Delhi Mayor Polls: Big Relief To AAP No Vote For Nominated Members - Sakshi
Sakshi News home page

ఢిల్లీ మేయర్‌ ఎన్నిక.. సుప్రీంలో ఆప్‌కు భారీ విజయం

Published Fri, Feb 17 2023 4:51 PM | Last Updated on Fri, Feb 17 2023 6:05 PM

Delhi Mayor Polls: Big Relief To AAP No Vote For Nominated Membs - Sakshi

సాక్షి, ఢిల్లీ:  ఎన్నికల్లో గెలిచి కూడా మేయర్‌ ఎన్నికకు ఆటంకాలు ఎదుర్కొంటున్న తరుణంలో.. ఆమ్‌ఆద్మీ పార్టీకి భారీ విజయం దక్కింది. నామినేటెడ్‌ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనడానికి వీల్లేదని సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా నామినేట్‌ చేసిన పది మంది కౌన్సిలర్లను.. మేయర్‌ కోసం జరిగే ఓటింగ్‌కు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సత్య శర్మ(బీజేపీ) అనుమతించారు. ఈ తరుణంలో వాళ్లంతా బీజేపీకే ఓటేస్తారని, సత్యశర్మ బీజేపీ గనుక సొంత పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆప్‌ మొదటి నుంచి వాదిస్తోంది. పైగా  ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(డీఎంసీ) యాక్ట్‌ 1957 ప్రకారం.. నామినేటెడ్‌ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు అర్హత లేదని గుర్తు చేసింది.

ఈ తరుణంలో మూడుసార్లు మేయర్‌ ఎన్నిక వాయిదా పడగా.. ఆప్‌ సుప్రీంను ఆశ్రయించింది. ఆప్‌ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు.. నామినేటెడ్‌ సభ్యులకు ఓటింగ్‌లో పాల్గొనే అర్హత లేదని స్పష్టం చేసింది. అంతేకాదు 24 గంటల్లో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికపై నోటిఫికేషన్‌ ఇవ్వాలని.. ఎన్నిక నిర్వహణ తేదీని కూడా స్పష్టంగా ప్రకటించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.  దీంతో ఢిల్లీ మేయర్‌ ఎన్నికపై ప్రతిష్టంభన తొలిగిపోయే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సుప్రీం తీర్పుపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. జనవరి 6, జనవరి 24వ తేదీల్లో, ఫిబ్రవరి 6వ తేదీల్లో సభ్యుల ఆందోళన వల్ల నెలకొన్న గందరగోళం నేపథ్యంలో మూడుసార్లు మేయర్‌ ఎన్నిక వాయిదా పడింది.

ఢిల్లీ చరిత్రలోనే మేయర్‌ ఎన్నిక ఆలస్యం కావడం ఇదే తొలిసారి. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక.. ఫలితాలు వెలువడిన నెలలోపే అదీ తొలి సెషన్‌లోనే జరిగిపోవాలి. అది జరుగుతూ వస్తోంది కూడా. కానీ, ఈసారి ఆ ఆనవాయితీకి బ్రేక్‌ పడినట్లయ్యింది. ఫలితాలు వెలువడి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా మేయర్‌ ఎన్నికపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

ఢిల్లీ మేయర్‌ను ఎన్నికల్లో నెగ్గిన మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఢిల్లీ పరిధిలోని ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, వీళ్లతో పాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ నామినేట్‌ చేసే 14 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement