
హోం మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పాడిగించేం దుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ నెల 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ పొడిగింపు ప్రతిపాదనకు ఇటీవలే లోక్‌సభ అంగీకారం తెలిపింది. ఈ ఏడాది చివర్లో కశ్మీర్‌లో ఎన్నికలు జరపాలని భావిస్తున్నందున రాష్ట్రపతి పాలనను పొడిగించడం తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం లేదని ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా రాజ్యసభకు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు ఆయన బదులిస్తూ.. గతంలో ఎన్నడూ రంజాన్ మాసం (మే 7–జూన్4)లో రాష్ట్రంలో ఎన్నికలు జరపలేదన్నారు. అదేవిధంగా, జూన్ 30 నుంచి ఆగస్టు 15 వరకు అమర్‌నాథ్ యాత్ర సాగుతోం దని తెలిపారు.
రాష్ట్రంలో 2018 డిసెంబర్ 20వ తేదీ నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా.. కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ప్రజలకు ఉద్యోగాలు, ప్రమోషన్లు, ప్రవేశాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును సభలో ప్రవేశపెట్టారు. 2030 కల్లా దేశంలోని ప్రజలందరికీ సురక్షిత నీటిని అందించాలన్న లక్ష్యాన్ని 2024 సంవత్సరానికి కుదించినట్లు జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ రాజ్యసభకు తెలిపారు. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి లోబడే ఈ చర్య తీసుకున్నామ న్నారు. నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న జిల్లాల్లో వృథా జలాన్ని శుద్ధిచేసి వాడుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. నీటి కొరతను నివారించే విషయంలో రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు.