Rajya Sabha approval
-
Winter Parliament Session 2023: క్రిమినల్ చట్టాలకు ఆమోదం
న్యూఢిల్లీ: బ్రిటిష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మూడు కీలక బిల్లులకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను లోక్‌సభ బుధవారం మూజు వాణి ఓటుతో ఆమోదించిన విషయం తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు, భారతీయ సాక్ష్య బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్–1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్–1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్–1872 స్థానంలో ఈ మూడు బిల్లులను తీసుకొచ్చారు. ‘ఈ బిల్లులు చట్ట రూపం దాల్చితే ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ మొదలుకొని తీర్పు వరకు అన్నీ ఆన్లైన్ అవుతాయి. దేశ విద్రోహ చట్టం రద్దయి పోయింది. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు కొత్త చట్టం ప్రకారం శిక్షలుంటాయి’అని అమిత్ షా వివరించారు. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు డిజిటైజ్ అవుతాయని చెప్పారు. వీటిల్లో చండీగఢ్ మొట్టమొదటగా డిజిటైజ్ అవుతుందన్నారు. బ్రిటిష్ పాలనలో గాంధీజీ, తిలక్, సావర్కర్ వంటి వారిని జైళ్లకు పంపిన నిబంధనలను తొలగించడం సంతోషాన్నిచ్చిందని మంత్రి చెప్పారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు సభలో లేనప్పటికీ మంత్రి ఆ పార్టీపై విమర్శలు చేశారు. ఇటాలియన్ అద్దాలు ధరించిన వారు భారత పార్లమెంట్ కొత్త క్రిమినల్ చట్టాలను రూపొందించడాన్ని సగర్వంగా భావించరంటూ కాంగ్రెస్ నేత సోనియానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. -
ఢిల్లీ బిల్లు నెగ్గింది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ సీనియర్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై నియంత్రణ కోసం ఉద్దేశించిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’ సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ అనంతరం సభాపతి ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 131 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 102 మంది ఎంపీలు ఓటువేశారు. ఢిల్లీ బిల్లు గత వారమే లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎగువ సభ సైతం ఆమోద ముద్ర వేయడంతో ఇక రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 238. అధికార ఎన్డీయేతోపాటు ఈ బిల్లు విషయంలో ఆ కూటమికి అనుకూలంగా ఉన్న సభ్యుల సంఖ్య 131. వారంతా బిల్లుకు మద్దతు పలికారు. ఇక విపక్ష ‘ఇండియా’ కూటమితోపాటు ఇతర విపక్ష సభ్యుల సంఖ్య 104 ఉండగా, బిల్లుకు వ్యతిరకంగా 102 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో ముగ్గురు సభ్యులు ఎటూ తేల్చుకోలేదు. ఓటింగ్‌లో పాల్గొనలేదు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తారా?: విపక్షాలు ఢిల్లీ బిల్లును రాజ్యసభలో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై తొలుత సభలో చర్చను కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ ప్రారంభించారు. బిల్లు రాజ్యాంగవిరుద్ధమని, ప్రజాస్వామ్య వ్యతిరేకమని చెప్పారు. మనమంతా కచి్చతంగా వ్యతిరేకించాలని విపక్షాలకు పిలుపునిచ్చారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్న ఈ చర్య ఏదో ఒక రోజు మీ దాకా వస్తుంది అంటూ హెచ్చరించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగం ధర్మాసనం ఇచి్చన రెండు తీర్పులకు వ్యతిరేకంగా బిల్లును తీసుకొచ్చారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ.. ఢిల్లీ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. అలాగే బిల్లుపై చర్చలో ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎండీకే, సమాజ్‌వాదీ పార్టీ, భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), ఆర్జేడీ, సీపీఎం, జేడీ(యూ), కేరళ కాంగ్రెస్(ఎం), సీపీఐ తదితర పారీ్టల సభ్యులు మాట్లాడారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను బలవంతంగా లాక్కోవడానికే బిల్లును తీసుకొచ్చారని దుయ్యబట్టారు. అధికారాలు లాక్కోవడానికి కాదు: అమిత్ షా బిల్లును తీసుకొచ్చింది కేవలం ఢిల్లీ ప్రజల హక్కులను కాపాడడం కోసమేనని, అంతేతప్ప ఆప్ ప్రభుత్వ అధికారాలను లాక్కోవడానికి కాదని అమిత్ షా తేలి్చచెప్పారు. ఢిల్లీ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చారు. ఇది పూర్తిగా చట్టబద్ధమేనని, సుప్రీంకోర్టు తీర్పును ఏ కోణంలోనూ ఉల్లంఘించడం లేదని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల కంటే ఢిల్లీ చాలా భిన్నమని తెలియజేశారు. పార్లమెంట్, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, సుప్రీంకోర్టు ఇక్కడే ఉన్నాయని, వివిధ దేశాల అధినేతలు ఢిల్లీని తరచుగా సందర్శిస్తుంటారని, అందుకే ఈ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసినట్లు పేర్కొన్నారు. పరిమిత అధికారాలున్న అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ అని అన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి దినం: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ‘దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో ఆప్‌నకు తోడుగా నిలిచిన రాజకీయ పార్టీలకు నా కృతజ్ఞతలు. ఢిల్లీలో నాలుగు పర్యాయాలు ఆప్ చేతిలో ఘోరంగా ఓటమిపాలైన బీజేపీ, దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకే ఈ బిల్లును తీసుకువచ్చింది. ఆప్ చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో బీజేపీ పోటీ పడలేకపోతోంది. నన్ను ముందుకు వెళ్లకుండా చేయడమే వారి ఏకైక లక్ష్యం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్క సీటును కూడా ప్రజలు బీజేపీకి దక్కనివ్వరు. ఢిల్లీ వ్యవహారాల్లో ప్రధాని మోదీ జోక్యం ఎందుకు చేసుకుంటున్నారు? ’అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒక వీడియో విడుదల చేశారు. -
పార్లమెంటు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే రెండు రోజులు ముందే ముగిసిపోయాయి. ఉభయ సభలు బుధవారం రవధికంగా వాయిదా పడ్డాయి. జనాభాలో ఇతర వెనుకబడిన కులాలను (ఓబీసీ) గుర్తించి జాబితాను తయారు చేసే అధికారాలను రాష్ట్రాలకు పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. పెగసస్ స్పైవేర్ వివాదం, వ్యవసాయ చట్టాలు, పెట్రో ధరలు పెంపు వంటి అంశాలపై విపక్ష పార్టీల సభ్యులు ఈసారి వర్షాకాల సమావేశాలను అడుగడుగునా అడ్డుకున్నారు. జూలై 19న మొదలైన ఈ సమావేశాలు ఆగస్టు 13న ముగియాల్సి ఉంది. అయితే సభా కార్యకలాపాలు జరగకుండా విపక్షాలు నిరంతరాయంగా అడ్డుకోవడంతో సభలో ప్రతిష్టంభన నెలకొంది. ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య లోక్‌సభలో 19 బిల్లులు పాసయ్యాయి. విపక్షాలు కలిసి రావడంతో ఓబీసీ బిల్లుపై మాత్రమే ఉభయసభల్లో పూర్తిస్థాయి చర్చ జరిగింది. లోక్‌సభ సమావేశాలు మొత్తం కేవలం 21 గంటలు మాత్రమే జరిగాయి. సభ ఉత్పాదకత 22 శాతం మాత్రంగానే ఉంది. ఈ సమావేశాల్లో విపక్ష సభ్యులు పెగసస్‌పై చర్చకు పట్టుబట్టడం వంటి దృశ్యాలే ప్రతీరోజూ కనిపించాయి. బుధవారం సభను నిరవధికంగా వాయిదా వేసినప్పుడు ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. ఓబీసీ బిల్లుని ఆమోదించిన రాజ్యసభ ఇతర వెనుకబడిన కులాల జాబితాను సొంతంగా రూపొందించుకునే అధికారాన్ని రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టే 127వ రాజ్యాంగ సవరణ బిల్లు 2021కి రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. 187 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. ఈ బిల్లును లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి ఈ చర్చలో పాల్గొంటూ ప్రభుత్వం కుల జనాభా గణన చేపట్టడానికి ఎందుకు వెనకడుగు వేస్తోందన్నారు. మార్షల్స్ మోహరింపు ఓబీసీ బిల్లుకు సభ ఆమోద ముద్ర వేసిన తర్వాత రాజ్యసభలో గందరగోళం జరిగింది. జనరల్ ఇన్సూరెన్స్ సవరణ బిల్లుని ప్రవేశపెట్టిన సమయంలో సభ్యులు మళ్లీ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ప్రభుత్వ రంగంలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రైవేటుపరం చేయడానికి వీలు కల్పించే ఈ బిల్లును విపక్షసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాగితాలు చింపి విసిరేశారు. మార్షల్స్‌తో ఎంపీలకు తోపులాట జరిగింది. మార్షల్స్ తమతో దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఆరోపించారు. రెండుసార్లు వాయిదాపడ్డాక రాత్రి ఏడు తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగా... టీఎంసీ, డీఎంకేలు దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేయగా ప్రభుత్వం తోసిపు చ్చింది. కాగా మంగళవారం సభ్యులు టేబుల్స్ పైకి ఎక్కి రభస చేయడంతో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. వెల్లోనికి ఎవరూ రాకుండా 50 మంది మార్షల్స్‌ని మోహరించారు. ఇన్సూరెన్స్ బిల్లుతోపాటు మరో రెండు బిల్లులు ఆమోదించాక సభ నిరవధికంగా వాయిదా పడింది. కఠిన చర్యలు తీసుకోవాలి: జోషి ప్రతిపక్ష సభ్యులే మార్షల్‌ను తోసివేశారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చారు. మార్షల్ ఎంపీలను తాకే సాహసం చేయరని, సీసీటీవీ ఫుటేజీ చూస్తే ఎవరు అబద్ధాలు చెబుతున్నారో తెలిసిపోతుందని అన్నారు. -
‘ఇన్ఫ్రా’ జాతీయ బ్యాంకుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: మౌలిక రంగ ప్రాజెక్టులకు, అభివృద్ధికి రుణ సదుపాయం కల్పించే జాతీయ బ్యాంకు ఏర్పాటుకు (నాబ్‌ఫిడ్ బిల్లు/నేషనల్ బ్యాంకు ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్) రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. బిల్లుపై చర్చ సందర్భంగా కొందరు సభ్యులు ఈ సంస్థపై పార్లమెంటు పర్యవేక్షణ లేదన్న అంశాన్ని లెవనెత్తారు. సెలక్ట్ కమిటీకి పంపించాలంటూ డిమాండ్ చేశారు. చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ.. ఈ సంస్థకు సంబంధించి ఆడిట్ నివేదికలను ఏటా పార్లమెంటు పరిశీలన కోసం అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. ‘అధీకృత మూలధనం రూ.10లక్షల కోట్లను సమకూర్చనున్నాం. రూ.20,000 కోట్లను ఈక్విటీ కింద, రూ.5,000 కోట్లను గ్రాంట్ కింద ప్రభుత్వం మంజూరు చేసింది’’ అని మంత్రి తెలిపారు. సౌర్వభౌమ హామీ ఉంటుందని.. ఆర్బీఐ నుంచి రుణం పొందొచ్చన్నారు. ఇన్ఫ్రా ప్రాజెక్టులకు నాబ్‌ఫిడ్ రుణ వితరణ చేస్తుందన్నారు. కాగా, నాబ్‌ఫిడ్ 4–5 నెలల్లో కార్యకలాపాలును ప్రారంభిస్తుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి దేశాశిష్ పాండా పేర్కొన్నారు. -
‘ఢిల్లీ బిల్లు’కు పార్లమెంట్ ఆమోదం
న్యూఢిల్లీ: ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నరే సుప్రీం అని స్పష్టతనిచ్చే ‘ఢిల్లీ’ బిల్లును బుధవారం రాజ్యసభ ఆమోదించింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్‌సభ ఓకే చెప్పడంతో బిల్లును పార్లమెంట్ ఆమోదించినట్లయింది. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వంకన్నా లెఫ్టినెంట్ గవర్నర్దే అంతిమాధికారం అని చెప్పే ఈ బిల్లు ఆమోదం సందర్భంగా బుధవారం రాజ్యసభలో హైడ్రామా నడిచింది. బిల్లును వ్యతిరేకిస్తూ పలు ప్రతిపక్షాలు ఆందోళనచేశాయి. ఎస్పీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల ఎంపీలు వాకవుట్ చేశారు. ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సవరణ బిల్లు 2021(జీఎన్సీటీడీ) ప్రకారం ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్ట్‌నెంట్ గవర్నరే!. ముందుగా బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా వాదనలు జరిగాయి. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని, దీన్ని సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు కోరాయి. బిల్లుతో ఢిల్లీలో బలమైన ప్రభుత్వయంత్రాంగం ఏర్పడుతుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. 1991లో తెచ్చిన చట్టంలోని సందిగ్ధతలు తొలగించేందుకే ఈ బిల్లు తెచ్చామన్నారు. సుప్రీంకోర్టు గతంలో చెప్పిన తీర్పుల సారాంశానికి అనుగుణంగానే మార్పులు చేశామని వివరించారు. ప్రజాస్వామ్యానికి దుర్దినం బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినంగా అభివర్ణించారు. అయితే తిరిగి ప్రజా ప్రభుత్వానికి అధికారాలు పునఃసంప్రాప్తించేందుకు తాను చేసే పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాజ్యసభలో ఈ బిల్లు పాసైంది. ఇది భారత ప్రజాస్వామ్యానికి చీకటిరోజు. ప్రజలకు తిరిగి అధికారం సాధించేవరకు పోరాటం ఆపను. మంచిపనులు ఆగవు, నెమ్మదించవు’ అని ఆయన ట్వీట్ చేశారు. -
సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే
న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల తీవ్ర ఆగ్రహావేశాల మధ్య మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రెండు వివాదాస్పద వ్యవసాయ బిల్లులు ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందాయి. ఈ బిల్లులు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం దాలుస్తాయి. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని, రైతులకు ఇవి మరణ శాసనాలని పేర్కొంటూ కాంగ్రెస్ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కోవిడ్–19 నిబంధనలను పట్టించుకోకుండా పోడియంను చుట్టుముట్టారు. నినాదాలతో సభను హోరెత్తించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్‌పై దాడి చేసినంత పని చేశారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడానికి ఉద్దేశించిన తీర్మానంపై ఓటింగ్ జరపాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోకపోవడంతో, ఆగ్రహంతో ఆయన ముఖంపైకి నిబంధనల పుస్తకాన్ని విసిరారు. మరికొన్ని అధికారిక పత్రాలను చించి, విసిరారు. ఆయన ముందున్న మైక్రోఫోన్‌ను లాగేసేందుకు విఫలయత్నం చేశా రు. ఈ గందరగోళం మధ్య సభ కొద్దిసేపు వాయి దా పడింది. ఆ తరువాత ‘వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య(ప్రోత్సాహం, సులభతరం)’ బిల్లు, రైతాంగ(రక్షణ, సాధికారత) ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పందం’ బిల్లులను మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. సభా సంఘానికి పంపించాలంటూ.. ఈ బిల్లుల ఆమోదం కోసం ముందుగా పేర్కొన్న సమయం కన్నా ఎక్కువ సేపు సభ జరిగింది. ఈ సమయంలో, బిల్లులను వ్యతిరేకిస్తూ పలు డిమాండ్లను, తీర్మానాలను ప్రతిపక్ష సభ్యులు సభ ముందుకు తీసుకువచ్చారు. చర్చపై వ్యవసాయ మంత్రి సమాధానాన్ని సోమవారానికి వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కీలక బిల్లుల ఆమోదం ఏకగ్రీవంగా జరగాలన్నారు. ఉపసభాపతి స్థానం వద్దకు వెళ్లి రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ నినాదాలు చేశారు. విపక్షం తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతుండటంతో వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చర్చకు తానివ్వాల్సిన జవాబును కుదించుకుని, క్లుప్తంగా ముగించారు. క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు ఈ రెండు బిల్లులను సభా సంఘాలకు పంపాలన్న విపక్షం తీర్మానాన్ని మూజువాణి ఓటుతో సభ తిరస్కరించింది. అయితే, దీనిపై డివిజన్ ఓటింగ్ జరగాలని కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం, డీఎంకే సభ్యులు పట్టుబట్టారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే డివిజన్ ఓటింగ్ సాధ్యమవుతుందని పేర్కొంటూ, వారి డిమాండ్‌ను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ తోసిపుచ్చారు. దాంతో, టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్ ఆగ్రహంతో డిప్యూటీ చైర్మన్ స్థానం వద్దకు దూసుకువెళ్లారు. రూల్ బుక్‌ను ఆయన ముఖంపై విసిరేశారు. అక్కడే ఉన్న మార్షల్స్ అది డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్‌కు తగలకుండా జాగ్రత్తపడ్డారు. ఆయన వైపు దూసుకువచ్చిన మరో పుస్తకం కూడా తగలకుండా చూశారు. మరోవైపు, సభాపతి స్థానం వద్ద ఉన్న మైక్రోఫోన్‌ను లాగేసేందుకు ప్రయత్నించగా, మార్షల్స్ అడ్డుకున్నారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని తీర్మానాలను ప్రతిపాదించిన డీఎంకే సభ్యుడు తిరుచి శివ, టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్, సీపీఎం సభ్యుడు కేకే రాగేశ్.. తదితరులు బిల్లు పేపర్లను చింపి గాల్లోకి విసిరేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను డిప్యూటీ చైర్మన్ పావుగంట పాటు వాయిదా వేశారు. సభ మళ్లీ సమావేశమైన తరువాత.. విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఈ బిల్లులను మూజువాణి ఓటింగ్‌కు పెట్టారు. తొలి బిల్లు ఆమోదం పొంది, విపక్ష తీర్మానాలు వీగిపోయిన సమయంలో ఇద్దరు విపక్ష సభ్యులు రాజ్యసభ ఆఫీసర్స్ టేబుల్స్‌పై ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. ఆ తరువాత రెండో బిల్లు కూడా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. విపక్ష తీర్మానాలు వీగిపోయాయి. ఈ బిల్లులకు జేడీయూ, వైఎస్సార్సీపీ మద్దతు తెలిపాయి. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, టీఆర్ఎస్, ఆప్.. తదితర విపక్ష పార్టీలతో పాటు ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ కూడా ఈ బిల్లులను వ్యతిరేకించింది. బిల్లులపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు ప్రభుత్వ ఉద్దేశాన్ని తప్పుబట్టారు. రైతులకు మరణ శాసనం వంటి ఈ బిల్లులను తాము ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించే ప్రయత్నం ఇదని ఆరోపించింది. ప్రతిపక్షం తీరు సిగ్గుచేటు: రాజ్‌నాథ్ రాజ్యసభలో రైతు బిల్లులపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు సిగ్గుచేట ని, పార్లమెంట్ చరిత్రలోనే మునుపెన్నడూ జరగలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. రైతు బిల్లులను సభ ఆమోదించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో సభ్యుల ఇలాంటి ప్రవర్తను, ఘటనలను ఊహించలేమన్నారు. సభాధ్యక్షుని నిర్ణయంతో ఏకీభవించని నేతలు ఆయనపై దాడికి ప్రయత్నించడం, హింసాత్మక చర్యలకు పూనుకో వడాన్ని అనుమతించబోమన్నారు. ఎంఎస్పీపై అనుమానాలొద్దు: ప్రభుత్వం విపక్షాలు ఆందోళన చెందుతున్నట్లుగా.. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) విధానాన్ని తొలగించే ఆలోచనేదీ ప్రభుత్వానికి లేదని నరేంద్రసింగ్ తోమర్ స్పష్టం చేశారు. ఎంఎస్పీ విధానం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. రైతులు తమ ఉత్పత్తులు ఎక్కడైనా తాము కోరుకున్న ధరకు అమ్ముకునే వీలు కల్పిస్తున్నామన్నారు. వ్యవసాయ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ఎప్పట్లాగానే కొనసాగుతుందన్నారు. కాంట్రాక్ట్ వ్యవసాయంతో రైతులకు తమ ఉత్పత్తులను తమకు నచ్చిన ధరకు అమ్ముకునే వెసులుబాటు లభిస్తుందని వివరించారు. బిల్లులో తాము పేర్కొన్న అంశాలను కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ప్రతిపాదించిందని గుర్తు చేశారు. వ్యవసాయ మార్కెట్లలోనే కాకుండా, తమకు నచ్చిన ధరకు ఎక్కడైనా ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం ‘వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం, వాణిజ్య(ప్రోత్సాహ, సులభతరం)’ బిల్లు ద్వారా లభిస్తుందన్నారు. రైతులపై సెస్, చార్జీలు ఉండబోవన్నారు. అలాగే, రైతులు వ్యవసాయాధారిత సంస్థలు, కంపెనీలు, ఎగుమతిదారులతో తమ ఉత్పత్తులను ముందే కుదుర్చుకున్న ధరకు అమ్మేందుకు ఒప్పందంకుదుర్చుకునే వీలు ‘రైతాంగ(రక్షణ, సాధికారత) ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పందం’ బిల్లు కల్పిస్తుందని మంత్రి తోమర్ వివరించారు. ఉపసభాపతిపై అవిశ్వాసం! రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై 12 విపక్ష పార్టీలు ఆదివారం అవిశ్వాస నోటీసును ఇచ్చాయి. వివాదాస్పద వ్యవసాయ బిల్లుల ఆమోదం విషయంలో ఆయన పక్షపాత ధోరణిలో, అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపించాయి. బిల్లులను సభాసంఘానికి పంపించాలన్న తీర్మానాలపై డివిజన్ ఓటింగ్ జరగాలన్న డిమాండ్‌ను ఆయన పట్టించుకోలేదని విమర్శించాయి. అవిశ్వాస నోటీసు ఇచ్చిన పార్టీల్లో కాంగ్రెస్, టీఎంసీ, టీఆర్ఎస్, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, ఆర్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్, డీఎంకే, ఆప్ ఉన్నాయి. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రభుత్వం పక్షాన నిలిచి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ విమర్శించారు. జేడీయూ నేత హరివంశ్ గతవారమే రాజ్యసభ ఉపసభాపతిగా రెండో సారి ఎన్నికయ్యారు. రాజ్యసభలో మెజారిటీ లేనందునే ప్రభుత్వం డివిజన్ ఓటింగ్‌కు అంగీకరించలేదని టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి దినమన్నారు. ఆ ఎంపీలపై ప్రివిలేజ్ మోషన్ రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా సభలో అనుచితంగా ప్రవర్తించిన పలువురు విపక్ష ఎంపీలపై సభాహక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక పార్టీకి చెందిన ఫ్లోర్ లీడర్ సహా ముగ్గురు, లేక నలుగురు ప్రతిపక్ష ఎంపీలపై సభాహక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బిల్లుల ఆమోదం సమయంలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపిస్తూ విపక్షపార్టీలు ఆయనపై అవిశ్వాస నోటీసు ఇచ్చారు. ఆ తరువాత, వెంటనే కొందరు కేంద్ర మంత్రులు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లి, సభలో జరిగిన ఘటనలపై చర్చించారు. విపక్ష సభ్యుల ప్రవర్తనను ఆయనకు వివరించారు. వ్యవసాయ బిల్లుల ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం రైతులకి మరణశాసనం లిఖించింది. భూమిలో బంగారు పంటలు పండించే రైతన్నల కంట్లో నుంచి రక్తం ప్రవహిస్తోంది. రైతులకి మరణశాసనంగా మారే వ్యవసాయ బిల్లుల్ని ఆమోదించిన తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటు – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. వారి బంగారు భవిష్యత్‌కు ఈ బిల్లులు బాటలు వేస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో దూరదృష్టితో ఈ బిల్లుల్ని తీసుకువచ్చారు. కనీస మద్దతు ధర, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు కొనసాగుతాయి – జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు ప్రజాస్వామ్యం అంటే ఏకాభిప్రాయం. కానీ అత్యధికుల అణచివేత కాదు. బిల్లును రాష్ట్రపతి వెనక్కి పంపించాలి – సుఖ్బీర్ సింగ్ బాదల్, శిరోమణి అకాలీదళ్ చీఫ్ వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకం, కార్పొ రేట్లకు అనుకూలం. రైతు ప్రయోజనాలను దెబ్బ తీస్తాయి. రాష్ట్రాల మధ్య వ్యాపారాన్ని మాత్రమే కాదు, రాష్ట్రాల పరిధిలో వ్యాపార లావాదేవీలను నియంత్రిస్తాయి. చరిత్ర ఎవరినీ క్షమించదు. – ఎంకే స్టాలిన్, డీఎంకే అధ్యక్షుడు రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందంటూ కేంద్రం పచ్చి అబద్ధాలు చెబుతోంది. 2028 సంవత్సరం వచ్చినా రైతుల ఆదాయం పెరగదు. ఈ బిల్లుల ఆమోదం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. బిల్లుల్ని వెంటనే సెలక్ట్ కమిటీకి పంపాలి – డెరెక్ ఓబ్రీన్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ వ్యవసాయ బిల్లులతో రైతు ఆత్మహత్యలు ఇంక జరగవని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వగలదా? వీటిపై చర్చించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశం జరపాలి – సంజయ్ రౌత్, శివసేన ఎంపీ స్వల్పకాలంలోనూ, దీర్ఘకాలంలోనూ ఈ బిల్లులు రైతులకు ఎలా మేలు చేస్తాయో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించి చెప్పాలి. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళలో ఈ బిల్లుల్ని అత్యవసరంగా ఆమోదించాల్సిన అవసరం ఏముంది ? – హెచ్డీ దేవెగౌడ, జేడీ (ఎస్) ఎంపీ వ్యవసాయ బిల్లులపై చర్చించకుండా హడావుడిగా ఆమోదించడమేంటి? రైతు బిడ్డలెవరూ ఇలాంటి బిల్లుల్ని రూపొందించరు. తిరిగి స్వగ్రామాలకు వెళితే అక్కడ యువత పార్లమెంటులో కూర్చొని రైతన్నలకు మరణశాసనం లిఖిస్తారా అని ప్రశ్నిస్తారు. – రామ్‌గోపాల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఢిల్లీలోని విజయ్‌చౌక్ వద్ద రైతులకు స్వీట్లు తినిపిస్తున్న కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ -
రైతులు, పేదల రుణాలపై వడ్డీ మాఫీ చేయాలి
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న రైతులు, పేదల రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన ‘ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్(రెండో సవరణ)బిల్లు–2020’కు రాజ్యసభ స్వల్ప చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. దేశంలో కోవిడ్ నేపథ్యంలో వాణిజ్య సంస్థల దివాళా ప్రక్రియను మార్చి 25వ తేదీ మొదలుకొని ఆరు నెలలపాటు నిలుపుదల చేసేందుకు వీలు కల్పిస్తూ ఇందులో సవరణలు చేశారు. ఇందుకు సంబంధించి జూన్‌లో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఇది అమల్లోకి రానుంది. బిల్లుపై చర్చ సందర్భంగా జరిగిన చర్చలో పలువురు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. సీపీఎంకు చెందిన కేకే రాగేశ్ మాట్లాడుతూ..‘కోవిడ్ కారణంగా దెబ్బతిన్న వ్యాపారంగాన్ని, కార్పొరేట్లను గట్టెక్కించేందుకే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇదే విషయాన్ని రైతులకు ఎందుకు వర్తింపజేయరు? రైతులూ దివాలా తీశారు. వారిని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? వారి రుణాలపై వడ్డీని ఎందుకు మాఫీ చేయదు?’ అని నిలదీశారు. పీఎం కేర్స్‌లో పారదర్శకత లేదు పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటును లోక్‌సభలో ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ వ్యవహారంలో పారదర్శకత లోపించిందని ఆరోపించాయి. ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీకి చెందిన నేతలు పీఎం కేర్స్ ఏర్పాటుపై మండిపడ్డారు. ఈ నిధిని కాగ్ సమీక్ష పరిధికి వెలుపల ఉంచడమేంటని ప్రశ్నించారు. -
ముస్లింలకు వ్యతిరేకం కాదు
-
పౌరసత్వ బిల్లుకు పార్లమెంట్ ఓకే
న్యూఢిల్లీ: మరో వివాదాస్పద బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం, ఆ స్థాయిలో విమర్శలు, నిరసనలు ఎదుర్కొన్న పౌరసత్వ (సవరణ) బిల్లు బుధవారం రాజ్యసభ అడ్డంకిని విజయవంతంగా అధిగమించింది. సభలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, క్రిస్టియన్, పార్శీ, జైన్, బౌద్ధ, సిఖ్ మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై రాజ్యసభలో దాదాపు ఆరున్నర గంటల పాటు వాడి వేడి చర్చ జరిగింది. ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకమని విపక్షాలు తూర్పారబట్టాయి. బిల్లును ప్రవేశపెడ్తూ, ఆ తరువాత చర్చకు సమాధానమిస్తూ హోంమంత్రి అమిత్ షా బిల్లుపై నెలకొన్న భయాందోళనలను, అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ఈ బిల్లు గురించి భారతీయ ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని, వారు భారతీయ పౌరులుగా కొనసాగుతారని, ఈ బిల్లుతో వారికి ఏ సంబంధమూ లేదని వివరణ ఇచ్చారు. సునాయాసంగానే: రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేని పరిస్థితుల్లో.. ఈ బిల్లు ఆమోదం పొందడంపై కొంత ఉత్కంఠ నెలకొంది. మిత్రపక్షాలు జేడీయూ, శిరోమణి అకాలీదళ్‌తో పాటు అన్నాడీఎంకే, బీజేడీ, వైఎస్సార్సీపీ, టీడీపీ బిల్లుకు మద్దతివ్వడంతో మెజారిటీ ఓట్లు సాధించింది. అంతకుముందు, బిల్లును సమగ్ర అధ్యయనం కోసం సెలెక్ట్ కమిటీకి పంపించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై ఓటింగ్ జరగ్గా, ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 124 ఓట్లు, అనుకూలంగా 99 ఓట్లు వచ్చాయి. విపక్ష సభ్యులు ప్రతిపాదించిన పలు ఇతర సవరణలను సభ మూజువాణి ఓటుతో తిరస్కరించింది. ఓటింగ్‌కు కొద్దిసేపు ముందు, శివసేనకు చెందిన ముగ్గురు సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. ఎస్పీ, ఎన్సీపీలకు చెందిన ఇద్దరు చొప్పున ఎంపీలు, ఒక టీఎంసీ సభ్యుడు గైర్హాజరయ్యారు. ఉభయసభల ఆమోదం అనంతరం, బిల్లును రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తరువాత అది చట్టరూపం దాలుస్తుంది. ముస్లింలకు వ్యతిరేకం కాదు: బిల్లులో ముస్లింలను మినహాయించడంపై పలువురు సభ్యులు విమర్శలు చేశారు. దానిపై స్పందిస్తూ.. ఇతర దేశాల నుంచి వచ్చి భారత పౌరసత్వం పొందాలనుకునే ముస్లింలు ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం దరఖాస్తు చేసుకునే అవకాశముందని షా చెప్పారు. 