న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రిడ్జ్ ప్రాంతంలోని చెట్లను నరికివేయడానికి కోర్టు అనుమతి అవసరమని తనకు తెలియదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో గవర్నర్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపై నేడు(బుధవారం) సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
గవర్నర్ వీకే సక్సేనా.. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు. రిడ్జ్ ప్రాంతంలో దాదాపు 600 చెట్లను నరికేయడంపై ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన న్యాయస్థానం.. అక్రమంగా 600 చెట్లను నేల కూల్చడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారోవివరిస్తూవ్యక్తిగత అఫిడవిట్ ద్వారా తెలియజేయాలని ఎల్జీని ఆదేశించింది. ఈ క్రమంలోనే తాయన తాజాగా ప్రమాణపత్రం సమర్పించారు.
ఇందులో తాను రిడ్జి ప్రాంతంలో మెడికల్ ఫెసిలిటీ నిర్మించాలనుకున్న ప్రదేశాన్ని ఫిబ్రవరి 3వ తేదీన సందర్శించినట్లు ఎల్జీ పేర్కొన్నారు. ఆ సమయంలో ఆ నిర్మాణ అవసరం, ప్రాధాన్యం, దానికి కేటాయించిన వనరుల అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొన్నట్లు తెలిపారు. తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు విస్తరణ జరుగుతున్న స్థలంలో ఆగినట్లు తెలిపారు. నాడు కోర్టు అనుమతి లేకుండా చెట్లను నరికివేయకూడదనే అంశాన్ని ఎవరూ తన దృష్టికి తీసుకురాలేదని పేర్కొన్నారు.
అయితే.. ప్రాజెక్టు కోసం చెట్ల నరికివేతకు అనుమతి కోరుతూ డీడీఏ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత మాత్రమే మార్చి 21న ఆ విషయం తనకు తెలిసినట్లు ఎల్జీ చెప్పారు.. చెట్లను నరికివేయడానికి కాంట్రాక్టర్‌లకు డీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మనోజ్ కుమార్ యాదవ్, డీడీఏ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పవన్ కుమార్, ఆయుష్ సరస్వత్‌లు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. వీరే నరికివేతకు అనుమతించారని తెలిపారు.పంకజ్ వర్మ, సూపరింటెండింగ్ ఇంజనీర్ యాదవ్‌లను కోర్టు నుండి వాస్తవాలను దాచేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.
చెట్లను నరికివేయడంపై కొందరు డీడీఏ, ఢిల్లీ ప్రభుత్వ అధికారులపై దాఖలైన ధిక్కార కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. చైర్‌పర్సన్ అంగీకరిస్తే, చెట్ల నరికివేతకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తప్పవని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment