పార్టీలు ఆర్టీఐలోకి రావు!
సుప్రీం కోర్టుకు కేంద్రం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురాకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పార్టీలను ఆర్టీఐ చట్ట పరిధిలోకి తీసుకురావడం వల్ల వాటి సంస్థాగత పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అలాగే, రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ఉద్దేశాలతో సమాచారం కోరుతూ దరఖాస్తులు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టుకు కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం(డీఓపీటీ) ఒక అఫిడవిట్ సమర్పించింది.
అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలను పబ్లిక్ అథారిటీలుగా ప్రకటించి, వాటిని ఆర్టీఐ చట్ట పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పంపిన నోటీసులకు కేంద్రం పై విధంగా స్పందించింది. ఆర్టీఐ చట్టాన్ని రూపొందించిన సమయంలో.. రాజకీయ పార్టీలను దాని పరిధిలోకి తీసుకురావాలనే అంశం పార్లమెంటు పరిగణనలోకి తీసుకోలేదని కేంద్రం ఆ అఫిడవిట్‌లో పేర్కొంది.
పార్టీల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత తీసుకువచ్చేందుకు అవసరమైన నిబంధనలు ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఆదాయ పన్ను చట్టాల్లో ఉన్నాయని వివరించింది. ఆర్టీఐ చట్టంలోని 2(హెచ్) సెక్షన్ ప్రకారం రాజకీయ పార్టీలు పబ్లిక్ అథారిటీల కిందకు వస్తాయని, అందువల్ల అవి ఆర్టీఐ చట్ట పరిధిలోకి వస్తాయంటూ కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) 2013లో ఇచ్చిన తీర్పును కేంద్రం తప్పుబట్టింది. ఆ సెక్షన్‌ను సీఐసీ తప్పుగా అన్వయించిందని పేర్కొంది.
‘పబ్లిక్ అథారిటీ’ నిర్వచనం నుంచి రాజకీయ పార్టీలకు మినహాయింపునిచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును గత ప్రభుత్వ హయాంలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేసింది. అయితే, ఆ బిల్లు ఆమోదం పొందకముందే ఆ లోక్‌సభ రద్దైయిందని వివరించింది. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు ఆర్టీఐ పరిధిలోకి తేవాలని, ఆ పార్టీలకు వచ్చే అన్ని విరాళాల(రూ. 20 వేల లోపు విరాళాలు సహా) వివరాలను వెల్లడించాలని కోరుతూ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 7న సుప్రీంకోర్టు విచారణ జరిపి, స్పందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, ఆరు ప్రముఖ రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేసింది.