
న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉన్న మణిపూర్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జనసంచారంపై ఉన్న ఆంక్షలను ఎత్తేయాలని.. మార్చి 8వ తేదీ నుంచి ఆ రాష్ట్రంలో సాధారణ స్థితి నెలకొల్పాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) సంబంధిత ఆదేశాలను జారీ చేశారు.
మార్చి 8వ తేదీ నుంచి మణిపూర్(Manipur)లో అన్ని రోడ్లపై ప్రజలు స్వేచ్ఛగా తిరగాలి. ఎవరైనా జనసంచారానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోండి అని అమిత్ షా మణిపూర్ అధికార యంత్రాంగానికి సూచించారు. మణిపూర్‌లో రాష్ట్రపతి విధింపు తర్వాత.. అక్కడి శాంతి భద్రతలపై జరిగిన తొలి సమీక్షా సమావేశం ఇదే కావడం గమనార్హం.
ఈ సమావేశానికి మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా(Ajay Kumar Bhalla), ఇతర ఉన్నతాధికారులు, సైన్యం.. పారామిలిటరీ తరపున ప్రతినిధులు హాజరయ్యారు. 2023 మే నుంచి ఈ ఈశాన్య రాష్ట్రంలో తెగల వైరంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేలా ప్రయత్నాలను కేంద్రం ఇప్పుడు ముమ్మరం చేసింది.
దాదాపు రెండేళ్లుగా జాతుల మధ్య వైరంతో రగులుతున్న మణిపుర్‌లో కల్లోల పరిస్థితుల నేపథ్యంలో.. ఇటీవల ఫిబ్రవరి 13వ తేదీన సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించిన కేంద్ర ప్రభుత్వం అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే కల్లోల పరిస్థితులను ఆసరాగా చేసుకుని భద్రతా బలగాలకు చెందిన ఆయుధాలను కొందరు ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో.. అక్కడి ప్రజలకు గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కీలక విజ్ఞప్తి చేశారు. తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఏడు రోజుల్లోగా అప్పగించాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్ణీత సమయంలోగా ఆయుధాలను తిరిగి ఇస్తే ఎలాంటి చర్యల ఉండవని.. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment