Delhi electricity regulatory commission
-
ఢిల్లీ ప్రభుత్వం, గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు విచారం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్పర్సన్ నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ విఫలమయ్యారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం, ఎల్జీ ఏకాభిప్రాయంతో డీఈఆర్సీ చైర్‌పర్సన్‌గా ఒకరి పేరును సూచించలేరా? అని ప్రశ్నించింది. సంస్థను ఎవరూ పట్టించుకోకపోవడం విచారణకరమని పేర్కొంటూ.. చైర్మన్‌ను తామే ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. ఢిల్లీ పాలనాధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తోపాటు డీఈఆర్సీ చైర్మన్ ఎంపికపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పీఎస్ నరసింహా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీ గవర్నర్ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదిస్తూ.. డీఈఆర్సీ చైర్‌పర్సన్‌ను రాష్ట్రపతి నియమించారని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ అభిషేక్ మను సంఘ్వీ మాట్లాడుతూ.. డీఈఆర్సీ చైర్మన్ నియామకం కేంద్ర ఆర్డినెన్స్ ప్రకారం జారీ చేశారని, దీనిని ఢిల్లీ ప్రభుత్వం కోర్టులో సవాలు చేసిందని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. ఆర్డినెన్స్ విచారణ రాజ్యాంగ ధర్మాసానానికి వెళుతుందని తెలిపింది. ఈ ప్రక్రియకు రెండు, మూడు నెలలు పడుతుందని అప్పటి వరకు డీఈఆర్సీ పని చేయకుండా ఉంటుందా? అని ప్రశ్నించింది. అయితే డీఈఆర్సీ సంస్థ అధిపతి లేకుండా ఉండలేదని, సుప్రీంకోర్టే దీనికి చైర్‌పర్సన్‌ను నియమించవచ్చని హరీష్ సాల్వే సూచించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. డీసీఆర్సీ చైర్మన్ ఎంపికపై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇందుకు కొంత సమయం వేచి ఉండాలని ఇరు వర్గాలకు చెందిన లాయర్లకు సూచించింది. తాత్కాలిక ప్రాతిపదికన కొంతకాలంపాటు మాజీ న్యాయమూర్తిని నియమించడానికి కొంతమంది న్యాయమూర్తులను పేర్లను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతానికి తమ వద్ద ఎలాంటి జాబితా లేదని, ముగ్గురు లేదా అయిదుగురు ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తుల పేర్లను అందించాలని.. వారిలో నుంచి ఒకరిని తామే నియమిస్తామని పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఆర్డినెన్స్‌పై ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి పదవుల్లో నియామకాలు ఆగిపోవడంతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ రాజకీయాలను పక్కనబెట్టి కూర్చొని మాట్లాడుకోవాలని సుప్రీంకోర్టు జూలై 17న సూచించింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తరఫు న్యాయవాది అందుకు సరేనన్నారు. ఢిల్లీ ప్రభుత్వం స్పందించలేదు. చదవండి: చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్రానికి ప్రశ్నల వర్షం రాజ్యాంగ ధర్మాసనానికి ఆర్డినెన్స్ ఢిల్లీలో పాలనాధికారాలపై నియంత్రణ కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఇంతకుముందుకు విచారణ జరిపిన రెండు రాజ్యాంగ బెంచ్‌లు పరిశీలించని న్యాయపరమైన అంశాలు ఈ పిటిషన్లో ఉన్నాయని.. అందుకే దీనిని విస్తృత ధర్మాసనానికి బదిలీచేస్తున్నట్టు తెలిపింది. -
సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రభుత్వానికి ఊరట..
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సర్కార్‌కు ఊరట లభించింది. ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ (డీఈఆర్సీ) చైర్మన్ నియామకంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై తుది విచారణను జూలై 11న చేపడతామని పేర్కొంది. అప్పటి వరకు డీఈఆర్సీ చైర్‌పర్సన్‌గా జస్టిస్(రిటైర్డ్) ఉమేష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కాగా ఢిల్లీ స్పీకర్ వీకే సక్సేనా ఆదేశాల మేరకు గతంలో అలహాబాద్ హైకోర్టు జడ్జీగా పనిచేసిన జస్టిస్ ఉమేష్ కుమార్ జూన్ 21న డీఈఆర్సీ చైర్మన్‌గా పదవి బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే ఆరోజు ఢిల్లీ విద్యుత్‌శాఖ మంత్రి అతిషి అనారోగ్యానికి గురవ్వడంతో.. జస్టిస్ కుమార్ ప్రమాణా స్వీకారం జూలై 6కు వాయిదా పడింది. అయితే ఈ ఉమేష్ కుమార్ నియమాకాన్ని(గవర్నర్ ఆదేశాలను) వ్యతిరేకిస్తూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆదేశించింది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు నోటీసులు జారీ చేస్తామని పేర్కొంది. అదే విధంగా డీఈఆర్సీ చైర్‌పర్సన్‌గా జస్టిస్ ఉమేష్ కుమార్ స్వీకారోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. అంతేగాక జస్టిస్ కుమార్ ప్రమాణ స్వీకారం గురించి ఢిల్లీ స్పీకర్ వీకే సక్సేనా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కోరరాదని సూచించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు తదుపరి విచారణ 11న చేపడతామని చెప్పడంతో.. ఉమేష్ కుమార్ నియామకం జూలై 11కు వరకు వాయిదా పడినట్లే. అయితే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కార్ జస్టిస్(రిటైర్డ్) సంగీత్ రాజ్ లోధా పేరును జూన్ 21న ప్రతిపాదించింది. అయితే ఆప్ ప్రభుత్వ విజ్ఞప్తిని పక్కన పెడుతూ జస్టిస్ కుమార్ పేరును ప్రకటిస్తూ కేంద్రం అదే రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై నియంత్రణకు సంబంధించి కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సైతం ఆప్ సర్కార్ సుప్రీంకోర్టులో పోరాడుతోంది. తాజాగా డీఈఆర్సీ చైర్మన్ వివాదంతో వీరి మధ్య వైర్యం మరింత పెరిగినట్లైంది. చదవండి: పురుషులకు జాతీయ కమిషన్.. పిల్ కొట్టేసిన సుప్రీంకోర్టు -
అసెంబ్లీకి హాజరుకావాలని డీఈఆర్సీ చైర్మన్‌కు స్పీకర్ ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీకి హాజరుకావాలని ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (డీఈఆర్సీ) చైర్మన్‌ను స్పీకర్ ఆదేశించారు. రానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరై డీఈఆర్సీ చైర్మన్ పీడీ సుధాకర్ డిస్కంల పనితీరుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని స్పీకర్ రాంనివాస్‌గోయల్ బుధవారం ఆదేశించారు. నగరంలో విద్యుత్ వినియోగదారులకు అధిక బిల్లులు వస్తున్నాయని, మీటర్లు వేగంగా తిరుగుతున్నాయని పలువురు శాసనసభ్యులు ఆరోపించారు. విధానసభ సమావేశాలలో ఈ విషయంపై పలువురు ఎమ్మెల్యేలు గళం విప్పారు. అడ్డగోలుగా వ్యవహారిస్తున్న డిస్కంల ఆటకట్టించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ రాం నివాస్ గోయల్ కూడా సమస్యపై తన అనుభవాలను పంచుకున్నారు. వేగంగా తిరిగే మీటర్లను కూడా డిస్కంలే తమ ల్యాబ్‌కి తీసుకెళ్లి తనిఖీ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. డిస్కంల పనితీరుపై తమ సందేహాలను తీర్చడం కోసం డీఈఆర్సీ చైర్మన్‌ను సభకు హాజరయ్యేలా చూడాలని సభ్యులు డిమాండ్ చేశారు. వీరి వాదనతో ఏకీభవించిన గోయల్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. -
వెనక్కితగ్గిన డీఈఆర్సీ
విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయం ఉపసంహరణ సాక్షి, న్యూఢిల్లీ : విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (డీఈఆర్సీ) శుక్రవారం ఉపసంహరించుకుంది. విద్యుత్ చార్జీలను ఏడు శాతం మేర పెంచుతున్నట్టు గురువారం ప్రకటించిన సంగతి విదితమే. అయితే వివిధ రాజకీయ పార్టీల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో వెనక్కితగ్గింది. ఆయా విద్యుత్ సంస్థల డిమాండ్ మేరకు ఏడు శాతం సర్‌చార్జీ విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నగర పరిధిలోని ఆయా విద్యుత్ సంస్థల డిమాండ్ మేరకు బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ వినియోగదారులకు ఏడు శాతం, బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ వినియోగదారులకు 4.5 శాతం, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ వినియోగదారులకు 2.5 శాతం చార్జీ పెంపు ఉంటుందని డీఈఆర్సీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. పెంచిన చార్జీలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే తన నిర్ణయాన్నిఉపసంహరించుకుంటునట్లు డీఈఆర్సీ శుక్రవారం ఉదయం పేర్కొంది. ఎస్ఎంఎస్ వచ్చింది : ఎల్జీ విద్యుత్ చార్జీల ఉపసంహరణ గురించి తనకు తెలియదని లె ఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తెలిపారు. అయితే చార్జీలను ఉపసంహరించిట్లు తన కార్యాలయానికి ఎస్ఎంఎస్ వచ్చిందన్నారు. సర్‌చార్జ్ విధించడం కోసం జరిపిన లెక్కల్లో పొరపాటు దొర్లి ఉంటుందని, అందువల్లనే చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించి ఉండొచ్చని ఆయన అన్నారు. డీఈఆర్సీ స్వతంత్ర సంస్థ అని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన వివరించారు. అటువంటిదేమీ లేదు : డీఈఆర్సీ రాజకీయ పార్టీల ఒత్తిళ్ల కారణంగా విద్యుత్తు చార్జీల పెంపు ప్రకటనను ఉపసంహరించుకోలేదని డీ ఈఆర్సీ చైర్మన్ పి.డి. సుధాకర్ తెలిపారు. విద్యుత్ ఉత్పాదనకయ్యే వ్యయానికి సంబంధించి పూర్తి వివరాలను అందజేయాల్సిందిగా గ్యాస్ ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను కోరామని అన్నారు. ఈ సమాచారం లభించిన వెంటనే అన్ని వివ రాలను పరిశీలించి రెండు మూడు వారాల్లో తాజా నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్, ఆప్ విమర్శనాస్త్రాలు డీఈఆర్సీ నిర్ణయంపై ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శనాస్త్రాలు సంధించాయి. తక్షణమే ఉపసంహరించుకోవాలని మాండ్ చేశాయి. డీఈఆర్సీ... డిస్కంలు ఆడించినట్లు ఆడుతోందంటూ ఆప్ విమర్శించింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ లె ఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ వద్ద ఈ విషయాన్ని లేవనెత్తుతామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ పేర్కొన్నారు. -
హస్తిన ప్రజలపై మరో పిడుగు
న్యూఢిల్లీ: విద్యుత్ సమస్యతో అల్లాడుతున్న హస్తిన ప్రజలపై మరో పిడుగు పడింది. ఢిల్లీలో విద్యుత్ చార్జీలు 2.5 శాతం వరకు పెంచారు. పరిశ్రమలు, ఢిల్లీ మెట్రో వంటి వాణిజ్య అవసరాలకు వినియోగించే విద్యుత్ చార్జీలు 11 శాతం వరకు పెంచారు. బయట రాష్ట్రాల నుంచి విద్యుత్ కోనుగోలు చేస్తున్నందున చార్జీలు పెంచాల్సివచ్చిందని ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంఘం తెలిపింది. విద్యుత్ కోతలతో ఇలీవల కాలంలో ఢిల్లీ ప్రజలు అల్లాడారు. కేంద్ర ప్రభుత్వం కూడా హస్తినలో కరెంట్ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఢిల్లీ సీఎం పీఠంపై కన్నేసిన బీజేపీ.. విద్యుత్ సమస్య తీర్చి ప్రజలకు చేరువ కావాలని భావిస్తోంది. -
మూడు నెలలు కావాలి
న్యూఢిల్లీ: విద్యుత్ చార్జీల తగ్గింపుపై ఢిల్లీ ప్రభుత్వం నుంచి తమకు ఇంతవరకు ఎటువంటి విజ్ఞప్తి రాలేదని ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్ (డీఈఆర్సీ) సోమవారం స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చినా, ప్రస్తుతమున్న చార్జీలను సమీక్షించేందుకు కనీసం మూడు నెలలు పడుతుందని తెలిపింది. విద్యుత్ టారిఫ్‌ను 50 శాతం తగ్గిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన సంగతి తెల్సిందే. దీనిపై నాలుగైదు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు. అయితే విద్యుత్ టారిఫ్ అంశంపై ప్రభుత్వం తమను ఇంతవరకు సంప్రదించలేదని డీఈఆర్సీ చైర్మన్ పీడీ సుధాకర్ చెప్పారు. పస్తుతం అమలవుతున్న విద్యుత్ టారిఫ్ విధానాన్ని తాము సమీక్షించడం లేదని ఆయన స్పష్టం చేశారు. చార్జీలను సమీక్షించేందుకు కనీసం మూడు నెలలు అవసరమని ఆయన పేర్కొన్నారు. రేట్లను ఖరారు చేసేముందు సంబంధిత అన్ని వర్గాల వారితో బహిరంగ విచారణ జరపాల్సి ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా, టారిఫ్‌ను తగ్గించాలంటే ప్రభుత్వం సబ్సిడీ మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందని, అందుకు పాలనాపరమైన నిర్ణయం అవసరమని విద్యుత్ నిపుణులు అభిప్రాయపడ్డారు. నగరంలో సుమారు 40 లక్షల మంది విద్యుత్ గృహ వినియోగదారులుండగా, వీరికి ప్రస్తుతమున్న రేట్లలో సగం ధరకే విద్యుత్‌ను అందచేస్తే ప్రభుత్వంపై కనీసం ఐదువేల కోట్ల రూపాయల భారం పడుతుందని వారు అంచనా వేశారు. డీఈఆర్సీ వద్ద ఉన్న వివరాల ప్రకారం, నగరంలో విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు ప్రైవేటు డిస్కాంలు ప్రస్తుతం రూ.19,500 కోట్ల రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతమున్న టారిఫ్‌ను తగ్గిస్తే డిస్కామ్‌ల నిర్వహణ సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని విద్యుత్ నిపుణులు పేర్కొంటున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం డిస్కాంల ఆదాయంలో 80 నుంచి 90 శాతం సొమ్ము విద్యుత్ కొనుగోలుకే పోతోంది. కేంద్ర, రాష్ట్ర రెగ్యులేటర్లు నిర్ణయించిన రేట్లకు డిస్కాంలు దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలోని సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. గత రెండేళ్ల కాలంలో విద్యుత్ కొనుగోలు ధర 300 శాతం పెరిగిందని, అదే కాలంలో టారిఫ్ మాత్రం 70 శాతం మాత్రమే పెరిగిందని నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా డిస్కాంలు రూ.19,500 కోట్ల లోటును ఎదుర్కొంటున్నాయని వివరించారు. గత ఆగస్టు నెలలో గృహ వినియోగదారులకు టారిఫ్‌ను ఐదు శాతం పెంచారు. ఆ వెంటనే అప్పటి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ 400 యూనిట్లకన్నా తక్కువగా వినియోగించే వారికి సబ్సిడీని ప్రకటించారు. 2011లో టారిఫ్‌ను 22 శాతం, తిరిగి గత ఏడాది ఫిబ్రవరిలో మరో ఐదు శాతం పెంచారు. తిరిగి గత ఏడాది మే నెలలో రెండు శాతం, జూలైలో 26 శాతం మేరకు టారిఫ్‌ను పెంచారు.