న్యూఢిల్లీ: ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్‌పర్సన్ నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ విఫలమయ్యారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం, ఎల్జీ ఏకాభిప్రాయంతో డీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా ఒకరి పేరును సూచించలేరా? అని ప్రశ్నించింది. సంస్థను ఎవరూ పట్టించుకోకపోవడం విచారణకరమని పేర్కొంటూ.. చైర్మన్‌ను తామే ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది.
ఢిల్లీ పాలనాధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తోపాటు డీఈఆర్‌సీ చైర్మన్ ఎంపికపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పీఎస్ నరసింహా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీ గవర్నర్ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదిస్తూ.. డీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌ను రాష్ట్రపతి నియమించారని తెలిపారు.
ఢిల్లీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ అభిషేక్ మను సంఘ్వీ మాట్లాడుతూ.. డీఈఆర్‌సీ చైర్మన్ నియామకం కేంద్ర ఆర్డినెన్స్ ప్రకారం జారీ చేశారని, దీనిని ఢిల్లీ ప్రభుత్వం కోర్టులో సవాలు చేసిందని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. ఆర్డినెన్స్ విచారణ రాజ్యాంగ ధర్మాసానానికి వెళుతుందని తెలిపింది. ఈ ప్రక్రియకు రెండు, మూడు నెలలు పడుతుందని అప్పటి వరకు డీఈఆర్‌సీ పని చేయకుండా ఉంటుందా? అని ప్రశ్నించింది.
అయితే డీఈఆర్‌సీ సంస్థ అధిపతి లేకుండా ఉండలేదని, సుప్రీంకోర్టే దీనికి చైర్‌పర్సన్‌ను నియమించవచ్చని హరీష్ సాల్వే సూచించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. డీసీఆర్‌సీ చైర్మన్ ఎంపికపై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇందుకు కొంత సమయం వేచి ఉండాలని ఇరు వర్గాలకు చెందిన లాయర్లకు సూచించింది.
తాత్కాలిక ప్రాతిపదికన కొంతకాలంపాటు మాజీ న్యాయమూర్తిని నియమించడానికి కొంతమంది న్యాయమూర్తులను పేర్లను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతానికి తమ వద్ద ఎలాంటి జాబితా లేదని, ముగ్గురు లేదా అయిదుగురు ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తుల పేర్లను అందించాలని.. వారిలో నుంచి ఒకరిని తామే నియమిస్తామని పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా ఆర్డినెన్స్‌పై ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి పదవుల్లో నియామకాలు ఆగిపోవడంతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ రాజకీయాలను పక్కనబెట్టి కూర్చొని మాట్లాడుకోవాలని సుప్రీంకోర్టు జూలై 17న సూచించింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తరఫు న్యాయవాది అందుకు సరేనన్నారు. ఢిల్లీ ప్రభుత్వం స్పందించలేదు.
చదవండి: చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్రానికి ప్రశ్నల వర్షం
రాజ్యాంగ ధర్మాసనానికి ఆర్డినెన్స్
ఢిల్లీలో పాలనాధికారాలపై నియంత్రణ కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఇంతకుముందుకు విచారణ జరిపిన రెండు రాజ్యాంగ బెంచ్‌లు పరిశీలించని న్యాయపరమైన అంశాలు ఈ పిటిషన్‌లో ఉన్నాయని.. అందుకే దీనిని విస్తృత ధర్మాసనానికి బదిలీచేస్తున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment