ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉండేవారు వివాదాస్పదులవుతారో, లేక అలాంటివారినే ఆ పదవికిఎంపిక చేస్తారో గానీ మరోసారి అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా వార్తల్లోకెక్కారు. ఈసారి ముఖ్యమంత్రితో వచ్చిన జగడం వల్లకాక సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ వల్ల ఆయన పేరు మార్మోగింది. ఢిల్లీ మహానగరంలో రోడ్ల వెడల్పు కోసం 1,100 వృక్షాలు నేల కూల్చడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌కు జవాబిస్తూ సక్సేనా వింత వాదన చేశారు. కేంద్ర సాయుధ పోలీసు దళాల కోసం కేంద్రం నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాల సముదాయానికి వున్న అప్రోచ్ రోడ్డును వెడల్పు చేయటం కోసం రిట్జ్ ప్రాంతంలో చెట్లను కూల్చారు.
రూ. 2,200 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రగతి ఎలావుందో పరిశీలించటానికి గత ఫిబ్రవరిలో వెళ్లిన ప్పుడు అక్కడున్న అధికారులెవరూ చెట్ల కూల్చివేతలకు అనుమతి అవసరమని తనతో చెప్ప లేదన్నది ఆయన వాదన. 1994లో తీసుకొచ్చిన ఢిల్లీ వృక్ష సంరక్షణ చట్టం (డీపీటీఏ) కింద అటవీ విభాగం కేంద్ర పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకుందనీ, ఢిల్లీ సీఎం, తానూ కూడా అందుకు అంగీకరించామనీ సక్సేనా వివరించారు. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకోనట్టయితే కోర్టు ధిక్కారమవుతుందని తనకు తెలియదని ఆయన చెబుతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నవారికి అన్నీ తెలియాలని లేదు. నిజమే. కానీ తెలుసుకోవటం, తెలియజెప్పటం రివాజుగా సాగిపోవాలి.
ఢిల్లీ సీఎం ఏదైనా నిర్ణయం తీసుకోగానే ఫలానా నిబంధన ప్రకారం ఇది చెల్లదని బుట్టదాఖలు చేయటం అలవాటైనవారికీ, అన్ని చట్టాలూ శోధించి ఆధిక్యతను చాటుకునేవారికీ నిబంధనలు తెలియలేదంటే ఎవరైనా నవ్విపోరా? చెట్లు కూల్చడం ఫిబ్రవరి 16న మొదలైతే, జూన్ 10న ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) వైస్ చైర్మన్ చెప్పేవరకూ తెలియదనటం ఆశ్చర్యకరం. గురువారం సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సూటిగా ప్రశ్నించింది. ఏప్రిల్ 10నే లెఫ్టినెంట్ గవర్నర్‌కు చెప్పినట్టు రికార్డులు చూస్తే వెల్లడవుతోందని ధర్మాసనం తెలిపింది.
పోనీ తెలియదనే అనుకుందాం... చట్ట నిబంధన తెలియక పొరపాటు చేశానని పౌరుడె వరైనా అంటే చెల్లుతుందా? అధికారులు నిబంధనలను సరిగా అర్థం చేసుకోకపోవటంవల్ల పొర పాటు జరిగిందని, ఇది ప్రజా ప్రయోజనం కోసం చిత్తశుద్ధితో చేసిన పని అని లెఫ్టినెంట్ గవర్నర్ అఫిడవిట్ చెప్పటమూ సరికాదు. సక్సేనా కార్పొరేట్ రంగంలో, వివిధ సామాజిక రంగాల్లో విశేషానుభవం కలవారని అంటారు. ఒక కార్పొరేట్ రంగానికి చెందిన వ్యక్తిని లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించటం ఇదే ప్రథమం. అలాంటి వ్యక్తి సైతం నిబంధన ఉల్లంఘిస్తే ఎలా?