566 మంది ముస్లింలు అలా పౌరసత్వం పొందారన్నారు. పాక్, బంగ్లా, అఫ్గాన్‌ల్లో మత వివక్షను ఎదుర్కొన్న మైనారిటీలకు భారతీయ పౌరసత్వం కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం కాబట్టి, ఆ దేశాల్లో మెజారిటీలైన ముస్లింలను బిల్లులో చేర్చలేదని వివరణ ఇచ్చారు. శ్రీలంక నుంచి వచ్చిన తమిళులకు పౌరసత్వం కల్పించడం గతంలో జరిగిందని, ఈ బిల్లు ప్రత్యేక సమస్య పరిష్కారం కోసం రూపొందించిందని వివరించారు. ఆర్టికల్ 14కి ఉల్లంఘన కాదు కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ నాయకుల్లా మాట్లాడుతున్నారని అమిత్ షా విమర్శించారు. ‘ఈ బిల్లు కానీ, గతంలో సభ ఆమోదం పొందిన ట్రిపుల్ తలాఖ్, ఆర్టికల్ 370 రద్దు బిల్లులు కానీ.. ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఈ బిల్లు పౌరసత్వం కల్పించేదే కానీ.. పౌరసత్వాన్ని లాక్కొనేది కాదు. ఈ విషయంలో ముస్లింలు ఎలాంటి భయాందోళలకు గురి కావాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ‘1947లో మత ప్రాతిపదికన దేశ విభజన జరిగింది. ఆ తప్పును సరిదిద్దేందుకే ఈ బిల్లును తీసుకురావాల్సి వచ్చింది’ అన్నారు. కాంగ్రెస్ ఈ విషయంలో రెండు నాలుకలతో మాట్లాడుతోందన్నారు. ‘గతంలో ఇదే కాంగ్రెస్ తమ పాలనలో వేరే ఇతర మతాల గురించి పట్టించుకోకుండా పాకిస్తాన్ నుంచి వచ్చిన 13 వేల హిందువులు, సిక్కులకు పౌరసత్వం ఇచ్చింది’ అని విమర్శించారు. సమానత్వ హక్కును ప్రసాదించే రాజ్యాంగ అధికరణ 14కి కూడా ఈ బిల్లు ఉల్లంఘన కాదని అమిత్ షా స్పష్టం చేశారు. సహేతుక కారణాలతో పార్లమెంట్ చట్టాలు చేయడాన్ని ఆర్టికల్ 14 నిరోధించదన్నారు. మా మేనిఫెస్టోలోనే చెప్పాం అంతకుముందు, బిల్లును సభలో ప్రవేశపెడ్తూ అమిత్ షా.. ఈ బిల్లు విషయంలో భారతీయ ముస్లింలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వారు భారతీయులుగానే కొనసాగుతారన్నారు. అనవసరంగా ముస్లింలకు తప్పుడు సమాచారం పంపిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. పౌరసత్వ బిల్లు 2014, 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టోలోనే ఉందని, దానికి అనుకూలంగానే బీజేపీకి ప్రజలు ఘనవిజయం అందించారన్నారు. ఓటుబ్యాంక్ రాజకీయాలకు పాల్పడలేదని, ఎన్నికలకు ముందే ఈ విషయమై హామీ ఇచ్చామని తెలిపారు. ఈ బిల్లు కేవలం మూడు పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వివక్షకు, వేధింపులకు గురైన హిందూ, పార్శీ, జైన్, సిఖ్, క్రిస్టియన్, బౌద్ధ మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించినదేనని వివరించారు. పొరుగుదేశాల్లో దారుణమైన వివక్ష ఎదుర్కొని, భారత్‌కు వచ్చిన ఆ ఆరు మతాలకు చెందిన లక్షలాది శరణార్ధులకు భారత్‌లో విద్య, ఉద్యోగం, జీవనోపాధి కల్పించే సదుద్దేశంలో ఈ చరిత్రాత్మక బిల్లును తీసుకువచ్చామన్నారు. వారు భారత్‌లో ఏర్పాటు చేసుకున్న దుకాణాలను రెగ్యులరైజ్ చేసే ప్రతిపాదన బిల్లులో ఉందన్నారు. ‘పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల నుంచి వచ్చిన ముస్లింలకు పౌరసత్వ కల్పించాలని కోరుకుంటున్నారా? ఇది ఎలా సాధ్యం?’ అని విపక్షాలను ప్రశ్నించారు. ప్రసారాల నిలిపివేత విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు ఈ బిల్లును సమగ్రంగా అధ్యయనం చేసేందుకు సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. అమిత్ షా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విపక్ష సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో కొద్దిసేపు సభ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. చరిత్రలో మైలురాయి: మోదీ పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోయే, మైలురాయి లాంటిరోజని అభివర్ణించారు. బిల్లుకు అనుకూలంగా ఓటేసిన సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కాగా, బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన ఈ రోజు భారత రాజ్యాంగ చరిత్రలో చీకటి రోజని బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అభివర్ణించారు. ఇది విభజన శక్తుల, సంకుచిత మనస్తత్వం ఉన్నవారి విజయం అన్నారు. మరోవైపు, ఈ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సంకేతాలిచ్చారు. పార్టీ తరఫున కోర్టుకెళ్తామని సీనియర్ నేత కపిల్ సిబల్ వెల్లడించారు. బిల్లు రాజ్యాంగబద్ధతపై పలు అనుమానాలున్నాయని, అందువల్ల కోర్టులో సవాలు చేసే అవకాశముందని అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. కోర్టు కొట్టివేస్తుంది ఈ బిల్లును కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు తీవ్రంగా నిరసించాయి. మత ప్రాతిపదికన రూపొందిన ఈ బిల్లు న్యాయ సమీక్షకు నిలవబోదని హెచ్చరించాయి. ‘ఈ బిల్లు భారత రాజ్యాంగ మౌలిక భావనలకు వ్యతిరేకం. ఇది వివక్షాపూరితంగా, విబేధాలు సృష్టించేలా ఉంది’ అని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ విమర్శించారు. ‘హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకే ఈ బిల్లును తీసుకువచ్చారు. అదృష్టవశాత్తూ మీరు రాజ్యాంగ సవరణ చేయడం లేదు. చట్టాన్ని చేస్తున్నారంతే. ఇది న్యాయసమీక్షకు నిలవబోదు అనే విషయం నాకు స్పష్టంగా తెలుసు. దీన్ని కోర్టు కచ్చితంగా కొట్టేస్తుంది’ అని కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు పి.చిదంబరం పేర్కొన్నారు. ఈ బిల్లు బీజేపీ హిందూత్వ ఎజెండాలో భాగంగా, నాజీ కాఫీ బుక్ నుంచి స్ఫూర్తి పొందినట్లుగా ఉందని టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ వ్యాఖ్యానించారు. బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తల కాగడాల ప్రదర్శన -
‘మెడికల్’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: వివాదాస్పద నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. వైద్య విద్యకు సంబంధించి అతిపెద్ద సంస్కరణగా ప్రభుత్వం అభివర్ణిస్తున్న ఈ బిల్లులో.. అవినీతికి ఆలవాలంగా మారిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పొందుపర్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలుపుతున్నారు. ఈ బిల్లును ‘ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956’కు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చారు. అన్నాడీఎంకే వాకౌట్ చేయగా మూజువాణి ఓటుతో బిల్లును రాజ్యసభ ఆమోదించింది. లోక్‌సభలో ఇప్పటికే ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. తాజాగా రెండు సవరణలకు లోక్‌సభ ఆమోదం తెలపాల్సి ఉన్న నేపథ్యంలో మరోసారి ఈ బిల్లు లోక్‌సభకు వెళ్లనుంది. బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్.. ‘నకిలీ వైద్యులకు అడ్డుకట్ట వేసేలా ఈ బిల్లు ఉంది. తప్పుడు వైద్య విధానాలకు పాల్పడేవారికి సంవత్సరం జైలుశిక్షతో పాటు, రూ. 5 లక్షల జరిమానా విధించే ప్రతిపాదన బిల్లులో ఉంది. ఇప్పటివరకు అలాంటివారికి ఎంసీఐ నామమాత్రపు జరిమానా మాత్రమే విధించేది’ అని తెలిపారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చిన మూడేళ్లలో నెక్ట్స్(నేషనల్ ఎగ్జిట్ టెస్ట్)ను నిర్వహించడం ప్రారంభిస్తామన్నారు. ఎన్ఎంసీలో రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం లేదన్న ఎంపీల విమర్శలపై స్పందిస్తూ.. మొత్తం 25 మంది సభ్యుల్లో 11 మంది రాష్ట్రాల ప్రతినిధులేనన్నారు. నెక్ట్స్గ్ పరీక్షను మెడికల్ పీజీ ఎంట్రన్స్ పరీక్షగా, అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ చేసినవారికి స్క్రీనింగ్ పరీక్షగా పరిగణిస్తామన్నారు. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్ల(సీహెచ్‌పీ) వ్యవస్థను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిందని, అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆ వ్యవస్థను అమలు చేస్తున్నాయని, భారత్ కూడా ఆ దిశగా వెళ్తోందని చెప్పారు. ఎన్‌ఎంసీలోని 25 మంది సభ్యుల్లో 21 మంది వైద్యులేనని, వారు సీహెచ్పీల అర్హతలను నిర్ణయిస్తారని హర్షవర్ధన్ వివరించారు. బిల్లును స్థాయీసంఘానికి పంపాలని తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. వైద్య విద్య అభ్యసించని 3.5 లక్షలమంది నాన్ మెడికల్ సిబ్బందికి ఆధునిక వైద్యం అందించే వైద్యులుగా లైసెన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ వ్యతిరేకించారు. బిల్లులోని ముఖ్యాంశాలు ► ఇప్పటివరకు అమల్లో ఉన్న ఎంసీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. వందమందికిపైగా సభ్యులు ఉండే ఇందులో 70 శాతం మందిని ఎన్నుకుంటారు. ఇక కొత్తగా వచ్చిన ఎన్ఎంసీలో 25 మందే సభ్యులుగా ఉంటారు. వారిలో అత్యధికుల్ని కేంద్రమే నామినేట్ చేస్తుంది. ► కేంద్రం నియమించిన ఏడుగురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ ఎన్ఎంసీ చైర్ పర్సన్ పేరుని, తాత్కాలిక సభ్యుల పేర్లను సిఫారసు చేస్తుంది. ► కొత్త కమిషన్‌లో 8 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో నలుగురు వైద్య విద్యకు సంబంధించిన వివిధ బోర్డుల అధ్యక్షులు ఉంటారు. మరో ముగ్గురిని ఆరోగ్యం, ఫా ర్మా, హెచ్ఆర్డీ శాఖలే సిఫారసు చేస్తాయి. ► ఎంసీఐ సమావేశం కావాలంటే వందమందికిపైగా ఉన్న సభ్యుల్లో 15 మంది హాజరైతే సరిపోయేది. వారు తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు అయ్యేవి. జాతీయ వైద్య కమిషన్‌కు సంబంధించి 25 మందిలో 13 మంది హాజరైతేనే కీలక నిర్ణయాలు తీసుకోగలరు. ► ఎన్ఎంసీ సభ్యులందరూ విధిగా తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించాలి. ► ఎంసీఐ కాలపరిమితి అయిదేళ్లయితే ఎన్ఎంసీ కాలపరిమితి నాలుగేళ్లు. తాత్కాలిక సభ్యులు రెండేళ్లకి ఒకసారి మారతారు. ► కమిషన్ చైర్మన్‌ను, అందులో సభ్యుల్ని తొలగించే అధికారం పూర్తిగా కేంద్రానిదే. ► ఎంబీబీఎస్, మెడికల్ పీజీకి సంబంధించి అన్ని ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిట్లీ 50 శాతం సీట్లలో ఫీజుల నియంత్రణ కమిషన్ చేతుల్లోనే ఉంటుంది. ► వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి, మెడికల్ ప్రాక్టీస్ అనుమతికి సంబంధించి ఎంబీబీఎస్ చివరి ఏడాది నిర్వహించే పరీక్షనే అర్హతగా పరిగణిస్తారు. దీనిని నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) పేరుతో నిర్వహిస్తారు. విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించిన విద్యార్థులు భారత్‌లో ప్రాక్టీస్ చేయాలంటే స్క్రీనింగ్ టెస్ట్‌కి హాజరుకావాలి. ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో వైద్యవిద్యనభ్యసించాలంటే ఇకపై నీట్‌తో పాటు గా నెక్ట్స్ పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది. ► దేశంలోని హోమియో, యునాని, ఆయుర్వేదం కోర్సులు చదివిన వారు కూడా ఒక బ్రిడ్జ్ కోర్సు ద్వారా అల్లోపతి వైద్యాన్ని చేయవచ్చు. -
