delhi govern ment
-
ఢిల్లీ ప్రభుత్వం, గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు విచారం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్పర్సన్ నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ విఫలమయ్యారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం, ఎల్జీ ఏకాభిప్రాయంతో డీఈఆర్సీ చైర్‌పర్సన్‌గా ఒకరి పేరును సూచించలేరా? అని ప్రశ్నించింది. సంస్థను ఎవరూ పట్టించుకోకపోవడం విచారణకరమని పేర్కొంటూ.. చైర్మన్‌ను తామే ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. ఢిల్లీ పాలనాధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తోపాటు డీఈఆర్సీ చైర్మన్ ఎంపికపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పీఎస్ నరసింహా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీ గవర్నర్ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదిస్తూ.. డీఈఆర్సీ చైర్‌పర్సన్‌ను రాష్ట్రపతి నియమించారని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ అభిషేక్ మను సంఘ్వీ మాట్లాడుతూ.. డీఈఆర్సీ చైర్మన్ నియామకం కేంద్ర ఆర్డినెన్స్ ప్రకారం జారీ చేశారని, దీనిని ఢిల్లీ ప్రభుత్వం కోర్టులో సవాలు చేసిందని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. ఆర్డినెన్స్ విచారణ రాజ్యాంగ ధర్మాసానానికి వెళుతుందని తెలిపింది. ఈ ప్రక్రియకు రెండు, మూడు నెలలు పడుతుందని అప్పటి వరకు డీఈఆర్సీ పని చేయకుండా ఉంటుందా? అని ప్రశ్నించింది. అయితే డీఈఆర్సీ సంస్థ అధిపతి లేకుండా ఉండలేదని, సుప్రీంకోర్టే దీనికి చైర్‌పర్సన్‌ను నియమించవచ్చని హరీష్ సాల్వే సూచించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. డీసీఆర్సీ చైర్మన్ ఎంపికపై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇందుకు కొంత సమయం వేచి ఉండాలని ఇరు వర్గాలకు చెందిన లాయర్లకు సూచించింది. తాత్కాలిక ప్రాతిపదికన కొంతకాలంపాటు మాజీ న్యాయమూర్తిని నియమించడానికి కొంతమంది న్యాయమూర్తులను పేర్లను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతానికి తమ వద్ద ఎలాంటి జాబితా లేదని, ముగ్గురు లేదా అయిదుగురు ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తుల పేర్లను అందించాలని.. వారిలో నుంచి ఒకరిని తామే నియమిస్తామని పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఆర్డినెన్స్‌పై ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి పదవుల్లో నియామకాలు ఆగిపోవడంతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ రాజకీయాలను పక్కనబెట్టి కూర్చొని మాట్లాడుకోవాలని సుప్రీంకోర్టు జూలై 17న సూచించింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తరఫు న్యాయవాది అందుకు సరేనన్నారు. ఢిల్లీ ప్రభుత్వం స్పందించలేదు. చదవండి: చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్రానికి ప్రశ్నల వర్షం రాజ్యాంగ ధర్మాసనానికి ఆర్డినెన్స్ ఢిల్లీలో పాలనాధికారాలపై నియంత్రణ కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఇంతకుముందుకు విచారణ జరిపిన రెండు రాజ్యాంగ బెంచ్‌లు పరిశీలించని న్యాయపరమైన అంశాలు ఈ పిటిషన్లో ఉన్నాయని.. అందుకే దీనిని విస్తృత ధర్మాసనానికి బదిలీచేస్తున్నట్టు తెలిపింది. -
బ్రిటిష్ వైశ్రాయ్‌లా చేయకండి.. ఎల్జీ సక్సేనాపై కేజ్రీవాల్ ఫైర్
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది. తమ ప్రభుత్వ కార్యకలాపాలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అడ్డుపడుతున్నారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనాను బ్రిటిష్ వైస్రాయ్‌తో పోల్చారు కేజ్రీవాల్. దీంతో, బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే, రెండు రోజులుగా ఢిల్లీ అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎల్జీ సక్సేనా.. టీచర్ల శిక్షణకు సంబంధించిన ఫైనల్ తాము పంపితే తిరస్కరించారని అన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలకు ఎల్జీ పడుతున్నాడని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల టీచర్లను శిక్షణ కోసం ఫిన్లాండ్కు పంపించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ ఎల్జీ అందుకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో రెండు కోట్ల జనాభా ఉన్నదని, వారిలో లక్షల మంది చిన్నారులు ఉన్నారు. వారికి మంచి విద్యను అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఎల్జీ అడ్డుపడాల్సిన అవసరం ఏమున్నదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. టీచర్లకు ఫిన్లాండ్లో శిక్షణకు సంబంధించిన ఫైల్‌ను ఎల్జీ దగ్గరకు పంపిస్తే ఆయన తిరస్కరించారని సభకు చెప్పారు. ఇదే సమయంలో బ్రిటిష్ పాలకుల నియంతృత్వానికి వ్యతిరేకంగానే ఆనాడు దేశ ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాడాల్సి వచ్చింది. ప్రస్తుతం తాము కూడా ఎల్జీ పోరాటం చేస్తున్నామని అన్నారు. సక్సేనా.. బ్రిటిష్ వైస్రాయ్‌లా వ్యవహరించవద్దని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎల్జీకి మా నెత్తిన కూర్చునే అధికారం లేదని మండిపడ్డారు. తన వల్లే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి 104 సీట్లు వచ్చాయని చెబుతున్నారని అన్నారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని కేజ్రీవాల్ హితవు పలికారు. -
ఎన్నికల హింసపై వివరాలన్నీ కావాలి
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని సీబీఐ అడిగింది. అందులో హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలకు సంబంధించి నమోదైన కేసుల వివరాలన్నింటి ఇవ్వాలంటూ ఒక లేఖ రాసింది. ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై దర్యాప్తును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణకు సన్నద్ధమైంది. ఇందు కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. జాయింట్ డైరెక్టర్లు రమణీష్, అనురాగ్, వినీత్ వినాయక్, సంపత్ మీనా ఆధ్వర్యంలోని బృందాలు దీనిపై విచారణ చేపట్టనున్నారు. ఒక్కో బృందంలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి అధికారుల్ని తెచ్చి ఈ బృందాల్లో నియమించింది. సీబీఐ అదనపు డైరెక్టర్ అజయ్ భట్నాగర్ ఈ విచారణను పర్యవేక్షిస్తారు. -
అక్కడ రెస్టారెంట్లకు ఓకే.. లిక్కర్‌కి నాట్ ఓకే
న్యూఢిల్లీ : మందుబాబులకు ఢిల్లీ సర్కారు ఝలక్ ఇచ్చింది. క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లకు పర్మిషన్ ఇస్తూనే లిక్కర్ సర్వింగ్‌కి నో చెప్పింది. ట్రయల్ బేసిస్ మీద జూన్ 6 నుంచి 21 వరకు యాభై శాతం సీటింగ్ కెపాసిటీతో ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బులు తెరుచుకోవడంతో ఓ పెగ్గు వేద్దామని వెళ్లిన మందుబాబులకు నిరాశే ఎదురవుతోంది. రెస్టారెంట్లు, బార్లలో ఆల్కహాల్ అమ్మకాలకు చేయకూడదంటూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు ఉండటంతో చుక్క మందు కూడా వాళ్లకి దొరకలేదు. కఠిన చర్యలు కోవిడ కేసులు పెరిగిపోవడంతో ఏప్రిల్ 19 నుంచి జూన్ 5 వరకు కఠిన లాక్డౌన్ అమలు చేసింది ఢిల్లీ సర్కార్. అయితే కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఇటీవల అన్‌లాక్ ప్రక్రియ మొదలు పెట్టింది. అందులో భాగంగా రెస్టారెంట్లు ఓపెన్ చేసినా మందుకు మాత్రం నో చెప్పింది. ఢిల్లీ బాబులు బార్లలో గొంతు తడుపుకోవాలంటే మరికొంత కాలం ఎదురు చూడక తప్పదు. బార్లు, రెస్టారెంట్లపై నిఘా పెట్టామని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఆల్కహాల్ అమ్మినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరించింది. త్వరగా ఇవ్వండి కరోనా కారణంగా ఇప్పటికే రెస్టారెంట్లు, బార్లు, హోటళ్ల రంగం భారీ నష్టాలు చవి చూస్తోందని. పరిస్థితులను అంచనా వేసి త్వరగా తమకు లిక్కర్ అనుమతులు ఇవ్వాలంటూ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి:‘ఆహార’ బిల్లుల్లో లైసెన్స్ నంబరు తప్పనిసరి -
చేతకాకపోతే చెప్పండి.. కేంద్రాన్ని దించుతాం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆక్సిజన్ బ్లాక్మార్కెట్లో అమ్మడంపై ఢిల్లీ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితిని చక్కదిద్దలేకపోతే గ్యాస్ రీఫిల్లర్ యూనిట్లను కేంద్రం స్వాధీనంలోకి పంపుతామని, అంతేకానీ ప్రజలు చచ్చిపోతుంటే చూస్తూ కూర్చోలేమని హెచ్చరించింది. మూడు గంటల పాటు జరిగిన విచారణలో సమస్యంతా ఢిల్లీ ప్రభుత్వం వల్లనే వస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. రీఫిల్లింగ్ యూనిట్లను టేకోవర్ చేయాలని, ఆస్పత్రులకు కొరత లేకుండా ఆక్సిజన్ సరఫరా చేయాలని ఆదేశించింది. మరోవైపు అశోకా హోటల్లో హైకోర్టు జడ్జిలు, సిబ్బంది కోసం వందరూములతో కోవిడ్ కేర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను ఢిల్లీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇలాంటి సదుపాయాన్ని తాము కోరలేదని హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది. ఈ ఆదేశాలు ముఖ్యమంత్రికి, కేబినెట్ మంత్రులకు తెలియకుండా వచ్చాయని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఆదేశాలు తప్పని, ఇలాంటివి ప్రభుత్వానికి మేలు చేసినందుకు జడ్జిలకు సమకూరాయన్న తప్పుడు సందేశాన్నిస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. చదవండి: కరోనా ఎఫెక్ట్: పెరిగిన కుటుంబాల పొదుపు.. ఎంతంటే? -
స్వలింగ వివాహాలపై మీ వైఖరేంటి?
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలపై తమ స్పందనను తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రంతోపాటు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక వివాహ చట్టం కింద తమ వివాహం చేసుకునేందుకు అనుమతించాలని ఒక జంట, అమెరికాలో జరిగిన తమ పెళ్లిని విదేశీ వివాహ చట్టం కింద భారత్‌లో నమోదు చేయాలని ఇంకో జంట వేర్వేరుగా వేసిన పిటిషన్లపై జస్టిస్ ఆర్.ఎస్. ఎండ్లా, జస్టిస్ ఆషా మీనన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహం చేసుకుంటామని ప్రతిపాదించిన మహిళలు ఇద్దరు ఆ చట్టంలో స్వలింగ వివాహాలకు తగిన నిబంధనలు లేకపోవడాన్ని సవాలు చేశారు. మరోవైపు అమెరికాలో వివాహం చేసుకుని రాగా విదేశీ వివాహ చట్టం కింద తమ వివాహాన్ని నమోదు చేయకపోవడాన్ని ఇద్దరు పురుషులు సవాలు చేశారు. కేసు తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 8వ తేదీకి వాయిదా పడింది. అయితే వివాహం చట్టాలు స్వలింగ వివాహాలకు అనుమతి ఇవ్వవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రత్యేక, విదేశీ వివాహ చట్టాలు రెండింటిలోనూ వివాహానికి నిర్వచనం లేకున్నా సంప్రదాయక చట్టాల ప్రకారం దాన్ని అర్థం చేసుకుంటారని వివరించింది. దీన్ని పిటిషన్‌దారులు సవాలు చేయాలని భావిసే,్త ఇప్పుడే చేయాలని స్పష్టం చేసింది. అయితే.. పిటిషన్‌దారులు సంప్రదాయ, మత చట్టాల కింద గుర్తింపు కావాలని కోరడం లేదని, కులాంతర, మతాంతర వివాహాలను గుర్తించే పౌర చట్టాల (ప్రత్యేక, విదేశీ వివాహ చట్టాలు) కింద మాత్రమే గుర్తింపు కోరుతున్నారని పిటిషన్‌దారుల తరఫు న్యాయవాది మేనక గురుస్వామి వాదించారు. ఇదే తొలిసారి.. ఐదు వేల ఏళ్ల సనాతన ధర్మ సంప్రదాయంలో ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఇదే తొలిసారి అని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన రాజ్‌కుమార్ యాదవ్ బెంచ్‌కు నివేదించారు. ఇందుకు బెంచ్ బదులిస్తూ... చట్టాల్లోని భాష ఏ ఒక్కరివైపో (పురుషులు, మహిళలు) సూచించడం లేదని, దేశ పౌరులందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చట్టాన్ని అర్థం చేసుకోవాలని చెప్పింది. పిటిషన్లు రెండూ ప్రకృతికి విరుద్ధమైనవి కావని అనగా కేంద్రం తరఫు మరో న్యాయవాది కీర్తిమాన్ సింగ్ అంగీకరించారు. తాము ఎనిమిదేళ్లుగా కలిసి జీవిస్తున్నామని, కష్టసుఖాలన్నింటినీ పంచుకుంటున్నామని.. కానీ ఇద్దరూ మహిళలమే (ఒకరి వయసు 47, ఇంకొరిది 36) అయినందున పెళ్లి మాత్రం చేసుకోలేకపోతున్నామని పిటిషన్‌దారులైన ఇద్దరు మహిళలు తమ పిటిషన్లో పేర్కొన్నారు. పెళ్లి కాని కారణంగా మిగిలిన జంటల్లాగా సొంతిల్లు, బ్యాంక్ అకౌంట్ తెరవడం, కుటుంబ బీమా తదితరాలను పొందలేకపోతున్నామని వాపోయారు. ఆర్టికల్ 21 ద్వారా పౌరులకు సంప్రదించే హక్కు స్వలింగ దంపతులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అమెరికాలో జరిగిన తమ వివాహాన్ని భారత కాన్సులేట్ విదేశీ వివాహ చట్టం కింద నమోదు చేయలేదని, ఇతర జంటల మాదిరిగానే తమ వివాహాన్ని కూడా భారత కాన్సులేట్ గుర్తించి ఉండాల్సిందని పురుష పిటిషన్‌దారులు ఇద్దరూ పేర్కొన్నారు. 2017లో జరిగిన తమ వివాహాన్ని గుర్తించకపోవడం కారణంగా కోవిడ్–19 కాలంలో దంపతులుగా కలిసి ప్రయాణించేందుకు, తమ కుటుంబాలతో కలిసి ఉండేందుకు ప్రతిబంధకంగా మారిందన్నారు. భారత కాన్సులేట్ నిర్ణయం ఆర్టికల్ 14, 15, 19, 21లను అతిక్రమించిందని ఆరోపించారు. -
'ఢిల్లీ'పై వెంటనే నిర్ణయం తీసుకోండి: సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్న కేంద్రం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. ప్రజాస్వామ్యంలో రాష్టపతి పాలన ఎక్కువ కాలం కొనసాగడం మంచిది కాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుపై లెఫ్టినెంట్ గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీనికి ఐదు నెలల సమయం తీసుకోవాల్సిన అవసరం లేదని చురక అంటించింది. తాము తగినంత సమయం ఇచ్చినప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోయారని ఆక్షేపించింది. కాగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఆహ్వానించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ కు రాష్ట్రపతి అనుమతిచ్చారని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ పిటిషన్ మెరిట్ ఆధారంగా వాదనలు వింటామని న్యాయస్థానం పేర్కొంది.