న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ సీనియర్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై నియంత్రణ కోసం ఉద్దేశించిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్‌మెంట్) బిల్లు–2023’ సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ అనంతరం సభాపతి ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 131 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 102 మంది ఎంపీలు ఓటువేశారు. ఢిల్లీ బిల్లు గత వారమే లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఎగువ సభ సైతం ఆమోద ముద్ర వేయడంతో ఇక రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 238. అధికార ఎన్డీయేతోపాటు ఈ బిల్లు విషయంలో ఆ కూటమికి అనుకూలంగా ఉన్న సభ్యుల సంఖ్య 131. వారంతా బిల్లుకు మద్దతు పలికారు. ఇక విపక్ష ‘ఇండియా’ కూటమితోపాటు ఇతర విపక్ష సభ్యుల సంఖ్య 104 ఉండగా, బిల్లుకు వ్యతిరకంగా 102 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో ముగ్గురు సభ్యులు ఎటూ తేల్చుకోలేదు. ఓటింగ్‌లో పాల్గొనలేదు.
సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తారా?: విపక్షాలు
ఢిల్లీ బిల్లును రాజ్యసభలో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై తొలుత సభలో చర్చను కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ ప్రారంభించారు. బిల్లు రాజ్యాంగవిరుద్ధమని, ప్రజాస్వామ్య వ్యతిరేకమని చెప్పారు. మనమంతా కచి్చతంగా వ్యతిరేకించాలని విపక్షాలకు పిలుపునిచ్చారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్న ఈ చర్య ఏదో ఒక రోజు మీ దాకా వస్తుంది అంటూ హెచ్చరించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగం ధర్మాసనం ఇచి్చన రెండు తీర్పులకు వ్యతిరేకంగా బిల్లును తీసుకొచ్చారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
కాంగ్రెస్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ.. ఢిల్లీ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. అలాగే బిల్లుపై చర్చలో ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎండీకే, సమాజ్‌వాదీ పార్టీ, భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్), ఆర్జేడీ, సీపీఎం, జేడీ(యూ), కేరళ కాంగ్రెస్(ఎం), సీపీఐ తదితర పారీ్టల సభ్యులు మాట్లాడారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను బలవంతంగా లాక్కోవడానికే బిల్లును తీసుకొచ్చారని దుయ్యబట్టారు.
అధికారాలు లాక్కోవడానికి కాదు: అమిత్ షా
బిల్లును తీసుకొచ్చింది కేవలం ఢిల్లీ ప్రజల హక్కులను కాపాడడం కోసమేనని, అంతేతప్ప ఆప్ ప్రభుత్వ అధికారాలను లాక్కోవడానికి కాదని అమిత్ షా తేలి్చచెప్పారు. ఢిల్లీ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చారు. ఇది పూర్తిగా చట్టబద్ధమేనని, సుప్రీంకోర్టు తీర్పును ఏ కోణంలోనూ ఉల్లంఘించడం లేదని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల కంటే ఢిల్లీ చాలా భిన్నమని తెలియజేశారు. పార్లమెంట్, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, సుప్రీంకోర్టు ఇక్కడే ఉన్నాయని, వివిధ దేశాల అధినేతలు ఢిల్లీని తరచుగా సందర్శిస్తుంటారని, అందుకే ఈ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసినట్లు పేర్కొన్నారు. పరిమిత అధికారాలున్న అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ అని అన్నారు.
ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి దినం: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ‘దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో ఆప్‌నకు తోడుగా నిలిచిన రాజకీయ పార్టీలకు నా కృతజ్ఞతలు. ఢిల్లీలో నాలుగు పర్యాయాలు ఆప్ చేతిలో ఘోరంగా ఓటమిపాలైన బీజేపీ, దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకే ఈ బిల్లును తీసుకువచ్చింది. ఆప్ చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో బీజేపీ పోటీ పడలేకపోతోంది. నన్ను ముందుకు వెళ్లకుండా చేయడమే వారి ఏకైక లక్ష్యం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్క సీటును కూడా ప్రజలు బీజేపీకి దక్కనివ్వరు. ఢిల్లీ వ్యవహారాల్లో ప్రధాని మోదీ జోక్యం ఎందుకు చేసుకుంటున్నారు? ’అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒక వీడియో విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment