మూడు నెలలు కావాలి
Published Tue, Dec 31 2013 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
న్యూఢిల్లీ: విద్యుత్ చార్జీల తగ్గింపుపై ఢిల్లీ ప్రభుత్వం నుంచి తమకు ఇంతవరకు ఎటువంటి విజ్ఞప్తి రాలేదని ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్ (డీఈఆర్‌సీ) సోమవారం స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చినా, ప్రస్తుతమున్న చార్జీలను సమీక్షించేందుకు కనీసం మూడు నెలలు పడుతుందని తెలిపింది. విద్యుత్ టారిఫ్‌ను 50 శాతం తగ్గిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన సంగతి తెల్సిందే. దీనిపై నాలుగైదు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు. అయితే విద్యుత్ టారిఫ్ అంశంపై ప్రభుత్వం తమను ఇంతవరకు సంప్రదించలేదని డీఈఆర్‌సీ చైర్మన్ పీడీ సుధాకర్ చెప్పారు.
పస్తుతం అమలవుతున్న విద్యుత్ టారిఫ్ విధానాన్ని తాము సమీక్షించడం లేదని ఆయన స్పష్టం చేశారు. చార్జీలను సమీక్షించేందుకు కనీసం మూడు నెలలు అవసరమని ఆయన పేర్కొన్నారు. రేట్లను ఖరారు చేసేముందు సంబంధిత అన్ని వర్గాల వారితో బహిరంగ విచారణ జరపాల్సి ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా, టారిఫ్‌ను తగ్గించాలంటే ప్రభుత్వం సబ్సిడీ మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందని, అందుకు పాలనాపరమైన నిర్ణయం అవసరమని విద్యుత్ నిపుణులు అభిప్రాయపడ్డారు. నగరంలో సుమారు 40 లక్షల మంది విద్యుత్ గృహ వినియోగదారులుండగా, వీరికి ప్రస్తుతమున్న రేట్లలో సగం ధరకే విద్యుత్‌ను అందచేస్తే ప్రభుత్వంపై కనీసం ఐదువేల కోట్ల రూపాయల భారం పడుతుందని వారు అంచనా వేశారు.
డీఈఆర్‌సీ వద్ద ఉన్న వివరాల ప్రకారం, నగరంలో విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు ప్రైవేటు డిస్కాంలు ప్రస్తుతం రూ.19,500 కోట్ల రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతమున్న టారిఫ్‌ను తగ్గిస్తే డిస్కామ్‌ల నిర్వహణ సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని విద్యుత్ నిపుణులు పేర్కొంటున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం డిస్కాంల ఆదాయంలో 80 నుంచి 90 శాతం సొమ్ము విద్యుత్ కొనుగోలుకే పోతోంది. కేంద్ర, రాష్ట్ర రెగ్యులేటర్లు నిర్ణయించిన రేట్లకు డిస్కాంలు దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలోని సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. గత రెండేళ్ల కాలంలో విద్యుత్ కొనుగోలు ధర 300 శాతం పెరిగిందని, అదే కాలంలో టారిఫ్ మాత్రం 70 శాతం మాత్రమే పెరిగిందని నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా డిస్కాంలు రూ.19,500 కోట్ల లోటును ఎదుర్కొంటున్నాయని వివరించారు.
గత ఆగస్టు నెలలో గృహ వినియోగదారులకు టారిఫ్‌ను ఐదు శాతం పెంచారు. ఆ వెంటనే అప్పటి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ 400 యూనిట్లకన్నా తక్కువగా వినియోగించే వారికి సబ్సిడీని ప్రకటించారు. 2011లో టారిఫ్‌ను 22 శాతం, తిరిగి గత ఏడాది ఫిబ్రవరిలో మరో ఐదు శాతం పెంచారు. తిరిగి గత ఏడాది మే నెలలో రెండు శాతం, జూలైలో 26 శాతం మేరకు టారిఫ్‌ను పెంచారు.
Advertisement