న్యూఢిల్లీ: లంచం తీసుకున్న వారితోపాటు లంచం ఇచ్చిన వారు కూడా ఇకపై నేరస్తులే. ఇందుకు గాను వారికి ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అవినీతి నిరోధక (సవరణ) బిల్లును రాజ్యసభ గురువారం ఆమోదించింది. అవినీతి వ్యతిరేక చట్టానికి చేసిన కొన్ని సవరణలతో సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ‘ఉద్దేశపూర్వకంగా చేసే ఫిర్యాదుల నుంచి ఉన్నతాధికారులకు, వారు రిటైరైన తర్వాత కూడా రక్షణ కల్పించటం తోపాటు అవినీతి కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఇందులో పలు నిబంధనలను చేర్చాం’ అని ఆయన చెప్పారు.
‘తాజా సవరణ ద్వారా లంచం ఇవ్వజూపిన వారికి కనీసం మూడేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బలవంతంగా ఎవరైనా లంచం ఇవ్వజూపితే సదరు అధికారి ఆ విషయాన్ని పై అధికారులకు వారంలోగా తెలియజేయాలి. అధికారికి లంచం లేదా ఇతరత్రా లబ్ధి చేకూ రుస్తామంటూ హామీ ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు జరిమానా విధించేందుకు వీలుంటుంది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎటువంటి కేసులకు సంబంధించి కూడా ప్రభుత్వ అధికారులపై పోలీసులు విచారణ చేపట్టరాదు’ అని తెలిపారు.
ఆర్థిక నేరగాళ్ల బిల్లు ఆమోదం
‘పరారైన ఆర్థిక నేరగాళ్ల బిల్లు–2013’ను లోక్‌సభ ఆమోదించింది. ‘దీంతో నేరాలకు పాల్పడే సంస్థలు, వ్యక్తుల లేదా బినామీ దారుల ఆస్తులను జప్తు చేసుకునే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. పరారైన వారి నుంచి డబ్బు రాబట్టుకునేందుకు బ్యాంకులకు ప్రభుత్వం సాయపడుతుంది’ అని ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment