లను వదులుకోవడమే కాకుండా, దాన్ని తిప్పి పంపడా నికి ఒక ఉత్తరం రాయడం, దానికి ఒక కవరు తయారు చేయడం, 25 లేదా 30 రూపాయల స్టాంపులు పెట్టడం, మొత్తం ఈ పనిచేయడానికి గంటో రెండు గంటలో వెచ్చిం చడం అంతే వృథా. దరఖాస్తుదారుడు కూడా పది రూపా యల స్టాంపు కొనడానికి అంత సొమ్ము మళ్లీ ఖర్చు చేయ వలసి వస్తుంది. ఆ పోస్టల్ ఆర్డర్‌ను ఆమోదిస్తే పది రూపా యలు దక్కుతుంది. లేదా ఆ పది రూపాయలతోపాటు యాభై రూపాయల ఖర్చు అవుతుంది. సమాచారం అడి గిన ప్రతిసారీ 50 రూపాయల ప్రజాధనం వృథా చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించాలి. అంతేకాకుండా పీఐఓ దీన్ని నిరాకరించడం ద్వారా తన అధికారాన్ని దుర్వి నియోగం చేస్తున్నట్టు అవుతుంది. దరఖాస్తుదారుడిని వేధించడం కూడా అవుతుంది. మరోవైపు సమాచార చట్టంలో నిపుణుడు, న్యాయ వాది అయిన ఆర్కే జైన్ సెకండ్ అప్పీల్‌ను డిసెంబర్ 5న సమాచార కమిషనర్ బసంత్ సేఠ్ విన్నారు. పోస్టల్ శాఖ ప్రధాన సమాచార అధికారి తమ శాఖ ప్రతిపాదన గురిం చి వివరించారు. ఈ సమస్యను అధ్యయనం చేయడం కోసం ఒక నిపుణుల కమిటీని నియమించారు. 31.1. 2014న మామూలు పోస్టల్ స్టాంపులనే ఆర్టీఐ ఫీజుగా అనుమతించాలని వారు సూచించారు. ఈ ప్రతిపాదనను సమాచార కమిషనర్ ఆమోదించారు. దాన్ని పరిశీలించా లని ప్రభుత్వానికి సూచించారు. ఆ సూత్రం ప్రయోజనక రమని ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనను వెంటనే పరిగణించి ఆమోదించే ప్రయత్నం చేయాలని ఈ కమిషనర్ కూడా రఘువీర్ సింగ్ కేసులో సిఫార్సు చేశారు. విద్యాశాఖలో పీఐఓలు ఈ సంవత్సరం జనవరి 2014 నుంచి డిసెంబర్ 10 వరకు ఎన్ని పోస్టల్ ఆర్డర్లను తిరస్కరించారో అందుకు కారణాలేమిటో వివరించాలని, ఆ సమాచారం ఈ ఉత్తర్వు అందిన పదిహేను రోజుల్లో ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసులో అన్యాయంగా పోస్టల్ ఆర్డర్‌ను తిరస్కరించినందుకు, సమాచార హక్కు దరఖా స్తుదారుడిని వేధించినందుకు జరిమానా ఎందుకు విధించ కూడదో వివరించాలని కూడా పీఐఓకు నోటీసు జారీచేయ డమైనది. విద్యాశాఖ వెబ్‌సైట్‌ను ఉపయుక్తంగా మార్చా లని, తాజా సమాచారం చేర్చాలని కూడా ఆదేశించారు. ఒకవేళ పోస్టల్ ఆర్డర్లో పొరబాటు ఉన్నా సరే దాన్ని తిర స్కరించకూడదని, అందుకు 50 రూపాయలు వెచ్చించడం ఇకపై చేయకూడదని కూడా ఆదేశించారు. సమాచార హక్కు అమలు చేయడానికి కావలసిన ఆచరణాత్మకమైన వ్యవస్థను రూపొందించడం ఆ చట్టం లక్ష్యమని గుర్తు చేయవలసి వచ్చింది. దీని ప్రకారం చట్టాలను అమలు చేయడానికి వీలయిన వాతావరణం కల్పించవలసి ఉంది. (డిసెంబర్ 11, 2014న రఘుబీర్ సింగ్ కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com - డా॥మాడభూషి శ్రీధర్ -
బౌద్ధ ఆరామాలు గోవిందా...
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పీసీపీఐఆర్ కోసం విశాఖపట్నం - కాకినాడ మధ్య ప్రతిపాదించిన 1,58,147 ఎకరాలు ప్రాచీన సంపదనకు నిలయంగా ఉంది. ఈ ప్రాంతంలో 8 బౌద్ధ ఆరామ కేంద్రాలున్నాయి. జిల్లాలోని ధారపాలెం, కొత్తూరు, రాకాసికొండ, అమలాపురం, వీరాలమెట్ట, పెంటకోట, గోపాలపట్నం, తూర్పుగోదావరి జిల్లాలోని కొడవలి, పి.తిప్పాపురం ఉన్నాయి. బౌద్ధారామ కేంద్రాలుగా గుర్తింపు కోసం మరో 8 కేంద్రాల పేర్లతో ఓ జాబితా రూపొందించారు. కొత్త పోలవరం, గుడివాడ, పెద్ద ఉప్పలాం, బుచ్చిరాజుపేట, ఎ.కొత్తపల్లిలను ఆ జాబితాలో చేర్చారు. మరో 13 కేంద్రాలను బౌద్ధ ఆరామా కేంద్రాలుగా గుర్తించాలన్న ప్రతిపాదన ఉంది. 12వ శతాబ్దంలో తూర్పు చాణుక్య వంశానికి చెందిన కాషాయ విష్ణువర్థన మహారాజు ఈ బౌద్ధ అరామ కేంద్రాల పరిరక్షణ కోసం నిధులు సమకూర్చినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రాచీనవారసత్వ ప్రాశస్త్యం ఉన్న కేంద్రాలకు విఘాతం కలగకుండా చూడాలని పురావస్తు ప్రదేశాల పరిరక్షణ చట్టం స్పష్టం చేస్తోంది. ఏకపక్షంగా... వారసత్వ సంపద ఉన్న ప్రాంతాలతోసహా భారీ ఎత్తున భూములు పీసీపీఐఆర్ కింద పారిశ్రామిక సంస్థలకు కట్టబెట్టేయడానికి సిద్ధమైంది. పీసీపీఐఆర్ మాస్టర్‌ప్లాన్ రూపొందించిన వుడా అధికారులు పురావస్తు శాఖ అధికారులను కనీసం సంప్రదించ లేదు. సమాచార హక్కు చట్టం కింద కోరినప్పుడు ఈ విషయం నిర్ధారణయ్యింది. బౌద్ధ ఆరామ అవశేషాలు ఉన్న ప్రాంతాలతోసహా భూసేకరణకు సిద్ధపడుతున్నప్పుడు వుడా అధికారులు సంప్రదించారా అని ప్రశ్నించగా...పురావస్తు శాఖ అధికారులు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ వుడా అధికారులు తమను సంప్రదించలేదని వెల్లడించారు. వుడా అధికారులు కూడా స్పందిస్తూ పురావస్తు శాఖను సంప్రదించలేదని అంగీకరించారు. వుడా అధికారులు తమదైన శైలిలో సమర్థించుకోవడం గమనార్హం. భూసేకరణకు ఓ కన్సల్టెన్సీ ద్వారా డ్రాఫ్ట్ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి నెలరోజుల ముందు విడుదల చేసే ఆ డ్రాఫ్ట్ ప్లాన్‌లో అన్ని అంశాలను పొందుపరుస్తామని చెప్పారు. అనంతరం అభ్యంతరాలు తెలపవచ్చని కూడా చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన డ్రాఫ్ట్ప్లాన్లో అసలు ఆ ప్రాంతంలో బౌద్ధ ఆరామ అవశేషాలు ఉన్నాయన్న విషయాన్నే ప్రస్తావించ లేదు. బౌద్ధ ఆరామ అవశేషాలను ప్రభుత్వం కనీసం గుర్తించలేదని స్పష్టమవుతోంది. -
‘జన్ ధన్’లో 74 శాతం అకౌంట్లు జీరో బ్యాలెన్స్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద నవంబర్ 7వ తేదీ నాటికి 7.1 కోట్ల అకౌంట్లు ప్రారంభమయ్యాయి. ఈ అకౌంట్లను మొత్తంగా చూస్తే దాదాపు రూ.5,400 కోట్లు డిపాజిట్ అయ్యాయి. అయితే వేర్వేరుగా అకౌంట్లను చూస్తే 74 శాతం (దాదాపు 5.3 కోట్లు) జీరో బ్యాలెన్స్‌తోనే ఉన్నాయి. సామాజిక కార్యకర్త సుభాష్ అగర్వాల్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలు చేసిన ఒక పిటిషన్‌కు సమాధానంగా ఆర్థిక సేవల శాఖ ఈ వివరాలను అందజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 4.2 కోట్లకుపైగా అకౌంట్లు ప్రారంభమయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 2.9 కోట్లు. 1.2 కోట్ల అకౌంట్లతో ఎస్బీఐ మొదటి స్థానంలో ఉంది. తరువాతి స్థానంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (38 లక్షలు), కెనరాబ్యాంక్ (37 లక్షలు) ఉన్నాయి. అకౌంట్ ప్రారంభం వల్ల పలు ప్రయోజనాలతోపాటు, 6 నెలలు సంతృప్తికరంగా అకౌంట్ నిర్వహిస్తే రూ.5,000 ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కూడా కల్పిస్తున్న సంగతి తెలిసిందే. -
‘చైనీస్’ బస్సులకు ఇక వీడ్కోలు!
సాక్షి, ముంబై: బెస్ట్ సంస్థ ఆధ్వర్యంలో నడిచే కింగ్ లాంగ్ బస్సుల నిర్వహణ ఖర్చు అధికంగా ఉండడంతో వీటిని త్వరలోనే తొలగించనున్నారు. అయితే వీటిని విడతల వారీగా తొలగించాలని అధికారులు యోచిస్తున్నప్పటికీ ఒక్క ప్రైవేట్ సంస్థ కూడా వీటిని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్సులు చైనీస్ బస్సులుగా నగరంలో పేరొందాయి. ఇదిలా ఉండగా, మొదటి విడతగా 20 బస్సులను తొలగించేందుకు నిర్ణయించామని అధికారి ఒకరు తెలిపారు. ఈ బస్సులు తరచూ బ్రేక్‌డౌన్ అవుతూ ఉంటున్నాయన్నారు. కాగా, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) నుంచి సేకరించిన వివరాల మేరకు.. 2010 జనవరి నుంచి 2012 జూన్ వరకు దాదాపు 4,037 బస్సులు బ్రేక్ డౌన్ అయ్యాయి. మరో పక్క ఆర్డినరీ బస్సులు బ్రేక్ డౌన్ల సంఖ్య తగ్గింది. జనవరి 2010లో 258 చైనీస్ బస్సులకు గాను 30 బస్సులు పూర్తిస్థాయి మరమ్మతులకు గురై డిపోలోనే పడి ఉన్నాయి. ఈ బస్సుల్లో అప్పుడప్పుడు మంటలు చెలరేగుతున్నాయని ఎమ్మెస్సార్టీసీ 2010 మే లో వీటిని తొలగించింది. కాగా 11 బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లు నడుపుతున్నారు. ముంబై-పుణే మార్గాల మధ్య మూడు బస్సులు తమ సేవలను అందజేస్తున్నాయి. మిగతా వాటిలో చాలావరకు మరమ్మతుల కోసం గ్యారేజీలోనే ఉంటున్నాయని ఎమ్మెస్సార్టీసీ అధికారి పేర్కొన్నారు. ఎమ్మెస్పార్టీసీకే కాకుండా బెస్ట్‌కు కూడా ఈ బస్సులు గుదిబండగా మారిపోయాయి. ఈ బస్సుల విడిభాగాల ఉత్పత్తి దారులు అందుబాటులో లేకపోవడం మరింత కష్టతరంగా మారిందని అధికారి పేర్కొన్నారు. -
స.హ. చట్టంతో ప్రశ్నించే హక్కు
సామాన్యుల్లో అవగాహన రాహిత్యం అమలు తీరులో లోపాలు స.హ. చట్టం కమిషనర్ తాంతియాకుమారి విశాఖపట్నం: ఏ సమాచారాన్నయినా ఎప్పుడైనా ఎవరైనా తెలుసుకునే అవకాశం సమాచార హక్కు చట్టం కల్పించింది. సామాన్యుడు సైతం సమాజంలో ఏం జరుగుతుందో అధికారులను ప్రశ్నించే వెసులుబాటు కల్పిస్తూ 2005లో వచ్చిన ఈ చట్టం తొలినాళ్లలో అధికారుల గుండెల్లో గుబులు రేపింది. రానురాను ఈ చట్టం మిగతా చట్టాల్లాగా సామాన్య మధ్యతరగతి వారికి న్యాయం చేయలేక పోయింది. ఈ చట్టం అమలులోకి వచ్చి అక్టోబర్ 12 నాటికి తొమ్మిదేళ్లయిన సందర్భంగా చట్టం అమలు తీరు లోపాలు గురించి సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియాకుమారితో ముఖాముఖి.. సమాచారహక్కు చట్టం వచ్చిన తొమ్మిదేళ్లలో ఎన్ని కేసులు వచ్చాయి, ఎన్ని పరిష్కారమయ్యాయి? ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 4వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అప్పీళ్లకు వచ్చిన వాటి ని పరిష్కరించేందుకు సాధ్యమైనంత వరకూ కృషి చేస్తున్నాం. సమస్య పరిష్కారంమయ్యేలా చూస్తున్నాం. చట్టంపై చైతన్యం ఎంతవరకూ వచ్చింది? చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం గ్రామాల్లో అవగాహన సదస్సులు, ప్రచారం నిర్వహించాలి. అది ఎక్కడా జరగడంలేదు. అధికారులు నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతోంది. జిల్లా, మండల స్థాయిలో కమిటీలు ఉన్నాయా? ప్రతి జిల్లాకు మోనటరింగ్ కమిటీలు ఉండాలి. కలెక్టర్, పోలీస్ కమిషనర్/ఎస్పీ, డీఆర్‌ఓతో పాటు ఇద్దరు జర్నలిస్టులు, ఇద్దరు స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఇద్దరు కార్యకర్తలతో జిల్లా కమిటీ ఉండాలి. ఇంతవరకూ ఎక్కడా ఈ కమిటీలు వేయలేదు. సరికదా ఈ చట్టం పై కలెక్టర్లు దృష్టి పెట్టడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఈ చట్టంపై అవగాహన లేదు. రాష్ట్ర స్థాయిలో చట్టం అమలు తీరు ఎలా ఉంది? ఈ చట్టం అమలులో అనేక లోపాలున్నాయి. సక్రమంగా అమలు చేసేందుకు కావాల్సిన సిబ్బంది లేరు. ఫిర్యాదులు స్టోర్ చేసుకునేందుకు కంప్యూటర్లు లేవు. ఉన్న సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు లేవు. ఇలా అయితే అమలు చేయడం కష్టం కదా. ఫిర్యాదుదారులు, అధికారులు హైదరాబాద్ రావడానికి ఇబ్బందులు పడుతున్నారు... సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం కావాలంటే ఆర్టీఐ హియరింగ్ బెంచ్‌లు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదు. ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ప్రజల మధ్యనే చేయాలి. మేం పోరాడుతున్నది అవినీతి మీద . ఆ అవినీతి అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రజల మధ్య నిలబెట్టి సమస్య పరిష్కారం చేస్తే గొడవలు అవుతాయి. మాకు రక్షణ ఉండదు. ఇంతవరకూ నాకు గన్‌మెన్ కూడా ఇవ్వలేదు. సమాచారానికి కట్టే డబ్బులును అధికారులు వాడుకుంటున్నారనే అపవాదు ఉంది. పౌరులు, ధరఖాస్తుదారులు సమాచారానికి కట్టే డబ్బులు ఖచ్చితంగా ఆర్టీఐ ఖాతాలోకే చేరాలి. రూపాయి అయినా సరే అధికారులు చలానా తీసి ఆర్టీఐ ఎకౌంట్ కు జమచేయాలి. అంతేతప్ప ఆ డబ్బులను జనరల్‌గా వాడుకునేందుకు అధికారులకు హక్కు లేదు. జిల్లాల్లో మీ పర్యటనలు ఎవరు నిర్ణయిస్తారు, మీ ప్రొటోకాల్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? జిల్లాల్లో పర్యటనలు మేమే నిర్ణయించుకుంటాం. ఆయా జిల్లాలకు వెళ్లేటప్పుడు జిల్లా కలెక్టర్ తప్పకుండా కలిసి ప్రొగ్రాం ఫిక్స్ చేయాలి. ప్రొటోకాల్ ప్రకారం వచ్చి నన్ను కలవాలి. ఆయన లేకపోతే డీఆర్ఓదే బాధ్యత. -
మా ఆదేశాలే పట్టించుకోవడం లేదు
రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సమాచార కమిషనర్ల అసంతృప్తి హైదరాబాద్: చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగమే తీవ్ర నిర ్లక్ష్యం ప్రదర్శిస్తోందంటూ సాక్షాత్తూ రాష్ట్ర సమాచార కమిషనర్లే అసంతృప్తి వ్యక్తంచేశారు. సమాచార హక్కు చట్టం అమలుకు సంబంధించి తామిచ్చే ఆదేశాలకు ఇరు రాష్ట్రాల అధికారులెవరూ వీసమెత్తు విలువ కూడా ఇవ్వడం లేదని ఏపీ సమాచార కమిషన్‌లోని 8 మంది క మిషనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రవీంద్రభారతిలో కమిషన్ ఆధ్వర్యంలో సమాచార హక్కు వారోత్సవాలను నిర్వహించారు. తమ ఆదేశాలనే పట్టించుకోవడం లేదని కమిషనర్లు అసంతృప్తి వ్యక్తంచేయడంతో.. కార్యక్రమానికి వచ్చిన ఆర్టీఐ ఉద్యమకారులు కంగుతిన్నారు. తమ ఆవేదన లను వెళ్లబోసుకునేందుకు కూడా కమిషనర్లు సమయం ఇవ్వకపోవడంతో ఉద్యమకారులు కాసేపు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం ఆర్టీఐ ఆమలు ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఈ చట్టంతో పలువురు అధికారులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రధాన సమాచార కమిషనర్ జన్నత్‌హుస్సేన్, స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ లింగరాజు పాణిగ్రాహి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాచార కమిషనర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన వారికి సమాచారం ఇచ్చేందుకు పలు ప్రభుత్వ విభాగాలు ఇష్టపడడం లేదని, అప్పిలేట్ అథారిటీలు పట్టించుకోవడం లేదన్నారు. విభాగాధిపతులు కనీసం స్పందించడం లేదన్నారు. మరో కమిషనర్ విజయబాబు మాట్లాడుతూ.. సమాచార కమిషన్ నిర్వహిస్తున్న వారోత్సవాలకు ప్రభుత్వ విభాగాలకు చెందిన పీఐవోలు, అప్పిలేట్ అథారిటీలు, విభాగాధిపతులు ఎక్కువ మంది రాకపోవడాన్ని ప్రస్తావించారు. ఆర్టీఐ అమలు మొక్కుబడి కార్యక్రమంగానే ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) హోదా కలిగిన కమిషనర్ల పట్ల పలువురు ఐఏఎస్ అధికారులు అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏం.. తమాషా చేస్తున్నారా?
రాంబిల్లి: సమాచార హక్కు చట్టం సదస్సు వాయిదా వేసుకోవాలని తనకే హద్దులు నిర్ణయిస్తారా? ఏం తమాషాగా ఉందా? అంటూ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియాకుమారి శనివారం మండల అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక స్త్రీశక్తి భవనంలో శనివారం ఈ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సమావేశానికి అధికారులు గైర్హాజరయ్యారు. దీంతోపాటు మండలంలో సమాచార హక్కు చట్టాన్ని అధికారులు సక్రమంగా అమలు చేయలేదని పలువురు ఫిర్యాదు చేయడంతో తాంతియకుమారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ తన పర్యటనను వాయిదా వేసుకోవాలని, రాంబిల్లిలో ఈ అవగాహన సదస్సు అవసరం లేదని మండల పరిషత్ అధికారులు చెప్పినట్లు స.హ. చట్టం రక్షణ వేదిక ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ కాండ్రేగుల వెంకటరమణ సమావేశంలో మాట్లాడంతో తాంతియకుమారి అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. రాంబిల్లిలో సమావేశాలు వద్దని అనడానికి మీరెవరు.. ఏం.. తమాషాలు చేస్తున్నారా.. ఇకపై కార్యాలయాలను తనిఖీ చేస్తా.. సమాచార హక్కు కింద తగిన సమాచారం అందజేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు. అయితే మండల పరిషత్ అధికారులెవరూ ఈ సమావేశానికి హాజరుకాలేదు. సమావేశం చివరిలో మండల పరిషత్ సూపరింటెండెంట్ డేవిడ్ బెరఖ్యా హాజరయ్యారు. దీంతో కమిషనర్ ఆయనపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవన్నారు. జన్మభూమి కార్యక్రమానికి ఎంపీడీవో , తహశీల్దారు వెళ్లారని ఆయన వివరణ ఇచ్చారు. అనంత రం తాంతియకుమారి విలేకరులతో మాట్లాడుతూ కోర్టులో కేసులు నడుస్తున్నప్పటికీ ప్రజలు అడిగిన సమాచారం అధికారులు ఇవ్వాల్సిందేనన్నారు. రాంబిల్లి సర్పంచ్ పిన్నంరాజు రాధా సుందర సుబ్బరాజు(కిషోర్), ఎన్‌వైకే జిల్లా సమన్వయకర్త బి. అప్పారావు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. అధికారుల్లో టెన్షన్.. టెన్షన్ ఇదిలా ఉంటే తాంతియకుమారి పర్యటనతో జన్మభూమి కార్యక్రమాల్లో భాగంగా మర్రిపాలెం, మురకాడ గ్రామాల్లో ఉన్న పలువురు అధికారులు ఉలిక్కిపడ్డారు. సమావేశంలో అధికారులు, అనుచరులకు ఫోన్ చేసి ఆమె పర్యటనపై ఆరా తీశారు. -
సోనియాకు, అమిత్‌షాకు సీఐసీ నోటీసులు
న్యూఢిల్లీ: సమాచారహక్కు చట్టాన్ని అమలు చేయనందుకు కేంద్రసమాచార కమిషన్ (సీఐసీ) పార్టీలపై చర్యలకు ఉపక్రమించింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ చీఫ్ సోనియాతో పాటు ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ చట్టాన్ని అమలు చేయాలన్న తమ ఆదేశాలను పాటించనందుకు విచారణ ఎందుకు చేపట్టరాదో తెలియజేయాలంది. గతేడాది సుభాష్ అగర్వాల్ అనే కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ మేరకు సీఐసీ ఈ పార్టీలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకొచ్చింది. అయినా ఆ పార్టీలు కమిషన్ ఆదేశాలను పాటించలేదు. దీనిపై లోగడ రెండు సార్లు సీఐసీ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 2013, జూన్3న తామిచ్చిన ఆదేశాలను పాటించనందుకు విచారణ ఎందుకు ప్రారంభించరాదో నాలుగు వారాల్లో తెలియజేయాల సీఐసీ తాజా నోటీసులిచ్చింది. లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంది. -
రహ‘దారి’ ఏది?
- ఏటా లక్షల్లో రోడ్లపైకి వస్తున్న కొత్త వాహనాలు - విపరీతంగా పెరుగుతున్న ద్విచక్రవాహనాల సంఖ్య - నగరవాసుల్లో ఏడాదికేడాది పెరుగుతున్న మోజు - ఫలితంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు - ఆందోళనను కలిగిస్తున్న కాలుష్యం తీవ్రత సాక్షి, ముంబై: నగరంలో రోజురోజుకూ ద్విచక్ర వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తత్ఫలితంగా కిక్కిరిసిన వాహనాలతో రహదారులు ప్రమాదకరంగా మారుతున్నాయి. ముంబై రిక్షామెన్ యూనియన్ నాయకుడు తంపీ కురేన్ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు.. ఏప్రిల్-2013 నుంచి మార్చి 2014 మధ్య కాలంలో వాహనాల సంఖ్య 1,86,640 కు పెరిగింది. మార్చి 1998 నుంచి మార్చి 2013 వరకు ప్రతి సంవత్సరం 88,510 వాహనాలు సగటున రోడ్లపైకి వస్తున్నాయి. కొత్తగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను చూసి అధికారులు నిర్ఘాంత పోతున్నారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాల కొనుగోళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం నగరంలోని మూడు ఆర్టీవో కేంద్రాల్లో 23,74,038 వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఇందులో అంధేరి ఆర్టీవో కార్యాలయంలో 1,86,640 ద్విచక్రవాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోగా, వడాలా, తాడ్‌దేవ్ ఆర్టీవో కార్యాలయాలలో 1,02,829 ద్విచక్రవాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో నగరంలో ద్విచక్రవాహనాలు ఉపయోగించే వారి సంఖ్య ఎంతగా పెరిగిందో తెలుస్తోంది. 1998 ఆర్థిక సంవత్సరం వరకు నగరంలో కేవలం 3,54,799 ద్విచక్రవాహనాలు ఉండగా మార్చి 2013లో వీటి సంఖ్య 12,35,282కు పెరిగింది. 1998 నుంచి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తున్నవారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇదిలా ఉండగా కార్లు ఉపయోగించే వారి సంఖ్య కూడా గణనీయంగానే పెరుగుతోంది. 1998లో నగర రోడ్లపై 2,73,581 కార్లు ఉండగా, మార్చి 31, 2014 వరకు కార్ల సంఖ్య 7,28,225కు చేరుకుంది. గత 16 సంవత్సరాల్లో 166 శాతం కార్ల సంఖ్య పెరిగిందని అధికారి తెలిపారు. దీంతో కాలుష్య కారకాల జాబితాలో ఆటోలతోపాటు కార్లు కూడా చేరాయి. ప్రస్తుతం నగర రహదారులపై డీజిల్ కార్ల సంఖ్య పెరగడంతో కార్ల వల్ల జరుగుతున్న కాలుష్యం కూడా ఏమంత తక్కువేం కాదన్నారు. దీంతోపాటు అత్యంత క్యూబిక్ కెపాసిటీ(సీసీ) ఉన్న వాహనాలు రోడ్లపైకి వస్తుండడం, వాటి వేగం కూడా ఎక్కువగా ఉంటుండడంతో రహదారులు ప్రమాదకరంగా మారుతున్నాయి. -
మరో ఈపీఎఫ్ స్కాం!
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: ఏపీ ఆయిల్‌ఫెడ్ అశ్వారావుపేట డివిజన్ కార్యాలయంలో మరో ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) కుంభకోణం వెలుగుచూసింది. దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన దొడ్డా రమేష్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలు ‘న్యూస్‌లైన్’కు అందాయి. వాటిలో పేర్కొన్న ప్రకారం డివిజన్ కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న 20 మంది కార్మికులకు ఈపీఎఫ్ చెల్లించడం లేదని డివిజనల్ ఆఫీసర్ రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు 2011 నుంచి ఇప్పటి వరకు అశ్వారావుపేటకు చెందిన బి. పిచ్చయ్య అనే లేబర్ కాంట్రాక్టర్ కార్యాలయానికి కార్మికులను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. - కాంట్రాక్టు ఒప్పంద పత్రాలను అడిగినప్పటికీ కార్యాలయ అధికారులు ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. కాంట్రాక్టు నిబంధనలు, కార్మికుల పనివేళలు, వేతనాల ఒప్పందం వివరాలను బయటకు వెల్లడించటంలేదు. వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో ఈ-ప్రొక్యూర్మెంట్, ఆన్లైన్ టెండర్ విధానంలో కాంట్రాక్టుల కేటాయింపులు జరుగుతున్నా.. ఆయిల్‌ఫెడ్‌లో మాత్రం నామినేషన్ విధానంపైనే నాలుగేళ్లుగా ఒకే కాంట్రాక్టర్‌కు ఫ్యాక్టరీని కట్టబెడుతున్నారు. కాంట్రాక్టు కేటాయింపు నిబంధనలకూ నీళ్లొదిలేశారు. ఎల్ 1 (తక్కువ ధర కోడ్ చేసిన మొదటి పాధాన్యత) బిడ్డర్ అయిన డి.సుబ్బారావును మినహాయించి ఎల్ 2 (తక్కువ ధర కోడ్ చేసిన రెండో ప్రాధాన్యత) బిడ్డర్ అయిన బి. పిచ్చయ్యకే కాంట్రాక్టు కట్టబెట్టారు. ఎక్కువ ధర కోడ్ చేసిన ఎల్1 కు ఎందుకు కాంట్రాక్టు కేటాయించలేదో వెల్లడించలేదు. ప్రతి లేబర్ కాంట్రాక్టుకూ ఏడాది లేదా రెండేళ్లు పరిమితి ఉంటుంది. కానీ ఈ కాంట్రాక్టుకు మాత్రం పరిమితి లేదు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పిచ్చయ్య కాంట్రాక్టు కొనసాగుతూనే ఉంటుంది. కాంట్రాక్టర్ కేవలం సర్వీస్ టాక్స్ మాత్రమే చెల్లిస్తూ 20మంది లోపు ఉన్న కాంట్రాక్టు కార్మికులకు పీఎఫ్ చెల్లించడం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఓ బిల్లు చెల్లించిన తర్వాత మరో బిల్లు చె ల్లించే ముందు గత చెల్లింపులో ఈపీఎఫ్ చెల్లింపుల వివరాలను పరిశీలించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. కానీ ఇక్కడ అలాంటివేవీ జరగడం లేదు. అశ్వారావుపేట డివిజనల్ కార్యాలయం ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ పనిచేసిన కొందరు అవినీతి అధికారులతో కాంట్రాక్టర్ కుమారుడు మధుకు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు దక్కుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈపీఎఫ్‌లు చెల్లించకున్నా యధాతథంగా బిల్లులు డ్రా అవుతున్నాయని అంటున్నారు. ఈ విషయమై ఆయిల్‌ఫెడ్ అశ్వారావుపేట డివిజనల్ ఆఫీసర్ రమేష్‌కుమార్‌రెడ్డిని ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా.. కాంట్రాక్టర్ ఈపీఎఫ్‌లు చెల్లించినట్లు కార్యాలయానికి ఇప్పటి వరకు తెలియజేయలేదన్నారు. ఈపీఎఫ్‌కు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. -
స.హ. చట్టానికి దరఖాస్తు చేస్తే..
భీమవరం క్రైం, న్యూస్‌లైన్ : నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించడంపై అనుమానం వచ్చిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసి చిక్కుల్లో పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని రోడ్ నెంబర్-20లో ఇన్నమూరి చెంచయ్య అనే వ్యక్తి రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. మూడో అంతస్తు, దానిపైన పెంట్ హౌస్ అనుమతి లేకుండా నిర్మించాడు. ఈ విషయం తెలిసిన పట్టణానికి చెందిన జీవీ సుబ్బారావు అనే వ్యక్తి ఈ ఏడాది ఏప్రిల్ 30న సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరుతూ మునిసిపల్ అధికారులకు దరఖాస్తు చేశాడు. ఈ విషయం భవన యజమానికి లీకైంది. దీంతో అతని నుంచి దరఖాస్తుదారుడికి ఫోన్లో బెదిరింపులు ప్రారంభమయ్యాయి. అంతేకాక సుబ్బారావు బెదిరిస్తున్నాడని చెంచయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై విజయకుమార్ అత్యుత్సాహంతో స్టేషన్‌కు రావాలని సుబ్బారావుకు ఫోన్లు చేయడంతో ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో ఈనెల 21 నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో తన భర్తను చెంచయ్య, అతని అనుచరులు కిడ్నాప్ చేశారని సుబ్బారావు భార్య పద్మకుమారి వన్‌టౌన్ పోలీసులు, కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసింది. సమాచారం కోసం దరఖాస్తు చేస్తే ఇన్ని ఇబ్బందులు పడాలా అంటూ సుబ్బారావు కుటుంబ సభ్యులు విస్తుపోతున్నారు. అధికారులు, పోలీసులకు భవన యజమాని ముడుపులు చెల్లించి ఉంటాడనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారి సుబ్బారావును వివరణ కోరగా చెంచయ్య అనే వ్యక్తి అదనంగా మరొక అంతస్తును నిర్మించిన విషయం తెలిసి అతనికి నోటీసు ఇచ్చామన్నారు. -
విచారణలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
టీటీడీకి స్పష్టం చేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందా? రాదా? అనే అంశం పై సమాచార హక్కు కమిషన్(ఆర్టీఐ) చేస్తున్న విచారణను నిలిపేయడానికి హైకోర్డు నిరాకరించింది. ప్రస్తుత దశలో కమిషన్ విచారణలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో కమిషన్ ఇచ్చే ఉత్తర్వులు కోర్టు తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. తాను కోరిన సమాచారాన్ని ఇచ్చేం దుకు టీటీడీ నిరాకరించడంపై డాక్టర్ వి.రాజగోపాల్ కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ సందర్భంగా పలు రికార్డులను తమ ముందు ఉంచాలని టీటీడీని కమిషన్ ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ టీటీడీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. టీటీడీ ప్రభుత్వ సంస్థ కాదని, అందువల్ల సమచార హక్కు చట్టం పరిధిలోకి రాదని టీటీడీ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కమిషన్ చేస్తున్న విచారణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. -
ఒబామాకు ఖరీదైన అతిథి... మన్మోహన్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా... తాను విదేశీ నాయకులకిచ్చే విందుల విషయంలోనూ ఏమాత్రం తగ్గట్లేదు. అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలి ఐదుగురు అత్యంత ప్రముఖ నేతలకు ఇచ్చిన విందుల వ్యయమెంతో తెలుసా? దాదాపు రూ. 9.62 కోట్లు. అందులో సింహభాగం అంటే రూ. 3.55 కోట్లు ఖర్చుతో విందు ఇచ్చింది ఎవరికో తెలుసా? మరెవరికో కాదు భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు. సమాచార హక్కు కింద సీబీఎస్ న్యూస్ 13 నెలల క్రితం చేసిన విన్నపానికి అమెరికా విదేశాంగ ఇచ్చిన గణాంకాలే ఇందుకు సాక్షి. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదట పర్యటనకొచ్చిన విదేశీ నేత అయిన మన్మోహన్‌సింగ్‌కు 2009, నవంబర్ 24న ఘనంగా విందు ఇచ్చారు. ఇందుకైన ఖర్చు 5.72 లక్షల డాలర్లు అంటే దాదాపు 3.55 కోట్ల రూపాయలు. అంతేకాదు ఇలా ఒబామా నుంచి అత్యంత ఖరీదైన విందు పొందిన తొలి ఐదుగురు విదేశీ నేతల్లో మన్మోహనే అగ్రస్థానంలో ఉన్నారు. -
ఆంధ్రా, తెలంగాణలో చట్టాలు వేరుగా ఉన్నాయి
ముదిగొండ, న్యూస్‌లైన్: ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో చట్టాలు వేర్వేరుగా ఉన్నాయని సమాచార హక్కు చట్టం కేంద్ర కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. ‘భూమి హక్కుల చైతన్య యాత్ర’లో భాగంగా ఆదివారం ఆయన ముదిగొండ మండలం మేడేపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఈ ప్రాంతంలోని భూ సమస్యలకు సంబంధించి నూతన చట్టాలు తీసుకురావాలనే అంశంపై రైతులు, ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని అన్నారు. భూ కొనుగోలు, వారసత్వ మార్పు చేసిన తర్వాత పట్టాల్లో మార్పులు చేయడానికి రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. భూములన్నీ రీసర్వే, సెటిల్మెంట్లు చేయాలని తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నాలుగు ృందాలు పర్యటించి వివరాలు సేకరిస్తున్నారని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులు, వ్యవసాయ కూలీలతో చర్చించి అభిప్రాయాలు తీసుకుని నివేదికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పాలకులకు చెప్పేందుకు భూ సమస్యలపై యాత్రలు చేస్తున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ముంపు గ్రామాలను పంచుకుంటున్నారే తప్ప ఆ గ్రామాల గురించి ఎవరూ ఆలోచించడం లేదని అన్నారు. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో నివసిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు తమ దృష్టికి తీసుకువస్తున్నారని, రైతుల అభిప్రాయాలను తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అందజేస్తామని అన్నారు. విలేకరుల సమావేశంలో గ్రామీణాభివృద్ధి సంస్థ దేశ డెరైక్టర్ గ్రేగర్, రాష్ట్ర డెరైక్టర్ ఎం. సునీల్‌కుమార్, రీసెర్చ్ మేనేజర్ సంతోష్, ప్రతినిధులు రవీందర్, రమేష్, ప్రభాకర్, మేడేపల్లి సర్పంచ్ కొత్తపల్లి నాగలక్ష్మి, రైతులు సామినేని ిహ మవంతరావు, పయ్యావుల లింగయ్య, పోటు ప్రసాద్ పాల్గొన్నారు. -
వైష్ణోదేవికి ‘నకిలీ’ కానుకలు
జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లోని ప్రసిద్ధ వైష్ణో దేవీ ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల్లో 43 కేజీల బంగారం.. 57 వేల కిలోల వెండి నకిలీవేనట. సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా ఈ విషయం వెల్లడైంది. గత ఐదేళ్లలో వైష్ణోదేవికి 193.5 కేజీల బంగారం.. 81,635 కిలోల వెండిని భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. ఇందులో 43 కేజీల బంగారం.. 57,815 కిలోల వెండి నకిలీవని తేలిందని ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎంకే భండారి చెప్పారు. -
జీతమెంతో భార్యకు చెప్పాల్సిందే
న్యూఢిల్లీ: ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి జీతభత్యాల వివరాలను అతడి భార్య కోరితే వెల్లడించాల్సిందేనని కేంద్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది. అంతేకాదు.. సమాచారహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులందరి జీతభత్యాల వివరాలను సంబంధిత కార్యాలయాలు బహిర్గతం చేయాల్సిందేనని పేర్కొంది. ఢిల్లీ హోంశాఖలో పనిచేసే ఓ అధికారి భార్య తన భర్త వేతన ధ్రువపత్రాన్ని ఇవ్వాల్సిందిగా కోరగా.. అధికారులు తిరస్కరించారు. దాంతో ఆమె సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్.. ‘‘దంపతుల్లో ఎవరికైనా మరొకరి జీతభత్యాల వివరాలు తెలుసుకొనే హక్కు ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగి వేతన వివరాలను అతడి భార్య అడిగితే అందజేయాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగుల వేతన వివరాలను వారి వ్యక్తిగత సమాచారంగా పేర్కొనలేం’’ అని స్పష్టం చేశారు. -
టీటీడీ ఆర్టీఐ పరిధిలోకి వస్తుంది: మాడభూషి శ్రీధర్
హైదరాబాద్, న్యూస్‌లైన్: తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ చెప్పారు. టీటీడీ ప్రజల ధనంతోనే నడుస్తుంది కాబట్టి ప్రభుత్వ పరిధిలోకే వస్తుందన్నారు. ఆర్టీఐ రాకముందే టీటీడీలో అవకతవకలపై తాను ఒక పత్రికలో పనిచేస్తున్నప్పుడు వార్తలు రాయగా, అధికారులు కేసులు వేశారన్నారు. కోర్టు ద్వారా టీటీడీలోని పత్రాలను తీసుకొని అవకతవకలను నిరూపిం చినట్లు తెలిపారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో వెటరన్ జర్నలిస్టు అసోసియేషన్, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ‘సింపోసియం ఆన్ ఆర్టీఐ యాక్ట్ అండ్ జర్నలిస్ట్స్’ అంశంపై సదస్సు నిర్వహించారు. దీనికి మాడభూషి, రాష్ట్ర సమాచార కమిషనర్ విజయబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాడభూషి మాట్లాడుతూ ఆర్టీఐ అమలులో మీడియా పాత్రే కీలకమన్నారు. సమావేశంలో వెటరన్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు వరదాచారి, భండారి శ్రీని వాస్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
'ఆర్టీఐ చట్టం కింద పత్రాల కోసం 1.34 కోట్ల డిమాండ్'
సమాచార హక్కు చట్టం ద్వారా ఏ డాక్యుమెంట్ ను పొందాలంటే 10 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అయితే బీహార్ లో మాత్రం ఆర్టీఐ కార్యకర్త శివ్ ప్రకాశ్ రాయ్ కి మాత్రం ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అధికారులు దిమ్మతిరిగేలా షాకిచ్చారు. ఓ వ్యవసాయ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను కోరిన ఓ వ్యక్తికి 1.34 కోట్లను చెల్లించాలని అధికారులు తెలిపారు. వ్యవసాయ భూమిని కమర్షియల్ కేటగిరికి మార్పు చేసిన పత్రాలను ఇవ్వాలని బీహార్ లోని బెగుసరాయ్ జిల్లా రిజిస్త్రేషన్ అధికారులను కోరారు. అయితే తాము కోరిన మొత్తాన్ని చెల్లిస్తే భూమికి సంబంధించిన పత్రాలను ఇస్తామని అధికారులు చెప్పడంతో అవాక్కయ్యారు. సాధారణంగా 10 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని.. కోట్ల రూపాయలను చెల్లించాలని కోరడం సమాచార చట్టం నిబంధనలను ఉల్లంఘించడమే అని శివ్ ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విదేశాల్లోని భారతీయులకూ ఆర్టీఐ
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉంటున్న భారతీయులు కూడా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇందుకు వీలుగా ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీఐ చట్టం కింద విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఈఎల్పీఓ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించవచ్చు. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. -
పోలీసులూ మారండి..