కశ్మీర్లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పాడిగించేం దుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ నెల 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ పొడిగింపు ప్రతిపాదనకు ఇటీవలే లోక్‌సభ అంగీకారం తెలిపింది. ఈ ఏడాది చివర్లో కశ్మీర్లో ఎన్నికలు జరపాలని భావిస్తున్నందున రాష్ట్రపతి పాలనను పొడిగించడం తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం లేదని ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా రాజ్యసభకు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు ఆయన బదులిస్తూ.. గతంలో ఎన్నడూ రంజాన్ మాసం (మే 7–జూన్4)లో రాష్ట్రంలో ఎన్నికలు జరపలేదన్నారు. అదేవిధంగా, జూన్ 30 నుంచి ఆగస్టు 15 వరకు అమర్నాథ్ యాత్ర సాగుతోం దని తెలిపారు. రాష్ట్రంలో 2018 డిసెంబర్ 20వ తేదీ నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా.. కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ప్రజలకు ఉద్యోగాలు, ప్రమోషన్లు, ప్రవేశాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును సభలో ప్రవేశపెట్టారు. 2030 కల్లా దేశంలోని ప్రజలందరికీ సురక్షిత నీటిని అందించాలన్న లక్ష్యాన్ని 2024 సంవత్సరానికి కుదించినట్లు జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ రాజ్యసభకు తెలిపారు. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి లోబడే ఈ చర్య తీసుకున్నామ న్నారు. నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న జిల్లాల్లో వృథా జలాన్ని శుద్ధిచేసి వాడుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. నీటి కొరతను నివారించే విషయంలో రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. -
ఇకపై లంచం ఇచ్చిన వారూ శిక్షార్హులే
న్యూఢిల్లీ: లంచం తీసుకున్న వారితోపాటు లంచం ఇచ్చిన వారు కూడా ఇకపై నేరస్తులే. ఇందుకు గాను వారికి ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అవినీతి నిరోధక (సవరణ) బిల్లును రాజ్యసభ గురువారం ఆమోదించింది. అవినీతి వ్యతిరేక చట్టానికి చేసిన కొన్ని సవరణలతో సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ‘ఉద్దేశపూర్వకంగా చేసే ఫిర్యాదుల నుంచి ఉన్నతాధికారులకు, వారు రిటైరైన తర్వాత కూడా రక్షణ కల్పించటం తోపాటు అవినీతి కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఇందులో పలు నిబంధనలను చేర్చాం’ అని ఆయన చెప్పారు. ‘తాజా సవరణ ద్వారా లంచం ఇవ్వజూపిన వారికి కనీసం మూడేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బలవంతంగా ఎవరైనా లంచం ఇవ్వజూపితే సదరు అధికారి ఆ విషయాన్ని పై అధికారులకు వారంలోగా తెలియజేయాలి. అధికారికి లంచం లేదా ఇతరత్రా లబ్ధి చేకూ రుస్తామంటూ హామీ ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు జరిమానా విధించేందుకు వీలుంటుంది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎటువంటి కేసులకు సంబంధించి కూడా ప్రభుత్వ అధికారులపై పోలీసులు విచారణ చేపట్టరాదు’ అని తెలిపారు. ఆర్థిక నేరగాళ్ల బిల్లు ఆమోదం ‘పరారైన ఆర్థిక నేరగాళ్ల బిల్లు–2013’ను లోక్‌సభ ఆమోదించింది. ‘దీంతో నేరాలకు పాల్పడే సంస్థలు, వ్యక్తుల లేదా బినామీ దారుల ఆస్తులను జప్తు చేసుకునే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. పరారైన వారి నుంచి డబ్బు రాబట్టుకునేందుకు బ్యాంకులకు ప్రభుత్వం సాయపడుతుంది’ అని ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. -
విజయోత్సాహం
సాక్షి, మంచిర్యాల : జిల్లావ్యాప్తంగా నాలుగో రోజు కూడా తెలంగాణ సంబరాలు కొనసాగాయి. తెలంగాణ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభలు ఆమోద ముద్ర వేయడంతో శుక్రవారం తెలంగాణవాదులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించడంతో అన్ని రాజకీయ పార్టీలు, జేఏసీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కుల, ప్రజా సంఘాలు, విద్యార్థులు విజయోత్సవం జరుపుకున్నారు. బాణాసంచా పేలుళ్లు.. మిఠాయిల పంపిణీతో ఆనందం వ్యక్తపరిచారు. ఆదిలాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే జోగు రామన్న అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. టపాసులు కాల్చి, రంగులు చల్లుతూ నృత్యాలు చేశారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో సంఘ భవనం నుంచి బ్యాండ్ మేళాలతో నృత్యాలు చేస్తూ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీకి వెళ్లి శుక్రవారం విచ్చేసిన టీఆర్ఎస్, జేఏసీ, బీజేపీ నాయకులకు మంచిర్యాల రైల్వేస్టేషన్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముస్లింలు జుమా నమాజ్ తర్వాత పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళులు అర్పించారు. టీఆర్ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చారు. మంచిర్యాల మండలం హాజీపూర్‌లో టీఆర్ఎస్ శ్రేణులు, లక్సెట్టిపేటలో టీయూటీఎఫ్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. దండేపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు అంబేద్కర్, బీజేపీ నేతలు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, కిషన్‌రెడ్డి ఫొటోలకు పాలాభిషేకం చేశారు. జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తాండూర్ మండల కేంద్రంలో ఏబీవీపీ, టీఆర్ఎస్వీ, బోథ్ మండల కేంద్రంలో జే ఏసీ విజయోత్సోవ రా్యాలీ నిర్వహించాయి. చెన్నూరు మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్, రెబ్బెనలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ చౌక్‌లో మహిళలు బతుకమ్మ ఆడారు. మందమర్రి పట్టణ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయినులు బతుకమ్మలు, భోనాలతో శోభయాత్ర నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మహిళతోనే సాధ్యమైయిందని ఇందుకు సోనియ గాంధీని కొనియాడారు. ఇచ్చోడలోని అంబేద్కర్ చౌర స్తా వద్ద టీఅర్ఎస్, బీజీపీ, జేఏసీల ఆధ్వర్యంలో విద్యార్థినులతో మానవహారం ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్‌లో 1969 ఉద్యోగుల సంఘం నాయకులు, మంచిర్యాలలోని సాయి అంధుల పాఠశాలలో తెలంగాణవాదులు మిఠాయిలు పంచి పెట్టారు. ఉట్నూరులో రాజుగొండు భవన్లో మహిళలు తెలంగాణ సంబరాలు నిర్వహించారు.