అసలు ఆ రోడ్ల వెడల్పు ప్రాజెక్టు వెనక మరింత వివాదం ఉన్నదని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆగస్టు 2022లో డీడీఏ ఆమోదించిన ప్లాన్‌కూ, అనంతర కాలంలో సవరించిన ప్లాన్‌కూ మధ్య ఎన్నో వ్యత్యాసాలున్నాయని ఆ కథనాలు వివరిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఉండే ఫార్మ్ హౌస్‌లకూ, శ్రీ జ్ఞానానంద ఆశ్రమం, ఇతర ప్రైవేటు ఆస్తులకూ నష్టం కలుగుతున్నదన్న కారణంతోనే ముందనుకున్న ప్లాన్ కాస్తా సవరించారన్నది అభియోగం. పర్యవసానంగా అక్కడి అటవీ భూముల్లోని చెట్లు కూల్చేయాల్సి వచ్చిందని ఆ కథనాలు చెబుతున్నాయి. ముందు రూపొందిన మ్యాప్ ప్రకారం రోడ్లు వెడల్పు చేస్తే 50 చెట్లకు మించి నష్టం ఉండేది కాదని లెక్కేస్తున్నారు.
పైగా మార్చిన ప్లాన్ వల్ల సాధారణ పౌరుల నివాస గృహాలకు నష్టం జరిగిందని మీడియా కథనాలు వివరిస్తున్నాయి. అంటే నోరూ వాయీ లేని వారికి ఎంత నష్టం కలిగినా ఫర్వాలేదు... సంపన్నులకు మాత్రం తేడా రావొద్దన్నది అధికారుల ఉద్దేశం. ఈ విషయంలో గోశాల రోడ్‌కు చెందిన పౌరుడు నీరజ్ కుమార్... ప్రధాని మొదలుకొని లెఫ్టినెంట్ గవర్నర్ వరకూ ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. దాంతో సుప్రీంకోర్టు ముందు దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌లో తాను కూడా కక్షిదారుగా ఉండదల్చుకున్నట్టు దరఖాస్తు చేసుకున్నాడు.
లెఫ్టినెంట్ గవర్నర్ ఆ ప్రాంతాన్ని సందర్శించటానికి సంబంధించిన రికార్డు ఉందో లేదో తెలియదని, అందుకు వ్యవధి కావాలని కూడా డీడీఏ సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ ఇంత చిన్న సమాచారం కోసం ఎన్నాళ్లు వెదుకుతారని ధర్మాసనం గట్టిగా ప్రశ్నించటంతో, అక్షింతలేయటంతో లెఫ్టినెంట్ జనరల్ జవాబివ్వటం తప్పని సరైంది.
కింది స్థాయిలో జరిగిన లాలూచీలు సక్సేనాకు తెలియలేదనుకున్నా ఫిర్యాదు వచ్చినప్పుడైనా ఆరా తీయలేదంటే ఏమనుకోవాలి? దేశంలో అభివృద్ధి పేరుతో జరిగేదంతా ఇలాగే ఉంటున్నది.సంపన్నుల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే అధికారులు పేదలకు నిలువ నీడ లేకుండా పోతున్న దన్న స్పృహ లేకుండా వ్యవహరిస్తుంటారు. ప్రశ్నించినవారిపై కేసులు బనాయించటం, జైళ్లలో పెట్టడం సర్వసాధారణమైంది. ఇప్పుడు డీడీఏ నిర్వాకం కారణంగా భారీయెత్తున చెట్లు కూలి పోవటం మాత్రమే కాదు... 43 ఏళ్లుగా ఆ ప్రాంతంలో చిన్నా చితకా ఇళ్లలో నివసిస్తున్నవారిని నిర్దాక్షి ణ్యంగా ఖాళీ చేయించారు.
దేశంలోని కీలక వ్యవస్థలన్నీ కొలువుదీరిన చోటే ఇంతగా నియమోల్లంఘనలు చోటుచేసుకుంటే ఏ ఛత్తీస్‌గఢ్ అడవుల్లోనో, ఇతర మారుమూల ప్రాంతాల్లోనో సక్రమంగా జరుగుతున్నాయని ఎలా అనుకోగలం? ఇలాంటి దురన్యాయాలుంటే తిరుగుబాట్లు రావా? సమస్య మూలాలు వదిలి పరిష్కారాలు వెదికే తెలివితక్కువతనం మరిన్ని సమస్యలకు దారితీయటం లేదా? ప్రభుత్వాలు ఆలోచించాలి. తామే చట్టాలు ఉల్లంఘిస్తే, మానవీయతను మరిస్తే సామాన్య పౌరు లను చట్టబద్ధంగా నడుచుకొమ్మని చెప్పే నైతికార్హత ఉంటుందా?
Comments
Please login to add a commentAdd a comment