న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ మహేశ్ కుమార్ ఖించి కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి కిషన్‌లాల్‌పై స్వల్ప ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. కరోల్‌బాగ్‌లోని దేవ్‌నగర్ కౌన్సిలర్‌గా ఉన్న మహేశ్ ఖించికి 133 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 130 ఓట్లు వచ్చాయి. కేవలం మూడు ఓట్ల తేడాతో ఆప్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.
కాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక గురువారం ఉత్కంఠగా సాగింది. కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు సభ్యలు వాకౌట్ చేయడంతో ఆప్-బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. మొత్తంగా 265 ఓట్లు పోలవ్వగా.. రెండు ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు.
బీజేపీకి 120 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉండగా.. మరో 10 ఓట్లు సాధించగలిగింది. దీంతో ఆప్ నుంచి కొందరు కార్పొరేటర్లు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ బీజేకి చెందిన కిషన్‌లాల్‌పై ఆప్ కౌన్సిలర్ మహేష్ ఖించి గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, ఎన్‌డీ గుప్తా, బీజేపీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఓటు వేశారు. అయితే ఖించి కేవలం 5 నెలల మాత్రమే మేయర్ పీఠంపై కొనసాగనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఆప్, బీజేపీ మధ్య పోరుతో పదే పదే వాయిదా పడటమే ఇందుకు కారణం.
Comments
Please login to add a commentAdd a comment