సాక్షి, హైదరాబాద్: ప్రజాహితం కోసమే రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెస్తూ కేంద్ర సమాచార కమిషన్ తీర్పు ఇచ్చిందని, అయితే అది అమలు కాకుండా చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం సరికాదని ప్రజాసంఘాలు మండిపడ్డాయి. ‘‘కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలుంటే రాజకీయపార్టీలు న్యాయస్థానంలో సవాల్ చేసుకోవచ్చు. అయినా పార్టీలు సవరణకు వీలుగా చర్యలకు సిద్ధం కావడం అనుమానాలకు తావిస్తోంది. మిగతా పార్టీలకు భిన్నమని పేర్కొనే వామపక్షాలు కూడా సవరణ బిల్లును వ్యతిరేకించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది’’ అని పేర్కొన్నాయి. మంగళవారమిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘యునెటైడ్ ఫోరం ఫర్ ఆర్‌టీఐ క్యాంపెయిన్, ‘అసోసియేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ సోషల్ యాక్షన్’ సంస్థలు జస్టిస్ లక్ష్మణరావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాయి. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సదస్సులో.. చట్ట సవరణను ప్రజాసంఘాలన్నీ వ్యతిరేకించగా, సీపీఐ నేత నారాయణ, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు వెంకటేశ్వరరావులు మాత్రం స్వాగతించారు.