దరఖాస్తుదారులకు స్వేచ్ఛ కల్పించాలి స్టేషన్‌కు రావాలంటే భయపడుతున్నారు సహ చట్టం కమిషనర్ తాంతియా కుమారి కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా పోలీసు శాఖలో ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తోందని సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియా కుమారి అన్నారు. చాలా పోలీసుస్టేషన్లకు దరఖాస్తులు రాలేదని చెప్పడాన్ని పరిశీలిస్తే ప్రజలు పోలీసుల వద్దకు రావడానికి భయపడుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. శనివారం కలెక్టరేట్లోని ప్రగతిభవన్ హాలులో వివిధ శాఖల్లో సహ చట్టం అమలు తీరుపై కమిషనర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల రీత్యా పోలీస్‌శాఖను తప్పు పట్టనప్పటికీ ఇతర శాఖల మాదిరిగానే సహచట్టం దరఖాస్తుదారులు నిర్భయంగా పొలీస్‌స్టేషన్‌కు వచ్చి దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన వాతావరణం కల్పించాలన్నారు. జిల్లాలోని గాంధారిలో సమాచారమడిగినందుకు దాడులకు పాల్పడిన వారిపై ఇంతవరకు చర్యలెందుకు తీసుకోలేదని కమిషనర్ ప్రశ్నించారు. సహచట్టం దరఖాస్తుదారులను రక్షించాల్సిన గురుతర బాధ్యత పోలీసు శాఖపై ఉందన్నారు. ఈ చట్టాన్ని ఉపయోగించి ప్రజలు కలెక్టర్ వద్దకు కూడ వెళ్ల గలుగుతున్నారన్నారు. దరఖాస్తులకు సంబంధించి రిజి ష్టర్ల నమోదు లేనందున నిజాంసాగర్ తహశీల్దార్‌కు మెమో జారీ చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కువ భాగం రెవెన్యూ శాఖకు సంబంధించి ఉన్నందున ఈ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు సహచట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజానికి వెన్నుముక లాంటి విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఉందన్నారు.ఈ చట్టాన్ని కళాశాలల్లో అమలు చేయడమేకాకుండా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.పేదలకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించడానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సమీక్షలో ఏజెసీ శేషాద్రి,డీఆర్వో జయరామయ్య, పీఓ శ్రీనివాస్‌చారి,అదనపు ఎస్పీ సుదర్శన్‌రెడ్డి,ఆర్డీఓలు వెంకటేశ్వర్లు,మోహన్‌రెడ్డి,శివలింగయ్య,డీఎస్పీలు గౌసుద్దీన్, సురేందర్‌రెడ్డి,రాంరెడ్డి,అనిల్‌కుమార్,సీఐలు,ఎస్సైలు పాల్గొన్నారు. బందోబస్తు మధ్య ‘తాంతియా’ సమీక్ష తాంతియా కుమారి సమీక్ష సమావేశం భారీ బందోబస్తు మధ్య జరిగింది. ఉదయం నుంచే ప్రగతి భవన్ వద్ద పో లీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. సమీక్షలను కమి షనర్ ఉదయం, మధ్యాహ్నం త్వరగా ముగించారు. -
పార్టీలు ‘సమాచార హక్కు’లో ఉండాల్సిందే: ప్రజాసంఘాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజాహితం కోసమే రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెస్తూ కేంద్ర సమాచార కమిషన్ తీర్పు ఇచ్చిందని, అయితే అది అమలు కాకుండా చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం సరికాదని ప్రజాసంఘాలు మండిపడ్డాయి. ‘‘కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలుంటే రాజకీయపార్టీలు న్యాయస్థానంలో సవాల్ చేసుకోవచ్చు. అయినా పార్టీలు సవరణకు వీలుగా చర్యలకు సిద్ధం కావడం అనుమానాలకు తావిస్తోంది. మిగతా పార్టీలకు భిన్నమని పేర్కొనే వామపక్షాలు కూడా సవరణ బిల్లును వ్యతిరేకించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది’’ అని పేర్కొన్నాయి. మంగళవారమిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘యునెటైడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్, ‘అసోసియేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ సోషల్ యాక్షన్’ సంస్థలు జస్టిస్ లక్ష్మణరావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాయి. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సదస్సులో.. చట్ట సవరణను ప్రజాసంఘాలన్నీ వ్యతిరేకించగా, సీపీఐ నేత నారాయణ, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు వెంకటేశ్వరరావులు మాత్రం స్వాగతించారు.